తానా ఆధ్వ‌ర్యంలో స్వాతంత్ర్య భార‌తీ- సాహిత్య హార‌తి | TANA PSV Plans To Celebrate Independence Day | Sakshi
Sakshi News home page

ప్రంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌ర‌ప‌నున్న తానా

Published Wed, Aug 12 2020 2:01 PM | Last Updated on Wed, Aug 12 2020 2:26 PM

TANA PSV Plans To Celebrate Independence Day - Sakshi

వాషింగ్టన్‌ : తానా ప్ర‌పంచ సాహిత్య వేదిక ఆధ్వ‌ర్యంలో 74వ‌ పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను వినూత్నంగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుపుకుంటామ‌ని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అన్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒక్కటై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి, జాతీయ సమైక్యతా భావాన్ని ప్రోదిగొల్పటం ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విషయమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పౌరుల్లో దేశభక్తి లేనిదే ఏ జాతి రాణించలేదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో దేశ భక్తి, సామాజిక స్పృహ కల్పించడంలో సాహిత్యం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఇది ఆది కవులు, రచయితల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహణలో ఈ అపూర్వమైన సాహిత్య సమ్మేళనం జరుగుతుందని తాళ్లూరి తెలియజేశారు. (తానా ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక మహోత్సవం)

39వ తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా - ఆగస్టు 15వ తేదిన, అంతర్జాలం ద్వారా, వివిధ దేశాల నుంచి 74 మంది సాహితీవేత్తలు వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత్వం, గజల్స్, పాటలలాంటి వివిధ ప్రక్రియలతో భరతమాతకు సాహిత్య హారతి సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథులుగా మన తెలుగు సంతతికి చెందిన గవర్నర్లు - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, తమిళనాడు పూర్వ గవర్నర్ పి.ఎస్. రామ్మోహన్ రావు, ఐపీఎస్ తమ సందేశాలు అందజేస్తారని ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో హాజరవుతున్న 74 మంది సాహితీ వేత్తలలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రఖ్యాత సినీ గేయ రచయితలు.. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, చైతన్య ప్రసాద్, జె.కె.భారవి, శ్యామ్ కాసర్ల, సిరాశ్రీ, డా. వడ్డేపల్లి కృష్ణ, రసరాజు, డా. ముయిద ఆనందరావు (మిథునం చిత్ర నిర్మాత) విశిష్ట అతిథులుగా ఉన్నారు. డా. కడిమెళ్ళ వరప్రసాద్, డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్, డా. మీగడ రామలింగస్వామి, డా. రాంభొట్ల పార్వతీశ్వర శర్మ, డా. పూదూర్ జగదీశ్వరన్, కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ అవ‌ధానులుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాక మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దుబాయ్, ఒమన్, కెనడా వంటి దేశాల నుంచి కూడా ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని డా. ప్రసాద్ తోటకూర ప్రకటించారు. (వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్‌’ ఆసుపత్రి)

సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ఆహ్వానం పలుకుతూ, ఈ అద్భుత కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం అవుతుందని, ఆయా దేశాల కాలమానాల ప్రకారం అంతర్జాలంలో యూట్యూబ్, ఫేస్‌బుక్‌(https://www.facebook.com/TANA.ORG/) ద్వారా అందరూ వీక్షించవచ్చని తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement