choutapalli
-
బతుకమ్మ పుట్టినిల్లు!
సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది. రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాఖోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. బతుకునిచ్చిన అమ్మ!17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది. కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు. యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి.. 40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్‌సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా. – డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
కట్టుదిట్టంగా పంచాయతీ పాలన
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్): గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈ సారి పంచాయతీల పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీకి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పంచాయితీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పట్టిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. సర్పంచ్‌లకు సవాలే.. గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది. కాని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో లాగా ఈ సారి ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు ఏ పని చేయాలన్న గ్రామస్తుల సమావేశంలో తీర్మానాలు చేసి వారి సమక్షంలో నిధుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతీ సారి పంచాయతీకి మంజూరయ్యే నిధులు వాటి వినియోగానికి సంబంధించి విషయాలు ఎప్పకటిప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయితీలలో చేసే ప్రతి పని ఆన్లైన్లో పొందు పరచాల్సి ఉంటుంది. తీర్మానం లేకుండా చేస్తే పదవికి ముప్పే.. గతంలో లాగా గ్రామ పంచాయితీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటు వారిపై వేటు పడే అవకాశం ఉంది.గతంలో సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత వచ్చిన నిధులను తీర్మానాలు చేయకుండానే తీసుకునేవారు.కానీ ఈ సారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మానం చేసుకొని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్.. ప్రియా(పంచాయితీ రాజ్ ఇనిస్టిట్యూషన్ అండ్ యూత్ అకౌంటింగ్) సాఫ్ట్వేర్ ద్వారా పంచాయతీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. గ్రామాలలో పనిచేసే ప్రతీ అభ్యర్థి ఏఏ పనులు చేస్తున్నారు. ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారు.అనే విషయాన్ని తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయతీకి ఏ గ్రాంటు ద్వారా నిధులు మంజూరయ్యాయి అందులో ఎన్ని ఖర్చు చేశారో కూడా పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామ జ్యోతి వెబ్సైట్ ద్వారా.. పంచాయితీలకు ఎంత బడ్డెట్ మంజూరైంది.మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చుచేశారు. శానిటేషన్ వైద్యం, నీటి సరఫరా సోషల్ వర్కులు,సీసీ రోడ్డుల నిర్మాణం, సిబ్బంది వేతనాలు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పంచాయతీ ఖర్చు చేయగా ఇంకా పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయి. వాటి వివరాలను ఈ వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. నేషనల్ పంచాయతీ పోర్టల్ యాప్.. పంచాయతీ పరిధిలో జరుగుతున్న పనుల వివరాలు గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, కాలువలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా గ్రామ స్థాయి సమాచారం ఇందులో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలను యాప్లోఆన్లోడ్ ఆప్‌లోనే చేస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న పనులకు సంబంధించి వివరాలతో పాటు ఎన్ని నిధులు ఖర్చు అయ్యాయో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ స్టోర్ నుంచి అప్ లోడ్ చేసుకోవచ్చు. పారదర్శకత పెరిగింది.. పంచాయితీలకు సంబంధించి నిధులు ఖర్చుల వివరాలు పూర్తి స్థాయి లో యాప్‌ల వెబ్సైట్లలో అందుబాటులో ఉండడంతో పంచాయితీలలో అవినీతి తగ్గడంతో పాటు పాలన పారదర్శకంగా ఉంటుంది.గతంలో జరిగిన పనులకు సంబంధించి వివరాలు నిధుల ఖర్చుల వివరాలు కొత్త పనుల ఎంపిక కోసం ఈ యాప్ తోడ్పడుతుంది.వీటిపై ఆయా గ్రామ పంచాయితీల పాలకులు,యవకులు,మహిళలకు అవగాహన ఏర్పరచుకోవాలి. – దమ్మని రాము, ఎంపీడీఓ హుస్నాబాద్ -
పోటీకి చౌట్పల్లి దూరం
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన నాయకుల ఖిల్లాగా పేరొందిన చౌట్పల్లి ఈసారి ఎన్నికల తెరపై కనుమరుగైంది. ఈ గ్రామానికి చెందిన నాయకులకు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ నియోజకవర్గం నుంచి అవకాశం లభించకపోవడంతో పోటీకి చౌట్పల్లి దూరం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి చౌట్పల్లికి చెందిన ఎవరో ఒకరు అసెంబ్లీలో బాల్కొండ లేదా ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ గ్రామానికి చెందిన ఇద్దరు నాయకులు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలవడంతో చౌట్పల్లికి అసెంబ్లీలో స్థానం లేకుండా పోయింది. కాగా ఈ సారి అసలే పోటీకి అవకాశం దక్కకపోవడంతో ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న చౌట్పల్లి తొలిసారి పోటీకి దూరమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 1952 నుంచి పోటీ.. 1952లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన 1956లో నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు మొట్టమొదటి చైర్మన్‌గా ఎంపికయ్యారు. 1978లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున కేఆర్ గోవింద్‌రెడ్డి పోటీ చేశారు. అంతకు ముందు ఆయన భీమ్‌గల్ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి కూడా భీమ్‌గల్ సమితి అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. 1983లో ఏలేటి మహిపాల్‌రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మహిపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మహిపాల్‌రెడ్డికి ఆర్మూర్ టిక్కెట్ దక్కలేదు. కాగా ఈ ఎన్నికల్లో బాల్కొండ కాంగ్రెస్ టిక్కెట్‌ను చౌట్పల్లికి చెందిన సురేశ్‌రెడ్డికి పార్టీ అధిష్టానం కేటాయించగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1994లో అన్నపూర్ణమ్మ ఆర్మూర్ ఎమ్మెల్యేగా, సురేశ్‌రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసెంబ్లీలో రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం సంచలనం సృష్టించింది. 1999, 2004లో వరుసగా సురేశ్‌రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్‌రెడ్డి పోటీ చేయగా ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున అన్నపూర్ణమ్మ పోటీ చేసి సురేశ్‌రెడ్డిపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఓటమిపాలయ్యారు. దీంతో అసెంబ్లీలో చౌట్పల్లికి చోటు లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి పోటీకి ఆసక్తి కనబరిచినా ఆయన టీఆర్ఎస్లో చేరడం ఆయనకు పార్టీ అధిష్టానం మరో పదవీని ఆఫర్ చేయడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఈసారి దూరమయ్యారు. అలాగే మల్లికార్జున్‌రెడ్డి మహాకూటమి తరపున పోటీ చేయడానికి బాల్కొండ టిక్కెట్‌ను ఆశించారు. కానీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన కూడా పోటీకి దూరమయ్యారు. 1983 నుంచి చౌట్పల్లికి చెందిన వారు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఏదో ఒక పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయగా ఈసారి తొలిసారి పోటీకి అవకాశం దక్కకపోవడంతో పోటీకి చౌట్పల్లి దూరమైందని వెల్లడవుతోంది. -
వ్యక్తిపై ఎలుగు బంటి దాడి
అట్లూరు: చౌటపల్లికి చెందిన మీసాల పెద్దనారాయణపై ఎలుగుబంటి శుక్రవారం దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. వివరాలలోకి వెళితే.. చైటపల్లి గ్రామానికి చెందిన మీసాల పెద్దనారాయణ వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే వాడు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటి ముఖం పట్టాడు. గ్రామ సమీపానికి చేరుకునే సమయానికి కంప చెట్ల మధ్య నుంచి వచ్చి ఎలుగుబంటి దాడికి యత్నించింది. ఒంటిపై ఉన్న బట్టలు చిరిగి పోగా కాలికి ఎలుగుబంటి గోర్లు గుచ్చుకున్నాయి. భయబ్రాంతులకు గురై కేకలు వేయడంతో ఎలుగుబంటి పరారైంది. విషయం తెలియడంతో వెంటనే గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. స్వల్ప గాయాలే కావడంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజులుగా కొండూరు గ్రామ పరిసరాలలో ఎలుగుబంటి సంచారం చేస్తుండడంతో గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఎలుగుబంటి సంచారంతో భయాందోళన’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా అటవీ అధికారులు స్పందించక పోవడంతో కొండూరు, చౌటపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
చౌటపల్లిలో మూడుకు చేరిన మృతుల సంఖ్య పర్వతగిరి : మండలంలోని చౌటపల్లి లో ఉన్న హట్యాతండాకు చెందిన అజ్మీర సరిత(9) సోమవారం అర్ధరాత్రి విష జ్వరంతో కన్నుమూసింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. అజ్మీర బీచ్చ్య, రంగమ్మ దంపతులకు వివాహం జరిగిన 15 సంవత్సరాల తర్వాత సరిత జన్మించింది. అజ్మీర సరిత తీగరాజుపల్లి ఆదర్శ పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. గత శుక్రవారం ఆమెకు జ్వరం వచ్చినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. మరుసటి రోజు శనివారం వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ రాసిన మం దులను వాడుతున్న క్రమంలో జ్వరం మరింత పెరిగింది. దీంతో స్థానిక ఆర్ఎంపీ సూచన మేరకు వరంగల్‌లోనే ఉన్న మరో ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేర్పిం చారు. రక్త, మూత్ర పరీక్షలు ఇతరాలకు రూ.6వేల బిల్లు చెల్లించారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు సరిత పరిస్థితి బాగా లేదని మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాలని అప్పటిదాకా చికిత్స అందించిన ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో చిన్నారిని వారు ఆటోలో మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందింది. పాప చనిపోయిన అనంతరం ఆస్పత్రి సిబ్బంది తమ వద్ద నుంచి బిల్లులు లాక్కున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మండలంలోని చౌటపల్లి గ్రామంలో విషజ్వరంతో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.