‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు.
‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది.
‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి...
తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి...
పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి...
బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్‌లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’.
విదేశాల్లో బతుకమ్మ ఆడాను
నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.
రెండూ ప్రకృతి పండగలే...
మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.
ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే
నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.
సంబరాలన్నీ జనాలతోనే...
నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.
పూలనే దేవుడిలా పూజిస్తాం
మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.
ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment