డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 73వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శతజయంతులు జరుపుకుంటున్న కొంతమంది రచయితలకు నివాళులర్పిస్తూ - “శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు” అనే కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా జరిగింది. తానాఅధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం అవిరళ కృషి చేసి, అమూల్యమైన జ్ఞానసంపదను మనకోసం వదిలి వెళ్ళిన, ఇటీవలే శతజయంతి సంవత్సరంలో కి అడుగుపెట్టిన, అడుగుపెట్టబోతున్న కొంతమంది సాహితీమూర్తుల జీవితవిశేషాలను స్మరించుకుని, వారికి ఘన నివాళులర్పించడం మన కనీస ధర్మం అని, వారి రచనలను చదవడం ద్వారా అలనాటి కాలమాన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు తేటతెల్లంగా తెలుస్తాయి అన్నారు”. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతమంది కవులను, పండితులను ఒకేసారి ఒకేవేదిక మీద స్మరించుకుని, భావితరాల కోసం వారు వదిలి వెళ్ళిన ఈ గొప్పసంపదను ఒకసారి తడిమి చూసుకోవడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకే చెల్లింది అన్నారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి, స్వయంగా సాహితీవేత్త అయిన ఆచార్య డా. వెలుదండ నిత్యానంద రావు మాట్లాడుతూ ఇదొక అపూర్వ సమ్మేళనం అని, ఈ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీమూర్తులలో కొంతమందితో తనకు ప్రత్యక్ష సాహిత్యానుబంధం కల్గిఉండడం తన అదృష్టమని, వారి సాహిత్య కృషి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని, వారందరికీ ఘన పుష్పాంజలి, గత 5 సంవత్సరాలగా వివిధ సాహిత్య అంశాలపై ప్రతి నెలా ఆఖరి ఆదివారం క్రమం తప్పకుండా నిభద్దతతో కార్యక్రమాలు చేస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు అన్నారు”.
శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీ మూర్తుల జీవితాలగురించి, వారి సాహిత్యకృషి గురించి ఈ క్రింద పేర్కొన్న విశిష్టఅతిథులు సోదాహరణంగా వివరించారు:
శ్రీ గండూరి (జి.) కృష్ణ (1924-2001), ప్రముఖ పాత్రికేయులు, రచయిత గురించి - శ్రీమతి గండూరి (యామిజాల) రాజీవ, జి. కృష్ణ గారి కుమార్తె, ప్రముఖ పాత్రికేయురాలు; శ్రీ కె. ఎల్. నరసింహారావు (1924-2003), ప్రముఖ నాటకరచయిత, నటులు గురించి - శ్రీ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షులు; డా. ఆవంత్స సోమసుందర్ (1924-2016), అభ్యుదయవాద కవి, విమర్శకులు, రచయిత గురించి - ఆచార్య డా. యస్వీ సత్యనారాయణ, అభ్యుదయ రచయిత, పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; శ్రీ “శారద” (ఎస్. నటరాజన్) (1925-1955), ప్రముఖ తెలుగు కథారచయిత, నవలారచయిత గురిచి - శ్రీ కొత్తపల్లి రవిబాబు, “ప్రజాసాహితి” మాసపత్రిక ప్రధానసంపాదకులు; ఆచార్య డా. బిరుదురాజు రామరాజు (1925-2010), జానపద గేయసాహిత్యంలో దిట్ట, ప్రముఖరచయిత గురించి డా. సగిలి సుధారాణి, పరిశోధకురాలు-‘తమిళనాట స్త్రీల జానపద కథనాలు”, రచయిత్రి; డా. దాశరథి కృష్ణమాచార్యులు (1925–1987), ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ విముక్తి సాయుధ పోరాటయోధుడు గురించి - డా. పి. విజయకుమార్, సహాచార్యులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం; కళాప్రపూర్ణ ఆరుద్ర (భాగవతుల సదాశివశంకర శాస్త్రి) (1925-1998), అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు గురించి - ఆచార్య డా. మేడిపల్లి రవికుమార్, ప్రముఖ సాహిత్యవిమర్శకులు, పూర్వ తెలుగువిభాగాధిపతి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి; శ్రీ కొడాలి గోపాలరావు (1925-1993), ప్రముఖ శతాథిక నాటకాల రచయిత గురించి - డా. కందిమళ్ళ సాంబశివరావు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ నాటకఅకాడమీ పూర్వ ఉపాధ్యక్షులు; శ్రీ ఆలూరి బైరాగి (1925-1978), ప్రముఖ కవి, కథా రచయిత, మానవతావాది గురించి – శ్రీ బండ్ల మాధవరావు, ప్రముఖ కవి, రచయిత, ‘సాహితీమిత్రులు’; శ్రీమతి బొమ్మరాజు భానుమతి (1926-20005), ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, ఫిల్మ్ స్టూడియో అధినేత్రి గురించి - శ్రీ భరద్వాజ రంగావఝుల, ప్రముఖ పాత్రికేయులు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను స్పృశించి సభను రంజింపజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/gf2INE_lbpk
Comments
Please login to add a commentAdd a comment