Jammi tree
-
శమీ వృక్షానికీ, దసరా పండుగకు సంబంధం ఏంటి?
శమీ వృక్షానికీ, విజయదశమి పండుగకూ సన్నిహిత సంబంధం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ‘శమీ’ అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని అదృశ్యంగా శమీవృక్షంలో నిక్షిప్తమై ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. యజ్ఞాల లాంటి పవిత్ర కార్యాలలో జమ్మి కర్రలు మథించి, అగ్ని పుట్టించి, హోమాలు చేస్తారు. శమీవృక్షం ప్రస్తావన రుగ్వేదంలో, అధర్వ వేదంలో కనిపిస్తుంది. ఇక పురాణ ఇతిహాసాలలో సరేసరి. అంటే, అతి ప్రాచీన కాలం నుంచి భారతీయులు శమీవృక్షాన్ని పవిత్రమైన వృక్షాలలో ఒకటిగా భావిస్తూ వస్తున్నారు.ఇక, ‘విజయ’ అంటే శ్రవణా నక్షత్రంలో కలిసివచ్చే దశమి తిథి. ఇలా కలవటం ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షంలో జరుగుతుంది. ఆ ‘విజయ’ దశమి రోజు సర్వదా శుభదినం. అంటే, మీనమేషాలూ, గోచార, గ్రహచారాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి శుభకార్యాలకైనా విజయదశమి మంచి రోజే!విజయదశమి దసరా నవరాత్రులలో ఆఖరి రోజు. చండముండులూ, మహిషాసురుడూ వంటి రాక్షసులందరినీ 9 రోజుల భీషణ యుద్ధంలో సంహరించిన దుర్గాదేవి, విజయదశమి నాడు విజయిగా, అపరాజితగా నిలిచింది. ఈ అపరాజిత రాజాధి రాజులను కూడా శాసించే శ్రీమహారాజ్ఞి కనుక, విజయదశమినాడు దుర్గాదేవిని రాజరాజేశ్వరిగా అలంకరించడం ఆనవాయితీ. విజయ దశమినాడు అపరాజితా పూజ చేయడం ఇక్ష్వాకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శ్రీరాముడు జమ్మి చెట్టును అపరాజితా దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావించి, శమీపూజ ద్వారా దేవి అనుగ్రహం పొంది రావణ సంహారం చేశాడని దేవీ భాగవతం చెబుతోంది. రాజులకు యుద్ధ జయమూ, ఇతరులకు కార్య విజయమూ ఇవ్వగలదు గనక జమ్మి చెట్టు ‘విజయద–శమీ’ వృక్షం. అందుకే ఆబాలగోపాలం విజయదశమి నాడు శమీ పూజ చేసే ఆచారం కొనసాగుతూ వస్తున్నది.చదవండి: దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?పూజ తరవాత అపరాజితా ప్రసాదంగా జమ్మి ఆకులను కోసి తెచ్చుకొని, వాటిని ‘బంగారం’లా దాచుకోవటం, కొన్ని ఆకులను పెద్దల చేతిలో ఉంచి, నమస్కరించి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం, దసరా పూజల సందడిలో భాగం. పనిలో పనిగా, ఆ పరిసరాలలోనే ఎగురుతుండే పాలపిట్టను చూసి, దాని నిసర్గ సౌందర్యాన్ని మెచ్చుకోవటం కూడా శుభకరం అని ఆస్తికుల నమ్మకం. విజయదశమి సందర్భంగా అపరాజితా దేవి ఆశీస్సులు అందరికీ అంది, ఆనందం కలిగించాలని ఆకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?
Vijayadashami: దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులూ, పదవ రోజు విజయ దశమినీ కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చేపండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికీ, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికీ, తరువాత మూడురోజులు సరస్వతీ దేవికీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతు కమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలి చిన సందర్భమే కాక... పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.బ్రహ్మ దేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశ వంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ జన్మించింది. సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహం రూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు మహిషం రూపంలో దేవి చేతిలో హతుడైనాడు.చదవండి: దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం. – దండంరాజు రాంచందర్ రావు -
మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలి: ఇంద్రకరణ్‌రెడ్డి
గచ్చిబౌలి(హైదరాబాద్): మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బొటానికల్ గార్డెన్లో ఆయన జమ్మిచెట్టు నాటి రెండో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జమ్మి వృక్షం పవిత్రమైందని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా ప్రకటించిందని తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతిగ్రామంలోనూ 1.20 లక్షల జమ్మిచెట్లను నాటేందుకు అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయని చెప్పారు. బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా సంతోశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. ఊరూరా జమ్మిచెట్టు–గుడిగుడిలో జమ్మిచెట్టు, వాకర్స్ అసొసియేషన్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
Dussehra: దసరా రోజున ఏం చేయాలి?!
ఒకప్పుడు లోకాలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే మాయావులైన చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులతో రోజుకో రూపంలో పోరాడి సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది ఆది పరాశక్తి. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దేవీ నవరాత్రులు... విజయ దశమి వేడుకలు. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా విజయ దశమి రోజునే. దసరా రోజునే శ్రీరామచంద్రుడు... దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ బల పరాక్రమాలు కలవారే, తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అమాయకులను పీడించడమే వారి పని. ఆయా రాక్షసులకు స్త్రీలంటే చిన్నచూపు. తమ జోలికి వారు రాలేరని, తమనేమీ చేయలేరన్న చులకన భావం. అందుకే పురుషుల చేతిలో ఓడిపోరాదన్న వరాలను పొందారు. అటువంటి లక్షణాలున్న వారిని అణిచి వేయకబోతే అందరి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి దేవి ముందుకు వచ్చింది. అందరి మొరలూ ఆలకించే అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. ఇంట్లో బిడ్డలు కూడా ఏదైనా తప్పు చేసేటప్పుడు అమ్మ వచ్చి దండిస్తుందేమోననే భయంతో ఉంటారు. ఆ సమయంలో అమ్మ మామూలుగా చూసినా, కోపంగా ఉన్నట్లే అనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే. ఆ శత్రువులపై మనమే పోరాటం చేయాలి. విజయం సాధించాలి. మామూలుగా దసరా... దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం... వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. విజయాలకు పునాది విజయదశమి అంటే సకల విజయాలనూ కలగ చేసే దశమి. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. ఈ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభించడం వల్ల నిరాటంకంగా జరుగుతాయని నమ్మకం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. దసరా రోజున ఏం చేయాలి? దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్య మంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఆయుధ పూజ, వాహన పూజ చేయడం, వృత్తిదారులు తమ పనిముట్లను పూజించడం వంటివి మహర్నవమితోపాటు ఈ రోజున కూడా కొందరు చేస్తారు. విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. ఆ శ్లోకంతోపాటు మన కోరికలేమైనా ఉంటే వాటిని చీటీ మీద రాసి జమ్మి కొమ్మకు కట్టాలి. జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణ నమస్కారాలు అయిన తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. ఆడపడచులను ఆదరించడం, తల్లిదండ్రులను గౌరవించడం, శక్తిమేరకు దానధర్మాలు చేయడం ఈ పండుగ విధులలో ఇతర ప్రధానమైన అంశాలు. సమష్టి బలం ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామి నుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధం చేసి విజయం సాధించింది. దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఒక్కరుగా చేయలేని పనిని ఐకమత్యంగా చేయవచ్చని. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ తెలియచేస్తోంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
దసరానాడు జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు?
విజయదశమినాడు శమీవృక్షం అంటే జమ్మిచెట్టును పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇంతకీ జమ్మిచెట్టు ప్రత్యేకత ఏమిటో తెలుసా? అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై దాచి, అజ్ఞాతవా సం పూర్తి అవగానే ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను ధరించారు. అనంతరం శమీవృక్ష రూపాన ఉన్న ’అపరాజిత’దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయ భేరీ మోగించారు. అంతకన్నా ముందు శ్రీ రాముడు కూడా రావణునిపై దండెత్తే ముందు, అనంతరం విజయదశమినాడు విజయం సాధించిన అనంతరం తన నగరానికి బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన జమ్మి చెట్టు వద్ద గల అపరాజితా దేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుకుంటూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని రాసిన చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇళ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం’ అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే ఐక్యతా రాగానికి ప్రతీకగా భావిస్తారు. -
జమ్మిచెట్టును ఊరూరా పెంచండి : రచ్చరవి
పాపన్నపేట(మెదక్): మన రాష్ట్ర వృక్షమైన జమ్మిచెట్టును ఊరురా పెంచాలని జబర్దస్త్ హస్యనటుడు రచ్చరవి కోరాడు. మండలంలోని ఎడుపాయాల నవ దుర్గామాతను మంగళవారం ఆయన దర్శించుకున్నాడు. త్రిదండి చినజీయర్ స్వామి మంగళ శాసనాలతో త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులతో ‘మన జమ్మిచెట్టు’ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మణ్ విష్ణువర్దన్‌రెడ్డికి జమ్మిచెట్టును అందించారు. -
జమ్మిచెట్టు మీద అస్త్రాలు మీకే తగులుతాయి జాగ్రత్త!
బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు సాక్షి, హైదరాబాద్: ‘‘జమ్మిచెట్టుమీద అస్త్రాలున్నాయి, అవి సంధించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కొంతమంది నాయకులు పదే పదే చెబుతున్నారు. కానీ ఆ అస్త్రాలు ప్రయోగించిన వారికే తగులుతాయన్న సత్యం మర్చిపోకండి అంటూ బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు శాసనసభలో పరోక్షంగా టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. మిత్ర ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తున్నామని, దీన్ని అసహాయతగా చూడటం సరికాదని హెచ్చరించారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. దేశంలో ఎక్కడా రైతులను నుంచి 60 రోజుల్లోనే భూములు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు భూసమీకరణలో భాగంగా అతి తక్కువ కాలంలోనే భూములు తీసుకున్న వ్యక్తిగా గిన్నిస్ బుక్‌లో ఎక్కాలి అని విష్ణుకుమార్ రాజు అన్నారు. పట్టిసీమపై చాలా సందేహాలున్నాయని, దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తే బావుంటుందని సూచించారు.