‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల చేత ప్రశంసలందుకున్నది తెలుగుభాష. పంచదారకన్నా, జుంటుతేనెలకన్నా మధురమైనది తెలుగుభాష. ఎన్నో ఏళ్ల చరిత్ర, సంస్కృతి కలిగిన భాష మన మాతృభాష. అలాంటి తెలుగుభాష గొప్పతనాన్ని తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోతోంది. భారతదేశంలోనే హిందీ తర్వాత అత్యధిక చిత్రాలను నిర్మిస్తోన్న పరిశ్రమగా తెలుగు సినీ పరిశ్రమ పేరు గాంచింది. ఇంత ఘన చరిత్ర కలిగినప్పటికీ పరభాషా వ్యామోహంతో తెలుగు చిత్రాలకు ఆంగ్లపేర్లు పెడుతున్నారు మన దర్శక నిర్మాతలు. ఇటీవల కాలంలో ఈ ధోరణి శ్రుతిమించిపోతోంది. ఘనమైన వారసత్వం కలిగిన అగ్రకథానాయకుల చిత్రాలకు కూడా ఇంగ్లిష్ పేర్లే పెడుతుండటం గమనార్హం. అసలు కథలో బలమున్న చిత్రాలను, నాయికా, నాయకులు ఎవరన్నది కూడా చూడకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటప్పుడు తెలుగు చిత్రాలకు ఇంగ్లిష్ పేర్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయకులు, దర్శక నిర్మాతలు ఈ విషయంపై దృష్టి సారించాలి. తెలుగు చిత్రాలకు తెలుగు పేర్లే పెట్టేందుకు కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రోత్సాహాన్ని అందించాలి. తమిళనాడు ప్రభుత్వం మాదిరి మాతృభాషలో పేర్లు పెట్టిన చిత్రాలకు ప్రత్యేక రాయితీ కల్పించాలి. తద్వారా తెలుగుభాష మరుగునపడిపోకుండా చూడాలి. మన భాషలోని తియ్యదనాన్ని పక్కనపెట్టి ఆంగ్ల పేర్ల వ్యామోహంలో పడిపోకుండా తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడాలని కోరుకుంటున్నాము.
- బి. రామకృష్ణ సౌత్‌మోపూరు, నెల్లూరు జిల్లా