sri krishna deva raya
-
శ్రీకృష్ణదేవరాయలకు రక్షణగా ‘గట్టు’
గద్వాల: శ్రీకృష్ణదేవరాయులు తన విజయనగర సామ్రాజ్యాన్ని ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకూ విస్తరించారు. ఆంధ్ర ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశంగా ఉన్న గట్టు ప్రాంతంలో ఆయన శత్రువుల నుంచి రక్షణ కోసం కోటగోడ ప్రాకారాలు నిర్మించారు. ఈ క్రమంలోనే అక్కడ రాజ్యవిస్తరణ జరిగి గట్టు సంస్థానం వెలసినట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్ర, కన్నడ ప్రజలు గొప్ప చక్రవర్తిగా అభిమానిస్తారు. ఆంధ్రా భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డారు.సోమనాద్రికి అండగా..పూడూరు కేంద్రంగా నలసోమనాద్రి గద్వాలలో తన రాజ్యస్థాపన చేసే క్రమంలో కోట నిర్మాణం చేశారు. అయితే దీనిని సహించని ఉప్పేరు నవాబు నలసోమనాద్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలో ఉప్పేరు నవాబు రాయచూరు నవాబు సాయం కోరారు. గట్టు ఆరగిద్ద ప్రాంతంలో హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నలసోమనాద్రి విజయ దుందుభి మోగించారు. తన విజయంలో గట్టు ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషించిందని నలసోమనాద్రి చెప్పినట్టు చరిత్రకారులు చెబుతారు. ఆ యుద్ధం అనంతరం సోమనాద్రి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని పాలించారు. రతనాల గట్టు.. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం(1509–1529)లో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఎనిమిది చావిడ్లు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గట్టు సంతబజారులో రతనాలు, బంగారు నాణేలను రాశులుగా పోసి క్రయవిక్రయాలు జరిపే వారని చరిత్ర తెలిసిన పెద్దలు నేటికీ చెబుతుంటారు. గట్టులో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సారవంతమైన భూమిలో మంచి పంటలు పండించేవారు. శ్రీ కృష్ణదేవరాయలు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ప్రోత్సహించేవారు. అందులో భాగంగానే చెరువులు, కాల్వలు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డారు. అనేక రకాల పండ్ల తోటలు పెంచేవారు. వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. బెల్లం, నీలిమందు తయారీ, వస్త్ర తయారీ వంటివి కూడా ప్రోత్సహించారు. గట్టులో పట్టుపరిశ్రమను ప్రోత్సహించారు. అప్పట్లో మగ్గాలపై వ్రస్తాలను తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన వ్రస్తాలను రాయలసీమలోని రాయదుర్గానికి తరలించే వారని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో.. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో పాలించిన రాజులు గట్టు ప్రాంతంపై నిర్లక్ష్యం చూపడంతో పూర్తి వెనుకబాటుకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో పేరుమోసిన ఓ దొంగ గట్టును ఆవాసంగా చేసుకున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దోచుకున్న సొమ్మును గట్టులో భద్రపర్చుకునే వాడని చెబుతారు. ఈ సొమ్ముకు కాపలాగా తన సోదరిని పెట్టగా.. ఆమె ఓ బాటసారిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న దొంగ తన సోదరిని పక్కనే ఉన్న గంగిమాన్దొడ్డిలో ఆమె చివరి జీవనం వరకు బందీగా చేశాడని చెబుతారు. రక్షణ ప్రాంతంగా.. కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉండే గట్టును శ్రీకృష్ణదేవరాయలు రక్షణ ప్రాంతంగా నిర్మించారు. గ్రామం చుట్టూ కోటబురుజులతో కూడిన ప్రహరీ, లోపల 8 వరకు చావిడిలను నిర్మించారు. వీటిపై అర్ధచంద్రాకార గుర్తులు ఉన్నాయి. చీకటి పడితే కోటగోడలపై కాగడాలు వెలిగించి, సైనికులు కాపలా కాసేవారని చెబుతారు. కరువుకు నిలయం..రాజుల కాలంలో సిరిసంపదలతో తులతూగిన గట్టు ప్రాంతం.. రాజులు పోయి, రాజ్యాలు అంతరించిన తర్వాత అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచింది. కరువుకు నిలయంగా మారింది. ఇక్కడి నుంచే పొట్టచేత పట్టుకొని కుటుంబాలకు కుటుంబాలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్న దైన్యస్థితి నెలకొంది.40 ఏళ్ల క్రితం..సుమారు 40 ఏళ్ల క్రితం గట్టు నేతాజీ చౌరస్తాలో గుప్తనిధుల తవ్వకాలలో పెద్దఎత్తున అలనాటి విలువైన నిధులు, బంగారు నాణేలు బయటపడ్డాయి. వీటిలో కొంతమేర అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు. -
ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..
దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు) -
పాటతో శ్రీ కృష్ణ దేవరాయలుని ఏకిపారేసిన బ్రహ్మనాయుడు
-
ఆముక్తమాల్యద తాళపత్రం.. తమిళనేలపై భద్రం
‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లభుండ తెలగొకండ ఎల్లనృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స’’ఐదొందల ఏళ్లక్రితం శ్రీ కృష్ణదేవరాయల కలం నుంచి జాలువారిన పద్యమిది. పది హేనో శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రపంచానికి చాటారు. కానీ... తెలుగంటే ఎంతో అభిమానాన్ని చాటుకున్న కృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ఆముక్తమాల్య దలో మాతృభాషపై తన మమకారాన్ని మరోసారి చాటారు. ఈ పద్యకావ్యం గురించి తెలియని తెలుగువారుండరేమో. ఈ అక్షరా లను నిక్షిప్తం చేసిన తాళపత్రగ్రంథం ఇప్పటికీ భద్రంగా ఉన్న సంగతి చాలా తక్కువ మం దికి తెలుసు. ఇది తమిళనాడులోని తంజా వూరులో ఉన్న సరస్వతి మహల్ గ్రంథాల యంలో కొలువుదీరి ఉంది. ఈ తెలుగు గ్రంథం తమిళ రాష్ట్రంలో ఉన్నా దాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలు పొరపాటున చెదల బారినపడో, వాతావరణ ప్రభావానికి గురయ్యో, అనుకోని ఇతర ప్రమాదాలబారిన పడో ధ్వంసమైతే శాశ్వతంగా అవి అదృశ్య మైనట్టే. దాని ఫొటో ప్రతులు రూపొందిం చాలని ఎనిమిది దశాబ్దాల క్రితమే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు. కానీ ఆయన ఆలోచనను కూడా ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయకపోవ టం విడ్డూరమే. – సాక్షి, హైదరాబాద్ వందల్లో గ్రంథాలు... తంజావూరు గ్రంథాలయంలో 778 తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వీటిల్లో 455 గ్రంథాలను తర్వాత పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికీ మరో 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. వీటిల్లో సనాతన వైజ్ఞానికశాస్త్రం, గణితం, పురాణాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిల్లోని ప్రత్యేకతలు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కాగితంపై రాసిన ఒరిజినల్ గ్రంథాలు 44 ఉన్నాయి. వీటిల్లో పుస్తకరూపంలో తీసుకు రానివి 26 ఉన్నాయి. ఇలా ఎన్నో విలువైన తెలుగు గ్రంథాలు తమిళనేలపై ఉన్నా వాటిని జనంలోకి తెచ్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. అసలు.. ఆ పుస్తకాల సారాంశమేంటో తెలుసుకునే కసరత్తు కూడా జరగలేదు. వాటిని భాషావేత్తలు పరిశోధిస్తే సమాజానికి తెలియని ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. సర్వేపల్లి కాంక్షించినా... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కాకపూర్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉండగా, 1933లో తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలోని తెలుగు గ్రంథాల గురించి తెలుసుకున్నారు. వాటిల్లో అచ్చు కానివి, బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని వెళ్లి శోధించి వాటి జాబితా రూపొందించారు. వాటిల్లో అముద్రిత గ్రంథాలను ముద్రించాలని నాటి ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిస్థాయి వరకు వెళ్లటం, బిజీగా గడపటంతో ఆ గ్రంథాలు అలాగే ఉండిపోయాయి. ఇటీవల కొందరు భాషాభిమానులు సర్వేపల్లి రూపొందించిన జాబితాను గుర్తించారు. కానీ, రెండు తెలుగు ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. భాషాభిమానుల నుంచి విన్నపాలను అందుకున్నా ఆ దిశగా ఆసక్తి చూపకపోవటం విడ్డూరం. గణితశాస్త్రంలో మన ఘనత.. గణితశాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది సనాతన భారతమే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గణితంలో ఘనతను సాధిస్తుందీ మనవారే. అలాంటి గణితం పద్యరూపంలో ఉందంటే నమ్ముతారా.. గణితంలోని ఎన్నో అంశాలను పద్యాల ద్వారా గొప్పగా వివరించి ఆ శాస్త్రంలో ప్రత్యేకతలను పరిచయం చేసింది ‘గణిత చూడామణి’. 19 వ శతాబ్దంలో ఇలాగే ఇది తళుక్కున మెరిసి పూర్వీకులను గణిత పం డితులుగా మార్చింది. తంజావూరు గ్రంథా లయంలో దిక్కూమొక్కూలేక పడి ఉన్న తెలుగు తాళపత్రగ్రంథాల్లో ఎన్ని గొప్ప విషయాలున్నాయో, అవి ఎప్పుడు మన ముందుకు వస్తాయోనని భాషాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనాలి.. ‘నేను ఓ సదస్సు కోసం వెళ్లినప్పుడు తంజావూరు గ్రంథాలయంలో తెలుగు తాళపత్రగ్రంథాలను చూసి పులకరించి పోయాను. ఆముక్తమాల్యద లాంటి ఒరిజినల్ ప్రతులున్నాయని తెలుసుకుని సంబరపడ్డాను. వాటిల్లో ముద్రితం కానివాటిని వెంటనే ముద్రించటంతోపాటు తాళపత్ర గ్రంథా లను డిజిటలైజేషన్ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వానికి నివేదించాను. కానీ, ఇప్పటి వరకు ఆ కసరత్తు ప్రారంభం కాకపోవటం బాధాకరం’ డాక్టర్ రాజారెడ్డి, వైద్యుడు, చరిత్రపరిశోధకులు ముందుకు సాగని మహాసభల స్ఫూర్తి.. ప్రపంచ తెలుగు మహాసభలలో ఎంతోమంది భాషాభిమానులు ప్రాచీన తెలుగుగ్రంథాల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అముద్రిత తెలుగు గ్రంథాలను గుర్తించి వాటిని కాపీ చేసి ప్రజల ముంగిటకు తేవాలని కోరా రు. ఈ క్రమంలోనే లండన్ లైబ్రరీలో దాదాపు 8 వేలకు పైచిలు కు తెలుగు పుస్తకాలున్నాయని, వాటిల్లో కొన్ని తెలుగునేలపై లభించటం లేదని గుర్తించి వాటిని కాపీ చేయాలని ప్రస్తావిం చారు. కానీ ఆ దిశగా అసలు అడుగు పడకపోవటం విచిత్రం. కౌటిల్యుడి అర్థశాస్త్రం ఇలాగే వెలుగు చూసింది... రాజనీతి, పాలన, సమాజం... ఇలా ఎన్నో అంశాలను స్పృశిస్తూ ప్రపంచానికి మార్గదర్శనంగా నిలిచిన గొప్ప గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసిన ఈ మహత్ గ్రంథం క్రీస్తుపూర్వంలో ఆవిష్కృతమైనా ఆ తర్వాత క్రీ.శ.12 వ శతాబ్దం వరకు దీనిని ప్రపంచం అనుసరించింది. ఆ తర్వాత ఆ గ్రంథ ప్రతులే కనిపించలేదు. కానీ, వందల ఏళ్ల తర్వాత ఆ గ్రంథం తాళపత్ర రూపం మైసూరులో ప్రత్యక్షమైంది. అక్కడి గ్రంథాలయంలో అనామకంగా పడి ఉన్న ఆ సంస్కృత గ్రంథాన్ని శ్యామశాస్త్రి గుర్తించి 1909 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించి పుస్తకరూపమిచ్చారు. -
చారిత్రక నగరిలో సాహిత్య వికాసం
1901 భాగ్యనగరిలో సాహిత్య పునర్వికాసానికి బీజంపడింది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించడంతో హైదరాబాద్ రాష్ట్రంలో సాహిత్య, సాంస్కృతిక వికాసం కొత్త పుంతలు తొక్కింది. కొమర్రాజు వెంకటలక్ష్మీ నరసింహారావు ఈ ఉద్యమానికి సారథిగా నిలిచారు. ఆ తర్వాత 1904లో సికింద్రాబాద్‌లోనూ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర దేశ సంస్కృతీ వారసత్వాలను గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, ఆంధ్రుల పూర్వవైభవంపై తెలుగు ప్రజలను చైతన్య దీప్తులను చేయడానికి, ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవడానికి ఈ గ్రంథాలయాలు ఎంతోగానో దోహదం చేశాయి. ఇవి క్రమంగా తెలుగు పునర్వికాస ఉద్యమానికి కేంద్ర బిందువులుగా మారాయి. -
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం
-
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం
పశువుల కాపరుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇల్లెందు: ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పందెం గ్రామం సమీపంలోని పొలంలో లభ్యమైన శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి బంగారు నాణాలను బయ్యూరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వీరేశ్వర్‌రావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఐదు నెలల క్రితం ధర్మసోత్ సుందర్ అనే రైతు తన పొలంలో దుక్కు లు దున్నిన తర్వాత కురిసిన భారీ వర్షానికి ఇత్తడి బిందె బయట పడింది. పశువులకు కాపలాగా వెళ్లిన పెనక నర్సయ్య, బచ్చలి వెంకన్న, ధర్మసోత్ ధను, ఇస్లావత్ లాల్‌సింగ్‌లకు ఈ బిందె లభించింది. అందులోని నాణేలను 10 చొప్పున పంచుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట బయటకు రావడంతో పోలీసులు పశువుల కాపర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అన్ని వివరాలు బయటపడ్డారుు. మొత్తం 40 నాణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. నాణాల తూకం 12 తులాలు ఉంటుందని, వాటిపై దేవనాగరి లిపి ఉందని, రాయల కాలం నాటి నాణేలుగా పురావస్తుశాఖ నిపుణులు తెలిపినట్లు డీఎస్పీ వివరించారు. త్వరలో పురావస్తుశాఖ అధికారులు పరిశీలించి వాటిని మ్యూజియంకు తరలించనున్నట్లు చెప్పారు. -
తెలుగు చిత్రాలకు ఆంగ్ల పేర్లా?
‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల చేత ప్రశంసలందుకున్నది తెలుగుభాష. పంచదారకన్నా, జుంటుతేనెలకన్నా మధురమైనది తెలుగుభాష. ఎన్నో ఏళ్ల చరిత్ర, సంస్కృతి కలిగిన భాష మన మాతృభాష. అలాంటి తెలుగుభాష గొప్పతనాన్ని తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోతోంది. భారతదేశంలోనే హిందీ తర్వాత అత్యధిక చిత్రాలను నిర్మిస్తోన్న పరిశ్రమగా తెలుగు సినీ పరిశ్రమ పేరు గాంచింది. ఇంత ఘన చరిత్ర కలిగినప్పటికీ పరభాషా వ్యామోహంతో తెలుగు చిత్రాలకు ఆంగ్లపేర్లు పెడుతున్నారు మన దర్శక నిర్మాతలు. ఇటీవల కాలంలో ఈ ధోరణి శ్రుతిమించిపోతోంది. ఘనమైన వారసత్వం కలిగిన అగ్రకథానాయకుల చిత్రాలకు కూడా ఇంగ్లిష్ పేర్లే పెడుతుండటం గమనార్హం. అసలు కథలో బలమున్న చిత్రాలను, నాయికా, నాయకులు ఎవరన్నది కూడా చూడకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటప్పుడు తెలుగు చిత్రాలకు ఇంగ్లిష్ పేర్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయకులు, దర్శక నిర్మాతలు ఈ విషయంపై దృష్టి సారించాలి. తెలుగు చిత్రాలకు తెలుగు పేర్లే పెట్టేందుకు కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రోత్సాహాన్ని అందించాలి. తమిళనాడు ప్రభుత్వం మాదిరి మాతృభాషలో పేర్లు పెట్టిన చిత్రాలకు ప్రత్యేక రాయితీ కల్పించాలి. తద్వారా తెలుగుభాష మరుగునపడిపోకుండా చూడాలి. మన భాషలోని తియ్యదనాన్ని పక్కనపెట్టి ఆంగ్ల పేర్ల వ్యామోహంలో పడిపోకుండా తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడాలని కోరుకుంటున్నాము. - బి. రామకృష్ణ సౌత్‌మోపూరు, నెల్లూరు జిల్లా -
సాహితీ సమరాంగణ సార్వభౌముడు
కావ్యం అనే తెలుగుపిల్ల వాగనుశాసనుడి వద్ద వర్ణాలు దిద్ది, అచ్చతెలుగు నుడిలో ఆటవెలదులాడి, పోతనామాత్యుని భక్తిరసంలో మునిగితేలి, కవిసార్వభౌముని శృంగార వైభవాలు కళ్ళజూసి, పూర్తి ప్రౌఢత్వంతో రాయల భువనవిజయం అనే శిఖరాన్ని అలంకరించింది. తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల యుగం స్వర్ణయుగం. కన్నడ రాజ్యలక్ష్మి కొలువులో తెలుగుభాష రాజభాష అయింది.‘తెలుగ దేల యన్న, దేశంబు దెలు గేను దెలుగు వల్లభుండ, దెలుగొకండ యెల్లనృపులు గొలువ నెరుగనే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స’ అన్న రాయలు, తెలుగులో ‘ఆముక్తమాల్యద’ స్వయంగా రచించడమేగాక, అష్టదిగ్గజాలనే మహాకవులని పోషించాడు. విద్యానగరంలో మన తెలుగు కవులని అందలం ఎక్కించాడు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రబంధ రచన జరిగింది. కావ్యరచన, పాత్రల చిత్రణలో, పద్దెనిమిది వర్ణనలలో, అలంకారాలతో కొత్తపుంతలు తొక్కింది. దృశ్యశ్రవణ ప్రదర్శనలకి అనువైన రీతిని స్వంతం చేసుకుంది. విజయనగరంలో కవులు మహారాజ వైభవాలు అనుభవించారు. మనుచరిత్ర అంకితం తీసుకొన్న రోజున రాయలు, పెద్దన పల్లకి స్వయంగా మోసాడట. ఎదురొస్తే చేయందంచి ఏనుగు అంబారీలో పక్కన కూర్చోపెట్టుకునేవాడట. ప్రబంధయుగంలో ఇతివృత్తాలు, వర్ణనలు ఆనాటి విజయనగర వైభవానికి అద్దం పడతాయి. ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలో ఇతివృత్తం మనకి శ్రీకృష్ణతులాభారం నాటకంగా, సినిమాగా పరిచయమే. అందులో సత్యభామ మందిరంలో కృష్ణుని దినచర్య, ఆనాటి రాయల దైనందిన క్రమాన్ని ప్రతిబింబిస్తుందని చారిత్రకుల అభిప్రాయం. ప్రబంధరచనలో శృంగారం పాలు కొంచెం ఎక్కువే! రమణీ ప్రియదూతికలు ఇచ్చిన తాంబూలం, ఆత్మకింపయిన భోజనం చేసి, ఉయ్యాల మంచంపై కూర్చుంటే గానీ అటువంటి కవిత్వం రాదని పెద్దనగారే స్వయంగా చెప్పారు. ఇక సుకుమార వార వనితల అధరామృతం ఎల్లప్పుడూ సేవించబట్టే ధూర్జటికి కవితా మాధుర్యం అబ్బిందట! ఆనాడు దేశం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉందని ఎందరో విదేశీ యాత్రికులు సాక్ష్యమిచ్చారు. రాజ్యంలో కొత్త చెరువులు తవ్వడానికి అనువైన ప్రదేశాలలో అన్నిచోట్లా అప్పటికే నిర్మాణాలు జరిగిపోయాయట! ప్రభుత్వాదాయంలో అన్ని ఖర్చులూ - అంటే సైన్యం, అభివృద్ధి పనులూ, స్వంత వ్యయాలూ - పోగా సాలుకి కోటి వరహాలు మిగిలేవట! ఇక సంస్థానాధీశులకి 15 వేల నుండి 11 లక్షల వరకూ జీతాలు. అలాంటి సంస్థానాధిపతులు కూడా ఎందరో కవిపండితులని పోషించారు. పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేయ్స్ వివరించినట్లు, ఆనాటి వ్యవస్థలో సామాన్య భటుడి రోజుకూలి ఒక మాడ. ఒక మాడ (మాడ= రూపాయి) విలువ ఎలాంటిదో చూద్దాం: 2 పైసలకి కోడి, 15 పైసలకి మేక, రెండున్నర పైసలకి కిలో బియ్యం. అంటే రోజుకూలితో ఇరవై కిలోల బియ్యం కొన్నా, మూడు మేకలు లేదా ఇరవై కోళ్లు కొన్నా ఇంకా చిల్లర మిగిలేది. కాని అదే కాలంలో కోస్తాంధ్ర, తెలంగాణల్లో కవులకి ఆదరణ కరువైంది. రెడ్డిరాజుల పతనంతో కోస్తాంధ్ర ఓడ్ర గజపతుల ఆధీనమైంది. శ్రీనాథ కవిసార్వభౌముడినే కౌలు కట్టలేదని భుజాన బండ మోపి ఎండలో నడివీధిలో నిలబెట్టారు. తెలంగాణలో పరిస్థితి ఇంకా అధ్వాన్నం. కుతుబ్షాహి, ఆదిల్ షా, బరీద్ షా సుల్తాన్ల మధ్య పోరుతో గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. చిన్న చిన్న దొరల సంస్థానాలలో దొరికిన పోషణ, విజయనగర వైభవం ముందు దిగదుడుపే. ఇచ్చిన వాడిని పొగడటం, ఇవ్వని వాడిని తిట్టడం కవులకి ఆనవాయితీ అయింది. అలాంటి పరిస్థితుల్లో... కొండవీడు మనదేరా! కొండపల్లి మనదేరా! కాదని వాదుకు వస్తే కటకం దాకా మనదేరా! అంటూ క్రీ.శ.1515లో కృష్ణరాయలు నెల్లూరు నుండి పొట్నూరు దాకా విజయయాత్ర సాగించి, కోస్తాంధ్రని విజయనగర రాజ్యంలో కలుపుకున్నాడు. ఆంధ్రకవులకి భువనవిజయపు వాకిళ్లు తెరుచుకున్నాయి. మాదయ్యగారి మల్లన, పింగళి సూరన, తెనాలి రామలింగడు వంటి అనేక కవులు విజయనగరం దారిపట్టారు. ప్రబంధాలు రచించారు. రాయల కొలువులో సాగిన ప్రబంధ సంప్రదాయాన్ని, తరువాతి యుగాల్లో పెనుగొండలో ఆరవీటివారూ, మధుర, తంజావూర్లలో నాయక రాజులు కొనసాగించారు. -
జయహో.. దేవరాయ
పండగను తలపించిన రాయల పట్టాభిషేక మహోత్సవాలు రూ.2 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పర్యాటక కేంద్రాలుగా పెనుకొండ, గుత్తి కోట గుప్త నిధుల కేటుగాళ్లపై నిఘా ముగింపు ఉత్సవాల్లో మంత్రి పరిటాల సునీత సాక్షి, అనంతపురం : శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు పండగను తలపించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. పెనుకొండలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉత్సవాలు గురువారం ముగిశాయి. పెనుకొండ కోటపై ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధ్యక్షతన గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో రాయల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్విహ స్తామన్నారు. ముందుగా కొండపైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కోటలో శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో పునరుద్ధరిస్తామని, ఇస్కాన్ ఆధ్వర్యంలో కోటపై శ్రీకృష్ణుడి ఆలయం నిర్మిస్తామని ప్రకటించారు. రాయల కీర్తి, చారిత్రక నిర్మాణాల గురించి తెలియజేసేందుకు వీలుగా కోటపై మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. కోట సంపద పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రాయల కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పేందుకు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించే వారిపై నిఘా పెంచుతామన్నారు. అనంతరం రాయల ఉత్సవాల్లో ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అంతకు ముందు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని మంత్రి సునీత ప్రారంభించారు. కోట పునఃనిర్మాణానికి చర్యలు : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ పెనుకొండ కోటను పునఃనిర్మిస్తామన్నారు. కోటపై విద్యుత్ దీపాలు, రోడ్లు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.25 కోట్లు మంజూరు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రాయలేలిన సీమలో ఫ్యాక్షన్ సంస్కృతిని చెరిపి వేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో రాయల కీర్తి గురించి తప్ప ఫ్యాక్షన్ మాట వినపడడానికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పోటెత్తిన కోట : రాయల ఉత్సవాల సందర్భంగా పెనుకొండ కోట జనంతో పోటెత్తింది. కోటపై ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు చివరకు చేతులెత్తేసినా.. ప్రజలు, విద్యార్థులు మాత్రం తెలుగు జాతి ఔన్నత్వాన్ని చాటిచెప్పేందుకు, రాయలపై ఉన్న అపార గౌరవంతో ఎనిమిది కిలోమీటర్ల మేర కాలినడకన కోటకు చేరుకున్నారు. కోట నలువైపులా కలియ దిరిగారు. చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంపై ఆవేదన చెందారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతపురం అరబింద్ ఆర్ట్స్ అకాడమీ కళాకారిణులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు, హైదరాబాద్ నృత్య కారిణులు ‘శ్రీకృష్ణ లీలలు’ గేయానికి చేసిన ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీఈఓ మధుసూదన్‌రావు, సివిల్ సప్లయీస్ డీఎం వెంకటేశం, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు. -
ఆ సన్నివేశాలు తొలగించండి
చెన్నై: తమిళ సినీ హాస్య నటుడు వడివేలుకు చెన్నై హైకోర్టులో చుక్కెదురైంది. ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు తొలగించాలని ఆదేశించింది. ఈ చిత్రంలో కృష్ణదేవరాయలు పేరు, తెలుగు భాషను కించపర్చేలా ఉన్న సన్నివేశాలు తొలగించి విడుదల చేసుకోవాలని హైకోర్టు సూచించింది. వడివేలు హీరోగా నిర్మించిన తెనాలిరామన్ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలను కించపరిచేవిధంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని తెలుగు సంఘాలు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అభ్యంతకర సన్నివేశాలను తొలగించేందుకు నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశంపై తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
'వడివేలు సినిమాను అడ్డుకుంటాం'
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామన్‌గా ద్విపాత్రాభినయం చేసిన ‘జగజ్జాల బాహుబల తెనాలిరామన్’ చిత్రంపై వివాదం ముదురుతోంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రను జోకర్‌గా చిత్రీకరించడంపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిర్మాత నిరాకరించడంతో తెలుగు సంఘాల ఐక్యవేదిక ఆందోళన కొనసాగిస్తోంది. ప్రధానపాత్ర పోషించిన వడివేలుకు వ్యతిరేకంగా తెలుగు సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను చిత్రాన్ని కోర్టు ద్వారానైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు వడివేలుకు తమిళ చిత్రపరిశ్రమ బాసటగా నిలిచింది. కళాకారుడైన వడివేలు జోలికి వస్తే తమిళులంతా ఏకమవుతారని నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ తెలుగు సంఘాల వారిని హెచ్చరించారు. -
తెలుగు సంఘాలకు మరో సవాల్
తమిళ హాస్యనటుడు వడివేలు హీరోగా నిర్మించిన ‘జగబల భుజబల తెనాలిరామన్’ చిత్ర వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. రెండు రోజుల క్రితం రాజకీయ నేత సీమాన్, బుధవారం నాడు తమిళ సినీ దర్శకుడు గౌతమన్ , తెలుగు సంఘాల వారికి హెచ్చరికలు జారీచేసి వివాదానికి ఆజ్యం పోశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీకృష్ణదేవరాయలు ఒక్క తెలుగువారికే కాదు అందరికీ ఆరాధ్యుడు, ఆదర్శనీయుడు. వీరునిగా, కవి, పండితా పోషకుడుగా ప్రసిద్ధుడు. శ్రీకృష్ణదేవరాయల ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. అటువంటి మహానాయకుని ఒక జోకర్గానూ, బహుభార్యాతత్వం కలిగిన విలాసజీవిగా చిత్రీకరించినట్లుగా తెనాలిరామన్ ప్రచార చిత్రాలే చెబుతున్నాయి. ఇది తెలుగువారి హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈనెల 18న తెనాలిరామన్ తమిళనాటంతా విడుదలకు సిద్ధమైంది. తమకున్న అనుమానాల నివృత్తి కోసం విడుదలకు ముందే సినిమాను చూపాల్సిందిగా కొందరు తెలుగు ప్రముఖులు చిత్రదర్శకుడు యువరాజన్ను కోరగా ఆయన అంగీకరించారు. అయితే విడుదలకు ముందు సినిమాను చూపేది లేదని చిత్రనిర్మాత రంగరాజన్ మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తెలుగువారంతా గవర్నర్ కే రోశయ్యను కలిసి ఈ వివాదంపై వినతిపత్రం అందజేశారు. తెలుగు సంఘాల ఐక్యవేదిక కింద సుమారు 20 తెలుగు సంఘాలు ఏకమై చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరో తెలుగు బృందం వడివేలు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసింది. కేతిరెడ్డి ఖండన తెలుగు సంఘాలకు సీమాన్, గౌతమన్ చేసిన హెచ్చరికలనుతమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలుగువారి మనోభావాలను కించపరుస్తూ నిర్మించిన సినిమాను అడ్డుకునే హక్కు తెలుగువారికి లేదా అని ప్రశ్నించారు. మహోన్నతుడైన కృష్ణదేవరాయలకు 36 మంది భార్యలు, 52 మంది సంతానం ఉన్నట్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని వారిని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులోనే పుట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన తెలుగువారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగువారిని స్థానికేతరులుగా భావిస్తూ కొందరు సాగించే బెదిరింపులకు తాము భయపడబోమని హెచ్చరించారు. మరో పది రోజుల్లో వివాదాస్పద తెనాలిరామన్ విడుదల కావడం, ఆ నిర్మాణ సంస్థను ఎటువంటి హామీలు రాకపోవడం, సీమాన్, గౌతమన్ ఇలా వరుసగా హెచ్చరికలు జారీచేయడం వంటివి జరిగిపోతున్నాయి. అయినా తెలుగు సంఘాల ఐక్యవేదిక తరపున సంఘటితమైన తెలుగు సంఘాల వారెవ్వరూ ఇంతవరకు నోరు మెదపకపోవడం శోచనీయం.