‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లభుండ తెలగొకండ ఎల్లనృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స’’ఐదొందల ఏళ్లక్రితం శ్రీ కృష్ణదేవరాయల కలం నుంచి జాలువారిన పద్యమిది. పది హేనో శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రపంచానికి చాటారు. కానీ... తెలుగంటే ఎంతో అభిమానాన్ని చాటుకున్న కృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ఆముక్తమాల్య దలో మాతృభాషపై తన మమకారాన్ని మరోసారి చాటారు. ఈ పద్యకావ్యం గురించి తెలియని తెలుగువారుండరేమో. ఈ అక్షరా లను నిక్షిప్తం చేసిన తాళపత్రగ్రంథం ఇప్పటికీ భద్రంగా ఉన్న సంగతి చాలా తక్కువ మం దికి తెలుసు. ఇది తమిళనాడులోని తంజా వూరులో ఉన్న సరస్వతి మహల్ గ్రంథాల యంలో కొలువుదీరి ఉంది. ఈ తెలుగు గ్రంథం తమిళ రాష్ట్రంలో ఉన్నా దాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలు పొరపాటున చెదల బారినపడో, వాతావరణ ప్రభావానికి గురయ్యో, అనుకోని ఇతర ప్రమాదాలబారిన పడో ధ్వంసమైతే శాశ్వతంగా అవి అదృశ్య మైనట్టే. దాని ఫొటో ప్రతులు రూపొందిం చాలని ఎనిమిది దశాబ్దాల క్రితమే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు. కానీ ఆయన ఆలోచనను కూడా ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయకపోవ టం విడ్డూరమే.
– సాక్షి, హైదరాబాద్
వందల్లో గ్రంథాలు...
తంజావూరు గ్రంథాలయంలో 778 తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వీటిల్లో 455 గ్రంథాలను తర్వాత పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికీ మరో 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. వీటిల్లో సనాతన వైజ్ఞానికశాస్త్రం, గణితం, పురాణాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిల్లోని ప్రత్యేకతలు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కాగితంపై రాసిన ఒరిజినల్ గ్రంథాలు 44 ఉన్నాయి. వీటిల్లో పుస్తకరూపంలో తీసుకు రానివి 26 ఉన్నాయి. ఇలా ఎన్నో విలువైన తెలుగు గ్రంథాలు తమిళనేలపై ఉన్నా వాటిని జనంలోకి తెచ్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. అసలు.. ఆ పుస్తకాల సారాంశమేంటో తెలుసుకునే కసరత్తు కూడా జరగలేదు. వాటిని భాషావేత్తలు పరిశోధిస్తే సమాజానికి తెలియని ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి.
సర్వేపల్లి కాంక్షించినా...
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కాకపూర్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉండగా, 1933లో తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలోని తెలుగు గ్రంథాల గురించి తెలుసుకున్నారు. వాటిల్లో అచ్చు కానివి, బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని వెళ్లి శోధించి వాటి జాబితా రూపొందించారు. వాటిల్లో అముద్రిత గ్రంథాలను ముద్రించాలని నాటి ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిస్థాయి వరకు వెళ్లటం, బిజీగా గడపటంతో ఆ గ్రంథాలు అలాగే ఉండిపోయాయి. ఇటీవల కొందరు భాషాభిమానులు సర్వేపల్లి రూపొందించిన జాబితాను గుర్తించారు. కానీ, రెండు తెలుగు ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. భాషాభిమానుల నుంచి విన్నపాలను అందుకున్నా ఆ దిశగా ఆసక్తి చూపకపోవటం విడ్డూరం.
గణితశాస్త్రంలో మన ఘనత..
గణితశాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది సనాతన భారతమే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గణితంలో ఘనతను సాధిస్తుందీ మనవారే. అలాంటి గణితం పద్యరూపంలో ఉందంటే నమ్ముతారా.. గణితంలోని ఎన్నో అంశాలను పద్యాల ద్వారా గొప్పగా వివరించి ఆ శాస్త్రంలో ప్రత్యేకతలను పరిచయం చేసింది ‘గణిత చూడామణి’. 19 వ శతాబ్దంలో ఇలాగే ఇది తళుక్కున మెరిసి పూర్వీకులను గణిత పం డితులుగా మార్చింది. తంజావూరు గ్రంథా లయంలో దిక్కూమొక్కూలేక పడి ఉన్న తెలుగు తాళపత్రగ్రంథాల్లో ఎన్ని గొప్ప విషయాలున్నాయో, అవి ఎప్పుడు మన ముందుకు వస్తాయోనని భాషాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికైనా మేల్కొనాలి..
‘నేను ఓ సదస్సు కోసం వెళ్లినప్పుడు తంజావూరు గ్రంథాలయంలో తెలుగు తాళపత్రగ్రంథాలను చూసి పులకరించి పోయాను. ఆముక్తమాల్యద లాంటి ఒరిజినల్ ప్రతులున్నాయని తెలుసుకుని సంబరపడ్డాను. వాటిల్లో ముద్రితం కానివాటిని వెంటనే ముద్రించటంతోపాటు తాళపత్ర గ్రంథా లను డిజిటలైజేషన్ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వానికి నివేదించాను. కానీ, ఇప్పటి వరకు ఆ కసరత్తు ప్రారంభం కాకపోవటం బాధాకరం’
డాక్టర్ రాజారెడ్డి, వైద్యుడు, చరిత్రపరిశోధకులు
ముందుకు సాగని మహాసభల స్ఫూర్తి..
ప్రపంచ తెలుగు మహాసభలలో ఎంతోమంది భాషాభిమానులు ప్రాచీన తెలుగుగ్రంథాల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అముద్రిత తెలుగు గ్రంథాలను గుర్తించి వాటిని కాపీ చేసి ప్రజల ముంగిటకు తేవాలని కోరా రు. ఈ క్రమంలోనే లండన్ లైబ్రరీలో దాదాపు 8 వేలకు పైచిలు కు తెలుగు పుస్తకాలున్నాయని, వాటిల్లో కొన్ని తెలుగునేలపై లభించటం లేదని గుర్తించి వాటిని కాపీ చేయాలని ప్రస్తావిం చారు. కానీ ఆ దిశగా అసలు అడుగు పడకపోవటం విచిత్రం.
కౌటిల్యుడి అర్థశాస్త్రం ఇలాగే వెలుగు చూసింది...
రాజనీతి, పాలన, సమాజం... ఇలా ఎన్నో అంశాలను స్పృశిస్తూ ప్రపంచానికి మార్గదర్శనంగా నిలిచిన గొప్ప గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసిన ఈ మహత్ గ్రంథం క్రీస్తుపూర్వంలో ఆవిష్కృతమైనా ఆ తర్వాత క్రీ.శ.12 వ శతాబ్దం వరకు దీనిని ప్రపంచం అనుసరించింది. ఆ తర్వాత ఆ గ్రంథ ప్రతులే కనిపించలేదు. కానీ, వందల ఏళ్ల తర్వాత ఆ గ్రంథం తాళపత్ర రూపం మైసూరులో ప్రత్యక్షమైంది. అక్కడి గ్రంథాలయంలో అనామకంగా పడి ఉన్న ఆ సంస్కృత గ్రంథాన్ని శ్యామశాస్త్రి గుర్తించి 1909 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించి పుస్తకరూపమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment