శత్రువుల నుంచి రక్షణ కోసం కోటగోడ ప్రాకారాలు
గట్టు సంస్థానంలో సిరిసంపదలతో తులతూగిన ప్రజానీకం
గద్వాల: శ్రీకృష్ణదేవరాయులు తన విజయనగర సామ్రాజ్యాన్ని ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకూ విస్తరించారు. ఆంధ్ర ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశంగా ఉన్న గట్టు ప్రాంతంలో ఆయన శత్రువుల నుంచి రక్షణ కోసం కోటగోడ ప్రాకారాలు నిర్మించారు.
ఈ క్రమంలోనే అక్కడ రాజ్యవిస్తరణ జరిగి గట్టు సంస్థానం వెలసినట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్ర, కన్నడ ప్రజలు గొప్ప చక్రవర్తిగా అభిమానిస్తారు. ఆంధ్రా భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డారు.
సోమనాద్రికి అండగా..
పూడూరు కేంద్రంగా నలసోమనాద్రి గద్వాలలో తన రాజ్యస్థాపన చేసే క్రమంలో కోట నిర్మాణం చేశారు. అయితే దీనిని సహించని ఉప్పేరు నవాబు నలసోమనాద్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలో ఉప్పేరు నవాబు రాయచూరు నవాబు సాయం కోరారు.
గట్టు ఆరగిద్ద ప్రాంతంలో హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నలసోమనాద్రి విజయ దుందుభి మోగించారు. తన విజయంలో గట్టు ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషించిందని నలసోమనాద్రి చెప్పినట్టు చరిత్రకారులు చెబుతారు. ఆ యుద్ధం అనంతరం సోమనాద్రి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని పాలించారు.
రతనాల గట్టు..
శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం(1509–1529)లో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఎనిమిది చావిడ్లు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గట్టు సంతబజారులో రతనాలు, బంగారు నాణేలను రాశులుగా పోసి క్రయవిక్రయాలు జరిపే వారని చరిత్ర తెలిసిన పెద్దలు నేటికీ చెబుతుంటారు. గట్టులో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.
సారవంతమైన భూమిలో మంచి పంటలు పండించేవారు. శ్రీ కృష్ణదేవరాయలు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ప్రోత్సహించేవారు. అందులో భాగంగానే చెరువులు, కాల్వలు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డారు. అనేక రకాల పండ్ల తోటలు పెంచేవారు.
వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. బెల్లం, నీలిమందు తయారీ, వస్త్ర తయారీ వంటివి కూడా ప్రోత్సహించారు. గట్టులో పట్టుపరిశ్రమను ప్రోత్సహించారు. అప్పట్లో మగ్గాలపై వ్రస్తాలను తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన వ్రస్తాలను రాయలసీమలోని రాయదుర్గానికి తరలించే వారని చెబుతారు.
శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో..
శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో పాలించిన రాజులు గట్టు ప్రాంతంపై నిర్లక్ష్యం చూపడంతో పూర్తి వెనుకబాటుకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో పేరుమోసిన ఓ దొంగ గట్టును ఆవాసంగా చేసుకున్నాడు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో దోచుకున్న సొమ్మును గట్టులో భద్రపర్చుకునే వాడని చెబుతారు. ఈ సొమ్ముకు కాపలాగా తన సోదరిని పెట్టగా.. ఆమె ఓ బాటసారిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న దొంగ తన సోదరిని పక్కనే ఉన్న గంగిమాన్‌దొడ్డిలో ఆమె చివరి జీవనం వరకు బందీగా చేశాడని చెబుతారు.
రక్షణ ప్రాంతంగా..
కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉండే గట్టును శ్రీకృష్ణదేవరాయలు రక్షణ ప్రాంతంగా నిర్మించారు. గ్రామం చుట్టూ కోటబురుజులతో కూడిన ప్రహరీ, లోపల 8 వరకు చావిడిలను నిర్మించారు. వీటిపై అర్ధచంద్రాకార గుర్తులు ఉన్నాయి. చీకటి పడితే కోటగోడలపై కాగడాలు వెలిగించి, సైనికులు కాపలా కాసేవారని చెబుతారు.
కరువుకు నిలయం..
రాజుల కాలంలో సిరిసంపదలతో తులతూగిన గట్టు ప్రాంతం.. రాజులు పోయి, రాజ్యాలు అంతరించిన తర్వాత అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచింది. కరువుకు నిలయంగా మారింది. ఇక్కడి నుంచే పొట్టచేత పట్టుకొని కుటుంబాలకు కుటుంబాలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్న దైన్యస్థితి నెలకొంది.
40 ఏళ్ల క్రితం..
సుమారు 40 ఏళ్ల క్రితం గట్టు నేతాజీ చౌరస్తాలో గుప్తనిధుల తవ్వకాలలో పెద్దఎత్తున అలనాటి విలువైన నిధులు, బంగారు నాణేలు బయటపడ్డాయి. వీటిలో కొంతమేర అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment