సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను పేర్చి, జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి సందడి చేశారు. సింగపూర్ స్థానికులు కూడా ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.
ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారంతా మమేకమై ఈ సంబరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
అందంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని.. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు. కుంభకర్ణ, Mr.బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి , ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.
సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment