tangedu
-
Medicinal Plants: ఔషధ మొక్కకు ఆపద
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గ్రామీణ జన జీవనంతో ముడిపడి ఉన్న అనేక రకాల చెట్లు, ఔషధ మొక్కలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో అడుగుపెట్టగానే ఎన్నో రకాల చెట్లు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధానంగా మారేడు, బ్రహ్మజెముడు, నాగజెముడు, ఉమ్మెంత, ఉత్తరేని, జిల్లెడు, తిప్పతీగె, కలమంద వంటి ఔషధ మొక్కలు ఎక్కడా కనిపించడం లేదు. చెలకల్లో తంగేడు, గునుగు పూల చెట్లు ఎక్కువగా ఉండేవి. చేను చుట్టూరా కంప చెట్లు, వాయిలాకు చెట్లు ఉండేవి. చాలా గ్రామాల్లో ఇప్పుడవి లేవు. ఇళ్ల ముందర వేప చెట్లు, పెరట్లో చింత చెట్లు ఉండేవి. ఊరి నడుమ వివిధ రకాల పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. ఆలయాల దగ్గర రావి, ఉసిరి, మారేడు (పత్రి) చెట్లు కనిపించేవి. అయితే పల్లెలకు ఆధునికత చొచ్చుకు వచ్చిన తర్వాత పెంకుటిళ్లు, పూరి గుడిసెల స్థానంలో బంగళాలు నిర్మించారు. వాటిని నిర్మించే క్రమంలో చాలా ఇళ్ల ఎదుట ఉన్న వేప చెట్లు, చింత చెట్లు నరికివేశారు. కొత్తగా నాటే విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కొత్త తరానికి ఔషధ మొక్కల ప్రాధాన్యం కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. తంగేడు దొరకని పరిస్థితి...చెలకల వద్ద, అటవీ ప్రాంతంలో విరివిగా లభించే తంగేడు పువ్వు ఇప్పుడు గగనమైంది. చాలా గ్రామాల్లో తంగేటు చెట్లు కనిపించడం లేదు. దీంతో బతుకమ్మ పేర్చడానికి తంగేడు పువ్వు దొరకడం లేదు. అక్కడక్కడ తంగేడు మిగిలి ఉన్నా, చాలా ప్రాంతాల్లో తంగేడు చెట్లు కనుమరుగయ్యాయి. మక్క, పత్తి చేలల్లో గునుగు పూల చెట్లు విపరీతంగా మొలిచేవి. బతుకమ్మ సీజన్లో జనం వెళ్లి కోసుకుని వచ్చేవారు. వ్యవసాయంలో వచ్చిన మార్పుల కారణంగా విత్తనం వేసేటపుడే కలుపు నివారణ మందులు పిచికారీ చేయడం, మొలకలు వచి్చన తర్వాత కూడా కలుపు నివారణ మందులు పిచికారీ చేయడంలో గునుగు దొరకడం లేదు. గునుగు పువ్వును ఔషధ మొక్కగా గుర్తిస్తారు. పసరికలు అయిన వారికి ఆరబెట్టిన గునుగు పువ్వును చూర్ణం చేసి మందు బిల్లలుగా మింగిస్తే తగ్గిపోతుందని చెబుతారు. అంత గొప్ప ఔషధ గుణాలున్న గునుగు పూల చెట్లు రానురాను తగ్గిపోతున్నాయి. కనిపించని నాగజెముడు, బ్రహ్మజెముడుఊళ్లల్లో చాలా చోట్ల బ్రహ్మజెముడు, నాగజెముడు చెట్లు కనిపిస్తాయి. దళసరిగా ఉండే ఆకులపై ముళ్లు ఉండే ఈ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని చెబుతారు. బ్రహ్మజెముడు పండ్లలో మంచి పోషకాలుంటాయని, డ్రాగన్ ఫ్రూట్ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా బీ12, ఏ, సీ విటమిన్లు అందులో ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే చాలా చోట్ల బ్రహ్మజెముడు మొక్కలు కానరావడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణతో చేల వద్ద పెద్దపెద్ద చెట్లను జేసీబీలతో తొలగించి పొలం మడుగులు చేయడం మూలంగా బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి చెట్లు కనుమరుగయ్యాయి. ఉమ్మెత్త లేదు.. ఉత్తరేణి దొరకదు చర్మ సమస్యలు, పైత్యం వేడి, దురద, గడ్డలు, దగ్గు, దమ్ము, ఆయాసం వంటి వాటికి ఉమ్మెత్త ఆకులను కాల్చి దాని నుంచి వెలుబడే పొగను పీల్చడం వల్ల ఆయా సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఉమ్మెత్త మొక్కలు ఎలా గుంటాయో కూడా నేటి తరానికి తెలియడం లేదు. ఉత్తరేణి ఆకులను పూజల్లో వాడుతారు. ఉత్తరేణి మంచి ఔషధ మొక్క. ఉత్తరేణి వేర్లతో పళ్లు తోముకుంటే ధృడంగా తయారవుతాయని చెబుతారు. ఉత్తరేణి ఆకుల రసంతో నొప్పులు, పంటినొప్పి కూడా తగ్గించొచ్చని పేర్కొంటున్నారు. ఊళ్లల్లో ఇప్పుడు ఉమ్మెత్త మొక్కలు కనిపించడం లేదు. ఆఖరుకు ఉత్తరేణి కూడా దొరకడం అరుదుగా మారింది.జిల్లేడు, తిప్పతీగ కూడా...చాలామంది ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు జిల్లేడు ఆకులను వాడుతారు. ఆకులను దంచి దాని రసాన్ని గాయాలపై రుద్దితే గాయాలు త్వరగా మానుతాయని, ఉబ్బులు తగ్గుతాయని చెబుతుంటారు. జిల్లెడు ఆకు తెంపి దాని నుంచి కారే పాల చుక్కలను నొప్పి ఉన్న చోట పెట్టడంతో నొప్పులు తగ్గుతాయని విశ్వసిస్తారు. మరిన్ని సమస్యలకూ జిల్లెడును వాడుతారు. కీళ్ల సమస్యలు ఉన్న వారు తిప్పతీగను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగుతుంటారు. తిప్పతీగ చాలా రకరాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధిగా చెబుతుంటారు. ఆర్థరైటీస్ సమస్యలకు బాగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు పల్లెల్లో తిప్పతీగలే కాదు జిల్లెడు కూడా కనిపించడం లేదు. -
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
తంగేడు చెట్టుకు తాళాలు
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామ సమీపంలో ఉన్న తంగేడు చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు వేశారు. అక్కడే తాళంచెవిలు సైతం పడేశారు. గొర్రెల కాపరులు గమనించి గ్రామస్తులకు విషయం చెప్పడంతో గ్రామానికి అరిష్టం తలపెట్టేందుకే ఇలా చేశారని పలువురు అనుకుంటున్నారు. కాగా విషయం పోలీసులకు తెలవడంతో పోకిరిలు చేసిన పని అని మూఢనమ్మకాలను నమ్మొద్దని స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఐకేపీ గోదాం పక్కనగల సాగుభూమిలో గుర్తుతెలియని వ్యక్తులు తంగెడు చెట్టు కొమ్మలకు అయిదు తాళాలు వేశారు. సుమారు పక్షం రోజుల క్రితం వేసినట్లు ఉన్నాయి. తాళం చెవులను సైతం అక్కడే వదిలేశారు. కాగా రెండో రోజుల క్రితం గ్రామానికి చెందిన మేకల కాపర్లు గమనించి విషయం గ్రామస్తులకు తెలిపారు. దీంతో విషయం తెలియడంతో పలువురు గ్రామస్తులు వెళ్లి పరిశీలించి వచ్చారు. గ్రామానికి అరిష్టం తలపెట్టేందుకు ఇలా చేశారంటున్నారు. విషయం ఎస్ఐ శ్రీనివాస్‌కు తెలవడంతో సంఘటన స్థలానికి వెల్లి తంగేడు చెట్టును పరిశీలించారు. ఆందోళన చెందవద్దు... మూఢ నమ్మకాలు నమ్మొద్దని ఇలాంటివి పట్టించుకుని ఆందోళన చెందవద్దని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పనిలేని వ్యక్తులు చేసే పనులవల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడవద్దన్నారు. మంత్రాలు, తంత్రాలు లేవన్నారు. తాళం వేసిన వ్యక్తుల గురించి విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం తంగెడు చెట్టుకు వేసిన తాళాలను తొలగించి చెట్టుకొమ్మలను విరిచేశారు. -
మాజీ మంత్రి ‘భాట్టం’ కన్నుమూత
* అనారోగ్యంతో విశాఖలో మృతి * పలువురు ప్రముఖుల సంతాపం సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి (89) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 మే 12న జన్మించారు. భారత సోషలిస్టు పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1957లో ఆ పార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 16 ఏళ్ల పాటు ఏఐసీసీ సభ్యునిగా కొనసాగారు. 1962 నుంచి 1981 వరకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. విద్య, సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమం, సాంకేతిక విద్య, హరిజన, గిరిజన సంక్షేమం, యువజన సర్వీసులు, దేవాదాయ, ప్రత్యేక ఉపాధి పథకాలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1984లో టీడీపీ తరఫున విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను అధిరోహించిన ఆయన వివాదరహితునిగా పేరొందారు. చాన్నాళ్లుగా భాట్టం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తొలినాళ్లలో శ్రీరామ్మూర్తి జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1947-48లో జయభారత్ మ్యాగ్జీన్కు ఉప సంపాదకునిగా, 1969 నుంచి కొన్నేళ్లు ప్రజారథం వారపత్రిక, ఆంధ్ర జనతా (హైదరాబాద్ నుంచి వెలువడే) దినపత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. స్వేచ్ఛా భారత్ పేరుతో స్వీయ చరిత్రతో పాటు తెలుగులో నాలుగు పుస్తకాలు రాశారు. సాంస్కృతిక రంగంలో చేసిన కృషిని గుర్తించి 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాట్టంకు కళారత్న పురస్కారాన్ని అందజేసింది. సోమవారం సాయంత్రం శ్రీరామ్మూర్తికి విశాఖ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భాట్టం మృతికి సీఎం చంద్రబాబు , జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, రాష్ట్ర మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి మృతికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన భాట్టం సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉండటమే కాక, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన సంప్రదాయాలను నెలకొల్పారని జగన్ కొనియాడారు. భాట్టం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
బహుముఖ ప్రజ్ఞకు దర్పణం
ఈతరం ప్రజా ప్రతినిధులకు మార్గదర్శకుడు భాట్టం విశాఖపట్నం/మహారాణిపేట :దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. వాటి పరిష్కారానికి చట్టసభల్లో గళమెత్తి వాటి పరిష్కారానికి కృషి చేశారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరం ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలిచారు.. భాట్టం శ్రీరామ్మూర్తి! తన క్రియాశీలత, రాజకీయ చతురత, ప్రతిభతో నలుగురు ముఖ్యమంత్రుల (పీవీ నరసింహారావు, టి. అంజయ్య, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి) మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇరవయ్యేళ్ల పాటు అమాత్య పదవుల్లో కొనసాగారు. తొలినాళ్లలో విశాఖపట్నం జిల్లాలోనే కొనసాగుతున్న విజయనగరం జిల్లాలో అక్కడ రాజులు, విశాఖ జిల్లాలో ఆధిపత్యంలో ఉన్న తంగేడు రాజుల ప్రాబల్యాన్ని తట్టుకుని నిలబడగలిగారు. పాతికేళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయనకు 1984లో అనూహ్యంగా అప్పటి సీఎం ఎన్టీఆర్ విశాఖ ఎంపీ సీటిచ్చారు. లోక్‌సభలో అడుగుపెట్టాక ఆయన విశాఖకు సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. అప్పటికే విశాఖను పట్టిపీడిస్తున్న పరిశ్రమల కాలుష్య భూతంపై సమగ్ర సమాచారంతో 1985 ఫిబ్రవరిలోనే ప్రధాని రాజీవ్‌గాంధీ దృష్టికి తెచ్చారు. ఉక్కు నిర్వాసితులకు ఉపాధి, అల్యూమినా ప్లాంటు ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు, ఏలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకు క్లియరెన్స్, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్పెషల్ గ్రాంటు తదితర అంశాలపై లోక్‌సభలో తన వాణి వినిపించారు. దశాబ్దన్నర కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భాట్టానికి సత్యసాయిబాబాపై అమితమైన భక్తిభావం. అందుకే ఆయన కొన్నేళ్ల పాటు ఆయన సన్నిధిలోనే గడిపారు. రచనలంటే ఇష్టం.. శ్రీరామ్మూర్తికి రచనలంటే ఇష్టం. తొలినాళ్లలో పత్రికా ఉప సంపాదకునిగా, సంపాదకునిగాను పనిచేశారు. తెలుగులో నాలుగు పుస్తకాలు కూడా రాశారు. స్వేచ్ఛాభారతం పేరిట స్వీయ చరిత్రను, మైసెల్ఫ్ ఇన్ పార్లమెంట్ పేరుతో ఇంగ్లిష్ పుస్తకాలను ప్రచురించారు. కులాంతర వివాహం.. సోషలిస్టు భావాలున్న శ్రీరామ్మూర్తి కులాంతర వివాహం చేసుకున్నారు. తాను విజయనగరంలో కాలేజి చైర్మన్ పదవికి పోటీ పడుతున్న సమయంలో క్లాస్మేట్ సత్యవతిని ఇష్టపడ్డారు. కొన్నాళ్ల తర్వాత రాజమండ్రిలో ఆమెను ఆదర్శ వివాహమాడానని తాను రచించిన స్వేచ్ఛాభారతంలో రాశారు. అయితే ఏడాదిన్నర క్రితమే ఆయనను విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. కుమారుడి వద్ద ఉంటున్న ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం కన్నుమూసి తాను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామి వద్దకు పయనమయ్యారు. ప్రముఖుల నివాళులు శ్రీరామ్మూర్తి మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు పాండురంగాపురంలోని ఆయన స్వగృహానికి చేరుకుని ఆయన పార్ధివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ శర్మ, ఎమ్మెల్యేలు పెతకంశెట్టి గణబాబు, పీలా గోవింద సత్యన్నారాయణ, బండారు సత్యనారాయణ మూర్తి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు మళ్ల విజయ్‌ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, నగర యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్, మాజీ ఎంపీలు కొణతాల రామకృష్ణ, సబ్బంహరి, మాజీ మేయర్ రాజాన రమణి భాట్టంకు నివాళులు అర్పించారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్.అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, సీపీఐ నేతలు పైడిరాజు, వామనమూర్తి, తదితరులు భాట్టం మృతికి సంతాపం తెలిపారు. సత్యసాయి సేవలో... ఎంవీపీకాలనీ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి భాట్టం శ్రీరాంమూర్తి మృతి భారతదేశానికి తీరనిలోటు అని శ్రీసత్యసాయిసేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జె.చలం అన్నారు. ఎంవీపీ కాలనీలోని సత్యసాయిసేవ సదన్‌లోని సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో అయన మాట్లాడుతూ బాబా ఆలోచనలతో పేదలకు సేవ చేశామన్నారు. భాట్టం 50 సంవత్సరాలుగా బాబా భక్తునిగా ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో ఎంతో ఎదిగి, ప్రజలకు సేవ చేసి ఆధ్యాత్మిక జీవితం కొనసాగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.ఆర్. నాగేశ్వరరావు, నగర కన్వీనర్ పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు పాల్గొన్నారు. -
పాలపిట్ట.. తంగేడు పువ్వు
తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి, పుష్పం ఖరారు రాష్ట్ర జంతువు జింక.. వృక్షం జమ్మిచెట్టు ఈ చిహ్నాలకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర జంతువుగా జింక , రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడును ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో అధికార చిహ్నాలపై పలు ప్రతిపాదనలు వచ్చినా.. వాటిని కాదని తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు, అలవాట్లకు అద్దంపడుతూ, చరిత్ర, పౌరాణిక నేపథ్యం ఉన్న వాటిని ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఉన్న అధికారిక చిహ్నాలు ఆంధ్ర కోణం నుంచి ఎంపిక చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘జింకకు భారతదేశంలో ప్రముఖ స్థానం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జింకలు ఉన్నాయి. చిన్నచిన్న అడవుల్లోనూ అవి మనుగడ సాగిస్తాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైన, అమాయకమైనదిగా జింకకు పేరుంది. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని జింకను ఎంపిక చేశాం’’ అని సీఎం వివరించారు. పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకంగా ప్రజలు భావిస్తారని, లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని వివరించారు. రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసినట్లు సీఎం పేర్కొన్నారు. జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమని చెప్పారు. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారని, తర్వాత వాటితోనే కౌరవులను ఓడించారన్నారు. విజయానికి సూచిక అయిన జమ్మిచెట్టు ఆశీర్వాదం ఇప్పుడు తెలంగాణకు కావాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అడవిలో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు పూవు ప్రకృతికే అందాన్ని తెస్తుందని, ఈ పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ అడపడుచులు భావిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి తంగేడు పూవును అధికారిక పుష్పంగా నిర్ణయించుకున్నట్లు వివరించారు.