Bathukamma 9 Days
-
Bathukamma 2024 నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ స్పెషల్
తెలంగాణా పల్లెపల్లెల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. రంగు రంగుల పూలతో అత్యంత సుందరంగా బతుకమ్మలను పేర్చి తెలంగాణా ఆడబిడ్డలు సంప్రదాయ దుస్తుల్లో గౌరమ్మను కొలుస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం బతుకమ్మ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో పూల పండుగను జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుతారు. నాలుగో (అక్టోబరు 5,శనివారం) రోజు బతుకమ్మ ‘నానేబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. గౌరమ్మను తయారు చేసి, గుమ్మడి తంగేడు, బంతి, గునుగు లాంటి రకరకాల పూలతో అలంకరిస్తారు. గౌరమ్మకు ఈరోజు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతోకలిపి ముద్దలు చేసి పెడతారు. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని ఆనందంగా అందరూ పంచుకుని తింటారు.కాగా తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. -
Bathukamma 2024: పూల పండుగ బతుకమ్మ..సంబురాలు లోడింగ్
తెలంగాణా ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటుభక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. రంగుల రంగుల పూలతో తెలంగాణా పల్లెలు కళ కళలాడుతాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ లాంటి ఆటపాటలతో సందడి నెలకొంటుంది. దీంతో ఇప్పటికే తెలంగాణా ఆడబిడ్డలు సంబరాలకు రెడీ అయిపోతున్నారు.పండుగ సంబురాలు ఎపుడు మొదలు2024లో భాద్రపద అమావాస్య అక్టోబరు 2 బుధవారం రోజు వచ్చింది. ఇలా ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు అత్యంగా ఉత్సాహంగా సాగుతాయి అక్టోబరు 10న సద్దుల బతుకమ్మ వేడుకతో ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగుస్తాయి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ, గునుగు పూలు, బంతి, చేమంతి, తంగేడు, కట్ల, సీతమ్మవారి జడ, గుమ్మడి పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ తొమ్మిది రోజులు పాటు, పలు నైవేద్యాలతో కులం, మతం, చిన్నా పెద్ద, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ. తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలుఅక్టోబరు 2 తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మనాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మతొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆఖరి రోజైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను పూజించి, అందంగా ముస్తామైన ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంగా బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆడి పాడితారు. గౌరమ్మకు నైవేద్యాలు సమర్పిస్తారు. బతుకమ్మను చివరకు గంగమ్మ చెంతకు చేరుస్తారు.దీంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. -
Batukamma: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!
ఎక్కడా లేనట్లుగా పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నాం. ఎంతో విశిష్టత ఉన్న ఈ వేడుకల్లో తొమ్మిదిరోజులపాటు ఆడబిడ్డలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పొద్దున్నే లేచి తీరొక్క పూలను సేకరిస్తున్నారు. అందంగా బతుకమ్మలను పేర్చి సాయంత్రం అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతున్నారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పటి బతుకమ్మ ఆటాపాట తీరుపై పలువురు మహిళలు అసంతృప్తి వ్యక్తంజేస్తున్నారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అప్పటి, ఇప్పటి బతుకమ్మ వేడుకల నిర్వహణపై పలువురు మహిళలు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. చదవండి: బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్ అప్పట్లోనే బాగా ఆడేవాళ్లం కోటపల్లి: బతుకమ్మ పండుగత్తే మా చిన్నతనంలో ఎంతో సంబురపడేటోళ్లం. మాకన్న పెద్దోళ్లు ఆడుతుంటే వాళ్ల అడుగులో అడుగేసి వారి లెక్కే ఆడెటోళ్లం. నడుము వంచి చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడేవాళ్లం. ఇప్పటోళ్లకు డీజే పాటల మీద డ్యాన్సుల చేసుడు తప్ప చప్పట్లు కొడుతూ ఆడుడు తెల్వది. పాటలు పాడుతలేరు. చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతూ సంస్కృతిని కాపాడుకోవాలె. – కావిరి సుగుణ, రొయ్యలపల్లి, కోటపల్లి మండలం పెద్దవాళ్ల నుంచి నేర్చుకున్న.. చెన్నూర్: చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, అమ్మ బతుకమ్మ పాటలు పాడడం గమనించిన. నాకూ పాటలు అంటే ఇష్టం. ప్రతీ బతుకమ్మ పండుగకు పాటలు పాడడం చెప్పలేనంత సంతోషాన్నిస్తోంది. పండుగ వచ్చిందంటే కొత్తకొత్త పాటలు నేర్చుకొని తొమ్మిది రోజులు పాడేదాన్ని. బతుకమ్మ అంటేనే చప్పట్లు కొడుతూ పాడుతూ ఆడేది. బతుకమ్మ ఆటను అప్పట్లాగే ఆడితేనే బాగుంటది. – మదాసు శృతి, చెన్నూర్ పిచ్చి పాటలు.. పిచ్చి డ్యాన్స్‌లు.. కాసిపేట: ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా అప్పట్లో ఎంతో సంబురంగా చప్పట్లు కొడుతూ స్వయంగా పాటలు పాడెటోళ్లం. 40 ఏళ్లుగా మా ఊళ్లో నేను పాటలు పాడుతుంటే మిగతావాళ్లు పాడేది. ప్రస్తుతం ఏడ జూసినా సౌండ్ బాక్స్‌లు, డీజేలల్ల పిచ్చి పాటలు పెట్టి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తున్నరు. ఇది మన సంస్కృతి కాదని అందరూ తెలుసుకుంటే మంచిది. – సాయిని మల్లక్క, కోమటిచేను, కాసిపేట మండలం పాటలు పాడుతూ ఆడుతాం చెన్నూర్‌రూరల్: నేను బతుకమ్మ పాటలు పుస్తకంలో చూసి నేర్చుకొన్న. నా చిన్నతనం నుంచి బతుకమ్మ వద్ద పాటలు పాడుతున్న. మా వాడకు బతుకమ్మ ఆడేటప్పుడు చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతున్నం. ఊళ్లో చాలాచోట గిట్లనే ఆడుతున్నరు. నాకు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం. చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడి మన సంస్కృతిని కాపాడుకోవాలె. – గద్దె శ్రీలత, పొక్కూరు, చెన్నూర్ డీజే సౌండ్లు తప్ప చప్పట్లు లేవు కాసిపేట: బతుకమ్మ వేడుకలు మొదలైనయంటే తొమ్మిది రోజులు ఊళ్లో పండుగ వాతావరణం కనిపించేది. ఒకరు పాటందుకుంటే మిగతా వాళ్లు అనుకరించెటోళ్లు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆనందంగా ఆడుకునెటోళ్లం. ఇప్పుడు డీజే సౌండ్లు, డ్యాన్స్‌లు తప్పా చప్పట్లు వినిపించడంలేదు. యువత పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాలె. – బూసి రాజేశ్వరి, సోమగూడం, కాసిపేట మండలం ఇప్పుడు పాడెటోళ్లే లేరు లక్సెట్టిపేట: చిన్నప్పుడు బతుకమ్మ పాటలు పాడుతూ సంబురంగా బతుకమ్మ పండుగను జరుపుకొనేటోళ్లం. బతుకమ్మ వచ్చిందంటే చాలు సంబురంగా పాటలు పాడేదాన్ని. ఇప్పుడు పాటలు పాడేవాళ్లే లేరు. డీజే పాటలు పెట్టుకుని ఆడుతున్నరు. రోజురోజుకూ ఆట తీరే మారుతున్నది. బాధనిపిస్తుంది. సంప్రాదాయాన్ని కాపాడుకోవాలె. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకోవాలె. – లింగాల దేవక్క, గంపలపల్లి, లక్సెట్టిపేట మండలం ఎంతో ఇష్టపడి పాటలు పాడుతా భీమారం: బతుకమ్మ పండుగ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతీ సంవత్సరం పండుగ వచ్చిందంటే చాలు ఉదయాన్నే మాఇంట్లో లేని పూలను ఇంటింటికీ వెళ్లి సేకరించి బతుకమ్మను పేరుస్తా. డీజే పాటలు పెట్టినా నన్నే పాడుమంటరు. నేను పాడితే మిగతావాళ్లు సంబురంగా పాడుతున్నరు. మా ఊళ్లో ఎంతో ఇష్టంగా తొమ్మిదిరోజుల పాటు సంబురాలు జరుపుకొంటున్నం. – ఎల్కటూరి శంకరమ్మ, భీమారం మండలం ఇప్పటోళ్లకు ఆడుడే రాదు జన్నారం: నాడు సాయంత్రం బతుకమ్మ ఆట మొదలువెట్టి గంటలతరబడి ఆడుకునేది. వాడోళ్లందరం చప్పట్లు కొడుతూ పాటలు పాడెటోళ్లం. ఎంతో భక్తిశ్రద్ధలతో తొమ్మిదిరోజులు పండుగ జరుపుకొనేది. ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే పాటలు పెట్టుకుని ఎగురుతున్నరు. బతుకమ్మల చుట్టూ కోలలాడుతున్నరు. బతుకమ్మ ఆటనే మార్చిండ్రు. ఇప్పటోళ్లకు ఎగురుడు తప్ప ఆడుడు రాదు. – అమరగొండ లక్ష్మి, జన్నారం మండలం మా అప్పుడు డీజేల లొల్లి లేదు లక్ష్మణచాంద: అప్పట్లో మేం బతుకమ్మ ఆడేటప్పుడు గీ డీజేల లొల్లి లేదు. అచ్చమైన బతుకమ్మ పాటలు పాడెటోళ్లం. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పుట్లు కొడుతూ ఒకరు ముందు పాడితే వెనుక అందరం పాడేది. ‘రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ రాగమెత్తితే ఆ జోష్ వేరేలా ఉండేది. ఇప్పటోళ్లకు అప్పటిలెక్క ఆడుడే రాదు. తెల్వనోళ్లు నేర్చుకుని ఆడాలె. – ఎంకవ్వ, లక్ష్మణచాంద సంప్రదాయాలను కాపాడుకోవాలె భీమిని: పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపైన ఉంది. పూలను దేవతగా పూజించే పండుగ మరెక్కడా లేదు. సంప్రదాయం ప్రకారం బతుకమ్మ ఆడాలి. నాడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుకునేవాళ్లం. నేడు డీజే సౌండ్ల మధ్య జరుపుతున్నారు. ఆనాటి సంప్రదాయాలను కాపాడుకోవాలె. – పుల్లూరి సురేఖ, కన్నెపల్లి, భీమిని మండలం అప్పటి ఆట పిల్లలకు నేర్పిస్తున్న భైంసాటౌన్: నేటి తరం పిల్లల కు మన అప్పటి బతుకమ్మ ఆట గురించి తెలియదు. పిల్లలకు వివరించేందుకు తల్లిదండ్రులకూ సమయం ఉండడం లేదు. నేను భరత నాట్యం నేర్చుకుని ఇప్పటి పిల్లలకు నేర్పుతున్న. బతుకమ్మ పండుగ అంటే డీజే పెట్టుకుని డ్యాన్సులు చేయడం కాదని వారికి వివరిస్తున్న. దీంతో వారిలో మార్పు వస్తోంది. కొందరైనా నన్ను అనుసరించడం సంతోషంగా ఉంది. – రంగు సౌమ్య, నృత్య శిక్షకురాలు, భైంసా -
తొమ్మిది రోజులు.. 9 రకాలుగా.. విను వీధులు.. విరివనాలు
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్ కల్చరల్: ఎగిలివారంగ తొలిమంచు కురవంగా.. ఆ.. మంచు బిందువులతో గౌరమ్మ మురవంగా.. చలికి వణుకుతున్న చేతులతో గౌరమ్మను తెంపంగా.. తోడుగా రంగురంగుల పూలను కోయంగా.. కోసిన పూలను ఒక్కచోట చేర్చిన ఆడపడుచు.. పేర్చేను ఎంగిలిపూల బతుకమ్మను సంబరంగా.. ఆడబిడ్డలు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ.. బతుకమ్మ అంటూ.. ఆడిపాడేను ఉత్సాహంగా.. నేటి నుంచి బతుకమ్మ సంబరాల సందర్భంగా కథనం..!! చదవండి: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా? నిండిన చెరువులు, పండిన పంటలు, రాలిన చినుకులతో అలుకుపూత చేసుకుందా అన్నట్లు కనిపించే అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా కనిపించే సమయమే.. బతుకమ్మ సంబరానికి ప్రారంభం. అతివల హర్షం ఆకాశాన్ని తాకేలా బతుకమ్మ తన వైభవాన్ని చాటుతోంది. మహాలయ అమావాస్య నుంచి నవమి వరకు పూలతో బతుకమ్మను కొలవడం అనూచానంగా వస్తోంది. ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబరాలు ఆదివారంతో ప్రారంభం అవుతున్నాయి. తంగేడు, బంతి, గునుగు, చేమంతి, రుద్రాక్ష, కట్లపూలు, పట్టు కుచ్చులు, సీతమ్మ జడ వంటి పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. పట్ట ణాలు, పల్లెలనే తారతమ్యం లేకుండా వీధులన్నీ విరులవనాలుగా మారుతాయి. ఆదివారం సాయంత్రం ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. పాటల్లో పల్లె జీవితాలు బతుకమ్మ ఆరాధనలో పాటల పాత్ర ప్రత్యేకమైంది. అమ్మ ఆరాధనను స్ఫురించే పాటలతో పాటు తెలంగాణ పల్లె ప్రజల జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. శ్రామిక సౌందర్యాన్ని ప్రతిబింబించేవి కొన్నయితే, కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు అత్తవారింటి ఆదరాభిమానాలు, కుటుంబాల్లోని కలతలు, జీవితాల్లోని సంఘర్షణలను మరికొన్ని చాటుతాయి. విభిన్నం.. ఉమ్మడి జిల్లా బతుకమ్మ ఉమ్మడి జిల్లాలో విభిన్న సంస్కృతుల కారణంగా బతుకమ్మవేడుకను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవాయితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావిలాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుకమ్మ అనంతరం బావిని పూడ్చుతారు. పూల కొరత.. మార్కెట్ సందడి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల కొరత ఏర్పడింది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో బీళ్లుగా లేకపోవడంతో బతుకమ్మ పూలు దొరకడం ఈసారి గగనంగా మారింది. ఉన్న పూలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులు బతుకమ్మ పూలను సాగు చేస్తుండగా.. అధిక వర్షాలు నష్టాలను మూటగట్టాయని చెబుతున్నారు. ఉన్నకొద్ది పువ్వునే విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. అదే విధంగా నైవేద్యాలు.. పిండివంటలు చేసేందుకు ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎది కొనాలన్నా సామాన్యులు జేబులు చూసుకోవాల్సి వస్తోంది. అయినా ఏడాదికోసారి వచ్చే పండగ అంటూ ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అవుతున్నారు. 9 రోజులు.. తొమ్మిది రకాలుగా •తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ •రెండో రోజు అటుకుల బతుకమ్మ •మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ •నాలుగో రోజు నానే బియ్యం •ఐదో రోజు అట్ల బతుకమ్మ, •ఆరో రోజు అలిగిన బతుకమ్మ •ఏడో రోజు వేపకాయ బతుకమ్మ •ఎనిమిదో రోజు •వెన్నముద్దల బతుకమ్మ •తొమ్మిదో రోజు •సద్దుల బతుకమ్మ నైవేద్యాలు నవ విధాలు ఆడబిడ్డలంతా వీధి కూడలిలో బతుకమ్మ ఆడిన తరువాత సమీప నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. అనంతరం వాయినాలు ఇచ్చుకుంటారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు, అట్లు, పెరుగు అన్నం, చింతపండుతో చేసిన పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, మక్క కంకులు, జొన్నలు, మినుములు, శనగలు, పెసర్లు, గోధుమలు, బియ్యం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసిన పలు రకాల వంటకాలను బతుకమ్మకు నైవేద్యాలుగా వినియోగిస్తారు. ఎంగిలి పూలు అంటే.. తంగెడు, రుద్రాక్షలు, కట్లపూలు, పట్టుకుచ్చులు, చిట్టి చేమంతులు, పోకబంతులు, బంతి ఇలా సాధారణ రోజుల్లో ఎవరూ పట్టించుకోని పూవులన్నీ బతుకమ్మ పండుగ నాడు గుర్తింపును ఆపాదించుకుంటాయి. వీటన్నింటి కూర్పే బతుకమ్మ. సమీపంలోని చేనూ చెలకా తిరిగి ఒక రోజు ముందే అవసరమైన పూలన్నీ సేకరించుకుని వస్తారు. నీటిలో కానీ, తేమగా ఉన్న వస్త్రంలో కానీ కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఒక రోజు ముందు సేకరించిన పూలతో బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూలుగా భావిస్తారు. కీటకాల పరాగ సంపర్కంతో ఎంగిలి పడ్డాయని భావించి ఎంగిలిపూలుగా పిలుస్తారు. పండగ అంటే బతుకమ్మే పండగ అంటే బతుకమ్మనే అనిపిస్తుంది. మా స్కూల్ పిల్లలు అందరమూ ముందస్తుగా స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆటలు, పాటలు, గ్రౌండ్ నిండా మనుషులు చూడడానికి, ఆడడానికి కూడా చాలా బాగుంది. చిన్నబతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు మా వీధులన్నీ సందడిగా మారుతాయి. ఎంతైనా పండగ అంటే బతుకమ్మే. – బి.సంజన, విద్యార్థిని, సిరిసిల్ల ఆనందాల వేడుక మనరాష్ట్రంలో ఆడవాళ్లందరికీ వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే పండగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు పదిహేను రోజుల పాటు ఆడపిల్లలకు సంతోషాలను పంచుతుందీ పండగ. అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని చిన్నా పెద్దా పాటించడం వల్ల ఈ సంస్కృతి చిరకాలం నిలుస్తుంది. – మర్రిపెల్లి రమ, గృహిణి, సిరిసిల్ల లక్ష్మీదేవీ స్వరూపం బతుకమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవీ స్వరూపం అని పెద్దవాళ్లు అంటుంటారు. కాబట్టి పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం సంపదలకు మూల కారణం అవుతుందంటారు. అమ్మవారి అనుగ్రహం, దేవతల ఆశీర్వాదం కోసం బతుకమ్మ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇంటిల్లిపాది ఇందులో పాల్గొనడం పండుగకు ప్రత్యేకంగా భావించాలి. అందుకే గౌరమ్మను ప్రత్యేకంగా పూజిస్తాం మనం. – గడ్డం చందన, గృహిణి, సిరిసిల్ల సాయంకాలం సంతోషం రోజువారీ కార్యక్రమాలతో సతమతం అయ్యే ఆడవాళ్లందరికీ బతుకమ్మ పండగ మంచి రిలీఫ్. చిన్న, పెద్ద అందరికీ ఒకే చోట చేర్చడం బతుకమ్మకే సాధ్యం. ఆటపాటలు అన్నీ కూడా ఈ తరాన్ని ఆకర్షించేలా రూపుదిద్దుకున్నాయి. బతుకమ్మకు కొత్త అందాన్ని, ఆచారాన్ని ఆపాదించాయి. పది మందితో కలిసి జీవించే కల్చర్ కూడా అలవడుతుంది. అందుకే బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. – శివరాత్రి సౌమ్య, గ్రాడ్యుయేట్ కలర్‌ఫుల్ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పండుగ జరిగే తొమ్మిది రోజుల పాటు ఆడపిల్లలందరికీ గొప్ప రిలీఫ్. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు రోజూ కొత్త స్నేహితులు పెరిగే అవకాశం ఉంది. ఈ పది రోజులూ ఆడపిల్లలందరికీ ప్రత్యేకంగా గడిచిపోతుంది. ప్రతి సాయంత్రం ఓ సాటిస్ఫాక్షన్ తోడవుతుంది. వీధుల్లో హడావుడి.. ఒక్కచోటే కలిసే స్నేహితులు ఆ ఆనందమే వేరు. – శ్రీమంతుల సాత్విక, సిరిసిల్ల -
బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!
సాక్షి, హైదరాబాద్: అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతోంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే.. బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో విభిన్న పర్యాయ పదాల వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలు పేరుస్తారు. మ«ధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారావు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భా గాన్ని ఉంచుతారు. దీన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. కొందరు బొడ్డెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. పండుగ నేపథ్యం ఇదీ.. 19వ శతాబ్దం పూర్వార్థం నిత్యం దారిద్య్రం, భయంకర అంటువ్యాధులు, ప్రకృతి బీభత్సాలతో తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది ప్రజలు చనిపోయేవారు. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, తమకు పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోకుండా బతకటానికి బతుకమ్మ(బతుకు+అమ్మ) పండుగను సృష్టించుకున్నారు. మరో కథనం ప్రకారం.. ఒక కాపు కుటుంబంలో ఏడో సంతానంగా పుట్టిన అమ్మాయే బతుకమ్మ. అంతకుముందు పుట్టి చనిపోయిన వారిలో కలవకూడదనే భావనతో ‘బతుకమ్మ’ అని పిలుచుకుంటూ పెంచుతారు. బతుకమ్మ ఎదిగాక పెళ్లి చేస్తారు. ఓ పండుగ రోజు బతుకమ్మ పుట్టింటికి వస్తుంది. అన్న భార్యతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. అక్కడ ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోయి వదిన చీరను బతుకమ్మ కట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, వదిన బతుకమ్మ గొంతు నులిమి, చంపేసి చెరువు గట్టున పాతిపెడుతుంది. తర్వాత ఆమె తంగేడు చెట్టుగా మొలుస్తుంది. బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి, జరిగిన విషయం చెప్పి, తనను తీసుకుపొమ్మంటుంది. అలా పండుగ ప్రారంభమైందని చెబుతారు. ఎంగిలిపూల బతుకమ్మ.. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు. అటుకుల బతుకమ్మ.. రెండోరోజు అటుకల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ ఆట పాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ.. మూడోరోజు ముద్ద పప్పు బతుకమ్మగా జరపుకుంటారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను త యారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ.. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూలతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు. బతుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు. వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈరోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని అరగిస్తారు. -
Bathukamma: ఆ తొమ్మిది రోజులు పల్లెలన్నీ పూల వనాలే! ఎంగిలిపూలు మొదలు సద్దుల దాకా!
Bathukamma 2022: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ. తొమ్మిది రోజులపాటు జరిగే పకృతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పూల పండుగలో రోజుకో ప్రత్యేకం. ఎంగిలిపూలతో ప్రారంభమైన పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొమ్మిది రోజులపాటు జరిగే పండుగలో తెలంగాణ పల్లెలన్నీ పూలవనాలను తలపిస్తాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. అమావాస్య రోజున మొదటి రోజు బతుకమ్మ ఆడతారు. ఈ రోజు పెత్రమాస (పెత్తర అమావాస్య) అంటారు. ఈసారి పెత్తర అమావాస్య సెప్టెంబరు 25న వచ్చింది. ►మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ ►రెండో రోజు- అటుకుల బతుకమ్మ ►మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ ►నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ ►ఐదో రోజు- అట్ల బతుకమ్మ ►ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ ►ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ ►ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ ►తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ బతుకమ్మ. అడవిలో దొరికే గునుగు, తంగేడు పూలను ఏరుకొచ్చి అందంగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?