
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎలుగుబంటిని బంధించి.. శారీరకంగా చిత్రహింసలకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఎలుగుబంటి ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పైశాచిక ఘటనపై విచారణకు ఆదేశించారు. మూగ జీవిని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వీడియోలో ఎలుగుబంటి చేతిని ఉక్కు తీగతో చెక్క పలకకు కట్టేశారు. ఓ వ్యక్తి ఆ జీవి చెవులను లాగుతున్నట్లు కనిపిస్తుంది. నొప్పితో ఆ ఎలుగుబంటి అల్లాడిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. మరొక వ్యక్తి తన చేతులతో ఎలుగుబంటి తలపై బలంగా కొట్టడాన్ని చూడవచ్చు. క్షణాల్లో, అదే వ్యక్తి ఎలుగుబంటి గోళ్లను పీకుతున్నట్లు చూడవచ్చు. తీవ్రమైన నొప్పి కారణంగా ఆ మూగ జీవి అరుపులు బిగ్గరగా వినిపించడం వీడియోలో రికార్డు అయ్యింది.
నిందితులపై రూ. 10,000 రివార్డును ప్రకటించిన అటవీశాఖ.. వారి చిత్రాలను విడుదల చేసింది. వీడియోలో వ్యక్తుల కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిపై వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చర్య తీసుకుంటామని అటవీ శాఖ తెలిపింది.