పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు
పదెకరాల ప్రాంగణంలో ఇక్కడ గుడి నిర్మించేందుకు ప్రణాళికలు
ఇప్పటికే విరాళాల సేకరణలో శ్రీశాంతికృష్ణ సేవా సమితి
నాలుగు నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు
సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి.
శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్‌ఆర్‌ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.
అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది.
రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం
గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాఖోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు.
బతుకునిచ్చిన అమ్మ!
17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది.
కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి.
పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు.
యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి..
40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్‌సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు.
తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా.
– డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment