Telugu Association of North America
-
ఫిలడెల్ఫియాలో తానా 23వ మహాసభలు
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ మహాసభలుఈ ఏడాది జులై 7 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. స్థానిక పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో వీటిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీవిల్ నగరంలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్ ఆడిటోరియంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి నేతృత్వంలోని తానా మహాసభల సమన్వయ కమిటీల నియమించారు. మహాసభల కార్యదర్శిగా సతీష్ తుమ్మల, కోశాధికారిగా భరత్ మద్దినేని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రవి మందలపు, ఇండియా వ్యవహారాల డైరెక్టర్ గా వంశీ కోట, జాయింట్ సెక్రెటరీగా శ్రీనివాస్ కూకట్లకు భాద్యతలు అప్పగించారు. కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి, రీజినల్ కోఆర్డినేటర్లు సునీల్ కోగంటి, వంశీ వాసిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పూర్తి వివరాలు
‘‘స్వభాషను పరిరక్షించుకుందాం- స్వాభిమానాన్ని పెంచుకుందాం’’ అనే నినాదంతో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక సిద్ధార్ధ అకాడమి (విజయవాడ) సౌజన్యంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు జరుగనున్నాయి. ఈ నెల 23, 24 తేదీలలో శుక్ర, శనివారాల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభాపతి డా॥ మండలి బుద్ధ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డా॥ జి.వి. పూర్ణచంద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశములో వారు మాట్లాడారు. ఉద్దేశం ఇదే ఈ సందర్భంగా.. ప్రపంచ నలుమూలల నుంచి సుమారుగా 1500 మంది రచయితలు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చరిత్ర రంగాలపై వాణిజ్య సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తోందన్నారు. సామాజిక విలువలను కాపాడుతూ, భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక చేతనత్వాన్ని కలిగించటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తోందని వివరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ సభలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక-అమెరికా, సిలికానాంధ్ర, సిద్దార్ద అకాడెమీ మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకరిస్తున్నాయని వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది రచయితలు, భాషాభిమానులు ప్రతినిధులుగా హాజరౌతున్నారని వివరించారు. పూర్తి వివరాలు ఇక డా॥ జి.వి. పూర్ణచంద్ మాట్లాడుతూ మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుబడిన రాజరాజనరేంద్రుడి పేరు పెట్టామన్నారు. ఆదికవి నన్నయ వేదిక పై ప్రారంభసభ, సమాపన సభ, తెలుగు వెలుగుల సభ, ఇంకా ఇతర సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెలుగు అకాడెమీ నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన వ్యక్తి, తెలుగు టైపు రైటర్ల సృష్టికర్త, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహరావు వేదిక పైన కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుండి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని వివరించారు. 23 ఉదయం 10 గంటలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెలుగు వెలుగుల సభలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్. వి. రమణ పాల్గొంటున్నారని తెలిపారు. పద్మశ్రీ గ్రహీతలు ఆచార్య కొలకలూరి ఇనాక్, అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతీ రామమోహనరావు, డా॥గరికపాటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి, సినీనటులు సాయికుమార్, గేయరచయితలు అందెశ్రీ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, సంగీతవేత్త స్వరవీణాపాణి పాల్గొంటున్నారని తెలిపారు. యువ అవధానులతో ‘‘కుదురాట-కొత్తవెలుగు’’, 10 మంది యువ గజల్ కవుల ముషాయిరా, 50 మందితో యువకవి సమ్మేళనం, 150 మందితో మహిళా కవిసమ్మేళనం, మోదుమూడి సుధాకర్, డాపప సప్పా దుర్గాప్రసాద్, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలు డా॥ఎస్.పి.భారతి సోదాహరణ ప్రసంగాలు వుంటాయని పేర్కొన్నారు. కళారత్న కె.వి.సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్యరూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. మాతృభాష పరిరక్షణకు ప్రజాచైతన్యాన్ని కలిగించటానికి రచయితల పాత్రపై వివిధ సదస్సులలో చర్చలు జరుగనున్నాయని వివరించారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్ధాపకులు డా॥ జంపా కృష్ణ్ణ కిషోర్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, ఉపాధ్యాయులు-భాషాపరిరక్షణ, తెలుగు బోధన, సామాజికమార్పులు-తెలుగు కవిత, విమర్శ, చరిత్ర, అంతర్జాలంలో తెలుగు విదేశీ, మహిళా పాత్రికేయ సదస్సు రాష్టేతర తెలుగు ప్రముఖులతో సదస్సులు ఉంటాయని వివరించారు. ప్రతినిధులకు రెండు రోజులు కమ్మని తెలుగు విందు ఏర్పాట్లు చేశామని, 100కి పైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో ఆవిష్కరించనున్నారని నిర్వాహకులు వివరించారు. శుభోధయం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్, ప్రపంచ మహాసభలు పేరుతో వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెల్లడి చేస్తామని వివరించారు. -
విరాళాల సేకరణలో తానా సరికొత్త రికార్డు
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మక స్థాయిలో విరాళాలు ప్రకటించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో 2021లో నిర్వహించాల్సిన మహాసభలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో 2023 జులై 7 నుండి 9 వరకు జరగబోతున్న తానా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నవంబర్ 5నాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్ నగరంలోని ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందులో ఎనిమిది వందల మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. గతంలో జరిగిన అన్ని విరాళాల సేకరణని మించిపోయేలా దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయల (ఆరు మిలియన్ల డాలర్లు) విరాళాలు ప్రకటించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, EC, BOD, ఫౌండేషన్ సభ్యులను, మాజీ అధ్యక్షులను, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. తానా సభ్యులు, వాలంటీర్లు, దాతలు సంఘం అభివృద్ధికి వారు చేసిన కృషిని సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా అభినందించారు. 23వ తానా మహాసభల ప్రాముఖ్యతను చాలా వివరంగా వివరించారు. ప్రతిష్టాత్మక తానా మహాసభలు దాదాపు నాలుగేళ్ళ తర్వాత నిర్వహిస్తుండటంతో పాటు అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలోని తానా కార్యవర్గం గత పదహారు నెలలుగా చేసిన సేవలు, చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్లో 23వ తానా మహాసభల పట్ల ఆసక్తిని పెంచి విరాళాల సేకరణ కార్యక్రమానికి ఊహించని స్పందన లభించినట్లు మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. విరాళాల కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్ధన్ బోబ్బా, జగదీశ్ యలమంచిలి, వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలియజేశారు. -
కాలిఫోర్నియాలో ‘వెటా’ నూతన కార్యవర్గం ఎన్నిక
సాక్రమెంటో : కాలిఫోర్నియాలోని బే ఏరియాలో వెటా (వుమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం వెటా వ్యవస్థాపక అధ్యక్షురాలు, సలహాదారు, ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కాగా, ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఫౌండర్ చైర్ పర్సన్ ఝాన్సీ రెడ్డి, సహ చైర్ పర్సన్ అభికొండలు ఆధ్వర్యంలో జరిగింది. దీనిలో ప్రెసిడెంట్‌గా శైలజ కల్లూరి, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్, వాషింగ్టన్ డీసీ నుంచి కూడా ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఆన్లైన్ మాధ్యమంగా జరిగింది. ఈ సదర్భంగా వెటా అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు అన్నిరకాలు అవకాశాలు కల్పించి, వారిలోని కళలను సాకారం చేసుకోవడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని అన్నారు. నూతన ప్రెసిడెంట్ శైలజ కల్లూరి మాట్లాడుతూ.. ఈరోజు నామినేటేట్ కార్యవర్గ సభ్యులందరు ప్రమాణ స్వీకారం చేయడానికి సమావేశం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ సంస్థ మహిళా సాధికారికత కోసం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే సంవత్సరంలో చేయాలను కుంటున్న కార్యక్రమాలన్ని ఇప్పటి నుంచే తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. -
తానా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య భారతీ- సాహిత్య హారతి
వాషింగ్టన్ : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 74వ పంద్రాగస్టు వేడుకలను వినూత్నంగా, ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటామని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అన్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒక్కటై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి, జాతీయ సమైక్యతా భావాన్ని ప్రోదిగొల్పటం ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విషయమని ఆయన పేర్కొన్నారు. పౌరుల్లో దేశభక్తి లేనిదే ఏ జాతి రాణించలేదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో దేశ భక్తి, సామాజిక స్పృహ కల్పించడంలో సాహిత్యం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఇది ఆది కవులు, రచయితల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహణలో ఈ అపూర్వమైన సాహిత్య సమ్మేళనం జరుగుతుందని తాళ్లూరి తెలియజేశారు. (తానా ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక మహోత్సవం) 39వ తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా - ఆగస్టు 15వ తేదిన, అంతర్జాలం ద్వారా, వివిధ దేశాల నుంచి 74 మంది సాహితీవేత్తలు వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత్వం, గజల్స్, పాటలలాంటి వివిధ ప్రక్రియలతో భరతమాతకు సాహిత్య హారతి సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన తెలుగు సంతతికి చెందిన గవర్నర్లు - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, తమిళనాడు పూర్వ గవర్నర్ పి.ఎస్. రామ్మోహన్ రావు, ఐపీఎస్ తమ సందేశాలు అందజేస్తారని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరవుతున్న 74 మంది సాహితీ వేత్తలలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రఖ్యాత సినీ గేయ రచయితలు.. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, చైతన్య ప్రసాద్, జె.కె.భారవి, శ్యామ్ కాసర్ల, సిరాశ్రీ, డా. వడ్డేపల్లి కృష్ణ, రసరాజు, డా. ముయిద ఆనందరావు (మిథునం చిత్ర నిర్మాత) విశిష్ట అతిథులుగా ఉన్నారు. డా. కడిమెళ్ళ వరప్రసాద్, డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్, డా. మీగడ రామలింగస్వామి, డా. రాంభొట్ల పార్వతీశ్వర శర్మ, డా. పూదూర్ జగదీశ్వరన్, కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ అవధానులుగా వ్యవహరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాక మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దుబాయ్, ఒమన్, కెనడా వంటి దేశాల నుంచి కూడా ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని డా. ప్రసాద్ తోటకూర ప్రకటించారు. (వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్’ ఆసుపత్రి) సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ఆహ్వానం పలుకుతూ, ఈ అద్భుత కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం అవుతుందని, ఆయా దేశాల కాలమానాల ప్రకారం అంతర్జాలంలో యూట్యూబ్, ఫేస్బుక్(https://www.facebook.com/TANA.ORG/) ద్వారా అందరూ వీక్షించవచ్చని తెలియజేశారు. -
విశ్వ సుందరిగా బెజవాడ యువతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలో భాగంగా మిస్ తెలుగు యూనివర్సల్ పోటీల్లో కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు. -
అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’
సాక్షి, అమరావతి : అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభలను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తానా సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించిన లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారని అన్నారు. ఈ సభలను పచ్చతమ్ముళ్లు టీడీపీ భజన సభలుగా మార్చి అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ట దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. ‘ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అని కన్నా వ్యాఖ్యానించారు. -
రారండోయ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు 2019 జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్లో జరగనున్న సందర్భంగా రెండు లక్షల రూపాయల బహుమతితో నవలల పోటీ ప్రకటించింది. తెలుగు వారి జీవితాన్ని ప్రతిబింబించాలి. పేజీల పరిమితి లేదు. రచయిత పేరును రచనపై కాకుండా కవరింగ్ లెటర్ మీద మాత్రమే రాయాలి. రచనలు అందవలసిన ఆఖరు తేది: మార్చి 30. చిరునామా: అక్షర క్రియేటర్స్, ఏజీ–2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాద్–29. వివరాలకు: 9849310560. tana.novel.2019 @gmail.com కు కూడా పంపవచ్చు. కాంచనపల్లి కథాసంపుటి ‘ఓ వర్షం కురిసిన రాత్రి’ ఆవిష్కరణ, ఆయన పదవీ విరమణ ఉత్సవం డిసెంబర్ 10న సాయంత్రం 6 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్. తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా కావ్య పరిమళం పరంపరలో భాగంగా డిసెంబర్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో వానమామలై జగన్నాథాచార్యుల ‘రైతు రామాయణం’పై డాక్టర్ గండ్ర లక్ష్మణరావు ప్రసంగిస్తారు. మంజు యనమదల ‘అంతర్లోచనాలు’ ఆవిష్కరణ డిసెంబర్ 15న సా. 6 గంటలకు టాగూర్ స్మారక గ్రంథాలయం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్. నిర్వహణ: నవ్యాంధ్ర రచయితల సంఘం. డాక్టర్ ప్రసాదమూర్తి కవితా సంపుటి ‘దేశం లేని ప్రజలు’ ఆవిష్కరణ డిసెంబర్ 16న సా. 5:30 కు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో జరగనుంది. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాన్ని రామా చంద్రమౌళి కథాసంపుటి ‘తాత్పర్యం’కు ప్రకటించారు. ఫిబ్రవరి 2019లో సిరిసిల్లలోని రంగినేని చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తారు. 2018 విమలాశాంతి సాహిత్య పురస్కారాలను శిఖామణి ‘చూపుడువేలు పాడే పాట’, ఇబ్రహీం నిర్గుణ్ ‘ఇప్పుడేదీ రహస్యం కాదు’ కవితా సంపుటాలకు ప్రకటించారు. శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం 2019ని ఆధునిక సాహిత్య అనువాద గ్రంథాలకు ఇవ్వనున్నారు. 2016 జనవరి నుండి 2018 డిసెంబర్ మధ్య ప్రచురించిన పుస్తక నాలుగు ప్రతులను జనవరి 30లోగా ‘షేక్ మస్తాన్‌వలి, 38/712, పి.ఎస్.నగర్, సెంట్రల్ విజన్ పోస్ట్, కడప–2’ చిరునామాకు పంపాలి. పురస్కార విలువ పదివేలు. వివరాలకు: 9704073044 కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ, కడప– గురజాడ కథా, కందుకూరి నవలా, శ్రీశ్రీ కవితా, జానమద్ది సాహిత్య, రావూరి భరద్వాజ బాల సాహిత్య పురస్కారాలకు 2016–18 మధ్య ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తోంది. పురస్కార విలువ ఒక్కోటీ ఐదు వేలు. మూడు ప్రతులు పంపాలి. చివరి తేది: డిసెంబర్ 31. చిరునామా: బోయపాటి దుర్గాకుమారి, 42/169, ఎన్జీవో కాలనీ, కడప–2. ఫోన్: 08562–253734 -
ఎన్నారై విద్యార్థులకు తానా సంగీతం కోర్సులు
డల్లాస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనుసంధానంతో సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు ప్రారంభించింది. తానా అధ్యక్షులు డాక్టర్ జంపాల చౌదరి ఆ వివరాలను ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించేందుకు తానా తీసుకున్న మరో మెట్టు ఇది. ఎంతో శ్రమించి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అధికారులతో చర్చలు జరిపి ఈ కార్యక్రమం రూపుదాల్చడంలో కృషిచేసిన తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, విశ్వవిద్యాలయ అధికారులకు జంపాల చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో తానా సంగీత కోర్సులు ప్రారంభించడం తానా చరిత్ర లో ఒక మైలు రాయి. ఈ వర్సిటీ రూపొందించిన సంగీత పాఠ్య ప్రణాళికను విద్యార్థులు పాటిస్తే, ఇక్కడే పరీక్షలు రాసి, అన్ని స్థాయిలు పూర్తి చేసిన తరువాత వర్సిటీ డిప్లొమా సర్టిఫికెట్స్ పొందవచ్చు. అమెరికా సంగీత ప్రియులు తమ ప్రతిభా పాఠవాలను పరీక్షించుకోవాలనే దీర్ఘకాలిక కలను సాకారం చేసినందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.దుర్గాభవానీ, డీన్ ప్రొఫెసర్ డి.శారద, వర్సిటీ సిబ్బంది నా ప్రత్యేక ధన్యవాదాలు. మీనాక్షి అనిపిండి.. పద్మావతి వర్సీటీ నుంచి సంగీతంలో బంగారు పతకంతో పట్టభద్రులయ్యారని, అమెరికాలో ఉన్న గొప్ప సంగీత విద్వాంసులలో ఒకరని కొనియాడారు. ఎన్నారై విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంగీతం కోర్సుల్లో వెంటనే నమోదు కావల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నానని” చెప్పారు. తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ “ సంగీత కోర్సుల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నారై స్టూడెంట్స్ భారత్‌కు వెళ్లకుండానే ఇక్కడే పరీక్షలు వ్రాసి, డిప్లొమా సర్టిఫికెట్స్ పొందడానికి గొప్ప అవకాశం. లెవెల్ 1, లెవెల్ 2 కోర్సులకు వెంటనే అప్లై చేసుకోవాలనిని సంగీత విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా ఉత్తర అమెరికాలోని తల్లిదండ్రులను, సంగీత ఉపాధ్యాయులను అభ్యర్ధిస్తున్నాను. తానా సంస్థతోను, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూరతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందదాయకమని” చెప్పారు. డల్లాస్ లో తానా నిర్వహించిన “సంగీత కోర్సుల” నమోదు కార్యక్రమంలో వందకు పైగా విద్యార్థులు పాల్గొని, ఎంతో ఉత్సాహభరితంగా లెవెల్ 1 మరియు లెవెల్ 2 లో నమోదయ్యారు. ఉత్తర అమెరికా లో నివసిస్తున్న ఆసక్తి గల విద్యార్థులెవరైనా మార్చి 20, 2017 లోగా ఈ కోర్సుల్లో నమోదు కావచ్చు. ప్రసాద్ తోటకూర, మీనాక్షి అనిపిండి ఓ ప్రకటనలో ఈ క్రింది వివరాలు వెల్లడించారు. అకాడమిక్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్: Level 1 – Diploma in Introductory Music Level 2 – Diploma in Music Level 3 – Diploma in Music Level 4 – Advanced Diploma in Music ప్రస్తుతం, విద్యార్థులు లెవెల్ 1 మరియు లెవెల్ 2 సంగీతం కోర్సుల్లో నమోదు కావచ్చు. ఒక్కో లెవెల్ కు 12 క్రెడిట్స్ ఇస్తుంది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు అందుకున్న డిప్లొమాలు ఎన్నారై విద్యార్థులకు అదనపు విద్యా కార్యక్రమంగా భావిస్తారు. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ క్రెడిట్స్ ను గుర్తించవచ్చు. మేము వారు దరఖాస్తు చేసినప్పుడు వారి సంబంధిత అధికారులతో తనిఖీ చేసుకోవాలని విద్యార్థులను సూచిస్తున్నాము. విద్యార్థులు ఉత్తర అమెరికాలో ఎక్కడనుంచి అయినా ఏ సంగీత ఉపాధ్యాయుల నుంచి అయినా సంగీతం నేర్చుకోవచ్చు. ఈ సంగీత కోర్సుల్లో నమోదుకు కనీస వయసు 10 సంవత్సరాలు కాగా, విద్యార్థినులు మాత్రమే నమోదు కాగలరు. పరీక్షా ఫీజుతో కలిపి ఒక్కో లెవెల్ కు ఫీజు 300 డాలర్లు మాత్రమే. లెవెల్ 1, 2, 3 చివర్లో విద్యార్థుల నైపుణ్యతను తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్, వారి బృందం కలిసి నిర్ణయిస్తారు. లెవెల్ 4కు విశ్వవిద్యాలయ అధికారులు వ్యక్తిగతంగా సమీక్షించి థియరీ అండ్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు డిప్లొమాలను అమెరికాలో ఒక అధికారిక స్నాతకోత్సవంలో బహుకరిస్తారు. ప్రతి లెవెల్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి కనీసం 45% మార్కులు సాధించాలి. 70 శాతం సాధిస్తే "డిస్టింక్షన్" గా పరిగణిస్తారు. దయచేసి నమోదు ఫారం కోసం www.tana.org ను సందర్శించి పేర్కొన్న విధంగా ప్రక్రియను పూర్తి చేయాలి. మరిన్ని వివరాలకు: www.tana.org ను సందర్శించండి లేదా: మీనాక్షి అనిపిండి, తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ tanamusiccoordinator@gmail.com, డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఛైర్మన్- తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్ 817-300-4747, లేదా tanaieachair@gmail.com, డాక్టర్ జంపాల చౌదరి, తానా అధ్యక్షులు- 937-475-7809 లేదా president@tana.org ఫోన్ నెంబర్లలో గానీ, మెయిల్స్ లోగానీ సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొని అధిక సంఖ్యలో నమోదయిన విద్యార్థులకు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి, టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యానికి, మీడియా వారికి తానా ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, తానా సంయుక్త కోశాధికారి డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
డల్లాస్‌లో ఘనంగా 'శివతత్వం' ఈవెంట్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా), సనాతన ధర్మ ఫౌండేషన్(ఎస్డీఎఫ్), కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్(కేఎస్టీహెచ్) సంయుక్తంగా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాయి. 'శివతత్వం' అనే అంశంపై డల్లాస్ కేఎస్టీహెచ్ లో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రముఖ నటుడు, రచయిత తనికేళ్ల భరణి పాల్గొన్నారు. శివతత్వంపై అక్కడికి వచ్చిన వారికి అర్థమయ్యేలా వివరించారు. ఆయన ఇష్టదైవం పరమశివుడిపై తాను రాసిన పాటలను భక్తిగా పాడి వినిపించారు. శివతత్వాన్ని తనవంతుగా ప్రచారం చేస్తున్న భరణికి 'శివతత్వ విశారద' అనే బిరుదునిచ్చారు. కేఎస్టీహెచ్ చైర్మన్ డాక్టర్ ప్రకాశ్ రావ్ వెలగపుడి మాట్లాడుతూ.. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(జీహెచ్హెచ్ఎఫ్) చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. హిందూమతం విశిష్టతను, వారసత్వాన్ని హిందూ దేవాలయాలను, పుణ్య పీఠాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కేఎస్టీహెచ్ గొప్పతనాన్ని, విశిష్టతలను ఆలయ అధ్యక్షుడు ఆర్కే వెల్లంకీ తెలిపారు. సనాతన ధర్మ ఫౌండేషన్ కీలక సభ్యుడు గోపాల్ పొనాంగి నటుడు, దర్శకుడు అయిన తనికేళ్ల భరణిని సభకు పరిచయం చేశారు. 650కి పైగా మూవీలలో విభిన్న పాత్రలను పోషించారని కొనియాడారు. ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డును మూడు పర్యాయాలు అందుకున్నారని చెప్పారు. శ్రీకాళహస్తిశ్వర శతకం రాసిన ధూర్జటి కవి గురించి తనికేళ్ల భరణి ప్రస్తావించారు. తాను రాసిన పాటల్లో ఆయనకు ఎంతో పేరు తెచ్చిన 'ఆటగదర శివ' పాట పాడి వినిపించారు. తనికేళ్ల భరణిని ఈవెంట్‌కు ఆహ్వానించిన వ్యక్తి తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తనికేళ్ల భరణి గారి లాంటి ప్రముఖులను కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి కృషిచేశారు. తానా ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో భాగస్వాములయిన ఎస్డీహెచ్, కేఎస్టీహెచ్, మ్యుజిషియన్స్ ప్రభాళ, రాజు, వాలంటీర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు తనికేళ్ల భరణి, తానా కోషాధికారి మురళి వెన్నమ్, రీజనల్ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, డైరెక్టర్ చలపతి కె, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సనాతన ధర్మ ఫౌండేషన్ కీలక సభ్యుడు గోపాల్ పొనాంగి, , మధుమతి వ్యాసరాజు, ఐవీ రావు, మహేశ్ చొప్పా, విజయ్ తొదుపునూరి, లక్ష్మి తుమ్మల, శ్రీరామ్ చెరువు, జయేశ్ టి, ఇతర ముఖ్యలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
నాటా సభలకు ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28, 29న జరుగనున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) సభల్లో పాల్గొనడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. డల్లాస్‌లో జరుగనున్న ఈ సభలతో పాటు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) జూన్ 3, 4 తేదీల్లో నిర్వహించే సభలోనూ పాల్గొంటారు. జూన్ 5న హైదరాబాద్‌కు తిరిగివస్తారు. -
డెట్రాయిట్లో ఐఐఈ ఎక్స్పో!
తొలిసారిగా ప్రాపర్టీ షో మీడియా పార్ట్నర్లుగా సాక్షి, తెలుగు టైమ్స్ హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ సదస్సు జూలై 2 నుంచి 4 వరకు డెట్రాయిట్‌లోని కోబో సెంటర్లో జరగనుంది. తొలిసారిగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్ పో (ఐఐఈ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు ఐఐఈ ఫౌండర్, సీఈఓ రాజేష్ సుకమంచి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాక్షి, తెలుగు టైమ్స్ మీడియా పార్టనర్లుగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు +919000988068కు ఫోన్ లేదా mail@iiexpo.in కు మెయిల్ చేయవచ్చు. -
అమెరికాలో ఆపద్బాంధవి
అడిగినా ఎదుటివాళ్లకు సాయపడరు కొందరు. కానీ అడగకపోయినా సాయం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు ఇంకొందరు. లక్ష్మి దేవినేని కూడా అంతే. ఎదుటివాళ్లకు సాయపడాలని అనుక్షణం తపన పడుతుంటారు. అదే ఆమెను అమెరికాలో చాలా పాపులర్ చేసింది. ఇమిగ్రేషన్ లా ఫర్మ్‌లో మేనేజర్‌గా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లోని ఇమిగ్రేషన్ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంతో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తోన్న లక్ష్మి... అమెరికా వచ్చే తెలుగువాళ్లకు కొండంత అండగా ఉంటున్నారు. ‘తానా చైతన్య స్రవంతి’ కార్యక్రమం ద్వారా ఇండియాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చిన సందర్భంగా తన గురించి, తను చేస్తోన్న సేవ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు... - సమీర నేలపూడి ‘తానా’లో ప్రముఖ పాత్రే పోషిస్తున్నట్టున్నారు? నేననే కాదు. తానాలోని ప్రతి సభ్యుడూ యాక్టివ్గానే ఉంటారు. ప్రతి రెండేళ్లకోసారి తానా కన్వెన్షన్ జరుగుతుంది. దానికి ముందు తానా సభ్యులందరం కలిసి ఇండియాలో నాలుగు వారాల పాటు ‘తానా చైతన్య స్రవంతి’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. గ్రామాలకు వెళ్లి హెల్త్ క్యాంపులు పెట్టడం, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించడం వంటివి చేస్తుంటాం. ఇమిగ్రేషన్ కమిటీకి మీరు చైర్పర్సన్ కదా... ఈ కమిటీ ఏం చేస్తుంది? కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎవరికైనా అంతా కొత్తగానే ఉంటుంది. యూఎస్ వచ్చేవాళ్ల పరిస్థితి కూడా అంతే. అక్కడ స్థిరపడటానికి ఎలా ప్రయత్నించాలి, ఏయే లెసైన్సులు సంపాదించాలి వంటివేమీ అర్థం కావు. దాంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారందరికీ సహాయపడతాం. అమెరికా వెళ్లేవాళ్లంతా సాఫ్ట్వేర్ అంటారు. మీరు ఇమిగ్రేషన్ లా ఫర్మ్ వైపు ఎందుకు వెళ్లారు? దాని మీద అవగాహన, ఆసక్తి ఉండటం వల్ల. నేను పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. నాకు పదిహేనో ఏటే పెళ్లి చేశారు. పదహారో ఏట ఓ బిడ్డకు తల్లిని కూడా అయ్యాను. పెళ్లితో బ్రేక్ పడిన చదువుని, బాబు పుట్టాక పూర్తి చేశాను. ఇంజినీరింగ్ చేశాక, కొన్నాళ్లపాటు చాంబర్ ఆఫ్ కామర్స్‌లో పని చేశాను. ఆ సమయంలో విదేశీ దౌత్యవేత్తలతో పరిచయం పెరిగింది. అమెరికన్ కాన్సులేట్‌తో వ్యవహారాలు నడిపించడంతో వీసా, ఇమిగ్రేషన్ అంశాల మీద బాగా అవగాహన ఏర్పడింది. అయితే అంత అవగాహన ఉన్న నేను కూడా... ఉద్యోగ నిమిత్తం అమెరికా చేరుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యాను. చాలా విషయాలు అర్థం కాలేదు. ఒక లా ఫర్మ్ ద్వారా అన్నీ తెలుసుకున్నాను. అప్పట్నుంచీ ఎవరు ఇబ్బంది పడుతున్నా నన్ను గైడ్ చేసిన సంస్థ దగ్గరకు తీసుకెళ్లేదాన్ని. ‘ఇంతమందిని తీసుకొస్తారు కదా, మీరు మా దగ్గరే ఎందుకు పని చేయకూడదు’ అనడంతో వెంటనే అక్కడ చేరిపోయాను. పదిహేనేళ్ల పాటు పని చేసి, కొద్ది నెలల క్రితం సొంతగా నేనే ఓ సంస్థ పెట్టాను. పేదవారికి ఉచితంగా కూడా చేసి పెడుతుంటాను. ఉద్యోగుల కోసం, విద్యార్థుల కోసం చాలా చేస్తున్నారు. మరి ఓ మహిళగా మహిళలకు ఏదైనా చేస్తున్నారా? ఇరవయ్యేళ్లుగా చేస్తూనే ఉన్నాను. అమెరికా వెళ్లేంత విజ్ఞానం ఉన్నవాళ్ల గురించి మనం ఏదో ఊహించుకుంటాం. అయితే అలాంటి వాళ్లలో కొందరు గృహ హింసకు పాల్పడుతున్నారంటే నమ్ముతారా? కట్నం కోసమనో, ఆడపిల్ల పుట్టిందనో చిత్రహింసలు పెడుతుంటారు. కొందరైతే ఏదో వంకతో భార్యను మన దేశానికి పంపేసి, ఆనక అక్కడ కోర్టులో విడాకుల పిటిషన్ వేస్తుంటారు. ఆరోగ్యం సరిగా ఉండదనో, మతి స్థిమితం లేనిదనో ఏవేవో కారణాలు సృష్టిస్తుంటారు. ఒకసారి అక్కడ కోర్టులో కేసు రిజిస్టర్ అయ్యాక ఇక ఆమె ఇంకెక్కడా కేసు వేయడానికి ఉండదు. ఇది అన్యాయం కదా... మీలాంటి వాళ్లు, ప్రభుత్వం కలిసి ఈ పరిస్థితిని మార్చలేరా? కష్టం. ఎందుకంటే అమెరికాలో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. వాటిలో ఎవరినీ ఇన్వాల్వ్ అవ్వనివ్వవు. పాపం ఆ అమ్మాయిల్ని చూస్తే చాలా జాలేస్తుంది. ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ మహిళలు విలవిల్లాడిపోతారు. వాళ్లు నాకు ఫోన్ చేసినా, మరెవరి ద్వారా అయినా సమాచారం అందినా నేను వెంటనే వెళ్లిపోతాను. వీలైనంత వరకు ఇరువర్గాలతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీలుకాని పక్షంలో ‘తానా’ సభ్యుల సహకారంతో ఆ అమ్మాయికి చదువుకోవడానికో, చదువుకున్నవారైతే ఉద్యోగం చేయడానికో ఏర్పాటు చేస్తాను. వారు తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ సభ్యులలో ఎవరో ఒకరం వారికి ఆశ్రయం కూడా కల్పిస్తూ ఉంటాం. చట్టపరమైన సహాయం అవసరమైతే కనుక ఆయా రాష్ట్రాల్లో ఉన్న తానా సభ్యుల సాయంతో లాయర్లను ఏర్పాటు చేయడం, గెడైన్స్ ఇప్పించడం వంటివి చేస్తాను. విదేశాల్లో చాలా సేవ చేస్తున్నారు. మరి మన దేశం సంగతేంటి? తానా ‘మన పల్లె కోసం’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. దానిలో భాగంగా సభ్యులందరం ఇండియాలోని ఒక్కోగ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాం. నేను మా అమ్మమ్మగారి ఊరైన ‘నాయుడుగూడెం’ను దత్తత తీసుకున్నాను. ఏలూరు దగ్గర ఉన్న ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి వైఫై విలేజ్‌గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? వీసా, ఇమిగ్రేషన్ల గురించి సందేహాలు ఉన్నాయా? వెంటనే మాకు రాయండి. అమెరికాలో మీకు సంబంధించిన మహిళలెవరైనా గృహ హింసకు గురవుతున్నారా? వారిని ఎలా కాపాడాలో తెలియడం లేదా? వారి సమస్యను మాకు తెలియజేయండి. మీ ప్రశ్నలన్నింటికీ లక్ష్మి దేవినేని సమాధానాలు ఇస్తారు. పరిష్కారాలను సూచిస్తారు. మా చిరునామా... గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com -
తానా సేవలు భేష్
పెదపాడు : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సేవలు అభినందనీయమని శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం హనుమాన్‌జంక్షన్‌లోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో తానా సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తానా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తానా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు వేలాదిగా నిర్మించారన్నారు. 37 ఏళ్లుగా తెలుగు ప్రజల అభివృద్ధికి తానా కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాగంటి రాంజీ, హనుమాన్ జంక్షన్ లయన్స్‌క్లబ్ ఫౌండర్, అధ్యక్షుడు డాక్టర్ కడియాల రామారావు తదితులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సీనియర్ జర్నలిస్టు తాడి రంగారావును లయన్స్ సభ్యులు సన్మానించారు. వైద్యశిబిరం ఆదివారం కూడా కొనసాగుతుందని తానా కార్యదర్శి గోగినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 29న పెదవేగి మండలంలోని విజయరాయిలో లయన్స్‌క్లబ్ ఆఫ్ ఏలూరు-హేలాపురి, తానా సంయుక్త ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
తెలుగు ప్రజల శ్రేయస్సే ధ్యేయం
ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్: తెలుగు ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ చైర్మన్ తాళ్లూరి జయశేఖర్ అన్నా రు. తానా, ప్రియదర్శిని కళాశాల సంయుక్తాధ్వర్యంలో ‘యువ-2014’ ఉత్సవాలు ఆదివా రం ఖమ్మం నెహ్రూనగర్‌లోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో ఆదివారం ప్రారంభమయ్యూరుు. ఈ కార్యక్రమంలో జయశేఖర్ మాట్లాడుతూ.. తానా స్థాపించి 40 ఏళ్లయిందని అన్నారు. స్థాపించనప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి అమెరిలో తానా ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా ఇండియాలో 175మంది పేద విద్యార్థులకు 15వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నామన్నారు. అమెరికాలో చదువుకుంటున్న ఏడుగురు విద్యార్థులకు తానా సహాయ సహకారా లు అందుతున్నాయన్నారు. హుదుద్ తుపాన్ బాధితుల కోసం తాము రెండుకోట్ల రూపాయలను విరాళంగా సేకరించామన్నారు. దీనిని ఈ నెల 23, 24 తేదీలలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఇస్తామన్నారు. తెలంగాణ పభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలోని ఏదో ఒక ఊరును ‘తానా- మీ ఊరి కోసం’ పేరిట దత్తత తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా రు. ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగు వారై నా కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనే సద్దుద్దేశ్యంతో నే తానా స్థాపించినట్టు చెప్పారు. జూలై2,3,4 తేదీల్లో అమెరికాలో జరిగే తానా చైతన్య స్రవంతికి జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వానం పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఫెమా’ కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, ప్రియదర్శిని వి ద్యాసంస్థల అధినేత కాటేపల్లి నవీన్‌బాబు, జి ల్లా జూనియర్ కళాశాలల యూజమాన్యాల సం ఘం జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి పాల్గొన్నారు. -
2 వరకు తానా ‘చైతన్య స్రవంతి’
తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘చైతన్య స్రవంతి’ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. విజయవాడలోని ఆంధ్రా చాంబర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి జనవరి రెండో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీన్లో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా చిలువూరులో మెగా హెల్త్‌క్యాంప్ నిర్వహించామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ భారతీయ విద్యాభవన్‌లో జరిగే కార్యక్రమంలో లిటిల్ మ్యుజీషియన్ అకాడమీకి రూ.45 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రచయితలు, నటులను సత్కరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తానా కార్యదర్శి సతీష్ వేమన, బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ చైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి, ఆంధ్రా చాంబర్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ పాల్గొన్నారు. -
సీమాంధ్ర, తెలంగాణ అభివృద్ధికి తానా నిధులు
వాషింగ్టన్: అమెరికాలో తెలుగువారి సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)...ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర కొత్తరాజధాని ఏర్పాటు, తెలంగాణ అభివృద్ధికోసం విడివిడిగా నిధులను సేకరించనుంది. రెండురాష్ట్రాల అభివృద్ధికోసం తమవంతు తోడ్పాటు అందించడానికి తానాకు చెందిన పలువురు సభ్యులు ముందుకు రావడంతో వారి కోరికమేరకు తానా కార్యవర్గ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సభ్యుల నుంచి సేకరించిన నిధులను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని శుక్రవారం వెల్లడించారు. ఈ నిధులను ఏయే ప్రాజెక్టుల కోసం వినియోగించాలన్న అంశంపై తానా బోర్డు సభ్యుడు జయరాం కోమటి, కార్యదర్శి సతీష్ వేమన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. -
ఏఎన్నార్ గొప్ప మానవతా వాది
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ మరో ధృవ తారను కోల్పోయిందని తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) పేర్కొంది. ఏఎన్నార్ అద్బుతమైన నటుడని కీర్తించింది. అంతేకాకుండా అంతకు మించిన మంచి మానవతావాది అని తెలిపింది. ఆ మహానటుడి నటన, జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని వెల్లడించింది. దాదాపు 75 ఏళ్లకు పైగా పలు చిత్రాలలో నటిస్తునే ఉన్నారని చెప్పింది. ఏఎన్నార్ నటించిన చిత్రాలు ప్రపంచ ప్రేక్షకుల మదిని రంజింప చేశాయని తెలిపింది. ఆ మహానటుడి నటనాచాతుర్యం ఆమోఘమని అభివర్ణించింది. అక్కినేనితో తమ సంస్థకు గల అనుబంధాన్ని తానా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అందులోభాగంగా 2012లతో జీవిత కాల సాఫల్య పురస్కారంతో తమ సంస్థ అక్కినేనిని గౌరవించిన సంగతిని తానా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.