నేటి నుంచి మగువలకు బతుకమ్మ కానుక | Bathukamma Sarees Distribution In Telangana | Sakshi
Sakshi News home page

Telangana Bathukamma Sarees: నేటి నుంచి బతుకమ్మ చీరల పంపణీ

Published Sat, Oct 2 2021 11:37 AM | Last Updated on Sat, Oct 2 2021 1:34 PM

Bathukamma Sarees Distribution In Telangana - Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి ఉమ్మడి వరంగల్‌లో రంగం సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ పండుగ పూట పేద వర్గాల మహిళలు నిరుత్సాహంగా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. సిరిసిల్ల, షాద్‌నగర్, నారాయణపేట, కొత్తపల్లి, తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను అందజేయడం ద్వారా కార్మికులకు సైతం ఉపాధి కల్పిస్తోంది.
చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’ 

ఈ నెల 6 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలై 13 వరకు జరగనున్నాయి. దీంతో అధికారులు ముందుగానే స్టాక్‌ తెప్పించి, గోదాముల్లో భద్రపరిచారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌ మండలం మినహా, జిల్లా పరిధిలోని మిగతా ప్రాంతాల్లో చీరల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
చదవండి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు 

13.45 లక్షల చీరలు... రూ.46.97 కోట్ల వ్యయం...
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లోని 18 సంవత్సరాలు పై బడిన యువతులు, మహిళలు చీరలు పొందేందుకు అర్హులు. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా 12.87 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, 13,45,015 మంది అర్హతగల వారిని గుర్తించారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు 11.25 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి.

హనుమకొండ జిల్లాలో 2,83,341, వరంగల్‌లో వరంగల్‌ 3,37,334, జనగామలో1,99,556, మహబూబాబాద్‌ 2,71,000, జేఎస్‌ భూపాలపల్లి1,43,000, ములుగులో 1,10,784 చీరలను అర్హులైన మహిళలకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్రామస్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు.

అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వార్డుస్థాయి కమిటీల ద్వారా పంపిణీ చేయనుండగా అధికారులు పర్యవేక్షిస్తారు. ఉమ్మడి వరంగల్‌లో రూ.46,96,76,000 వ్యయంతో మొత్తం 13,45,015 చీరలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ఆడపడుచులకు కేసీఆర్‌ కానుక.. బతుకమ్మ చీరలు
తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పండగ కానుకగా చీరలు అందజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉమ్మడి వరంగల్‌లో సుమారుగా 13.50 లక్షల చీరలు పంపిణీ చేస్తారు.

బతుకమ్మ పండుగకు తీరొక్క పువ్వుతో గౌరమ్మను అలంకరించినట్లే.. బతుకమ్మ ఆడడానికి వెళ్లే మహిళలు.. తీరొక్క రంగు చీరల్లో అందంగా ముస్తాబవ్వడం కోసం ఆకర్శణీయమైన రంగులతో రూపుదిద్దుకున్న ఈ చీరల పంపిణీ శనివారం ప్రారంభమవుతుంది. 

– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement