Bathukamma 2024
-
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు
సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్లో TCUK ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్స్ లోని సౌతెండ్, బాసిల్డ్న్ , చెల్మ్సఫోర్డ్ , తుర్రోక్ కౌన్సిల్ ఉంచి దాదాపు 450 మన తెలుగు వాళ్ళు అందరు ఒక్కదగ్గర చేరి బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకున్నారు. గుర్రం మల్లారెడ్డి, గుర్రం లావణ్య నేతృత్వంలో ఈ ఈవెంట్ స్వచ్చందంగా నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచులు అందమైన బతుకమ్మ పేర్చికొని వచ్చారు. దసరా జమ్మి ఆకూ మొగవాళ్ళు ఇచ్చుకొని అలాయి బలయ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్జెండ్ కౌన్సిలర్స్ క్రిస్ వెబ్‌స్టర్ , పమేలా కిన్సేల్ల, సామ్ అల్లెన్, షాహిద్ నదీమ్, జేమ్స్ మొరిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చివరగా తెలంగాణ వంటకాలతో విందు ఆరగించి, దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులోమరెన్నో జరగాలని అందరూ ఆకాంక్షించారు. -
ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి. సుమారు 7వేలమంది మంది పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం విశ్వవ్యాప్తంగా ప్రదర్శితమైంది. 25 అడుగుల ఎత్తైన కమల పీఠం బతుకమ్మల అందంతో అలరించింది. అష్టలక్ష్మి అలంకరణలు, 6 గంటలపాటు నిరాటంకంగా జరిగిన బతుకమ్మ నృత్యం కార్యక్రమం ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవానికి రెండు నెలల పాటు కఠోర సాధన చేసి మరీ బతుకమ్మను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జే జె చౌదరి, మారిస్విల్ మేయర్ టిజే కౌలీ, మేయర్ ప్రో టెం సతీష్ గరిమెల్ల, కౌన్సిల్ సభ్యులు లిజ్ జాన్సన్, స్టీవ్ రావు, కేరీ టౌన్ కౌన్సిల్ సభ్యురాలు సరికా బన్సాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికులను మాత్రమే కాకుండా ఉత్తర కరోలినా ,ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన భారతీయులను ఆకర్షించింది. స్థానిక డెల్టా కంపెనీ ఐటీ డైరెక్టర్ స్టెఫనీ షైన్ తోపాటు, ఇతర వ్యాపార ప్రతినిధులు, ఐటీ డైరెక్టర్లు, ఇతర ప్రముఖులు హాజరు కావడం విశేషం.అతిథులకు భోజనవసతి, శాటిలైట్ పార్కింగ్ నుండి స్టేడియం వరకు రవాణా సౌకర్యం అందించారు. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి TTGA నాయుకత్వంలో రెండు నెలలు ప్రణాళికా సూత్రాలను అమలు చేశారు.బతుకమ్మ కోసం ప్రత్యేక పాటను రూపొందించి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం TTGA అధ్యక్షుడు మహిపాల్ బిరెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె, యువత డైరెక్టర్ శ్రీకాంత్ మందగంటి, ఫెసిలిటీ డైరెక్టర్ రఘు యాదవ్, ఫుడ్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, కోశాధికారి రవి ఎం, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ స్వాతి గోలపల్లి, మెంబర్షిప్ డైరెక్టర్ ఉమేష్ పారేపల్లి, కమ్యూనికేషన్ డైరెక్టర్ మాధవి కజా నాయకత్వంలో విజయవంతంగా సాగింది.ఈ బతుకమ్మ వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటించడంతో పాటు, ఉత్తర కరోలినాలో భారత సాంస్కృతిక ఉత్సవాల పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతుందని TTGA ప్రకటించింది. -
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా TDF బతుకమ్మ సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. క్వాటామా ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని విజయవంతం చేసారు.తెలుగుదనం ఉట్టి పడేలా.. మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు.ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం అవటానికి కృషి చేసిన స్పానర్స్, పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వాలంటీర్స్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ మెట్రో ఇండియన్ కమ్యూనిటికి, సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. TDFసంస్థ స్థాపించి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, శుభాకాంక్షలు తెలిపారు. -
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటాపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో నేడు ముగుస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున ముగింపు వేడుకలను ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించారు.ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క, ప్రముఖులు హజరయ్యారు.సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద బతుకమ్మ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.సిరిసిల్ల పట్టణం: సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సద్దుల బతుకమ్మ వేడుకలకి అంతరాయం కలిగింది. దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు. -
బతుకమ్మ పుట్టినిల్లు!
సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది. రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాఖోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. బతుకునిచ్చిన అమ్మ!17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది. కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు. యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి.. 40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్‌సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా. – డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
బోరివలిలో అంబరాన్నంటిన సంబరాలు బతుకమ్మ సంబరాలు
తెలుగు కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు ముంబై పరిసర ప్రాంతాలనుంచి మూడు వేలమంది మహిళల హాజరు తీరొక్క పూలతో కనువిందుగా బతుకమ్మల కూర్పుడప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు కాలుకదిపిన అతివలు ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బోరివలి: బోరివలి తూర్పులోని సుకూర్వాడి, గోపాల్ హేమ్రాజ్ హైస్కూల్ లో సుమారు రెండెకరాల సువిశాల స్థలంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారు. వేడుకల కోసం ఉత్తర ముంబై ప్రాంతాలైన దహిసర్, బోరివలి, కాందివలి, మలాడ్, గోరేగావ్, మాల్వా నీ, శివాజీ నగర్, దౌలత్ నగర్, నవగాం తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది కుటుంబ సమేతంగా తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి డప్పు చప్పుళ్ల మధ్య ఆటపాటలతో వాటి చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు... బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కమిటీ ముందే ప్రకటించడంతో మహిళలు ఒకరికొకరు పోటీపడుతూ తమ బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మనీషా కొమ్ము న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ బతుకమ్మ పోటీల్లో మొదటి బహుమతి లాల్ జీ పాడ, కాందివలి ప్రాంత మహిళలు, ద్వితీయ బహుమతి సాయిబాబా నగర్, బోరివలికి చెందిన మహిళలకు అదేవిధంగా తృతీయ బహుమతి మలాడ్ పద్మశాలీ సంఘానికి చెందిన మహిళలకు లభించాయి. ఈ సందర్భంగా మైదానంలో వివిధ రకాల రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది తెలుగు సంస్కృతిని జ్ఞప్తికి తెచ్చిన శారదరెడ్డి అనే మహిళను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, అతిధులు ఉత్తర ముంబై మాజీ లోక్‌సభ సభ్యుడు గోపాల్ శెట్టి, భాస్కర్ నాయుడు, స్థానిక కార్పోరేటర్ సంధ్య విపుల్ జోషి, బహుజన సాహిత్య అకాడమీ మహా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ నాగెల్ల తెలంగాణ ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ బతుకమ్మ వేడుకలను గురించి ప్రసంగించారు. అనంతరం వీరందరినీ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడు సునీల్ అంకం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తెర శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ఎలిజాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మదుసుదన్ రావు, మేకల హనుమంతు, కోశాధికారి గాజుల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మనగర్‌లో బతుకమ్మ, దాండియా వేడుకలు పద్మనగర్ మహిళ సాంస్కృతిక సేవ మండలి నిర్వహించిన బతుకమ్మ, దాండియా వేడుకలకు మహిళలనుంచి విశేష స్పందన లభించింది. అదివారం సాయంత్రం స్థానిక పార్లమెంటు సభ్యురాలు ప్రణతి శిందే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపాలి కాలే లాంఛనంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక తెలుగు మహిళలతో కలిసి వారు కూడా బతుకమ్మ పాటలకు కాలు కదిపి కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో భాగంగా ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు, అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి వెండి వస్తువులను బహూకరించారు. అదేవిధంగా దాదాపు 50 మంది మహిళలకు చీరలు, ఇతర రకాల దుస్తులను బహుమతులుగా అందించారు. అలాగే ఉత్తమంగా దాండియా ఆడిన మహిళలకు నిర్వాకులు నగదు బహుమతులపే అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మేయర్ శ్రీ కాంచన యన్నం, మాజీ కార్పొరేటర్ దేవేంద్ర కోటే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మహిళా మండలి అధ్యక్షురాలు లీనా ఆకేన్, సెక్రటరీ మంజుశ్రీ వల్లకాటి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న రవ్వ, కోశాధికారి అర్చన వల్లకాటి, సహాయ కోశాధికారి పల్లవి కనకట్టి, స్వాతి అడం, వందన గంజి పాల్గొన్నారు. థానేలో ఉత్సాహంగా ‘బతుకమ్మ’ థానేలో స్థిరపడిన తెలంగాణకు చెందిన గౌడ సమాజం సభ్యులు ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. థానే లూయిస్వాడీలోని షెహనాయి హాల్లో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికి విచ్చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. తమను చల్లగా చూడాలని బతుకమ్మను వేడుకున్నారు.అనంతరం బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నవారందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. గౌడ సమాజానికి చెందిన మహిళలందరినీ ఐక్యం చేసేందుకు గత రెండేళ్ల నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో సంఘ ప్రముఖులు, పదాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు -
అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం బతుకమ్మ సంబరాలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను పేర్చి, జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి సందడి చేశారు. సింగపూర్ స్థానికులు కూడా ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారంతా మమేకమై ఈ సంబరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.అందంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని.. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు. కుంభకర్ణ, Mr.బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి , ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న(శనివారం) ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 4000 నుండి 5000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ , స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్‌లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో మహిళలకు గృహ ప్రవేశ్, సౌజన్య డెకార్స్, ఎల్ఐఎస్ జువెల్స్ , బీఎస్కే కలెక్షన్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరమని, బరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఎస్ఎస్తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.ఈ వేడుకల్లో టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ కొచ్చే శివుని పెండ్లాము.. సిరులెన్నో తీసుకొచ్చే మా పువ్వుల కోసము.." యూట్యూబ్‌లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్బుక్ ,యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మై స్క్వేర్ ఫీట్ (గృహప్రవేశ్) ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బిస్ట్రో, జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్, ప్రద్ ఈవెంట్ మేనేజ్ మెంట్, జి.ఆర్.టి ఆర్ట్లాండ్, జోయాలుక్కాస్ జ్యూవెల్లర్స్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఎస్.వి.ఎస్ (శ్రీవసుధ) ట్రూ వెల్త్ ఇండియా, ది ఆంధ్ర కర్రీ క్లాసిక్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్, కుమార్ ప్రాప్ నెక్స్ , గారెంటో అకాడమీ, ఎస్ పి సిస్నెట్ సొల్యూషన్ దట్స్ పర్ఫెక్ట్ , సౌజన్య హోమ్ డెకార్స్ , ఎల్.వై.ఎస్ జెవెల్స్ మరియు బి.ఎస్.కె కలెక్షన్స్, లాలంగర్ వేణుగోపాల్, రాకేష్ రెడ్డి రజిది, సతీష్ శివనాథుని, కవిత ఆనంద్ అండ్ సంతోష్ ఆమద్యల, హేమ సుభాష్ రెడ్డి దుంతుల, మల్లేష్ బారేపటి, శ్రీధర్ కొల్లూరి,చంద్ర శేఖర్ రెడ్డి కోమటిరెడ్డి, విజయ రామ రావు పొలినేని , సునీల్ కేతమక్క ,రంజిత్ రెడ్డి మండల, నాగేశ్వర్ రావు టేకూరి , బండారు శ్రీధర్ మరియు పార్క్ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు సహకారం అందజేసిన కల్వ రాజు, సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి, చల్లా కృష్ణ, మల్లవేని సంతోష్ కుమార్, మల్లారెడ్డి కళ్లెం, బాదం నవీన్, భాను ప్రకాష్ , సాయికృష్ణ కొమాకుల , ముక్కా కిశోర్‌కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కీ.శే. గోనె నరేందర్ రెడ్డి గారు సొసైటీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
బంగరు నవ్వుల ఆట.. వాకిలయ్యే పువ్వుల తోట
సాక్షి,ముంబై: ముంబైలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వర్లీ, లోవర్‌పరెల్, బాంద్రా, అంధేరి, బోరివలి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పాటలతో సందడి నెలకొంది. ఒక్కేసి పువ్వేసి ఆడవే చెల్లి బతుకమ్మ పాట అంటూ మహిళలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఓ వైపు బతుకమ్మ పాటలతోపాటు తెలుగు ప్రజలు కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో దేవీమాతను అలంకరించే చీరల రంగుల ప్రకారమే చీరలు ధరించి బతుకమ్మలు ఆడుతూ కన్పిస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రతీరోజు ఒకే రంగు చీరలతో బతుకమ్మ ఆడుతూ సంబురాలు చేస్తున్నారు. తిరంగ వెల్ఫేర్ కమిటీ... బాంద్రాలోని తిరంగా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తూర్పు బాంద్రా జ్ఞానేశ్వర్నగర్లో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు ప్రతీ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలందరూ ఒకే రంగుల చీరలు ధరించి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెబుతున్నారు. తెలుగు రజక సంఘం... తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. అంటప్హిల్ సీజిఎస్ కాలనీలోని గహ కల్యాణ్ కేంద్రహాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్యఅతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కెపె్టన్ తమిళ సెల్వన్, స్థానిక కార్పొరేటర్ కృష్ణవేణిరెడ్డి, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎం.కొండారెడ్డి తోపాటు బీజేపీ ముంబై సౌత్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు అనీల్ కనోజియాలు హాజరయ్యారు. ముఖ్యంగా కృష్ణవేణిరెడ్డి మహిళల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలతో పరిసరాలన్నీ మార్మోగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ముంబై ఆంధ్ర ఎడ్యుకేషన్ హై స్కూల్ కాలేజీ పదాధికారి పురుషోత్తంరెడ్డి, ముంబై రజక సంఘం ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ముంబై ప్రజాగాయకుడు గాజుల నర్సారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరినీ సంఘం పదాధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నడిగోటి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు మర్రిపల్లి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి అవనిగంటి రామలింగయ్య, కోశాధికారి భూమ చిన్న నరసింహ, ఉపకోశాధికారి భూమ యాదయ్య, కమిటీ సలహాదారులు భూమ పెద్దనర్సింహ, చెరుకు కృష్ణ, తాందారి వెంకటేశ్, బసవాడ కృష్ణ, భూమ సురేశ్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ఎల్లయ్య, అక్కనపల్లి నరసింహ, బసాని ఉపేందర్, ఐతరాజు మల్లయ్య, భూమ వెంకటేశ్, భూమ శంకర, పున్న సోమయ్య, బొడ్డుపల్లి రాజుతోపాటు తదితరులతోపాటు విజయనగర్, మోతిలాల్నెహ్రూనగర్, వాడాలా, సైన్కు చెందిన మహిళలు కూడా పాల్గొన్నారు. పద్మశాలి యువక సంఘం...తూర్పు దాదర్ నాయిగావ్‌లోని పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. సంఘం హాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దాండి యా, కోలాటాలు ఆడి సందడి చేశారు. ముఖ్యంగా దసరా నవరాత్రులతోపాటు బతుకమ్మ సంబురాల నేపథ్యంలో ప్రతి ఏటా పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నవరాత్రి ఉత్స వాల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు. అనంతరం స్థానిక సంప్రదాయాలమేరకు యువత దాండియా కోలాటాలు ఆడారు. ఇక అక్టోబరు 10వ తేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా దాండియా, కోలాటాలు మంచిగా ఆడి విజేతలుగా నిలిచిన వారికి అక్టోబరు 22న సద్దుల బతుకమ్మ పండుగ రోజున బహమతులు అందించనున్నారని సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు వెల్లడించారు. అదేవిధంగా సద్దుల బతుకమ్మ రోజు అందంగా పేర్చిన బతుకమ్మలకు, బతుకమ్మలు బాగా ఆడినవారికి కూడా బహమతులు అందించనున్నారన్నారు. మరోవైపు శనివారం ఆడిన దాండియా, కోలాటాల పోటీలకు అతిథిగా హాజరైన తిలక్‌నగర్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యురాలు పారెపెల్లి లత, మహారాష్ట్ర తెలుగు మహిళ సంస్థ కార్యదర్శి గాజెంగి హారికలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అతిథులను న్యాయనిర్ణేతలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంఘం మహిళ మండలి ఉపాధ్యక్షురాలు జిల్లా శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, సహ కార్యదర్శి బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులు అడ్డగట్ల ఐశ్వర్య, చెడుదుపు పద్మ, దొంత ప్రభావతి, ఇడం పద్మ, గుజ్జరి జాహ్నవీ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, సీతారేఖ, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, అనబత్తుల ప్రమోద్, పొన్న శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్సెట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, కోశాధికారి దోర్నాల బాలరాజు, దుస్స అమరేంద్ర, దోమల శంకర్, కస్తూరి గణేశ్, పుట్ట గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం... సిరిసిల్ల పద్మశాలి సంఘం ముంబై శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వర్లీ బీడీడీ చాల్స్‌లోని మార్కండేయ మందిరం ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిఫలించేలా ఆడపడచులు బతుకమ్మ పాటలు ఆలపిస్తూ పూలతో పేర్చిన బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల సంఘం మహిళలే కాకుండా స్థానిక, వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో పాల్గొన్న వివాహిత మహిళలకు లక్కీడిప్ ద్వారా 15 మందిని ఎంపికచేసి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ఉపాధ్యక్షుడు కొక్కుల రమేశ్, ప్రధాన కార్యదర్శి యేముల లక్ష్మీనారాయణ, సంయుక్త కోశాధికారి దూస మురళీధర్, కోశాధికారి సుంక ప్రభాకర్, సంయుక్త కోశాధికారులు ఆడెపు చంద్రశేఖర్, అడ్డగట్ల ముఖేశ్ సాంస్కృతిక అధికారి మార్గం శ్రీనివాస్, సోషల్ మీడియా అడ్మిన్ అడెపు అశోక్, కమిటీ సభ్యులు కోడం మనోహర్, ముదిగంటి అంజనేయులు, జిందం దశరథ్, జిందం నాగేశ్, కోడం గంగాధర్, వాసం నారాయణ, గాజుల సురేశ్, వాసా ల గంగాధర్, కట్టెకోల అశోక్, యంజాల్ భూమేశ్వర్, గాలిపెల్లి లక్ష్మణ్, వాసం అనిల్ కుమార్, రాపెల్లి సతీశ్, సలహాదారులు దూస నారాయణ, అడ్డగట్ల సుదర్శన్, ఆడెపు హనుమంతు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో..తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని థానేలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన మహిళలు తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెబుతూ బతుకమ్మ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. బతు కమ్మ వేడుకలకు హాజరైన మహిళలు గోదావరి, కావేరి, గంగ వంటి దేశంలోని వివిధ నదుల పేర్లతో గ్రూపులుగా విడిపోయి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో గోదావరి మహిళా బృందానికి మొదటి బహుమతి రాగా, గంగా నది మహిళా గ్రూపునకు రెండవ బహుమతి, కావేరి నది మహిళా గ్రూపునకు మూడో బహుమతి లభించాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అంజలి మచ్చ ఆధ్వర్యంలో స్నేహ అంబ్రె, రమేశ్ అంబ్రె, ఎఫ్–టామ్ సంస్థ అధ్యక్షుడు గంజి జగన్ బాబు చేతులమీదుగా చీరలు అందజేశారు. కార్యక్రమంలో రాఘవరావు, కిరణ్మయి, సునీల్ బైరి, వాణి వేముల, విజయ, స్నేహ వంగ, స్నేహ బొమ్మకంటి, మహేశ్ గుజ్జ, రాధిక, రమేశ్, పద్మాకర్, అర్జున్, సుభాష్, మహేంద్ర, హరితరావు, సత్యనారాయణ కంచెర్ల పాల్గొన్నారు. -
బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి
చేతల్లోనూ, గొంతుల్లోనూ, ఊరువాడల్లోనూ విరాజిల్లుతూ వర్ధిల్లే బతుకమ్మ ఏనాడు పుట్టిందో, ఏనాడు పెరిగిందో నేటికీ తెలంగాణను ఒక్కతాటి మీదుగా నిలుపుతోంది. జాతి వైభవాన్ని చాటుతోంది. శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరి భాగంలో (ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు) జరిగే వేడుక బతుకమ్మ. రుతుపవనాల వర్షాలు మంచినీటి చెరువులలోకి పుష్కలంగా నీటిని తెస్తాయి. తెలంగాణ ్ర΄ాంతంలోని సాగు చేయని, బంజరు మైదానాలలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించే సమయం కూడా ఇదే. వీటిలో అత్యధికంగా లభించేవి ‘గునుగు, తంగేడు పూలు.’ ఇక సీతజడ, బంతి, చెమంతి, గోరింట, గుమ్మడి, కట్లపూలు... పూల పేర్లు చెప్పుకుంటూపోవడం కన్నా అవన్నీ ఒక్క చోట చేర్చిన వారి శ్రమ, ఆ పూల అందం ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రకృతి తన సౌందర్యాన్ని ఈ అనేక రకాల పువ్వుల రంగులతో తెలియజేస్తుంది. ఈ పూలన్నీ కలిస్తే ఉండే అందం స్త్రీలంతా ఒక్కచోట చేరి ఆట ΄ాటలతో శక్తి స్వరూపిణిని కొలవడంలో, వారి పాటల్లో తెలుస్తుంటుంది.స్వేచ్ఛకు ప్రతీకదసరాకు ముందు వచ్చే ’సద్దుల బతుకమ్మ’ కి ఆడబిడ్డలు అత్తవారింటి నుండి తల్లిగారింటికి తిరిగి వచ్చి, పువ్వుల రంగులను జరుపుకోవడానికి స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజున ఇంటి పెద్దతో పాటు బతుకమ్మ ను అందంగా పేర్చడానికి ఆ ఇంట్లో అందరూ ఒక చోట కూర్చుంటారు. పువ్వులు వృత్తాకార వరుసలలో, రంగులలో ఇత్తడి ప్లేట్లో జాగ్రత్తగా వరుస తర్వాత వరుసలో అమర్చుతారు. సాయంత్రం సంప్రదాయ వేష ధారణలో తమ ్ర΄ాంగణంలో అంతా చేరి, బతుకమ్మను ఉంచి, చుట్టుపక్కల మహిళలు పెద్ద వలయంలో గుమికూడుతారు. బతుకమ్మల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నట్టు తిరుగుతూ,పాటలు పాడటం మొదలు పెడతారు. ఐకమత్యం, ప్రేమ, సోదరీమణుల ఆనందానికి బతుకమ్మ ప్రతీక.సామూహిక సందడిబతుకమ్మ పాటలు పాడి, ఆడలు ఆడి, చివరకు వాటిని తలపై ఎత్తుకొని ఊరేగింపుగా పెద్ద నీటి ప్రదేశానికి చేరుకుంటారు. బతుకమ్మలను నెమ్మదిగా ఆ నీటిలో వదులుతారు. చేసిన ప్రసాదాలను పంచుకుని, బతుకమ్మను కీర్తిస్తూపాటలుపాడుతూ తిరిగి వస్తారు. కష్టం, సుఖం చెప్పుకోవడం, తీపిదనాన్ని పంచుకోవడం కూడా ఈ వేడుక మనసును తృప్తి పరుస్తుంది.నీటి స్వచ్ఛతబతుకమ్మ... భూమి, నీళ్లతో మానవుల మధ్య అంతర్గత సంబంధాన్ని చూపుతుంది. కొన్ని చోట్ల బతుకమ్మతో పాటు ’బొడ్డెమ్మ’ (గౌరీ దేవిని మట్టితో తయారు చేస్తారు)ను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియ చెరువులను బలోపేతం చేయడానికి, మరింత నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు నీటిని శుద్ధి చేసే గొప్ప నాణ్యతను కలిగి ఉంటాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న స్త్రీలు ప్రకృతి సౌందర్యాన్ని పండగలా జరుపుకోవడం ద్వారా చెరువులను ఎలా మెరుగుపరచాలో అంతర్లీనంగా వారికి తెలుసు. ఈ పండుగ ప్రకృతి, ప్రజల సామూహిక, మహిళా జనాదరణ పొందిన స్ఫూర్తి. అలాగే ప్రకృతి వనరులను వేడుకగా సంరక్షించడంలో వ్యవసాయదారుల శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది. అందుకే బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. మన దేశంలోబతుకమ్మ వేడుకను దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులలో స్థిరపడిన తెలంగాణ వాళ్లు ఇప్పటికీ జరుపుకుంటున్నారు ∙బతుకమ్మ పండగ వచ్చిందంటే బెంగళూరు, పుణె వీధుల్లోనూ ఊయ్యాల ఆటపాటల కళ కనపడుతుంది. పూణెలో కూడా బతుకమ్మ పండగ సందడి జోరుగానే ఉంది ∙ముంబైలో డీజీపాటల స్టెప్స్ వేస్తూ బతుకమ్మ ఆటలతో సందడి చేస్తుంటారు. భిన్న సంస్కృతుల ముంబై తెలంగాణ సంస్కృతినీ స్వీకరించింది. విదేశాలలోనూ... నేపాల్, అమెరికా, సింగపూర్, కెనడాలో, న్యూజిలాండ్.. మొదలైన దేశాలలో ఉన్న తెలంగాణీయులు బతుకమ్మ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తమ కమ్యూనిటీలో అందరినీ ఒక చోట చేర్చి, సంబరం జరుపుకుంటున్నారు. భావి తరాలకు బతుకమ్మను మరింత వైభవంగా అందిస్తున్నారు. -
స్కాట్ లాండ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని స్థానిక తెలుగు సంఘం నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు. దైవత్వం. ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను అందిస్తుందన్నారు.గ్లాస్గో దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ప్రకృతిలో పెరుగుతోంది. దీనికి సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేకపోవడంతో మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత స్థలాన్ని గుర్తించారు. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల , వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి, బతుకమ్మలను జరుపుకుంటారు. చిరకాలం నిలిచిపోయే వేడుక జరగడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
దుర్గార్తిశమనీ దశదిశలా దసరా
జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.నవదుర్గల ఆరాధనదసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. శమీపూజనవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత– ‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.పూల వేడుక బతుకమ్మ పండుగఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. పన్యాల జగన్నాథదాసు -
Bathukamma 2024 నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ స్పెషల్
తెలంగాణా పల్లెపల్లెల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. రంగు రంగుల పూలతో అత్యంత సుందరంగా బతుకమ్మలను పేర్చి తెలంగాణా ఆడబిడ్డలు సంప్రదాయ దుస్తుల్లో గౌరమ్మను కొలుస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం బతుకమ్మ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో పూల పండుగను జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుతారు. నాలుగో (అక్టోబరు 5,శనివారం) రోజు బతుకమ్మ ‘నానేబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. గౌరమ్మను తయారు చేసి, గుమ్మడి తంగేడు, బంతి, గునుగు లాంటి రకరకాల పూలతో అలంకరిస్తారు. గౌరమ్మకు ఈరోజు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతోకలిపి ముద్దలు చేసి పెడతారు. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని ఆనందంగా అందరూ పంచుకుని తింటారు.కాగా తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. -
రవీంద్రభారతిలో ఘనంగా బతుకమ్మ, పేరిణి నృత్యం (ఫోటోలు)
-
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాలు (ఫొటోలు)
-
పూలు పేర్చి.. బతుకమ్మ ఆడి : బతుకమ్మ వేడుకలు ఘనంగా
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పసుపుతో తయారు చేసిన గౌరమ్మకు బియ్యం పిండి, నువ్వులు, నూకలతో తయారు చేసిన ప్రసాదంగా నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతలు బతుకమ్మలను ఒక చోట పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. – కుత్బుల్లాపూర్ -
ముంబైలో ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు
సాక్షి,ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. నగరంతోపాటు వర్లీ, బాంద్రా, అంధేరి, గోరేగావ్, బోరివలి, థాణే, భివండీ, సోలాపూర్లలో నివసించే తెలుగు ప్రజలు బుధవారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో దసరా వేడుకలకు స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా తొలిరోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ను పూజించిన తెలంగాణ మహిళలు బతుకమ్మ పాటలు, కోలాటాలతో ఉల్లాసంగా గడిపారు. ఉత్సవాల నేపథ్యంలో ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది. మరోవైపు శరన్నవరాత్రుల సందర్భంగా బెంగాలీలు దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తుండగా, గుజరాతీలు పూజా కార్యక్రమాలతో పాటు ‘గర్భా’, దాండియాల్లోనూ ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. సద్దుల బతుకమ్మతో ముగింపు...తెలుగువారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవుళ్లకు పువ్వులతో పూజలు చేయడం సహజం కానీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో విడదీయలేని భాగమైన బతుకమ్మ పండుగ సందర్భంగా రకరకాల, రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి వాటికే పూజలు నిర్వహించడం విశేషం. ఇలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పూజించిన మహిళలు చివరి రోజున భారీ ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుని బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. రద్దీగా దేవీ ఆలయాలు... దసరా సందర్భంగా ముంబైతోపాటు రాష్ట్రంలోని మహాలక్ష్మి, మహాకాళి, దుర్గాదేవి, లక్షి్మదేవి తదితర అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవానీ, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి, మావూర్లోని రేణుకా మాత, నాసిక్ జిల్లాలోని సప్తశృంగి దేవి ఆలయాలతో పాటు అదే విధంగా ముంబైలోని మహాలక్షి్మ, ముంబాదేవి, ఠాణే జిల్లాలోని వజ్రేశ్వరీ, విరార్‌లోని జీవ్దనీ మాతా, ముంబ్రాలోని కొండపై ఉన్న ముంబ్రా దేవి మందిరాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. కాగా శరన్నవరాత్రుల తొలిరోజునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం భద్రతా ఏర్పాట్లతోపాటు తాగు నీరు, ఇతర సదుపాయాలను కల్పించడంలో ఆలయ కమిటీలు నిమగ్నమయ్యాయి. నాయిగావ్ పద్మశాలీ యువక సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో...దాదర్ నాయిగావ్‌లోని పద్మశాలీ యువక సంఘానికి చెందిన మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక తెలుగు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజించారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా అక్టోబరు 5నకోలాటం, దాండియా, అక్టోబరు 10నసద్దుల బతుకమ్మ సంబరాలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు తెలిపారు. ఈసంబరాల్లో ఉత్తమ బతుకమ్మను పేర్చిన, చూడచక్కని బతుకమ్మ అడిన మహిళలకు, బాల బాలికలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సంఘం మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులుఅడ్డగట్ల ఐశ్వర్య, గుజ్జరి జానవి, కస్తూరి సావిత్ర, మహేశ్వరం సాక్షి, సీత రేఖలతో పాటు స్థానిక మహిళలు, బాలికలుపెద్దఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో... పశి్చమ గోరెగావ్, హనుమాన్ నగర్‌లోని తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరూ తీరొక్క పూలను అందంగా పేర్చి బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘం కమిటీ అధ్యక్షుడు మల్లేష్ ప్రధాన కార్యదర్శి స్వామి లెంకలపల్లి, ఉపాధ్యక్షుడు శేఖర్ వంటిపాక, నరసింహా బినమోని, కోశాధికారి గణేష్ మచ్చ, నరసింహ నాయక్, శ్రీనివాస్ రెడ్డి మన్నే. సహాయ కార్యదర్శులు బద్దం శంకర్, లక్ష్మణ్ ఎర్ర, మల్లేష్ సురి్వ, సలహాదారులు పరమేష్ నర్సిరెడ్డి, మన్నే జనార్దన్, మల్లేష్ గాదె, కృష్ణ కురుపాటి, శ్రీను కిష్టం, జాని స్వామి, వెంకటేష్ .వి, రాములు, నర్సింహ్మ ఎర్ర, శంకర్ బాబు, శంకర్ .డి, బిక్షం యాదయ్య, ఎ స్వామి, రంగనాధం,లింగయ్య జి, సుధాకర్ రెడ్డిలతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో... దహిసర్ నవగాం, హనుమాన్ టేకిడి ప్రాంతంలోని శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు మహిళలు సంప్రదాయబద్ధంగా ముస్తాబై రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు, ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ముంబై అంటాప్ హిల్ చర్చి సమీపంలోని మరియమ్మ మందిరంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ... బుధవారం నవీముంబైలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహాసభ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాదిరెడ్డి కొండారెడ్డిని తెలుగు కళా సమితి అధ్యక్షుడు బండి నారాయణ రెడ్డి. ఉపాధ్యక్షుడు బి. సుబ్రమణ్యం. కే. వరలక్ష్మి, వహీదా షేక్ ఘనంగా సన్మానించారు. చిరాగ్ నగర్ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో... ఘాట్కోపర్,చిరాగ్నగర్లోని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మఆడుకున్నారు. శివాజీ నగర్, గీతాంజలి గార్డెన్లో...దహిసర్ ప్రాంతంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన తెలుగువారు తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. శివాజీ నగర్ ప్రాంతంలోని గీతాంజలి గార్డెన్లో బతుకమ్మ పండుగ సంబరాలు తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పానుగుళ్ల వసుమతి, తేజస్విని కుకడపు, కవిత నందిపాటి, దీపిక పానుగుళ్ల, శిరీష జాల, మమత చినాల, లావణ్య కుకడపు, రేణుక గోగు, రేణుక, బాల కందే తదితరులు పాల్గొన్నారు. తూర్పు డోంబివలిలో...తూర్పు డోంబివలి, పలావా ఫేజ్ 2లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగ జరిగింది. మొట్టమొదటిసారి జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాకినాకాలో... సాకినాకాలోని పోచమ్మ గుడి వద్ద తెలుగు ప్రజలు ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలుఘనంగా ‘ఎంగిలి పూల బతుకమ్మ’ సంబరాలు -
హైదరాబాద్ : రవీంద్రభారతిలో అటుకుల బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
పూల పండుగ వచ్చేసింది.. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
నేటినుంచి పూల పండుగ: ఇల్లిల్లూ ఓ గుడి... వీధంతా సింగిడి
తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. వానాకాలం వెళ్లేముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లె పడుచులతో ఎటు చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుగా ఉన్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండి జిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి.పూరిగుడిసెలమీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి పొలంగట్లు. పూలు కోసుకురావడం ఒక్కటే మగవారి వంతు. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవాళ్లదే. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే ‘బతుకమ్మ’ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న విశ్వాసం ఈనాటికీ తెలంగాణలో ఉంది.తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగ మహాలయ పక్ష అమావాస్యతో ఆరంభం అవుతుంది. కొన్నిచోట్ల పితృ అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి.అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలియజేయడంతో పాటు ఆడపిల్లలకు సంబంధించిన అనేక విషయాలమీదే ఉంటాయి. ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ. భాద్రపద అమావాస్య అక్టోబరు 2నప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగి, అక్టోబరు 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. – డి.వి.ఆర్. -
TG: బతుకమ్మ వేడుకల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: బతుకమ్మ వేడుకల షెడ్యూల్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రేపటి (బుధవారం) నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. 10న ట్యాంక్బాండ్లో బతుకమ్మ వేడుకలు..లేజర్‌షో జరగనుంది. అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్వరకు వెయ్యి బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక.. బతుకమ్మ వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలుతెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ