
ఆడపడుచు తప్పుడు మార్గంలో వెళ్తుంటే.. వద్దని శిరీష వారించింది. ఇది ఇలాగే కొనసాగితే పరువు పోతుందని చెప్పింది. అలా మంచి చెప్పడమే ఆమె పాలిట శాపమైంది. అదను కోసం ఎదురు చూసిన ఆడపడుచు.. కపట ప్రేమతో శిరీషను నమ్మించి బలిగొంది. నగరంలో చర్చనీయాంశమైన మలక్‌పేట శిరీష హత్య కేసులో సంచలన కోణం వెలుగు చూసింది ఇప్పుడు..
హైదరాబాద్, సాక్షి: మలక్‌పేట్ శిరీష(Malakpet Sirisha Case) హత్య కేసులో.. భర్త వినయ్, అతని సోదరి సరిత కలిసి నేరానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా వివాహేతర సంబంధ కోణం వెలుగుచూసింది. ఆ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో శిరీషను సరితే హత్య చేసినట్లు తేలింది.
వినయ్ సోదరి సరిత(Vinay Sister Saritha) భర్త ఒమన్‌లో ఉంటాడు. దీంతో సరిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో శిరీష.. పరువు పోతుందని ఆమెను మందలించింది. ఇది మనసులో పెట్టుకుని కోపంతో రగిలిపోయిన సరిత.. అవకాశం కోసం ఎదురు చూసింది.
శిరీష కొంతకాలం నుంచి నిద్ర కోసం మత్తు ఇంజక్షన్లు వాడుతోంది. ఈ క్రమంలో ఈనెల 2న సరిత, శిరీష మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. అయితే శిరీషకు క్షమాపణలు చెప్పినట్లు నటించిన సరిత.. ఇక నుంచి మంచిగా ఉంటానని నమ్మబలికింది. కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పున్నారు. ఆ ప్రేమ నిజమేనని శిరీష నమ్మింది. ఆపై నిద్రపోయేందుకు శిరీషకు సరితే మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అయితే..
నిద్ర మత్తులోకి జారిపోయిన శిరీషకు.. ఓవర్‌డోస్ ఇంజెక్షన్ ఇచ్చింది సరిత. అలా నిద్రలోనే ఆమె ప్రాణం తీసింది. మరుసటిరోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్టు.. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు నాటకం ఆడింది. ఈ నాటకంలో సరిత సోదరుడు, శిరీష భర్త వినయ్ కూడా భాగమయ్యాడు. శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించింది.
👉ఆపై శిరీష సోదరి స్వాతికి.. ఫోన్ చేసి, శిరీష ఛాతి నొప్పితో మరణించినట్టు అక్కాతమ్ముడు సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేట్‌లోని మేనమామ మధుకర్‌కు చెప్పింది. అయితే తాను వచ్చేంత వరకు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని ఆయన సూచించాడు. ఆపై పలుమార్లు ఫోన్‌చేసినా స్పందన లేకుండా పోయింది. దీంతో.. సదరు ఆసుపత్రి వాళ్లను ఆయన సంప్రదించాడు. వాళ్లు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నట్లు సమాచారమిచ్చారు. ఆలస్యం చేయకుండా ఆయన అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి.. ఆరా తీశారు.
👉మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ దోమలపెంట(Domalpenta)కు తరలిస్తున్నట్లు ఆంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. దీంతో మధుకర్ పోలీసుల సాయంతో.. ఆ అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. ఆపై చాదర్‌ఘాట్ పోలీసులకు తన మేనకోడలు శిరీష మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు.
👉శిరీష మెడ చుట్టూ గాయాలు ఉండడంతో మధుకర్, ఇతర బంధువులు వినయ్‌ను నిలదీశారు. ఛాతీ నొప్పితో శిరీష కుప్పకూలినపుడు సీపీఆర్ చేశామని.. ఆ సమయంలో చేతి గోళ్లు గుచ్చుకొని ఉండవచ్చని ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు గాయాలైనట్టు మరోసారి పొంతన లేకుండా చెప్పాడు. దీంతో బంధువులను పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమదైన శైలిలో విచారించి అసలు విషయం బయటకు లాగారు. తాజాగా వచ్చిన ఉస్మానియా పోస్టు మార్టం రిపోర్టుతో ఈ కేసు మిస్టరీ వీడిపోయింది.
👉హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా సోదరి సరితతో కలిసి శిరీష మృతదేహాన్ని వినయ్ మాయం చేయాలనున్నాడు. దీంతో సరితకు సహకరించినందుకు వినయ్‌ను సహనిందితుడిగా చేర్చారు.
పాపం శిరీష
శిరీష స్వస్థలం హనుమకొండ జిల్లా పరకాల. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో.. ముగ్గురు పిల్లల్లో చిన్నదైన శిరీషను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకుని చదవించాడు. కాలేజీ రోజుల్లో నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ ఆమెను ప్రేమించాడు. అయితే అప్పటికే వినయ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటిభార్యను చంపేసినట్లుగా, రెండో భార్య ఇతడి టార్చర్ తట్టుకోలేక పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
అయితే అవేం తెలియని శిరీష వినయ్ ప్రేమ మత్తులో ముగినిపోయింది. 2016లో వినయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరం పెట్టింది. ఆపై హైదరాబాద్ మలక్‌పేట జమున టవర్స్‌లో వినయ్-శిరీష్ కాపురం పెట్టారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉండగా... శిరీష్ నర్సుగా పని చేస్తూ భర్త, బిడ్డను పోషిస్తోంది. ఇదిలా ఉంటే.. వినయ్ తరచూ శిరీషపై అనుమానంతో హింసించేవాడని.. అందుకు ఆడపడుచు సరిత కూడా సహకరించేదని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment