
సాక్షి, కృష్ణా జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అసహనానికి గురయ్యారు. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన గ్రామస్థులపై కస్సుబుస్సుమన్నారు. 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ ఫైరయ్యారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. అయితే, నిమ్మకూరుకు వచ్చిన బాలకృష్ణను కలిసేందుకు ఆయన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు.. బాలకృష్ణను పలకరించారు. ఫొటోలు సైతం దిగారు.
అనంతరం, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కోరారు. అందుకు ఆయన ‘నేను పట్టించుకోను.. ఫొటోలు దిగారుగా వెళ్లండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా? అదెక్కడ ఉంది? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో, తన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలును బాలకృష్ణ విస్మరించడం, అసహనం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments
Please login to add a commentAdd a comment