విషజ్వరంతో చిన్నారి మృతి
-
చౌటపల్లిలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
పర్వతగిరి : మండలంలోని చౌటపల్లి లో ఉన్న హట్యాతండాకు చెందిన అజ్మీర సరిత(9) సోమవారం అర్ధరాత్రి విష జ్వరంతో కన్నుమూసింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. అజ్మీర బీచ్చ్య, రంగమ్మ దంపతులకు వివాహం జరిగిన 15 సంవత్సరాల తర్వాత సరిత జన్మించింది. అజ్మీర సరిత తీగరాజుపల్లి ఆదర్శ పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. గత శుక్రవారం ఆమెకు జ్వరం వచ్చినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. మరుసటి రోజు శనివారం వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ రాసిన మం దులను వాడుతున్న క్రమంలో జ్వరం మరింత పెరిగింది. దీంతో స్థానిక ఆర్‌ఎంపీ సూచన మేరకు వరంగల్‌లోనే ఉన్న మరో ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేర్పిం చారు. రక్త, మూత్ర పరీక్షలు ఇతరాలకు రూ.6వేల బిల్లు చెల్లించారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు సరిత పరిస్థితి బాగా లేదని మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాలని అప్పటిదాకా చికిత్స అందించిన ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో చిన్నారిని వారు ఆటోలో మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందింది. పాప చనిపోయిన అనంతరం ఆస్పత్రి సిబ్బంది తమ వద్ద నుంచి బిల్లులు లాక్కున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మండలంలోని చౌటపల్లి గ్రామంలో విషజ్వరంతో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.