వీరి సంభాషణలో ప్రస్తావనకొచి్చన ఈ అంశం
టాక్ ఆఫ్ ది సిటీగా మారిన టాపిక్
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాన అంశం మంగళవారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన విందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణల్లో మేయర్‌పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.
మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగ తా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మా ట్లాడినట్లు తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం.. మేయర్‌పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై చర్చ జరిగిందనే ప్రచారం వైరల్‌గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, జీహెచ్‌ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
పార్టీ మారినందునే..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడినా.. గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్‌ఎస్ అవకాశం కల్పించింది. కాగా.. ఆమె కనీస కృతజ్ఞత లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో, తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపాటీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్‌పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందిని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు.
బహుశా వచ్చే శనివారం.. లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనునుగుణంగా సమావేశం జరగనున్న ట్లు తెలిసింది. అదే సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇంతకీ ఏం జరగనుంది?
మేయర్‌పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది? గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఆయా పార్టీల బలాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) 50 శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ..
నిరీ్ణత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా, అందులో 98 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం, బీఆర్‌ఎస్‌కు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది.
ఆ పార్టీలు కలిసి వచ్చేనా?
అవిశ్వాసం పెట్టాలంటే మరోపార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్‌ఎస్‌తో కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారీగా సంతకాలు చేసి.. అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదు. జీహెచ్‌ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91–ఎ మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో మూడొంతుల మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరం ఉన్నట్లు లెక్క.
ఆ లెక్కన ప్రస్తుతమున్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలను పరిగణనలోకి తీసుకుంటే 131 మంది సభ్యుల బలం ఉండాలి. బీఆర్‌ఎస్‌తో బీజేపీ కలిసినా, లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదని జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment