అట్లూరు: చౌటపల్లికి చెందిన మీసాల పెద్దనారాయణపై ఎలుగుబంటి శుక్రవారం దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. వివరాలలోకి వెళితే.. చైటపల్లి గ్రామానికి చెందిన మీసాల పెద్దనారాయణ వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే వాడు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటి ముఖం పట్టాడు. గ్రామ సమీపానికి చేరుకునే సమయానికి కంప చెట్ల మధ్య నుంచి వచ్చి ఎలుగుబంటి దాడికి యత్నించింది. ఒంటిపై ఉన్న బట్టలు చిరిగి పోగా కాలికి ఎలుగుబంటి గోర్లు గుచ్చుకున్నాయి. భయబ్రాంతులకు గురై కేకలు వేయడంతో ఎలుగుబంటి పరారైంది. విషయం తెలియడంతో వెంటనే గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. స్వల్ప గాయాలే కావడంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజులుగా కొండూరు గ్రామ పరిసరాలలో ఎలుగుబంటి సంచారం చేస్తుండడంతో గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఎలుగుబంటి సంచారంతో భయాందోళన’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా అటవీ అధికారులు స్పందించక పోవడంతో కొండూరు, చౌటపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.