తెలుగు సంఘాలకు మరో సవాల్ | Another challenge Telugu organizations | Sakshi
Sakshi News home page

తెలుగు సంఘాలకు మరో సవాల్

Published Thu, Apr 10 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

Another challenge Telugu organizations

తమిళ హాస్యనటుడు వడివేలు హీరోగా నిర్మించిన ‘జగబల భుజబల తెనాలిరామన్’ చిత్ర వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. రెండు రోజుల క్రితం రాజకీయ నేత సీమాన్, బుధవారం నాడు తమిళ సినీ దర్శకుడు గౌతమన్ , తెలుగు సంఘాల వారికి హెచ్చరికలు జారీచేసి వివాదానికి ఆజ్యం పోశారు.
 
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీకృష్ణదేవరాయలు ఒక్క తెలుగువారికే కాదు అందరికీ ఆరాధ్యుడు, ఆదర్శనీయుడు. వీరునిగా, కవి, పండితా పోషకుడుగా ప్రసిద్ధుడు. శ్రీకృష్ణదేవరాయల ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. అటువంటి మహానాయకుని ఒక జోకర్‌గానూ, బహుభార్యాతత్వం కలిగిన విలాసజీవిగా చిత్రీకరించినట్లుగా తెనాలిరామన్ ప్రచార చిత్రాలే చెబుతున్నాయి. ఇది తెలుగువారి హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈనెల 18న తెనాలిరామన్ తమిళనాటంతా విడుదలకు సిద్ధమైంది.
 
తమకున్న అనుమానాల నివృత్తి కోసం విడుదలకు ముందే సినిమాను చూపాల్సిందిగా కొందరు తెలుగు ప్రముఖులు చిత్రదర్శకుడు యువరాజన్‌ను కోరగా ఆయన అంగీకరించారు. అయితే విడుదలకు ముందు సినిమాను చూపేది లేదని చిత్రనిర్మాత రంగరాజన్ మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తెలుగువారంతా గవర్నర్ కే రోశయ్యను కలిసి ఈ వివాదంపై వినతిపత్రం అందజేశారు. తెలుగు సంఘాల ఐక్యవేదిక కింద సుమారు 20 తెలుగు సంఘాలు ఏకమై చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరో తెలుగు బృందం వడివేలు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసింది.
 
కేతిరెడ్డి ఖండన

తెలుగు సంఘాలకు సీమాన్, గౌతమన్ చేసిన హెచ్చరికలనుతమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలుగువారి మనోభావాలను కించపరుస్తూ నిర్మించిన సినిమాను అడ్డుకునే హక్కు తెలుగువారికి లేదా అని ప్రశ్నించారు. మహోన్నతుడైన కృష్ణదేవరాయలకు 36 మంది భార్యలు, 52 మంది సంతానం ఉన్నట్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని వారిని ఆయన ప్రశ్నించారు.

తమిళనాడులోనే పుట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన తెలుగువారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగువారిని స్థానికేతరులుగా భావిస్తూ కొందరు సాగించే బెదిరింపులకు తాము భయపడబోమని హెచ్చరించారు. మరో పది రోజుల్లో వివాదాస్పద తెనాలిరామన్ విడుదల కావడం, ఆ నిర్మాణ సంస్థను ఎటువంటి హామీలు రాకపోవడం, సీమాన్, గౌతమన్ ఇలా వరుసగా హెచ్చరికలు జారీచేయడం వంటివి జరిగిపోతున్నాయి. అయినా తెలుగు సంఘాల ఐక్యవేదిక తరపున సంఘటితమైన తెలుగు సంఘాల వారెవ్వరూ ఇంతవరకు నోరు మెదపకపోవడం శోచనీయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement