సిరిసిల్లకల్చరల్/కరీంనగర్ కల్చరల్: ఎగిలివారంగ తొలిమంచు కురవంగా.. ఆ.. మంచు బిందువులతో గౌరమ్మ మురవంగా.. చలికి వణుకుతున్న చేతులతో గౌరమ్మను తెంపంగా.. తోడుగా రంగురంగుల పూలను కోయంగా.. కోసిన పూలను ఒక్కచోట చేర్చిన ఆడపడుచు.. పేర్చేను ఎంగిలిపూల బతుకమ్మను సంబరంగా.. ఆడబిడ్డలు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ.. బతుకమ్మ అంటూ.. ఆడిపాడేను ఉత్సాహంగా.. నేటి నుంచి బతుకమ్మ సంబరాల సందర్భంగా కథనం..!!
చదవండి: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా?
నిండిన చెరువులు, పండిన పంటలు, రాలిన చినుకులతో అలుకుపూత చేసుకుందా అన్నట్లు కనిపించే అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా కనిపించే సమయమే.. బతుకమ్మ సంబరానికి ప్రారంభం. అతివల హర్షం ఆకాశాన్ని తాకేలా బతుకమ్మ తన వైభవాన్ని చాటుతోంది. మహాలయ అమావాస్య నుంచి నవమి వరకు పూలతో బతుకమ్మను కొలవడం అనూచానంగా వస్తోంది.
ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబరాలు ఆదివారంతో ప్రారంభం అవుతున్నాయి. తంగేడు, బంతి, గునుగు, చేమంతి, రుద్రాక్ష, కట్లపూలు, పట్టు కుచ్చులు, సీతమ్మ జడ వంటి పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. పట్ట ణాలు, పల్లెలనే తారతమ్యం లేకుండా వీధులన్నీ విరులవనాలుగా మారుతాయి. ఆదివారం సాయంత్రం ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు.
పాటల్లో పల్లె జీవితాలు
బతుకమ్మ ఆరాధనలో పాటల పాత్ర ప్రత్యేకమైంది. అమ్మ ఆరాధనను స్ఫురించే పాటలతో పాటు తెలంగాణ పల్లె ప్రజల జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. శ్రామిక సౌందర్యాన్ని ప్రతిబింబించేవి కొన్నయితే, కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు అత్తవారింటి ఆదరాభిమానాలు, కుటుంబాల్లోని కలతలు, జీవితాల్లోని సంఘర్షణలను మరికొన్ని చాటుతాయి.
విభిన్నం.. ఉమ్మడి జిల్లా బతుకమ్మ
ఉమ్మడి జిల్లాలో విభిన్న సంస్కృతుల కారణంగా బతుకమ్మవేడుకను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవాయితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావిలాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుకమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.
పూల కొరత.. మార్కెట్ సందడి
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల కొరత ఏర్పడింది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో బీళ్లుగా లేకపోవడంతో బతుకమ్మ పూలు దొరకడం ఈసారి గగనంగా మారింది. ఉన్న పూలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులు బతుకమ్మ పూలను సాగు చేస్తుండగా.. అధిక వర్షాలు నష్టాలను మూటగట్టాయని చెబుతున్నారు. ఉన్నకొద్ది పువ్వునే విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. అదే విధంగా నైవేద్యాలు.. పిండివంటలు చేసేందుకు ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎది కొనాలన్నా సామాన్యులు జేబులు చూసుకోవాల్సి వస్తోంది. అయినా ఏడాదికోసారి వచ్చే పండగ అంటూ ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అవుతున్నారు.
9 రోజులు.. తొమ్మిది రకాలుగా
•తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
•రెండో రోజు అటుకుల బతుకమ్మ
•మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
•నాలుగో రోజు నానే బియ్యం
•ఐదో రోజు అట్ల బతుకమ్మ,
•ఆరో రోజు అలిగిన బతుకమ్మ
•ఏడో రోజు వేపకాయ బతుకమ్మ
•ఎనిమిదో రోజు
•వెన్నముద్దల బతుకమ్మ
•తొమ్మిదో రోజు
•సద్దుల బతుకమ్మ
నైవేద్యాలు నవ విధాలు
ఆడబిడ్డలంతా వీధి కూడలిలో బతుకమ్మ ఆడిన తరువాత సమీప నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. అనంతరం వాయినాలు ఇచ్చుకుంటారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు, అట్లు, పెరుగు అన్నం, చింతపండుతో చేసిన పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, మక్క కంకులు, జొన్నలు, మినుములు, శనగలు, పెసర్లు, గోధుమలు, బియ్యం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసిన పలు రకాల వంటకాలను బతుకమ్మకు నైవేద్యాలుగా వినియోగిస్తారు.
ఎంగిలి పూలు అంటే..
తంగెడు, రుద్రాక్షలు, కట్లపూలు, పట్టుకుచ్చులు, చిట్టి చేమంతులు, పోకబంతులు, బంతి ఇలా సాధారణ రోజుల్లో ఎవరూ పట్టించుకోని పూవులన్నీ బతుకమ్మ పండుగ నాడు గుర్తింపును ఆపాదించుకుంటాయి. వీటన్నింటి కూర్పే బతుకమ్మ. సమీపంలోని చేనూ చెలకా తిరిగి ఒక రోజు ముందే అవసరమైన పూలన్నీ సేకరించుకుని వస్తారు. నీటిలో కానీ, తేమగా ఉన్న వస్త్రంలో కానీ కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఒక రోజు ముందు సేకరించిన పూలతో బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూలుగా భావిస్తారు. కీటకాల పరాగ సంపర్కంతో ఎంగిలి పడ్డాయని భావించి ఎంగిలిపూలుగా పిలుస్తారు.
పండగ అంటే బతుకమ్మే
పండగ అంటే బతుకమ్మనే అనిపిస్తుంది. మా స్కూల్ పిల్లలు అందరమూ ముందస్తుగా స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆటలు, పాటలు, గ్రౌండ్ నిండా మనుషులు చూడడానికి, ఆడడానికి కూడా చాలా బాగుంది. చిన్నబతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు మా వీధులన్నీ సందడిగా మారుతాయి. ఎంతైనా పండగ అంటే బతుకమ్మే.
– బి.సంజన, విద్యార్థిని, సిరిసిల్ల
ఆనందాల వేడుక
మనరాష్ట్రంలో ఆడవాళ్లందరికీ వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే పండగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు పదిహేను రోజుల పాటు ఆడపిల్లలకు సంతోషాలను పంచుతుందీ పండగ. అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని చిన్నా పెద్దా పాటించడం వల్ల ఈ సంస్కృతి చిరకాలం నిలుస్తుంది.
– మర్రిపెల్లి రమ, గృహిణి, సిరిసిల్ల
లక్ష్మీదేవీ స్వరూపం
బతుకమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవీ స్వరూపం అని పెద్దవాళ్లు అంటుంటారు. కాబట్టి పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం సంపదలకు మూల కారణం అవుతుందంటారు. అమ్మవారి అనుగ్రహం, దేవతల ఆశీర్వాదం కోసం బతుకమ్మ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇంటిల్లిపాది ఇందులో పాల్గొనడం పండుగకు ప్రత్యేకంగా భావించాలి. అందుకే గౌరమ్మను ప్రత్యేకంగా పూజిస్తాం మనం.
– గడ్డం చందన, గృహిణి, సిరిసిల్ల
సాయంకాలం సంతోషం
రోజువారీ కార్యక్రమాలతో సతమతం అయ్యే ఆడవాళ్లందరికీ బతుకమ్మ పండగ మంచి రిలీఫ్. చిన్న, పెద్ద అందరికీ ఒకే చోట చేర్చడం బతుకమ్మకే సాధ్యం. ఆటపాటలు అన్నీ కూడా ఈ తరాన్ని ఆకర్షించేలా రూపుదిద్దుకున్నాయి. బతుకమ్మకు కొత్త అందాన్ని, ఆచారాన్ని ఆపాదించాయి. పది మందితో కలిసి జీవించే కల్చర్ కూడా అలవడుతుంది. అందుకే బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం.
– శివరాత్రి సౌమ్య, గ్రాడ్యుయేట్
కలర్‌ఫుల్ ఫెస్టివల్
బతుకమ్మ ఫెస్టివల్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పండుగ జరిగే తొమ్మిది రోజుల పాటు ఆడపిల్లలందరికీ గొప్ప రిలీఫ్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రోజూ కొత్త స్నేహితులు పెరిగే అవకాశం ఉంది. ఈ పది రోజులూ ఆడపిల్లలందరికీ ప్రత్యేకంగా గడిచిపోతుంది. ప్రతి సాయంత్రం ఓ సాటిస్‌ఫాక్షన్ తోడవుతుంది. వీధుల్లో హడావుడి.. ఒక్కచోటే కలిసే స్నేహితులు ఆ ఆనందమే వేరు.
– శ్రీమంతుల సాత్విక, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment