![Political Heat On GHMC : No-confidence motion On Mayor](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/29/121124545.jpg.webp?itok=6wchtuKN)
రేపు బల్దియా కౌన్సిల్ సమావేశం
‘అవిశ్వాసం’ నేపథ్యంలో పొలిటికల్ హీట్
మేయర్ సమావేశానికి కార్పొరేటర్లు డుమ్మా
బడ్జెట్ కేటాయింపులపై నిలదీయాలని బీజేపీ ఉద్బోధ
సాక్షి, హైదరాబాద్: బల్దియా పాలకమండలి ఏర్పాటై వచ్చే నెల 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం.. ఆ తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సర్వసభ్య సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ ఈ సమావేశాల సందర్భంగా ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా అందుకు పాలకమండలి సమావేశం వేదిక కాకపోయినప్పటికీ, పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది.
ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ నాయకుడు, ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. పలువురు పార్టీ అగ్రనేతలు కూడా హాజరైన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని ఉద్భోదించారు. కేంద్రం నిధులివ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే అంటున్నందున జీహెచ్‌ఎంసీలో ప్రజలు వేల కోట్ల పన్నులు కడుతున్నా మీరెందుకు వారికి పనులు చేయడం లేదని ప్రశ్నించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఈ నిధులు ఎక్కడికి మళ్లిస్తున్నారో అడగాలని, ఆ నిధులన్నీ ఏం చేస్తున్నారో నిలదీయాలని సూచించారు. ముఖ్యంగా.. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌పైనా, ప్రజా సమస్యలపైనా గళమెత్తాలని ఆదేశించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు బీజేపీ సభ్యులకు అవకాశమివ్వకపోవడం తగదన్నారు. ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది.
హాజరైన కార్పొరేటర్లు ముగ్గురే..
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఆమె బీఆర్‌ఎస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ కావడం తెలిసిందే. పాలకమండలి తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చంది కేవలం రెండు కార్పొరేటర్ స్థానాలే అయినప్పటికీ, ఏడాది క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీలోనూ కాంగ్రెస్ బలం పెరిగింది. ప్రస్తుతం ఆ పారీ్టలో 24 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మేయర్ ఆహ్వానానికి కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. అనుసరించాల్సిన వ్యూహం కోసం పిలిస్తే కనీస సంఖ్యలో కూడా సభ్యులు రాలేదు.
అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’
తనపై ఏ పార్టీవారు అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని మేయర్ విజయలక్ష్మి ఉప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. చట్టం, నిబంధనల మేరకు వారికా అవకాశం ఉందంటూ ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే అది సాధ్యమన్నారు. ఆలోగా ఏయే పార్టీలు కలిసి అవిశ్వాసం పెడతాయో చూద్దామన్నారు. అసలు అవిశ్వాసం పెట్టాలంటే ఎంత బలం ఉండాలో వారికి తగిన అవగాహన లేదన్నారు. తనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పదేళ్లుగా తాను, దాదాపు యాభయ్యేళ్లుగా తనతండ్రి కేశవరావు రాజకీయాల్లో ఉన్నా.. మా లైఫ్‌స్టైల్ ఏంటో, కొత్తగా ఎమ్మెల్యేలైన బీఆర్‌ఎస్ వారి లైఫ్ స్టైల్ ఏంటో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునన్నారు.
బీజేపీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ వ్యాఖ్య
జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటల రాజేందర్‌కు దక్కకుండా ఉండేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివిగా ప్లాన్ చేశారని ఆరోపించారు. గద్దర్‌కు అవార్డు ఇవ్వకపోవడం గురించి చేసిన వ్యాఖ్య ద్వారా బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల అర్హుడు కాదనే సంకేతాలిచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment