
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
వన్‌టౌన్ (విజయవాడపశ్చిమ): తెలుగు భాష వినసొంపైనదే కాకుండా.. సంగీతంలా మనసులను పరవశింపజేస్తుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కితాబిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో శనివారం ప్రారంభమయ్యాయి.
ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మహాసభలను ప్రారంభించి మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాలన్నారు. జాతి మనుగడకు, వికాసానికి భాష ప్రధానమైన పాత్ర పోషిస్తుందని, తెలుగు భాష సంగీతంలా మనసుకు హత్తుకుంటుందని చెప్పార
శ్రీశ్రీ, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సీ నారాయణరెడ్డి వంటి గొప్ప కవులు రచయితలు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, భానుమతి వంటి నటులు, మంగళంపల్లి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి తెలుగు దిగ్గజాల గొప్ప వారసత్వం మనదన్నారు. తెలుగు భాషా వికాసానికి అడ్డంకిగా ఉన్న జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగు వారిలో అద్భుత ప్రతిభ..
శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగువారు అద్భుతమైన ప్రతిభను కనబరిచి సమాజానికి స్ఫూర్తినిచ్చారని భారత రక్షణ మంత్రిత్వశాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. సాహితీవేత్త పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నూతన సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకుని తెలుగు రచనలను మరింత విస్తృతం చేసుకోవాలని సూచించారు.
హోసూరు (తమిళనాడు) ఎంపీ కే గోపీనాథ్ మాట్లాడుతూ తెలుగు భాష పరిపుష్టికి తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ మాట్లాడారు. తొలుత ‘మార్పు’ పేరుతో ముద్రించిన మహాసభల సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు.