Vijayadashami: దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులూ, పదవ రోజు విజయ దశమినీ కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చేపండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికీ, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికీ, తరువాత మూడురోజులు సరస్వతీ దేవికీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.
తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతు కమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలి చిన సందర్భమే కాక... పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.
బ్రహ్మ దేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశ వంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ జన్మించింది. సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహం రూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు మహిషం రూపంలో దేవి చేతిలో హతుడైనాడు.
చదవండి: దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"
తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం.
– దండంరాజు రాంచందర్ రావు
Comments
Please login to add a commentAdd a comment