కిగలీ(రువాండా): రక్తనాళాలను ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణమయ్యే ప్రమాదకర మార్బర్గ్ వైరస్ రువాండా దేశంలో ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల మందికి ఇప్పటికే ఈ వైరస్‌సోకి ఉంటుందని రువాండా అధికారులు భావిస్తున్నారు. విపరీతమైన జ్వరం, రక్తధారలకు కారణమవడంతో ఈ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’వైరస్‌గానూ పిలుస్తారు. మార్బర్గ్ వైరస్ సోకితే 88 శాతం వరకు మరణం సంభవించే అవకాశం ఉంది. ఫలాలను తినే గబ్బిలాల్లో మార్బర్గ్ వైరస్ సహజంగా ఉంటుంది. ఇది ఎబోలా జాతికి చెందిన వైరస్.
ఓరోపైచ్ జ్వరం, ఎంపాక్స్‌కు కారణమయ్యే వైరస్‌ల వ్యాప్తితో బాధపడుతున్న 17 ఆఫ్రికా దేశాల్లో తాజాగా ప్రయాణికుల రాకపోకలపై ప్రభుత్వాలు అడ్వైజరీని విడుదలచేశాయి. బ్లీడింగ్ ఐ వైరస్‌కూ దాదాపు ఎబోలా వైరస్ లక్షణాలే ఉంటాయి. బ్లీడింగ్ ఐ వైరస్ సోకితే గొంతు నొప్పి, జ్వరం, చలి, తలనొప్పి, దగ్గు, కండరాల నొప్పి, దద్దర్లు వస్తాయి. కొన్ని సార్లు ఛాతి నొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బరువు తగ్గడం, రక్తవిరేచనాలు ఉంటాయని క్లెవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధనలో తేలింది. మార్బర్గ్ వైరస్‌కు స్పష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు. ముందస్తు వ్యాక్సిన్లు లేవు. వైరల్ జ్వరం మాదిరిగా చికిత్సావిధానాలనే ప్రస్తుతం అవలంభిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment