జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.
ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.
‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!
యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’
పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.
దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.
నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు
1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.
2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.
3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.
4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.
5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.
6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.
7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.
8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.
9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.
10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.
నవదుర్గల ఆరాధన
దసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్
నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
ఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది.
శమీపూజ
నవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత–
‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.
దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.
పూల వేడుక బతుకమ్మ పండుగ
ఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.
నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.
అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.
వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.
ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు.
పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment