
తెలంగాణా పల్లెపల్లెల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. రంగు రంగుల పూలతో అత్యంత సుందరంగా బతుకమ్మలను పేర్చి తెలంగాణా ఆడబిడ్డలు సంప్రదాయ దుస్తుల్లో గౌరమ్మను కొలుస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం బతుకమ్మ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో పూల పండుగను జరుపుకుంటున్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుతారు. నాలుగో (అక్టోబరు 5,శనివారం) రోజు బతుకమ్మ ‘నానేబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. గౌరమ్మను తయారు చేసి, గుమ్మడి తంగేడు, బంతి, గునుగు లాంటి రకరకాల పూలతో అలంకరిస్తారు. గౌరమ్మకు ఈరోజు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతోకలిపి ముద్దలు చేసి పెడతారు. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని ఆనందంగా అందరూ పంచుకుని తింటారు.
కాగా తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment