కనుమరుగవుతున్న పల్లె నేస్తాలు
ప్రకృతి సిద్ధంగా లభించేవన్నీ మటుమాయం
భవిష్యత్ తరాలు గూగుల్‌లో చూసుకోవాల్సిందే..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గ్రామీణ జన జీవనంతో ముడిపడి ఉన్న అనేక రకాల చెట్లు, ఔషధ మొక్కలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో అడుగుపెట్టగానే ఎన్నో రకాల చెట్లు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధానంగా మారేడు, బ్రహ్మజెముడు, నాగజెముడు, ఉమ్మెంత, ఉత్తరేని, జిల్లెడు, తిప్పతీగె, కలమంద వంటి ఔషధ మొక్కలు ఎక్కడా కనిపించడం లేదు. చెలకల్లో తంగేడు, గునుగు పూల చెట్లు ఎక్కువగా ఉండేవి. చేను చుట్టూరా కంప చెట్లు, వాయిలాకు చెట్లు ఉండేవి. చాలా గ్రామాల్లో ఇప్పుడవి లేవు. ఇళ్ల ముందర వేప చెట్లు, పెరట్లో చింత చెట్లు ఉండేవి. ఊరి నడుమ వివిధ రకాల పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. ఆలయాల దగ్గర రావి, ఉసిరి, మారేడు (పత్రి) చెట్లు కనిపించేవి. అయితే పల్లెలకు ఆధునికత చొచ్చుకు వచ్చిన తర్వాత పెంకుటిళ్లు, పూరి గుడిసెల స్థానంలో బంగళాలు నిర్మించారు. వాటిని నిర్మించే క్రమంలో చాలా ఇళ్ల ఎదుట ఉన్న వేప చెట్లు, చింత చెట్లు నరికివేశారు. కొత్తగా నాటే విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కొత్త తరానికి ఔషధ మొక్కల ప్రాధాన్యం కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.
తంగేడు దొరకని పరిస్థితి...
చెలకల వద్ద, అటవీ ప్రాంతంలో విరివిగా లభించే తంగేడు పువ్వు ఇప్పుడు గగనమైంది. చాలా గ్రామాల్లో తంగేటు చెట్లు కనిపించడం లేదు. దీంతో బతుకమ్మ పేర్చడానికి తంగేడు పువ్వు దొరకడం లేదు. అక్కడక్కడ తంగేడు మిగిలి ఉన్నా, చాలా ప్రాంతాల్లో తంగేడు చెట్లు కనుమరుగయ్యాయి. మక్క, పత్తి చేలల్లో గునుగు పూల చెట్లు విపరీతంగా మొలిచేవి. బతుకమ్మ సీజన్‌లో జనం వెళ్లి కోసుకుని వచ్చేవారు. వ్యవసాయంలో వచ్చిన మార్పుల కారణంగా విత్తనం వేసేటపుడే కలుపు నివారణ మందులు పిచికారీ చేయడం, మొలకలు వచి్చన తర్వాత కూడా కలుపు నివారణ మందులు పిచికారీ చేయడంలో గునుగు దొరకడం లేదు. గునుగు పువ్వును ఔషధ మొక్కగా గుర్తిస్తారు. పసరికలు అయిన వారికి ఆరబెట్టిన గునుగు పువ్వును చూర్ణం చేసి మందు బిల్లలుగా మింగిస్తే తగ్గిపోతుందని చెబుతారు. అంత గొప్ప ఔషధ గుణాలున్న గునుగు పూల చెట్లు రానురాను తగ్గిపోతున్నాయి.
కనిపించని నాగజెముడు, బ్రహ్మజెముడు
ఊళ్లల్లో చాలా చోట్ల బ్రహ్మజెముడు, నాగజెముడు చెట్లు కనిపిస్తాయి. దళసరిగా ఉండే ఆకులపై ముళ్లు ఉండే ఈ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని చెబుతారు. బ్రహ్మజెముడు పండ్లలో మంచి పోషకాలుంటాయని, డ్రాగన్ ఫ్రూట్ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా బీ12, ఏ, సీ విటమిన్లు అందులో ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే చాలా చోట్ల బ్రహ్మజెముడు మొక్కలు కానరావడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణతో చేల వద్ద పెద్దపెద్ద చెట్లను జేసీబీలతో తొలగించి పొలం మడుగులు చేయడం మూలంగా బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి చెట్లు కనుమరుగయ్యాయి.
ఉమ్మెత్త లేదు.. ఉత్తరేణి దొరకదు
చర్మ సమస్యలు, పైత్యం వేడి, దురద, గడ్డలు, దగ్గు, దమ్ము, ఆయాసం వంటి వాటికి ఉమ్మెత్త ఆకులను కాల్చి దాని నుంచి వెలుబడే పొగను పీల్చడం వల్ల ఆయా సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఉమ్మెత్త మొక్కలు ఎలా గుంటాయో కూడా నేటి తరానికి తెలియడం లేదు. ఉత్తరేణి ఆకులను పూజల్లో వాడుతారు. ఉత్తరేణి మంచి ఔషధ మొక్క. ఉత్తరేణి వేర్లతో పళ్లు తోముకుంటే ధృడంగా తయారవుతాయని చెబుతారు. ఉత్తరేణి ఆకుల రసంతో నొప్పులు, పంటినొప్పి కూడా తగ్గించొచ్చని పేర్కొంటున్నారు. ఊళ్లల్లో ఇప్పుడు ఉమ్మెత్త మొక్కలు కనిపించడం లేదు. ఆఖరుకు ఉత్తరేణి కూడా దొరకడం అరుదుగా మారింది.
జిల్లేడు, తిప్పతీగ కూడా...
చాలామంది ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు జిల్లేడు ఆకులను వాడుతారు. ఆకులను దంచి దాని రసాన్ని గాయాలపై రుద్దితే గాయాలు త్వరగా మానుతాయని, ఉబ్బులు తగ్గుతాయని చెబుతుంటారు. జిల్లెడు ఆకు తెంపి దాని నుంచి కారే పాల చుక్కలను నొప్పి ఉన్న చోట పెట్టడంతో నొప్పులు తగ్గుతాయని విశ్వసిస్తారు. మరిన్ని సమస్యలకూ జిల్లెడును వాడుతారు. కీళ్ల సమస్యలు ఉన్న వారు తిప్పతీగను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగుతుంటారు. తిప్పతీగ చాలా రకరాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధిగా చెబుతుంటారు. ఆర్థరైటీస్ సమస్యలకు బాగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు పల్లెల్లో తిప్పతీగలే కాదు జిల్లెడు కూడా కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment