ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పూర్తి వివరాలు | Vijayawada: Prapancha Telugu Rachayitala Mahasabhalu On Dec 23 24 | Sakshi
Sakshi News home page

Vijayawada: ఈనెల 23, 24న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పూర్తి వివరాలు

Published Wed, Dec 21 2022 3:51 PM | Last Updated on Wed, Dec 21 2022 4:03 PM

Vijayawada: Prapancha Telugu Rachayitala Mahasabhalu On Dec 23 24 - Sakshi

‘‘స్వభాషను పరిరక్షించుకుందాం- స్వాభిమానాన్ని పెంచుకుందాం’’ అనే నినాదంతో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక సిద్ధార్ధ అకాడమి (విజయవాడ) సౌజన్యంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు జరుగనున్నాయి. 

ఈ నెల 23, 24 తేదీలలో శుక్ర, శనివారాల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభాపతి డా॥ మండలి బుద్ధ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి డా॥ జి.వి. పూర్ణచంద్‌, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశములో వారు మాట్లాడారు.

ఉద్దేశం ఇదే
ఈ సందర్భంగా.. ప్రపంచ నలుమూలల నుంచి సుమారుగా 1500 మంది రచయితలు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చరిత్ర రంగాలపై వాణిజ్య సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తోందన్నారు. సామాజిక విలువలను కాపాడుతూ, భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక చేతనత్వాన్ని కలిగించటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తోందని వివరించారు.

విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్‌ మరియు సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఈ సభలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక-అమెరికా, సిలికానాంధ్ర, సిద్దార్ద అకాడెమీ మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకరిస్తున్నాయని వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది రచయితలు, భాషాభిమానులు ప్రతినిధులుగా హాజరౌతున్నారని వివరించారు.

పూర్తి వివరాలు
ఇక డా॥ జి.వి. పూర్ణచంద్‌ మాట్లాడుతూ మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుబడిన రాజరాజనరేంద్రుడి పేరు పెట్టామన్నారు. ఆదికవి నన్నయ వేదిక పై ప్రారంభసభ, సమాపన సభ, తెలుగు వెలుగుల సభ, ఇంకా ఇతర సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెలుగు అకాడెమీ నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన వ్యక్తి, తెలుగు టైపు రైటర్ల సృష్టికర్త, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహరావు వేదిక పైన కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు.

గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుండి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని వివరించారు. 23 ఉదయం 10 గంటలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెలుగు వెలుగుల సభలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యన్‌. వి. రమణ పాల్గొంటున్నారని తెలిపారు.

పద్మశ్రీ గ్రహీతలు ఆచార్య కొలకలూరి ఇనాక్‌, అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతీ రామమోహనరావు, డా॥గరికపాటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, సినీనటులు సాయికుమార్‌, గేయరచయితలు అందెశ్రీ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, సంగీతవేత్త స్వరవీణాపాణి పాల్గొంటున్నారని తెలిపారు.

యువ అవధానులతో ‘‘కుదురాట-కొత్తవెలుగు’’, 10 మంది యువ గజల్‌ కవుల ముషాయిరా, 50 మందితో యువకవి సమ్మేళనం, 150 మందితో మహిళా కవిసమ్మేళనం, మోదుమూడి సుధాకర్‌, డాపప సప్పా దుర్గాప్రసాద్‌, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలు డా॥ఎస్‌.పి.భారతి సోదాహరణ ప్రసంగాలు వుంటాయని పేర్కొన్నారు. కళారత్న కె.వి.సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్యరూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. మాతృభాష పరిరక్షణకు ప్రజాచైతన్యాన్ని కలిగించటానికి రచయితల పాత్రపై వివిధ సదస్సులలో చర్చలు జరుగనున్నాయని వివరించారు.

జనవిజ్ఞాన వేదిక వ్యవస్ధాపకులు డా॥ జంపా కృష్ణ్ణ కిషోర్‌, విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, ఉపాధ్యాయులు-భాషాపరిరక్షణ, తెలుగు బోధన, సామాజికమార్పులు-తెలుగు కవిత, విమర్శ, చరిత్ర, అంతర్జాలంలో తెలుగు విదేశీ, మహిళా పాత్రికేయ సదస్సు రాష్టేతర తెలుగు ప్రముఖులతో సదస్సులు ఉంటాయని వివరించారు.

ప్రతినిధులకు రెండు రోజులు కమ్మని తెలుగు విందు ఏర్పాట్లు చేశామని, 100కి పైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో ఆవిష్కరించనున్నారని నిర్వాహకులు వివరించారు. శుభోధయం యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌, ప్రపంచ మహాసభలు పేరుతో వాట్సాప్‌ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ వెల్లడి చేస్తామని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement