సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన నాయకుల ఖిల్లాగా పేరొందిన చౌట్‌పల్లి ఈసారి ఎన్నికల తెరపై కనుమరుగైంది. ఈ గ్రామానికి చెందిన నాయకులకు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ నియోజకవర్గం నుంచి అవకాశం లభించకపోవడంతో పోటీకి చౌట్‌పల్లి దూరం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి చౌట్‌పల్లికి చెందిన ఎవరో ఒకరు అసెంబ్లీలో బాల్కొండ లేదా ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ గ్రామానికి చెందిన ఇద్దరు నాయకులు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలవడంతో చౌట్‌పల్లికి అసెంబ్లీలో స్థానం లేకుండా పోయింది. కాగా ఈ సారి అసలే పోటీకి అవకాశం దక్కకపోవడంతో ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న చౌట్‌పల్లి తొలిసారి పోటీకి దూరమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
1952 నుంచి పోటీ..
1952లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన 1956లో నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు మొట్టమొదటి చైర్మన్‌గా ఎంపికయ్యారు. 1978లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున కేఆర్ గోవింద్‌రెడ్డి పోటీ చేశారు. అంతకు ముందు ఆయన భీమ్‌గల్ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి కూడా భీమ్‌గల్ సమితి అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. 1983లో ఏలేటి మహిపాల్‌రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మహిపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మహిపాల్‌రెడ్డికి ఆర్మూర్ టిక్కెట్ దక్కలేదు. కాగా ఈ ఎన్నికల్లో బాల్కొండ కాంగ్రెస్ టిక్కెట్‌ను చౌట్‌పల్లికి చెందిన సురేశ్‌రెడ్డికి పార్టీ అధిష్టానం కేటాయించగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అలాగే 1994లో అన్నపూర్ణమ్మ ఆర్మూర్ ఎమ్మెల్యేగా, సురేశ్‌రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అసెంబ్లీలో రెండు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం సంచలనం సృష్టించింది. 1999, 2004లో వరుసగా సురేశ్‌రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్‌రెడ్డి పోటీ చేయగా ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున అన్నపూర్ణమ్మ పోటీ చేసి సురేశ్‌రెడ్డిపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు.
అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఓటమిపాలయ్యారు. దీంతో అసెంబ్లీలో చౌట్‌పల్లికి చోటు లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి పోటీకి ఆసక్తి కనబరిచినా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం ఆయనకు పార్టీ అధిష్టానం మరో పదవీని ఆఫర్ చేయడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఈసారి దూరమయ్యారు. అలాగే మల్లికార్జున్‌రెడ్డి మహాకూటమి తరపున పోటీ చేయడానికి బాల్కొండ టిక్కెట్‌ను ఆశించారు. కానీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన కూడా పోటీకి దూరమయ్యారు. 1983 నుంచి చౌట్‌పల్లికి చెందిన వారు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఏదో ఒక పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయగా ఈసారి తొలిసారి పోటీకి అవకాశం దక్కకపోవడంతో పోటీకి చౌట్‌పల్లి దూరమైందని వెల్లడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment