bathukamma festival
-
బ్రిటన్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు
బ్రిటన్: స్కాట్లాండ్ లోని గ్లాస్కో నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. “మదర్ ఎర్త్ హిందూ దేవాలయం “ ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత మరియు అనేక మంది వ్యక్తులతో అనేక సమావేశాల తరువాత, కేంద్రం యొక్క భవిష్యత్తు స్థలంగా ఉండే స్థలాన్ని ఎన్నుకున్నారు.ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు , రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి రోజు అంకితం చేయబడింది. 06/10/24న బతుకమ్మ జరుపుకున్నారు . దీన్ని డాక్టర్ మమత వుసికల మరియు వినీల బత్తుల నేతృత్వంలోని స్థానిక తెలుగు సంఘం నిర్వహించింది. ఈ బృందానికి ట్రస్టీలు – డాక్టర్ పునీత్ బేడీ మరియు శ్రీమతి రష్మీ నాయక్ మద్దతు ఇచ్చారు.మూడు వందల మంది పిల్లలు సహా అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం విశేషం. దుర్గామాతకు పూజలు, హారతులతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం మహిళలు బతుకమ్మకు పూజలు చేసి సంప్రదాయ నృత్యం చేశారు. దీని తర్వాత మళ్లీ ఆర్తి మరియు మా తెలుగు సంఘం వాలంటీర్లు చేసిన అద్భుతమైన విందు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఎంతో ఆనందించారు. ఈ మధ్య కాలంలో తాము హాజరైన మంచి ఫంక్షన్ ఇదేనని అన్నారు వారు. నిర్వాహకులు తమ శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. -
హాంగ్‌కాంగ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వేడుక
హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న తెలంగాణా ఆడపడుచులు తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట పండుగైన బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే ప్రక్రుతి లోని అందమైన ఈ పుల పండుగను భక్తీ ఉత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. హాంగ్ కాంగ్ లో కూడా సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలలలో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటారు.ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ స్నేహితుల కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి ’బతుకమ్మ పండుగ’, మరియొకటి దసరా (విజయ దశమి). బతుకమ్మ పండుగ మన తెలంగాణా ఆడపడుచులు మాత్రమె జరుపుకుంటారు, కాని ఉత్సాహంగా ఎందరో ఆడపడుచులు పాల్గొంటారు. దసరా నవరాత్రులలో లలితా పారాయణం , బొమ్మల కొలువులు , పేరంటాళ్ళతో రంగ రంగ వైభవంగా పండుగల సందడి పట్టు చీరలు ధగ ధగ మెరిసే నగలు గాజుల సవ్వడి తో విదేశీయులని కుడా ఆకర్షిస్తుంటుంది.సంవత్సరం కూడా హాంగ్ కాంగ్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా సముద్ర తీరాన లాన్తాఉ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రోమేనెడ్ మీద జరిగాయని, పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా రెట్టింపు ఉత్సాహాలతో పాల్గొనేవారు సంప్రదాయ వస్త్రాలలో మరిన్ని ఆట పాటలతో విందు భోజనంతో జరుపుకున్నారని, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఆనందంగా తెలిపారు. -
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు మరియు దైవత్వం మరియు ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను మనకు అందిస్తుంది.గ్లాస్గో యొక్క దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ఉంది మరియు అది ప్రకృతిలో పెరుగుతోంది. మాకు సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేదు. నిపుణుల బృందం కలిసి సమావేశమై చర్చల ద్వారా మా కమ్యూనిటీ కోసం ఒక సాంస్కృతిక కేంద్రంతో సహా ఒక మందిర్ ఆలోచనను రూపొందించింది. మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత మరియు అనేక మంది వ్యక్తులతో అనేక సమావేశాల తరువాత, మా కేంద్రం యొక్క భవిష్యత్తు స్థలంగా ఉండే స్థలాన్ని మేము కనుగొన్నాము. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి రోజు అంకితం చేయబడిందిఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల మరియు వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి మరియు బతుకమ్మలను జరుపుకుంటారు. అక్టోబర్ 6న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చిరకాలం మన జ్ఞాపకాలలో నిలిచిపోయే వేడుకగా ఇది జరగబోతోందని మా సంఘం వారు చాలా ఉత్సాహం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
తొమ్మిది రోజుల పూల బతుకమ్మలు నైవేద్యాలు..! (ఫొటోలు)
-
డాలస్‌లో బతుకమ్మ వేడుకలు, స్పెషల్ అట్రాక్షన్‌గా సంయుక్తా మీనన్
డాలస్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను సంయుక్తంగా ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్లో వైభవంగా జరిపించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు టీపాడ్ బృందం తెలిపింది. ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ సంయుక్తామీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మగువలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అనంతరం దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజలు నిర్వహించి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్‌బలయ్ తీసుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన అనంతరం కళాకారుల బృందం అమ్మవారి మహాశక్తిని నృత్యరూపకంగా ప్రదర్శించి గూస్బంప్స్ తెప్పించింది. అటు డ్యాన్సర్లు, ఇటు గాయకుల అలుపెరగని ప్రదర్శనతో కార్యక్రమం మరింత కనులవిందుగా, వీనులవిందుగా మారింది. సింగర్స్ సమీర భరద్వాజ్, పృథ్వీ, ఆదిత్య, అధితీ భావరాజు.. దాదాపు 3 గంటల పాటు తమ పాటలతో మనసునిండా పండుగ తృప్తితో పాటు సాంత్వన కలిగిస్తూ కొత్త శక్తిని నింపారు. జాతరను తలపించిన కొమెరికా సెంటర్ కార్యక్రమంలో భాగంగా బైక్రాఫెల్, 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల గోల్డ్రాఫెల్ను సినీనటి సంయుక్తామీనన్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. జాతరకు ఏమాత్రమూ తీసిపోదన్నట్టు వెలిసిన వెండర్బూతలు ఆసాంతం రద్దీతో కనిపించాయి. కొమెరికా సెంటర్లోకి అడుగుపెట్టేందుకు తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. -
బతుకమ్మ పండగకు అరుదైన గౌరవం,గవర్నర్ ఆదేశాలు జారీ
అట్లాంటా: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంతో ఘనంగా పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అక్టోబర్ 15 నుంచి ఈనెల 23 వరకు 9రోజుల పాటు బతుకమ్మ పండగను జరుపుకున్న సంగతి తెలిసిందే.తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ.బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుందని అంటారు. కాకతీయుల కాలం అంటే సుమారు 12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటుకుంటారు. జార్జియాలోనూ ప్రతి ఏడాది జార్జియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. -
Bathukamma Celebrations: రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై (ఫొటోలు)
-
Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
బతుకమ్మ సంబరాలు షురూ.. నేడే ఎంగిలిపూల బతుకమ్మ
తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డలా పండుగ.. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగకు సమయం ఆసన్నమైంది. భాద్రపద అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పండగకు తెలంగాణ ముస్తాబైంది. ఏర్పాట్లకు సర్వం సిద్ధమయ్యాయి. నేటి(శనివారం) నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. చివరిరోజైన దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో.. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు.గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు ఒక్కో రోజు.. ఒక్కోలా.. మొదటి రోజు: బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు: బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇది ఆశ్వీయుజ మాసం మొదటి రోజైనపౌడ్యమి రోజున నిర్వహిస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు: బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మను చేస్తారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు. ఐదో రోజు: అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు అట్లు(దోసలు) తయారు చేస్తారు. అమ్మకు నైవేద్యంగా పెడతారు. ఆరో రోజు: అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజు బతుకమ్మ పేర్చరు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు. ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి, నూనెలో వేయిస్తారు. వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ. చాలా ముఖ్యమైన రోజు. ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో బతుకమ్మ ఉత్సవాలను ముగిస్తారు. -
TS: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు బతుకమ్మ, దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో అక్టోబర్ 6 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి: బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఖాయం: బండి సంజయ్ -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!
‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ! తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’ ‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’ ‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి. ‘‘నేను 2007లో యూఎస్‌కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్‌తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను. మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ అన్నం ఉంటుంది! యూఎస్‌లో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్‌కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని. షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్ నేర్పించిన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఫ్రెండ్ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్. గునుగుపూలు వాటర్బాడీస్ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్‌లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి. బతుకమ్మ దీప్తినయ్యాను! యూఎస్ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్ లైఫ్‌ని జాయ్‌ఫుల్‌గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్ ఇంతగా ఇండియనైజ్ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్ వచ్చేస్తుంది. చూడండి గూజ్బంప్స్ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బతుకమ్మ చీరలు @ రూ.330 కోట్లు
సిరిసిల్ల: రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ పండుగ కానుక చీరల రంగులను, డిజైన్లను తెలంగాణ పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ఖరారు చేసింది. 21 రంగుల్లో 25 డిజైన్లలో బతుక మ్మ చీరలను ఆర్డర్ చేసింది. రాష్ట్రంలోని కోటి మందికి బతుకమ్మ పండగ కానుకగా ప్రభుత్వం చీరలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ పండుగకు చీరలను సారెగా అందిస్తున్నారు. గతంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెక్సో) ద్వారా ఈ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. ఈసారి తెలంగాణ పవర్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ద్వారా ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లలోని 139 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్)లకు 3.70 కోట్ల మీటర్ల బట్టను (64.03 లక్షల చీరలు), 126 చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎస్ఐ)కు 1.84 కోట్ల మీటర్ల బట్టను (31.87 లక్షల చీరలు) ఆర్డర్లు ఇచ్చారు. జాకెట్ పీసుల కోసం మరో 68 లక్షల మీటర్ల బట్టను సిరిసిల్ల శివారు టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలకు ఇచ్చారు. మొత్తంగా 6.22 కోట్ల మీటర్ల బట్టను బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఏడాది నిర్ణయించారు. చీరలకు ఉత్పత్తి రవాణా, ప్రాసెసింగ్ ఇతర ఖర్చులకు మొత్తం రూ.330 కోట్లు కేటాయించారు. సెపె్టంబరు నెలాఖరులోగా ఈ చీరలను సిరిసిల్ల నేతన్నలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. మగ్గాల సంఖ్య ఆధారంగా ఆర్డర్లు ఇస్తాం సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాము. 21 రంగుల్లో 25 డిజైన్లలో చీరలను ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశాము. మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్లలోని మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తిదారులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తాం. గడువులోగా చీరలను ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంటుంది. – సాగర్, జౌళిశాఖ, ఏడీ -
కిక్కిరిసిన జర్నీ.. అరకొర రైళ్లే.. ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు
సాక్షి, హైదరాబాద్: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. పండగకు మరో మూడు రోజులే ఉండడడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. అలాగే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి కూడా ప్రయాణికులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు. ఈ సంవత్సరం ఆర్టీసీ పుణ్యమా అని పండగ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఆర్టీసీ బస్సుల్ని సాధారణ చార్జీలపైనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికుల ఆదరణ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దారిదోపిడీ కొనసాగుతోంది. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోంది. అరకొర రైళ్లే... ► ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈసారి అదనపు రైళ్లను చాలా వరకు తగ్గించారు. ► కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ► దసరా సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ► అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► ‘కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో బోగీలో వందలకొద్దీ కిక్కిరిసి ప్రయాణం చేయవలసి వస్తుంది’. అని కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. ► తెలంగాణ ప్రాంతాలకు రైలు సర్వీసుల విస్తరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న మరో ప్రయాణికుడు శ్రీనివాస్ ఆరోపించారు. దూరప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... ► తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 4400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ► విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి తదితర నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► అక్టోబర్ 1 నుంచి రద్దీ మరింత పెరగనున్న దృష్ట్యా రోజుకు 500 నుంచి 1000 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి.. సీబీస్: అనంతపూర్, చిత్తూరు, కడప,కర్నూలు,ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు: వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట వైపు దిల్సుఖ్నగర్: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట .. జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవి.. ఎల్బీనగర్: వైజాగ్, విజయవాడ, గుంటూరు వైపు .. ఎంజీబీఎస్: మహబూబ్‌నగర్,వికారాబాద్, తాండూరు, భద్రాచలం, తదితర ప్రాంతాలకు.. సాధారణ చార్జీలే.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించరాదని, సాధారణ చార్జీలపైనే ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ కోరారు. ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణసమయంలోనూ టిక్కెట్లు తీసుకోవచ్చునని తెలిపారు. -
బతుకమ్మ.. పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట!
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఆరంభమైంది. తొమ్మిది రోజులు వేడుకగా సాగే ఈ సంబురంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ.. కోలాటాలతో ఆడబిడ్డలంతా కథాగానం చేస్తూ గౌరమ్మను పూజిస్తారు. ఈ పండుగ వేళ బతుకమ్మ జననం గురించి చెప్పే 200 ఏళ్ల నాటి పాట మీకోసం.. ‘‘శ్రీలక్ష్మీ దేవియు చందమామ- సృష్టి బతుకమ్మాయె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ- భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ- ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ- అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ- నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యె చందమామ- వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ- తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమునుబాసి చందమామ- దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ- వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ- పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ- వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ- పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ- జన్మించె శ్రీలక్ష్మి చందమామ అంతలో మునులునూ చందమామ- అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ- కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిష్టులూ చందమామ- ఆ కన్నియను జూచి చందమామ బతుకు గనె ఈ తల్లి చందమామ- బతుకమ్మ యనిరంత చందమామ’’ చదవండి: Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..! -
డీజే టిల్లు సాంగ్‌కు స్టెప్పులేసిన హెల్త్ డైరెక్టర్
-
తొమ్మిది రోజులు.. 9 రకాలుగా.. విను వీధులు.. విరివనాలు
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్ కల్చరల్: ఎగిలివారంగ తొలిమంచు కురవంగా.. ఆ.. మంచు బిందువులతో గౌరమ్మ మురవంగా.. చలికి వణుకుతున్న చేతులతో గౌరమ్మను తెంపంగా.. తోడుగా రంగురంగుల పూలను కోయంగా.. కోసిన పూలను ఒక్కచోట చేర్చిన ఆడపడుచు.. పేర్చేను ఎంగిలిపూల బతుకమ్మను సంబరంగా.. ఆడబిడ్డలు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ.. బతుకమ్మ అంటూ.. ఆడిపాడేను ఉత్సాహంగా.. నేటి నుంచి బతుకమ్మ సంబరాల సందర్భంగా కథనం..!! చదవండి: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా? నిండిన చెరువులు, పండిన పంటలు, రాలిన చినుకులతో అలుకుపూత చేసుకుందా అన్నట్లు కనిపించే అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా కనిపించే సమయమే.. బతుకమ్మ సంబరానికి ప్రారంభం. అతివల హర్షం ఆకాశాన్ని తాకేలా బతుకమ్మ తన వైభవాన్ని చాటుతోంది. మహాలయ అమావాస్య నుంచి నవమి వరకు పూలతో బతుకమ్మను కొలవడం అనూచానంగా వస్తోంది. ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబరాలు ఆదివారంతో ప్రారంభం అవుతున్నాయి. తంగేడు, బంతి, గునుగు, చేమంతి, రుద్రాక్ష, కట్లపూలు, పట్టు కుచ్చులు, సీతమ్మ జడ వంటి పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. పట్ట ణాలు, పల్లెలనే తారతమ్యం లేకుండా వీధులన్నీ విరులవనాలుగా మారుతాయి. ఆదివారం సాయంత్రం ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. పాటల్లో పల్లె జీవితాలు బతుకమ్మ ఆరాధనలో పాటల పాత్ర ప్రత్యేకమైంది. అమ్మ ఆరాధనను స్ఫురించే పాటలతో పాటు తెలంగాణ పల్లె ప్రజల జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. శ్రామిక సౌందర్యాన్ని ప్రతిబింబించేవి కొన్నయితే, కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు అత్తవారింటి ఆదరాభిమానాలు, కుటుంబాల్లోని కలతలు, జీవితాల్లోని సంఘర్షణలను మరికొన్ని చాటుతాయి. విభిన్నం.. ఉమ్మడి జిల్లా బతుకమ్మ ఉమ్మడి జిల్లాలో విభిన్న సంస్కృతుల కారణంగా బతుకమ్మవేడుకను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవాయితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావిలాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుకమ్మ అనంతరం బావిని పూడ్చుతారు. పూల కొరత.. మార్కెట్ సందడి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల కొరత ఏర్పడింది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో బీళ్లుగా లేకపోవడంతో బతుకమ్మ పూలు దొరకడం ఈసారి గగనంగా మారింది. ఉన్న పూలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. అయితే ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులు బతుకమ్మ పూలను సాగు చేస్తుండగా.. అధిక వర్షాలు నష్టాలను మూటగట్టాయని చెబుతున్నారు. ఉన్నకొద్ది పువ్వునే విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. అదే విధంగా నైవేద్యాలు.. పిండివంటలు చేసేందుకు ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎది కొనాలన్నా సామాన్యులు జేబులు చూసుకోవాల్సి వస్తోంది. అయినా ఏడాదికోసారి వచ్చే పండగ అంటూ ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అవుతున్నారు. 9 రోజులు.. తొమ్మిది రకాలుగా •తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ •రెండో రోజు అటుకుల బతుకమ్మ •మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ •నాలుగో రోజు నానే బియ్యం •ఐదో రోజు అట్ల బతుకమ్మ, •ఆరో రోజు అలిగిన బతుకమ్మ •ఏడో రోజు వేపకాయ బతుకమ్మ •ఎనిమిదో రోజు •వెన్నముద్దల బతుకమ్మ •తొమ్మిదో రోజు •సద్దుల బతుకమ్మ నైవేద్యాలు నవ విధాలు ఆడబిడ్డలంతా వీధి కూడలిలో బతుకమ్మ ఆడిన తరువాత సమీప నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. అనంతరం వాయినాలు ఇచ్చుకుంటారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు, అట్లు, పెరుగు అన్నం, చింతపండుతో చేసిన పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, మక్క కంకులు, జొన్నలు, మినుములు, శనగలు, పెసర్లు, గోధుమలు, బియ్యం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసిన పలు రకాల వంటకాలను బతుకమ్మకు నైవేద్యాలుగా వినియోగిస్తారు. ఎంగిలి పూలు అంటే.. తంగెడు, రుద్రాక్షలు, కట్లపూలు, పట్టుకుచ్చులు, చిట్టి చేమంతులు, పోకబంతులు, బంతి ఇలా సాధారణ రోజుల్లో ఎవరూ పట్టించుకోని పూవులన్నీ బతుకమ్మ పండుగ నాడు గుర్తింపును ఆపాదించుకుంటాయి. వీటన్నింటి కూర్పే బతుకమ్మ. సమీపంలోని చేనూ చెలకా తిరిగి ఒక రోజు ముందే అవసరమైన పూలన్నీ సేకరించుకుని వస్తారు. నీటిలో కానీ, తేమగా ఉన్న వస్త్రంలో కానీ కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఒక రోజు ముందు సేకరించిన పూలతో బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూలుగా భావిస్తారు. కీటకాల పరాగ సంపర్కంతో ఎంగిలి పడ్డాయని భావించి ఎంగిలిపూలుగా పిలుస్తారు. పండగ అంటే బతుకమ్మే పండగ అంటే బతుకమ్మనే అనిపిస్తుంది. మా స్కూల్ పిల్లలు అందరమూ ముందస్తుగా స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆటలు, పాటలు, గ్రౌండ్ నిండా మనుషులు చూడడానికి, ఆడడానికి కూడా చాలా బాగుంది. చిన్నబతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు మా వీధులన్నీ సందడిగా మారుతాయి. ఎంతైనా పండగ అంటే బతుకమ్మే. – బి.సంజన, విద్యార్థిని, సిరిసిల్ల ఆనందాల వేడుక మనరాష్ట్రంలో ఆడవాళ్లందరికీ వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే పండగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు పదిహేను రోజుల పాటు ఆడపిల్లలకు సంతోషాలను పంచుతుందీ పండగ. అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని చిన్నా పెద్దా పాటించడం వల్ల ఈ సంస్కృతి చిరకాలం నిలుస్తుంది. – మర్రిపెల్లి రమ, గృహిణి, సిరిసిల్ల లక్ష్మీదేవీ స్వరూపం బతుకమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవీ స్వరూపం అని పెద్దవాళ్లు అంటుంటారు. కాబట్టి పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం సంపదలకు మూల కారణం అవుతుందంటారు. అమ్మవారి అనుగ్రహం, దేవతల ఆశీర్వాదం కోసం బతుకమ్మ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇంటిల్లిపాది ఇందులో పాల్గొనడం పండుగకు ప్రత్యేకంగా భావించాలి. అందుకే గౌరమ్మను ప్రత్యేకంగా పూజిస్తాం మనం. – గడ్డం చందన, గృహిణి, సిరిసిల్ల సాయంకాలం సంతోషం రోజువారీ కార్యక్రమాలతో సతమతం అయ్యే ఆడవాళ్లందరికీ బతుకమ్మ పండగ మంచి రిలీఫ్. చిన్న, పెద్ద అందరికీ ఒకే చోట చేర్చడం బతుకమ్మకే సాధ్యం. ఆటపాటలు అన్నీ కూడా ఈ తరాన్ని ఆకర్షించేలా రూపుదిద్దుకున్నాయి. బతుకమ్మకు కొత్త అందాన్ని, ఆచారాన్ని ఆపాదించాయి. పది మందితో కలిసి జీవించే కల్చర్ కూడా అలవడుతుంది. అందుకే బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. – శివరాత్రి సౌమ్య, గ్రాడ్యుయేట్ కలర్‌ఫుల్ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పండుగ జరిగే తొమ్మిది రోజుల పాటు ఆడపిల్లలందరికీ గొప్ప రిలీఫ్. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు రోజూ కొత్త స్నేహితులు పెరిగే అవకాశం ఉంది. ఈ పది రోజులూ ఆడపిల్లలందరికీ ప్రత్యేకంగా గడిచిపోతుంది. ప్రతి సాయంత్రం ఓ సాటిస్ఫాక్షన్ తోడవుతుంది. వీధుల్లో హడావుడి.. ఒక్కచోటే కలిసే స్నేహితులు ఆ ఆనందమే వేరు. – శ్రీమంతుల సాత్విక, సిరిసిల్ల -
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ, 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందన్నారు. దాదాపు రూ.350 కోట్ల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని సీఎం అన్నారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన "బతుకమ్మ" ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను సీఎం కేసీఆర్ ప్రార్థించారు. చదవండి: (మీకో దండం ఠాగూర్ బాబు.. మమ్మల్ని వదిలి వెళ్లండి!) -
ఈనెల 25న ఎంగిలి పూల బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్నా వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ప్రతి రోజు ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు చేసి సాయంత్రం పూట ఆనందోత్సాహాలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడతారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు! -
Bathukamma: పూలకి పండగ.. ప్రత్యేకతలేంటో తెలుసా?
బతుకమ్మ పండుగ పకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు. చదవండి: ఆ బంధాన్ని గుర్తు చేసేదే బతుకమ్మ రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. -
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో‘అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి ఉ ట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభి నందించారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడ మీ చైర్పర్సన్ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చై ర్మన్ ముజీబ్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, టీ ఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు. -
Bathukamma: ఆ తొమ్మిది రోజులు పల్లెలన్నీ పూల వనాలే! ఎంగిలిపూలు మొదలు సద్దుల దాకా!
Bathukamma 2022: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ. తొమ్మిది రోజులపాటు జరిగే పకృతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పూల పండుగలో రోజుకో ప్రత్యేకం. ఎంగిలిపూలతో ప్రారంభమైన పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొమ్మిది రోజులపాటు జరిగే పండుగలో తెలంగాణ పల్లెలన్నీ పూలవనాలను తలపిస్తాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. అమావాస్య రోజున మొదటి రోజు బతుకమ్మ ఆడతారు. ఈ రోజు పెత్రమాస (పెత్తర అమావాస్య) అంటారు. ఈసారి పెత్తర అమావాస్య సెప్టెంబరు 25న వచ్చింది. ►మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ ►రెండో రోజు- అటుకుల బతుకమ్మ ►మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ ►నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ ►ఐదో రోజు- అట్ల బతుకమ్మ ►ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ ►ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ ►ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ ►తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ బతుకమ్మ. అడవిలో దొరికే గునుగు, తంగేడు పూలను ఏరుకొచ్చి అందంగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? -
విమలక్క ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్: ప్రజాగాయకురాలు అరుణోదయ విమలక్క ‘బహుజన బతుకమ్మ’వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు. ‘బతుకమ్మ ఉత్సవమే కాదు.. ఉద్యమమంటూ చాటుదాం’అంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన బతుకమ్మ’ ఉత్సవాలను చేపడుతున్నారు. పదమూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 24న ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు గన్‌పార్కులో అమరులకు నివాళి అర్పించి, సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఆడతారు. అక్టోబర్ 3న యాదాద్రి భువనగిరిలో ముగింపు ఉత్సవాలు చేస్తారు. బహుజన బతుకమ్మ షెడ్యూల్: ►సెప్టెంబర్ 24: ఉదయం 10 గంటలకు గన్‌పార్కు వద్ద నివాళి, సాయంత్రం 4 గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభం ►సెప్టెంబర్ 25: నారాయణపేట జిల్లా పాటేపల్లి–హకీంపేట్‌లో ►సెప్టెంబర్ 26: సూర్యాపేట జిల్లా ఇస్తాళ్లపురంలో ►సెప్టెంబర్ 27: జనగాం జిల్లా బతుకమ్మకుంటలో ►సెప్టెంబర్ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో ►సెప్టెంబర్ 29: సిద్దిపేట జిల్లా కాజీపురంలో ►సెప్టెంబర్ 30: యాదాద్రి భువనగిరి జిల్లా వెల్మజాల, గుండాలలో ►అక్టోబర్1: రాజన్న సిరిసిల్లజిల్లా వేములవాడలో ►అక్టోబర్ 2: హైదరాబాద్ జిల్లా మల్లాపూర్‌లో ►అక్టోబర్ 3: యాదాద్రి భువనగిరి జిల్లా పిల్లాయిపల్లిలో. -
బతుకమ్మ కొత్త పాట: ‘తెల్ల తెల్లారింది తమ్ముళ్లు..’ వైరల్
తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండగల్లో బతుకమ్మ ఒకటి. సహజ సౌందర్యానికి ప్రతీక బతుకమ్మ పండగ. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు.. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ పుట్టుకొస్తాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ ‘సాక్షి’వేదికగా రిలీజ్ అయింది. ‘తెల్ల తెల్లారిదింది తమ్ముళ్లు.. బతుకమ్మ పండగ నేడు తమ్ముళ్లు’అంటూ సాగే ఈ పాట.. బతుకమ్మ పండగ విశిష్టతను తెలియజేస్తుంది. -
ఆహ్లాద తీరం..
-
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్ భవన్లో కూడా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తమిళి సై సౌందరరాజన్, కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ మహిళ ఉద్యోగులుబతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు. (చదవండి: తెలంగాణ హృదయం– బతుకమ్మ) తెలంగాణ ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు తమిళిసై. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ పండుగైనా బతుకమ్మను.. గవర్నర్‌గా, తెలంగాణ ఆడపడుచుగా రాజ్ భవన్లో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఏడాదే మా తల్లిని కోల్పోయాను... పండుగలు అన్నీ ఘనంగా జరుపుకోవాలనేది ఆమె కోరిక. ఆ మేరకు రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకలు చేస్తున్నాం. 9 రోజుల పాటు తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ..బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి’’ అని తమిళిసై సూచించారు. చదవండి: నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు.. పండుగ నేపథ్యం ఇదే -
తెలంగాణ ఆడపడుచులకు చిరంజీవి శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేయనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. — Chiranjeevi Konidela (@KChiruTweets) October 6, 2021 -
నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు.. పండుగ నేపథ్యం ఇదే
సాక్షి, కరీంనగర్: అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతోంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే.. బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో విభిన్న పర్యాయ పదాల వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలు పేరుస్తారు. మ«ధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారావు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భా గాన్ని ఉంచుతారు. దీన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. కొందరు బొడ్డెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. పండుగ నేపథ్యం ఇదీ.. 19వ శతాబ్దం పూర్వార్థం నిత్యం దారిద్య్రం, భయంకర అంటువ్యాధులు, ప్రకృతి బీభత్సాలతో తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది ప్రజలు చనిపోయేవారు. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, తమకు పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోకుండా బతకటానికి బతుకమ్మ(బతుకు+అమ్మ) పండుగను సృష్టించుకున్నారు. మరో కథనం ప్రకారం.. ఒక కాపు కుటుంబంలో ఏడో సంతానంగా పుట్టిన అమ్మాయే బతుకమ్మ. అంతకుముందు పుట్టి చనిపోయిన వారిలో కలవకూడదనే భావనతో ‘బతుకమ్మ’ అని పిలుచుకుంటూ పెంచుతారు. బతుకమ్మ ఎదిగాక పెళ్లి చేస్తారు. ఓ పండుగ రోజు బతుకమ్మ పుట్టింటికి వస్తుంది. అన్న భార్యతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. అక్కడ ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోయి వదిన చీరను బతుకమ్మ కట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, వదిన బతుకమ్మ గొంతు నులిమి, చంపేసి చెరువు గట్టున పాతిపెడుతుంది. తర్వాత ఆమె తంగేడు చెట్టుగా మొలుస్తుంది. బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి, జరిగిన విషయం చెప్పి, తనను తీసుకుపొమ్మంటుంది. అలా పండుగ ప్రారంభమైందని చెబుతారు. ఎంగిలిపూల బతుకమ్మ.. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు. అటుకుల బతుకమ్మ.. రెండోరోజు అటుకల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ ఆట పాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ.. మూడోరోజు ముద్ద పప్పు బతుకమ్మగా జరపుకుంటారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను త యారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ.. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూ లతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు. బ తుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు. వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈరోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని అరగిస్తారు. పూలు ప్రియం.. బతుకమ్మ పూలకే పూజలు చేసే వేడుక కాబట్టి పండుగ జరిగే తొమ్మిది రోజులూ పూలకు భలే గిరాకీ ఉంటుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, రుద్రాక్ష, పోకబంతులు, చిట్టి చామంతులు తదితర పూల ధర ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో రెండుసార్లు అధికంగా వర్షాలు కురిసి పంట చేలన్నీ నీటితో నిండిపోయాయి. సెప్టెంబర్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రేట్లు అందనంత ఎత్తులో ఉంటున్నాయి. -
భాగ్యనగరం.. బతుకమ్మ వేడుకలు
-
బతుకమ్మ శుభాకాంక్షలు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ పండుగను పురష్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు. ( నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం ) బతుకమ్మ 💐🌼సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. 🌷🌻🌹బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.🌺🌻🌹 pic.twitter.com/qM8tHhrpfd — Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2020 -
తెలంగాణ హృదయం– బతుకమ్మ
‘బతుకమ్మ బతుకు / గుమ్మడి పూలు పూయగా బతుకు / తంగెడి పసిడి చిందగా బతుకు/ గునుగు తురాయి కులుకగ బతుకు/ కట్ల నీలిమల చిమ్మగా బ్రతుకు’ అని ప్రజాకవి కాళోజీ తెలంగాణ వారసత్వ సంపద బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియచేశారు. బతుకుతో ఇంత ప్రత్యక్ష సంబంధమున్న పండుగ మరొకటి లేదు. ప్రకృతిలో నిబిడీకృతమైన నిసర్గ సౌందర్యాన్ని తెలంగాణ గుమ్మం ముందు నిలిపిన పండుగ బత్కమ్మ. పుష్పం పునరుత్పత్తికి ప్రతీక, మానవ సమాజం ధరిత్రిపై అవిచ్ఛి న్నంగా కొనసాగడానికి స్త్రీకి ప్రకృతి కల్పించిన ప్రత్యేక ధర్మం సంతానోత్పత్తి. తల్లి కడుపులో శిశువు పెరుగుదలతో పాటు దాని జీవన సారాలన్నీ బొడ్డు తాడు ద్వారానే తీరుతాయి. ఈ బొడ్డు తాడుకు, మహత్మ్యాన్ని, దైవత్వాన్ని అపాదించి రూపం కలిపిస్తే బొడ్డెమ్మ అవుతుంది. ఈ మహోన్నత పవిత్ర కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవడం కోసం పూలను బత్కమ్మగా, బొడ్డెమ్మగా కొలిచే అద్వితీయ సాంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం. తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్ట, పువ్వు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్య పాలకులు తెలంగాణ అంతటా చెరువులను తవ్వించడం ఒక ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు. చెరువులను అభివృద్ధికి ప్రతీకలుగా భావించారు. అప్పటినుండి ఈ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ వస్తున్నారు. చిరు మార్పులతో ఆనాటి పండుగను నేటికీ జరుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండేది చెరువుల వల్లే కాబట్టి అందరూ కలిసి ఏడాదికొకసారి చెరువులకు పూలతో కృతజ్ఞతలు చెప్పేవారు. అందుకే బతుకమ్మ చెరువుల పండుగ. పండుగ జరిపే నాటికి వర్షరుతువు ముగిం పులో ఉంటుంది. చెరువులు, కుంటలు నీలి బంగారంతో నిండి ఉంటాయి. ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉంటుంది. రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది. బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. పండుగ కొనసాగుతున్న 18 రోజులు పంచే ఫలహారాలలో పుష్కలమైన ఖనిజ, విటమిన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. లయబద్ధమైన పాదపు కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలు గల పాటలతో రసరమ్య మోహనరాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను చిక్కపరిచే బతుకమ్మ చిరకాలం వర్ధిల్లుతూనే ఉంటుంది. అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, వరంగల్ మొబైల్ : 96522 75560 -
పాఠకులు పంపిన బతుకమ్మ సెల్ఫీ ఫొటోలు
-
పూల ధరలు పైపైకి..
సాధారణంగా ఇంట్లో పూజలు, వివాహ శుభకార్యాలకు ఎక్కువగా పూలకు ప్రాధాన్యత ఇస్తారు. పూలను పూజిస్తూ దేవుళ్లుగా భావించే తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది బతుకమ్మ పండుగ. పూల పండుగ అంటే ఊరూ వాడ బతుకమ్మ సందడి. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలైన పూల జాతర సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. వివిధ రకాల పువ్వుల్లో ఔషధ గుణాలుంటాయని, బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తే చెరువు నీటిలో ఉండే క్రిములు చనిపోయి నీరు శుభ్రమవుతుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న బతుకమ్మ పండుగ పూలు సాగు చేసే రైతులను నిరాశకు గురి చేసింది. సాక్షి, సంగారెడ్డి: ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్న దిగుబడి రాకపోవడంతో పండుగ సందర్భంగా బతుకమ్మ బంతి పైపైకి లేస్తోంది. పూల పండుగైన బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పువ్వులకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మకు బంతి, ముద్ద బంతి, తంగెడు, చామంతి, పట్టుకుచ్చుల పువ్వులకు భలే గిరాకీ పెరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని పందిల్లకు చెందిన గూళ్ల రవి తనకున్న భూమిలో బంతి, చామంతి, మల్లె, కనకంబురాల, పట్టుకుచ్చుల సాగు చేశాడు. సాగు చేసిన తోటలు కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ సందర్భంగా రవి ఎకరం కనకంబురాలు, 10 గుంటలు పట్టుకుచ్చులు, 10 గుంటలు బంతి, 10 గుంటలు మల్లె పూలు సాగు చేశాడు. ముసురు వర్షాలతో పూల సాగు అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. కొద్దోగొప్పో పూలు పూసిన బంతి పూలు గుత్తులతో నిగనిగలాడుతోంది. కిలోకి రూ.50కి పైనే.. సాధారణ రోజుల్లో ఒక కిలోకు రూ.30 ధర పలుకుతుందని, పండగ వేళల్లో మార్కెట్లో కిలో బంతికి రూ.50 పలుకుతుందని రైతు తెలిపారు. పూల సాగు లాభదాయకమని నమ్మిన రైతు రకరకాల పువ్వుల సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ బంతి పూల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఏ పల్లె, ఏ ఊరు, ఏ వాడలో చూసిన బతుకమ్మ ఆటలతో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పూల ధరలకు రెక్కలచ్చాయి. తుంపురు వర్షాలతో, ఉన్న నీటితో వ్యవసాయం సాగు చేస్తున్న రైతులు పూల తోటలపై ఎక్కువ దృష్టి సారించకపోవడంతో బతుకమ్మ పండుగకు అవసరమయ్యే పూల ధరలు కొండనెక్కి కూర్చున్నాయి. మరో మూడు రోజుల్లో పూల జాతర రానుండటంతో బంతి పూల ధరలు జనానికి చుక్కలు చూపెట్టనున్నాయి. మండుతున్న ధరలు ఓ వైపు బతుకమ్మ సంబరాలు, మరో వైపు వర్షాలు లేక పూల తోటల సాగు తగ్గిపోవడంతో పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్నాబాద్ మార్కెట్లో పూల ధరలు మండుతున్నాయి. బంతి కిలోకు రూ.100, చామంతి కిలోకు రూ.400, కాగడ మల్లెపువ్వులు రూ.700, గులాభి రూ.400 ధరలు పలుకుతుండటంతో జనాలు బెంబలెత్తిపోతున్నారు. దీంతో పాటుగా పట్టుకుచ్చుల పువ్వులు ఒక్క కట్టకు రూ.20 పలుకుతుంది. ఇది కూడ నేరుగా రైతులు అమ్మితేనే ఈ ధర పలుకుతుంది. బతుకమ్మ పండుగ సందర్బంగా గునుగు. తంగేడు, పట్టు కుచ్చులు, చామంతి, బంతి పువ్వులను అధికంగా వాడుతారు. ప్రస్తుతం ఉన్న ఈ పూల ధరలు బతుకమ్మ పండుగ వరకు ఇంకా పెరగవచ్చని పూల వ్యాపారులు చెబుతున్నారు. పూల ధరలు పెరిగినయ్ బతుకమ్మ సందర్భంగా పూల ధరలు పెరిగినయ్. గతం కంటే ఈ ఏడాది పూల దిగుబడి తగ్గడంతో ధరలు అంతకంతకు పెరిగాయి. హోల్‌సెల్ ధరలు సైతం ఎక్కువ పెంచారు. బంతిపూలు కిలోకు రూ.100కు పైగా అమ్ముతున్నాం. పూల డిమాండ్‌ను బట్టి పండుగ రోజున బంతి పూల ధర రూ.200 వరకు పెరిగే అవకాశాలున్నాయి. – షబ్బీర్, పూల వ్యాపారి, హుస్నాబాద్ దిగుబడి తగ్గింది పండుగను బట్టి పూల సాగు చేపడుతాను. బతుకమ్మ పండుగ సందర్భంగా 10 గుంటల్లో బంతి పూల విత్తనాలు చల్లితే, సగం నష్టం వచ్చింది. ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ పువ్వులను సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్‌కు తరలించి అమ్ముతున్నాను. కిలోకి రూ.50 ధర పలుకుతోంది. – గూళ్ల రవి, రైతు, పందిల్ల -
లండన్‌లో బతుకమ్మ వేడుకలు
సాక్షి,సిటీబ్యూరో: వాడవాడలా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా..ఖండాంతరాలకు వ్యాపించాయి. ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం’ ఆధ్వర్యంలో ‘అక్షరజ్యోతి’ నేతృత్వంలో లండన్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ సంప్రదాయపద్దతిలో హాజరై ఆటపాటలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా లండన్‌లో తెలంగాణ వాతావరణం అలుముకుంది. -
సాంస్కృతిక ఆయుధంగా బతుకమ్మ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పండుగను స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతికే దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేయడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కృషిని కొనియాడుతూ జాగృతి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్లో బుధవారం కేటీఆర్ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను నిషేధించిన సందర్భంలో హైకోర్టుకు వెళ్లి మరీ తెలంగాణ జాగృతి అనుమతి సాధించి వేడుకలు నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దశాబ్ద కాలంగా జాగృతి ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం అద్భుతమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో మహిళలను భాగస్వాములుగా చేసింది తెలంగాణ జాగృతేనని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మెచ్చుకున్నారు. -
సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తం గా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరా ధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుం దన్నారు. బతుకమ్మ ఆడే దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. -
బతుకునిచ్చే పూలదేవత
సాక్షి, మొయినాబాద్(చేవెళ్ల): ‘బతుకమ్మ అంటే పూల పండుగ.. ప్రకృతి పూలను అందంగా అలంకరించి పూజించే దేవత బతుకమ్మ. విగ్రహం లేకుండా పూజలందుకునే పూల దేవత. ఈమహోత్సవం సామాజిక సందేశం అందిస్తుందంటు’న్నారు చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్ మాటల్లోనే బతుకమ్మ విశిష్టతను తెలుసుకుందాం. శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా.. అంటూ సాగే బతుకమ్మ పాట ప్రసిద్ధమైనది. బతుకమ్మ సర్వదేవతాస్వరూపం. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ దేవీలు బతుకమ్మ స్వరూపంగా భావించి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మను ఆరాధిస్తారు. సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, వైభవం, విద్య సంపదలను ఇవ్వాలని గౌరమ్మ రూపంలో కొలుస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక పండుగలు, పర్వాలు జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగంగా కొద్దిపాటి తేడాతో పండుగలు నిర్వహిస్తారు. కానీ తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగ మాత్రం ఈ ప్రాంత ఆత్మను ప్రకటిస్తుంది. జనసామాన్యంలో నుంచి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. బతుకమ్మకు జీవించు–బతికించు అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించేతత్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే దానికి మూలం బతకమ్మలో కనిపిస్తుంది. బతుకమ్మ పండుగకు గొప్ప చారిత్రక ఆధారం కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయులు గొప్పగా పాలించారు. కాకతీయ రాజ్యపాలకుడైన ‘గుండన’ పాలనలో పొలం దున్నతుండగా గుమ్మడితోటలో ఓ స్త్రీదేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో కాకతి అని పిలుస్తారు. గుమ్మడితోటలో లభించినందువల్ల కాకతమ్మ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. రాజులతోపాటు ప్రాంత ప్రజలు కూడా పూజించేవారు. రానురాను విగ్రహం కన్నా విగ్రహం ముందు పూలకుప్పలు పోసి వాటిని పూజించడం మొదలు పెట్టారు. పూలకుప్పలే దేవతా స్వరూపంగా మారిపోయింది. కాకతమ్మ అనే శబ్ధం క్రమంగా భాషాశాస్త్రపరంగా ఉచ్చరణలో బతుకమ్మ పేరుగా మారినట్లు పరిశోధకులు డాక్టర్ కసిరెడ్డి తెలియజేశారు. బతుకమ్మలో సామాజిక సందేశం పూలతో ఆరాధించే బతుకమ్మకు ఎలాంటి విగ్రహం లేదు. ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను ఒక్కచోట పేర్చి బతుకమ్మగా అలంకరిస్తారు. ఏ జీవి అయినా మట్టిలో నుంచి పుట్టి చివరకు మట్టిలోనే కలిసిపోతుందనే సామాజిక సందేశం బతుకమ్మలో కనిపిస్తుంది. మట్టి నుంచి పుట్టిన చెట్టు. ఆ చెట్ల నుంచి వచ్చే పూలు, పూలతో తయారైన బతుకమ్మ నీటిలో కలిసిపోయి మళ్లీ మట్టిగా మారుతుంది. అలాగే జీవులన్నీ ఎక్కడి నుంచి పుట్టినా భోగాలు అనుభవించి చివరకు మళ్లీ మట్టిలోనే కలుస్తాయనే ఆధ్యాత్మిక, తాత్విక సందేశాన్ని బతుకమ్మ పండుగ ఇస్తుంది. -
యూరోప్ దేశాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
యూరోపియన్ దేశాలైన డెన్మార్క్, స్వీడన్, ఫ్రాన్స్, నార్వే, లాత్వియా, జర్మనీల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. యూరోప్ తెలంగాణ అసోసియేషన్ (ఈటా) ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఈటా వ్యవస్థాపకుడు శ్యామ్ బాబు ఆకుల తెలిపారు. డెన్మార్క్‌లో రాజిరెడ్డి గడ్డం, రూపేష్ జైస్వాల్ నిర్వహించగా, స్వీడన్లో మహేందర్ శర్మ, ఫ్రాన్స్‌లో నీల శ్రీనివాస్, నార్వేలో వై వీ శ్రీనివాస్, లాత్వియాలో క్రాంతి పాశికంటి, జర్మనీలో ఈటా సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. -
తెలంగాణ అంటేనే బతుకమ్మ :ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు సుఖ శాంతులతో, సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అని, మహిళలకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగల్లో బతుకమ్మ ప్రధానమైనదన్నారు. ఈ ఏడాది పల్లెలన్నీ ఆడపడుచులతో కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఆడ బిడ్డలను కేసీఆర్ ఘెరంగా అవమానించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
పంచాయతీ పాలన అస్తవ్యస్తం..!
సాక్షి, కరీంనగర్: గ్రామ పంచాయతీల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆగస్టు 2తో సర్పంచ్ల పదవీకాలం ముగియండంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో పోలుపోలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో కార్యదర్శికి ఐదారు గ్రామ పంచాయతీలు అప్పగించడంతో ఏ పని చేయాలో తోచని పరిస్థితి వారిది. ఇటీవల నియమించిన ప్రత్యేక అధికారుల నియమాకం కూడా ముందునుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. నిధులున్నా.. వాడుకోలేని దుస్థితి. గ్రామాల్లోని పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాట్లు, మంచినీటి సమస్య, క్లోరినేషన్ వంటి పనులకు నిధులున్నా ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక అధికారులు గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోక పోవడంతో పంచాయతీ పాలన గాడి తప్పుతోంది. గ్రామ కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు గ్రామాల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా కార్యదర్శి బాధ్యత కీలకం. ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలోని గ్రామాల్లో అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాల్సింది గ్రామ కార్యదర్శులే. గ్రామ పంచాయతీలు అభివృద్ధికి పట్టుకొమ్మలు అనే నానుడిని అధికార యంత్రాంగం విస్మరిస్తుండడంతో గ్రామపంచాయతీ పాలన గాడి తప్పుతోంది. జిల్లాలో పాతవి 276 గ్రామ పంచాయతీలు, కొత్తవి 54 గ్రామపంచాయతీలున్నాయి. మొత్తం 330 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 109 మంది కార్యదర్శులు పనిచేస్తుండగా.. 167 ఖాళీలున్నాయి. ఇదో లెక్క.. దీనికి మరో లెక్క కూడా ఉంది. ఇప్పటికే క్లస్టర్ గ్రామాల పేర ప్రభుత్వం కొన్నింటిని ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 136 క్లస్టర్‌గ్రామాలకు 27 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి రెండుమూడు, ఒక్కొక్క చోట నాలుగేసి పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్ గ్రామంగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఎందుకు జరిగిందో అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. నేరుగా ప్రజలతో సంబంధం ఉండి ఆ గ్రామానికి సేవ చేసేందుకు పంచాయతీలు ఉపయోగపడుతుంటాయి. ఇలాంటి సమయంలో క్లస్టర్ల ఏర్పాటు ఎందుకు జరిగిందో.. ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో బయటపెట్టడం లేదు. ఈ క్రమంలో పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్థిక కోణంలో పరిశీలిస్తే కార్యదర్శుల సంఖ్య తగ్గించేందుకే ఆ పని చేసినట్టు తెలు స్తోంది. ఒక్కో పంచాయతీకి ఒక కార్యదర్శిని ఇవ్వడానికి బదులు రెండుమూడు పంచాయతీలను కలిపి క్లస్టర్ గ్రామంగా ఎంపిక చేయడం వెనుక ఒకే కార్యదర్శితో వెల్లదీసే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవస్థ మరింత అధ్వానంగా ఉంది. క్లస్టర్ల పరంగా చూస్తే ఖాళీలు 27గానే కనబడుతున్నాయి. పంచాయతీల పరంగా 167 ఖాళీలున్నా యి. పనిచేస్తున్నవారు 109 మందే కావడంతో సగానికి పైగా ఖాళీలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి అరడజన్ పంచాయతీలకు సైతం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న తీరు కొనసాగుతోంది. పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా 90 శాతం పన్నులు వసూలు చేశాయి. పంచాయతీలకు రావాల్సిన 14 ఆర్థిక సంఘం నిధులు రెండు దశల్లో రూ.25 కోట్లు వచ్చాయి. అంగన్వాడీ భవనాల నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీలకే అప్పగించారు. ఇప్పటికే వీధిదీపాలు, పారిశుధ్య పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి దశలో ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి చొప్పున కేటాయిస్తే అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త పంచాయతీ డివిజన్లు ఏర్పాటు చేయకపోగా.. డివిజన్ పంచాయతీ అధికారి పోస్టులను ఎత్తేశారు. వారిని కొత్త జిల్లాలకు పంపారు. అన్ని బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారి మాత్రమే చూస్తున్నారు. దీంతో పనుల ఒత్తిడితో పంచాయతీ పాలన క్షేత్రస్థాయిలో ప్రజలదరికి చేరకపోవడంతో అనుకున్న మేరకు అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇకనైనా పంచాయతీ కార్యదర్శుల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసి గ్రామపంచాయతీలను పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పట్టించుకోని ప్రత్యేకాధికారులు పంచాయతీల పాలన వ్యవహారాలను చూడటానికి నియమించిన ప్రత్యేక అధికారులు రెవెన్యూ, వ్యవసాయ, ఇంజినీరింగ్, విద్య తదితర శాఖల అధికారులకు అప్పగించడంతో వారు రోజువారీ కార్యాలయాల పనులు పూర్తి చేయడంతోపాటు పల్లెల్లో పాలన వ్యవహారాలు చూడాల్సివస్తోంది. ఆయా శాఖల అధికారులు రైతుబీమా, రైతుబంధు, ఓటరు నమోదు, సర్వేలు, వంటి అనేక కార్యక్రమాల్లో తలమునకలై ఉండడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి. బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై అయోమయం ఈనెల 17, 18 తేదీల్లో జరిగే బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై గ్రామపంచాయతీల్లో నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్ల పదవీకాలం ముగియడం, కార్యదర్శుల కొరత, ప్రత్యేక అధికారుల లేమి దీనికితోడు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉన్న అధికారులంతా బిజీగా ఉండడంతో గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలు, బతుకమ్మ, దసరా ఏర్పాట్ల నిర్వహణపై ఎవరికి చెప్పుకోవాలో..? ఏం చేయాలో..? తోచని పరిస్థితి గ్రామప్రజల్లో నెలకొంది. కొన్ని గ్రామాల్లో తాజా మాజీ సర్పంచ్‌లు, ఔత్సాహిక యువకులు, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే వారు అక్కడక్కడ పండుగల ఏర్పాట్లపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప మెజార్టీ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో బతుకమ్మల నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్న ట్యాంక్ -
జర్మనీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
-
‘బతుకమ్మ పండుగపై కూడా ఈసీని ఆశ్రయిస్తారేమో..!’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు టీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు ఏపీని వదిలి తెలంగాణకు వచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలలు కూడా చంద్రబాబే దిక్కని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు బతుకమ్మ పండుగపై కూడా ఈసీని ఆశ్రయించినా ఆశ్చర్యపడనక్కర్లేదని వ్యంగ్యంగా స్పందించారు. -
జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు
ఆదిలాబాద్‌అర్బన్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు జిల్లాకు చేరాయి. తొమ్మిది రోజుల పాటు సందడి వాతావరణంలో జరిగే తీరొక్క పూల పండుగకు ఈ సారి ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచన చేసింది. దసరా పండుగకు ముందే మహిళా లబ్ధిదారులకు ‘కానుక’ అందజేయనుంది. ప్రభుత్వ ఈ పథకానికి గతేడాది శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. అయితే గతేడాది మాదిరి కాకుండా ఈ సారి రూ.300 నుంచి రూ.350 విలువైన బార్డర్ అంచుతో ఉన్న పాలిస్టర్ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారనే వివరాలను అధికారులు సేకరించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి కూడా మహిళా లబ్ధిదారుల వివరాలు అందాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను త్వరలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు 1.19 లక్షల చీరలు.. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 2,37,867 మంది మహిళా లబ్ధిదారులు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంగా గుర్తించారు. అయితే పంపిణీ బాధ్యతను మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. జిల్లాకు మొదటి విడతగా లక్షా 19 వేల చీరలు వచ్చాయి. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలను ఆయా మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లో భద్రంగా ఉంచారు. జిల్లా కేంద్రంలో గల మార్కెట్ యార్డులో 38 వేల చీరలు అందుబాటులో ఉంచగా, ఇచ్చోడ మార్కెట్లో 48,480 చీరలు, నార్నూర్ మార్కెట్లో 20 వేలు, ఇంద్రవెల్లి మార్కెట్లో 28 వేల చీరలను భద్రపర్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా చీరలు రాకపోవడంతో రెండో విడత చీరలు సరఫరా చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. గోదాముల నుంచి గ్రామాలకు చీరలు సరపరా చేసి ఆయా గ్రామాల్లోనే మహిళలకు పంపిణీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ పండుగలను పురస్కరించుకొని మైనార్టీలకు, క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో హిందూ మహిళలకు సైతం చీరలు పంపిణీ చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ.. గతేడాది చీరల నాణ్యతపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వ్యతిరేకత ఈసారి రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పంపిణీ సమయంలో కొత్త చీరలు నలిగిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అయితే ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేయనుండడంతో రాష్ట్రంలోని చేనేత కార్మిక కుటుంబాలకు చాలా వరకు ఉపాధి దొరకడంతో పాటు చేనేత వస్త్రాలపై ప్రజలకు కూడా అవగాహన వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే జిల్లాకు వచ్చిన చీరలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు. ఈ సారి మహిళా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, రేషన్ డీలర్లు చీరలను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పంపిణీకి రెవెన్యూ, పోలీస్ అధికారులు సైతం సహకరించనున్నారు. కాగా, ఈ ఏడాది బతకుమ్మ సంబరాలు అక్టోబర్‌లో జరుగనున్నాయి. -
నేడు మహా బతుకమ్మ వేడుకలు
-
‘బతుకమ్మ’తో బతుకుదెరువు
- కేటీఆర్ చొరవతో.. నేతన్నకు చేతినిండా పని.. - సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మొత్తం రూ.151.76 కోట్ల ఆర్డర్లు - ఆర్వీఎం, కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, కేజీబీవీ వస్త్రాలు - 15 వేల మంది నేత కార్మికులకు పవర్‌లూమ్స్ ద్వారా పని సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్రపరిశ్రమలో పనిచేసే చేనేత కార్మికులకు ముందుగానే బతుకమ్మ పండుగ వచ్చింది. కార్మికుల ఆత్మహత్యలు.. ఆకలిచావులతో నిత్యం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వస్త్ర పరిశ్రమను గాడిలో పెట్టేందుకు, కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలోనే వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా చీరలు అందించేందుకు నిర్ణయిం చింది. ఇందుకు 86 లక్షల చీరలు అవసరమని గుర్తించింది. వీటి తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చింది. ప్రస్తుతం పవర్‌లూమ్స్(మరమగ్గాల)పై చీరల ఉత్పత్తి శరవేగంగా సాగుతోంది. రూ.151.76 కోట్ల ఆర్డర్లు..: రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ద్వారా స్కూల్ విద్యార్థుల యూనిఫామ్స్ కోసం కోటి మూడు లక్షల మీటర్ల వస్త్రాన్ని రూ.40.76 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసింది. ఈ వస్త్రాన్ని సిరిసిల్ల నేతకార్మికులు తయారు చేసి అందించారు. ఆ వెంటనే కేసీఆర్ కి ట్ల కోసం 1.18 లక్షల చీరలకు ఆర్డ ర్లు వచ్చాయి. ఒక్కో చీర, జాకెట్ ఉత్పత్తికి 6.30 మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. కేసీఆర్ కిట్ల కోసం మొత్తంగా 7.43 లక్షల మీటర్ల వస్త్రాన్ని తయారు చేసి అందించారు. దీని ద్వా రా నేతన్నలకు రూ.1.32 కోట్ల ఆదాయం సమకూరింది. కేసీఆర్ కిట్ల కోసం నెలకు 50 వేల చీరలకు 3.15 లక్షల మీటర్ల వస్త్రాన్ని అందించాల్సి ఉంది. దీని ద్వారా ప్రతినెలా రూ.56 లక్షల ఉపాధి వస్త్ర పరిశ్రమకు లభిస్తుంది. బతుకమ్మ పండగకు 86 లక్షల మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం ఆర్డర్లు ఇ చ్చింది. ఇందుకోసం 5.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంది. దీంతో సిరిసిల్లలోని మరమగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తి జోరుగా సాగుతోంది. వీటి ఆర్డరు విలువ రూ. 113 కోట్ల మేరకు ఉంటుంది. చేనేత, జౌళిశాఖ ద్వారా నేతన్నలకు ఈ ఏడాది రూ.151.76 కోట్ల విలువైన ప్రభుత్వ ఆర్డర్లు వచ్చాయి. నేత కార్మికులకు మెరుగైన ఉపాధి.. సిరిసిల్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34 వేల మరమగ్గాలు ఉండగా.. ఇందులో 7 వేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. మరో 27 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి చేస్తున్నారు. పాలిస్టర్ గుడ్డ మీటరుకు రూ.5 నుంచి రూ.6కు అమ్ముడుపోయేది. కానీ, ప్రభుత్వ ఆర్డర్లతో మెరుగైన కూలిని నిర్ణయించారు. బతుకమ్మ చీర ధర రూ.230 ఉండగా.. వస్త్రం ఖరీదు తెల్లదానికి రూ.112, కలర్ బట్టకు రూ.148గా నిర్ణయించారు. ఇందులో ఒక్కమీటరుకు ప్లెయి న్ బట్టకు కూలిగా రూ.5 గా నిర్ణయించారు. ఇందులో పనిచేసిన కార్మికుడికి రూ.2.25, సాంచాల యజమాని(ఆసామికి) మీటరుకు రూ.2.75 నిర్ణయించారు. కలర్బట్ట మీటరు ధర రూ.6గా నిర్ణయించగా ఇందులో కార్మికుడికి మీటరుకు రూ.3, ఆసాములకు రూ.3 కూలి చెల్లిస్తారు. ఎనిమిది రంగులతో చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. తద్వారా శ్రమించే కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. ఒక్కోకార్మికుడికి నెలకు రూ.12 వేల వరకు ఆదాయం గిట్టుబాటవుతోంది. మరోవైపు.. ఆసాములకు మంచి బతుకుదెరువు సమకూరుతోంది. సిరిసిల్లలో ఐదువేల మగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది.10 వేల మంది కార్మికులు, మరో 3,500 మంది అనుబంధ రంగాల కార్మికులు, 1,500 ఆసాములు బతుకమ్మ చీరలతో ఉపాధి పొందుతున్నారు. మళ్లీ క్రిస్మస్ ఆర్డర్లు.. బతుకమ్మ వస్త్రోత్పత్తి ఆర్డర్లు పూర్తికాగానే క్రిస్మస్ ఆర్డర్లు సిరిసిల్లకు రానున్నాయి. ఇప్పటికే కేజీబీవీ స్కూల్స్ విద్యార్థులకు చెక్స్ డిజైన్ సూటింగ్, షర్టింగ్ వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్ వస్త్రోత్పత్తిదారులకు ఇచ్చారు. బతుకమ్మ చీరలకు 40 రకాల రంగులను ప్రింట్ చేయనున్నాయి. ఓపెన్ టెండర్ ద్వారా ప్రింటింగ్ ఆర్డర్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబరు 1 నాటికి ఆర్డర్లు పూర్తిస్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్, ఆర్వీఎం, కేజీబీవీ, అంగన్వాడీ, వైద్య, ఆరోగ్యశాఖ ఆర్డర్లతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని లభిస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి లభించనుంది. -
అంబరమంటిన సద్దుల సంబరం
-
ఊరికి పోదాం..చలో.. చలో...
అసలే దసరా, బతుకమ్మ పండుగలు.. సిటీలో ఏముంది.. మనూరికి పోతే అందరినీ చూడొచ్చు.. చిన్ననాటి మిత్రులు,హితులు, సన్నిహితులు, బంధువులు.. అందరినీ పలకరిస్తే మనసుకెంతో హాయి.. సంవత్సరానికోసారే కదా అందరం కలిసేది.. మళ్లీ ఎప్పుడో.. అందుకే ఊరికి పోయొద్దాం అనుకుంటున్నారు నగరవాసి. ఊళ్లకెళ్లే వారితో నగరంలోని రైల్వేస్టేçÙన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి సికింద్రాబాద్రైల్వే స్టేషన్లో ఆదివారం కనిపించిన ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్షి – ఫొటోలు: ఆడెపు నాగరాజు -
గాజుల వ్యాపారులు బిజీ
కౌడిపల్లి: బతుకమ్మ పండుగ నేపథ్యంలో బ్యాంగిల్స్టోర్ బిజీగా ఉంది. బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకం. మహిళలు గాజులు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడంతో దుకాణాలు బిజీగా మారాయి. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం, సోమవారం సైతం బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. -
గిన్నీస్ బుక్ రికార్దు కోసం
-
బతుకంతా పండుగ కావాలి!
సమకాలీనం పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ ప్రకృతి పూజే! పూలు నవ్వినట్టే స్త్రీలు సంతోషంగా ఉండాలి. బతుకమ్మ పండక్కి పుట్టింటి కి ఆడబిడ్డలొస్తేనే కళ. కొడుకైతేనేం, కూతురై తేనేం అన్న ధ్యాస, ఆడ బిడ్డే ఇంటికి కళ అన్న స్పృహ తగ్గుతోంది. గతంలో ఈ పండుగ నాటికి వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి స్పందిస్తుందేమో! ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాలతో పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. అలాగే మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి. పల్లెకు పండుగొచ్చింది. అంతకు ముందే పండుగ కళొచ్చింది. ప్రకృతి చల్లని చూపూ తోడవడంతో తెలంగాణ చెరువులన్నీ నేడు నీటితో నిండి కళకళలాడు తున్నాయి. చెరువంచుల్లో ఏపుగా ఎదిగిన సర్కారు తుమ్మ కొమ్మ కొసలు, తూటి పొద చివర్లు వయ్యారంగా వంగి నీటిని ముద్దాడుతున్నాయి. పల్లెకు ఆనుకొనో... ఆ పక్కో, ఈ పక్కో నెలకొన్న చెరువుల్లో పరుపులా పరుచుకున్న నీరు ఎండకు వెండిలా తళుక్కున మెరుస్తోంది. మొత్తమ్మీద ఊరి వెలుగే వేరుగా ఉంది. ఊరూరా బతుకమ్మల ఆటలు జోరుమీదున్నాయి. రంగుల కల బోతగా బారులుతీరిన మహిళలు పల్లెకాంతికి వర్ణాలద్దుతున్నారు. అంతటా ఆనందం వెల్లివిరుస్తోంది. బతుకు కథలే నేపథ్యంగా అల్లుకున్న బతుకమ్మ పాటలు ఊరుమ్మడి స్వరాలై ఉబికి వస్తున్నాయి. సాయంత్రం ఆట కాగానే రోజువారీ బతుకమ్మలు చెరువుల్ని చేరి, అలల కదలికలపై తేలుతూ సాగు తున్నాయి. ఆఖరునాడు సద్దుల బతుకమ్మ, ఆ పైన దసరా! అదే రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం. పాలనా వికేంద్రీకరణ, దశాబ్దాల కలకు కార్యరూపం. ఇక సందడే సందడి! పండుగంటేనే సంబురం. ఏటా పండుగలొస్తుంటాయ్, పోతుంటాయ్! మనస్ఫూర్తిగా ఆనందం నింపే పండుగలే ప్రత్యేకంగా నిలు స్తాయి. ఈసారి రాష్ట్రమంతా నెలకొన్న వాతావరణమే అలా ఉంది. పాత బంగరు రోజులు గుర్తొస్తున్నాయి. అన్నీ వ్యవసాయాధారిత గ్రామాలయినం దుకేమో... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పండక్కి ముందే కళ వచ్చేసింది. కాలం కలిసివస్తేనే ఏదైనా! ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... ప్రకృతి సహకరించకపోతే, అవేవీ పూర్తి ఫలితాలి వ్వవు. ప్రభుత్వాలు చొరవ తీసుకోకున్నా ప్రగతి శూన్యం. సంవత్సరాల తరబడి వర్షాలు లేక కరవుతో అల్లాడినా క్రమం తప్పకుండా ఏటా పండుగలు వస్తూనే ఉంటాయి! కానీ, పండుగ పండుగలా ఉండదు. ఆనందం అడుగం టుతుంది. అంతా మొక్కుబడి వ్యవహారంలా సాగుతుంది. బలవంతంగా ముఖానికి నవ్వు పులుముకోవడమూ కష్టమౌతుంది. కాస్త ఆలస్యమైనా ఇటీవల వర్షాలు బాగా కురిశాయి. అంతకు ముందు... సకాలంలో వానలు రాక కొంత, పండిన అరకొర ఖరీఫ్ పంట దెబ్బతిని ఇంకొంత నష్టపోయింది రైతాంగం. ఈ పరిస్థితి వినాయక చవితి పండుగలో కనిపించింది. కానీ, రబీ పంటలకు భరోసా కల్పిస్తూ సమృద్ధిగా కురిసిన వానలు, నిండిన చెరువులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు కల్పిస్తున్నాయి. మిషన్ కాకతీయ పుణ్యమా అని భూగర్భజల మట్టాలూ పెరిగాయి. సదరు ఆనందం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఊరూరా ప్రతిబింబిస్తోంది. దీనికొక శాశ్వతత్వం కావాలి. సమానావకాశా లతో మహిళలకు మంచి రోజులొచ్చి, ఉపాధి దొరికి యువతరం పెడదారి వీడితే గ్రామాల్లో ఆనందం పండుగై కలకాలం నిలుస్తుంది. ప్రకృతికి ప్రతీక బతుకమ్మ వర్షాకాలం మొదలయ్యాక విరివిగా పూసే పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ నిజానికి ప్రకృతి పూజే! గుమ్మడాకులో అందంగా పేర్చే బతుకమ్మకు నిండుగా నవ్వుతున్నట్టుండే తంగేడు, గునుగు పూలు తప్పనిసరి. నట్టింట మహిళలు కలకాలం నవ్వుతూ ఉంటేనే బతుకు పండుగకు సంబురం! ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరితానుండనొల్లద’న్న పెద్దల మాట అక్షర సత్యం. బతుకమ్మలో పూలు నవ్వినట్టే ఇంటింటా స్త్రీలు సంతోషంగా ఉండాలి. ‘పుష్పలావికల’ని వ్యాసం రాస్తూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి అన్నట్టు ఆడపిల్లలంటేనే పూలు. పెళ్లయిన కొత్తలో అయిదారేళ్ల దాకా అమ్మాయిలు తప్పనిసరిగా బతుకమ్మ పండక్కి పుట్టింటికొస్తారు. అప్పుడా ఇంటి కళే వేరు! పది రోజుల పాటు సందడి సందడిగా ఉంటుంది. తలిదండ్రుల కళ్లల్లో ఆ వెలుగు ప్రతిఫలిస్తుంది. కూతురైతేనేం? కోడలైతేనేం? ఆడపిల్ల ఆడపిల్లే! ఆ స్పృహ మనవాళ్లకి కొరవడుతోంది. కొడుకైతేనేం? కూతురైతేనేం? బిడ్డ బిడ్డే! అన్న ధ్యాసా తగ్గుతోంది. మానవసంబంధాలు మాసిపోయి ఆర్థికబంధా లుగా మారుతున్న ప్రపంచీకరణలో ఆడపిల్లను భారమని భావిస్తున్నారు. భ్రూణ హత్యలతో పుట్టకముందే కడతేరుస్తున్నారు. 1980-90ల తర్వాత పెచ్చుమీరిన ఈ దురాలోచనల ఫలితం, ఈ రోజు యుక్తవయసు యువతీ- యువకుల నిష్పత్తి గగుర్పాటు కలిగిస్తోంది. పెళ్లీడు మగపిల్లలు పది మంది ఉంటే, అదే వయసు ఆడపిల్లలు నలుగురు కూడా లేరు. మనమెటు పయ నిస్తున్నాం? ఒకప్పుడు ఈ నిష్పత్తి భిన్నంగా ఉంటే సంతోషించేవారు! ‘‘ఇద్దరక్క చెల్లెండ్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చి ఉయ్యాలో..... ఒక్కడే మా యన్న ఉయ్యాలో వచ్చన్నా పోడు ఉయ్యాలో’’అని పాడుకోవడంలోనే ఆ ఆర్తి, ఆప్యాయతలు, అనుబంధం, ఆనందం ప్రస్ఫుటమౌతాయి. ‘‘ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయె ఉయ్యాలో!’’ అంటే బతుకమ్మ పండుగ నాటికి సంతృప్త స్థాయిలో వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి ప్రతిస్పందిస్తుందేమో! ఏమైతేనేం ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలనను వికేంద్రీకరించి అన్ని పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. పురుషులతో పాటు మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి. ప్రభుత్వ విధానాల్లో, అభి వృద్ధి-సంక్షేమ కార్యక్రమాల్లో వారికి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత పెంచాలి. జెండర్ బడ్జెట్ స్పృహ ప్రభుత్వ ప్రతిపాదనల్లో ప్రతిబింబించాలి. అప్పుడే, ఆకాశంలోనే కాదు అవకాశాల్లోనూ సగం నువ్వు సగం నేను అని సగర్వంగా చెప్పగలిగే పండుగ! పండుగంటే అదికాదని చెప్పాలె! వరుస కరువులతో, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైనపుడు తెలుగు పల్లెలు చిన్నబోయాయి. ఊరు వల్లకాడై, ఉపాధి అవకాశాలు ఉట్టెక్కడం వల్ల ముఖ్యంగా నష్టపోయింది గ్రామీణ యువతరం. ఉపాధి వేటలో పలు కుటుంబాలే పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాల వైపు వలసబాట పట్టాయి. చేతి వృత్తుల కుటుంబాలు చెల్లాచెదరయ్యాయి. ఉన్న ఊరి బంధం వీడక, కాస్తోకూస్తో కలిగిన భూమిపై ఆశ చావక కొన్ని కుటుంబాలు గ్రామాల్లోనే మిగిలిపోయాయి. సొంతూళ్లో ఏ ఆదరువూ లేకున్నా... కదిలి వెళ్లే ధైర్యం చాలక, ఉన్నచోటే ఉపాధికి యాతన పడ్డ కుటుంబాలు మరికొన్ని. అలా గ్రామాల్లో మిగిలిపోయిన పేద కుటుంబాల్లో దారిద్య్రం తాండవించింది. ఉపాధిహామీ పథకమైతేనేం, వృద్ధాప్య -వితంతు -వికలాంగుల పెన్షన్ల వల్ల ఆ కుటుంబాలు పదీ పరకా కళ్ల జూశాయి. కొన్ని పేద కుంటుంబాలకు చౌకధరకు బియ్యం, ఇతర నిత్యా వసరాలు లభిం చడంతో కొంత నిలదొక్కుకునే యత్నం చేశాయి. ఆ కుటుంబాల్లోని యువ కుల్లో అత్యధికులు ఎందుకూ కొరగాకుండా పోయారు. విద్యావకాశాలు సరిగా లేక, ఉన్నా వినియోగించుకోలేక మెజారిటీ గ్రామీణ యువత చదు వులు సగంలోనే ఆగిపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాల్లేక యువత గాలి తిరుగుళ్లకు అలవాటు పడింది. 15-16 ఏళ్ల నుంచి 40 దాటిన వారి వరకు తాగుళ్లకు అలవాటు పడ్డారు. డబ్బుంటే బీరు, విస్కీలు, లేకుంటే కల్లు, సారా... ఇలా వ్యసనానికి బానిసలయ్యారు. మెజారిటీ యువకులకు చీకటి పడితే చాలు, ఇంకొందరికయితే పగలు-రాత్రి తేడా లేదు. పండుగ లొస్తే ఇక పట్టపగ్గాలుండవు, మద్యంలో మునిగితేలు తారు. దసరా, సంక్రాంతి వంటి పండుగలు వారి విపరీత చేష్టలకు పరాకాష్ట! అసలు పండుగలొచ్చేదే అందుకని కూడా వారు సూత్రీకరిస్తారు. అది పట్ట ణాలు, నగరాల్లోనూ ఉంది. తాగి కన్నుమిన్నుకానని యువకుల వికృత చేష్టలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటివి ఇతరులకెలా ప్రాణాంత కమవుతాయో నగరంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలే నిద ర్శనం. యువత ఈ దుస్థితి నుంచి బయటపడాలి. పండుగ సంబురాలకు అర్థం అది కాదని గ్రహించాలి. ఒకరి ఆనందం... హద్దులు దాటి స్వయంగా తమకే అయినా, ఇతరులకైనా ఆటంకం, ప్రాణాంతకం కావొద్దని తెలుసు కోవాలి. అరకొరగానే అయినా అందుబాటులో ఉన్న అవకాశాల్ని అంది పుచ్చుకొని ఎదగాలి. అలా పండుగ చేయాలి. ప్రభుత్వాల చొరవతోనే కొత్తగాలి యువశక్తిని వినియోగించుకొని పల్లెల్లో పండుగ జేసే కొత్తగాలి వీయాలి. అందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. జీవనదులు దిగువన ప్రవహిస్తుంటే తెలంగాణ దక్కన్ పీఠభూమిపై ఎగువన ఉన్నందుకు ఇక్కడ చెరువులు, కుంటలే ప్రత్యామ్నాయ జలవనరు. నదులు సమతలంగా పారి, ప్రాజె క్టులు-కాలువల వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. వర్షాలు ఆలస్యంగా కురిసినందువల్ల ఖరీఫ్ పంటలు ఎండిపోయిన ఏపీలోని వెనుక బడిన జల్లాల్లో పరిస్థితి నేడు దయనీయంగా ఉంది. ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్రెడ్డి కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి స్తుంటే రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల్ని ఆదుకోని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. ప్రకృతి సహకరించినపుడైనా వ్యూహా త్మకంగా నడుచుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. చెరువులు నిండు కుండల్లా ఉన్న తాజా పరిస్థితిని సానుకూలంగా మలచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమాభివృద్ధికి పూనుకోవడం ప్రశంసలందుకుం టోంది. ‘‘పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికిబోయిరి.... లారీ లల్లా క్లీనర్లయ్యిర.... పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా... తల్లి దూద్ సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు ఆ బేకరి కేఫ్‌లో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో...’’ అని గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడు తుందో...’ అన్న పాట, విన్న ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. 48 కోట్ల రూపాయలు వెచ్చించి, 4,532 చెరువుల్లో 35 కోట్ల చేప పిల్లల్ని విడవడం ద్వారా భవిష్యత్ గ్రామీణ ఉపాధి అవకాశాల్ని ప్రభుత్వం మెరుగుపరు స్తోంది. ప్రజల బతుకుల్ని పండుగ చేసే తెలివిడి ప్రభుత్వాలకున్నపుడే ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...’ అన్న పాట సార్థకమవుతుంది. - దిలీప్ రెడ్డి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
సాక్షి బతుకమ్మ పాట 2016
-
ఖండాలు దాటిన సంస్కృతి..
-
బతుకమ్మ పండుగ..బతుకుల్లో నిండుగ..
-
బతుకమ్మ పండక్కి వెళ్తూ...
-
బతుకమ్మ పండక్కి వెళ్తూ...
► బతుకమ్మ పండక్కి వెళ్తూ బతుకు కోల్పోయిన తల్లీబిడ్డలు ► వాగులో కొట్టుకుపోయి తల్లితోపాటు ఐదుగురు చిన్నారుల మృతి ► పిల్లలంతా ఆడబిడ్డలే.. వారిలో ఇద్దరు కవలలు.. ఓ 13 నెలల పసిగుడ్డు ► నిజామాబాద్ జిల్లాలో విషాదం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కంగ్టి: వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. అప్పటికీ అక్కడున్న కాపలాదారు వద్దన్నాడు.. కారు డ్రైవర్ వినలేదు.. అలాగే ముందుకుపోనిచ్చాడు.. మధ్యలోకి వెళ్లాక కారు ఆగింది.. ముందుకు నెట్టేందుకు డ్రైవ ర్, మరొకరు దిగారు.. ఇంతలో నీటి వేగానికి కారు కొట్టుకుపోయింది.. చూస్తుండగానే ఆ కారులోని తల్లి, ఆమె ఐదుగురు పిల్లలు జల సమాధి అయ్యారు! బతుకునిచ్చే బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డ సంబరంగా తల్లిగారింటికి వెళ్తుండ గా జరిగిన ఈ ఘోర దుర్ఘటన అందరినీ కలచివేసింది. తల్లితోపాటు ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగామ్‌లో చోటుచేసుకుంది. ఎలా జరిగింది? మెదక్ జిల్లా కంగ్టి మండలం తడకల్ గ్రామానికి చెందిన మాలజంగం రాజు, రాజమణి దంపతులకు ఐదుగురు పిల్లలు. రాజు విద్యుత్ శాఖలో లైన్ మన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజమణి తల్లిగారి ఊరు నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం అన్నారం. బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాజమణిని ఆమె సోదరుడు నవీన్ అన్నారం తీసుకువెళ్లేందుకు వచ్చాడు. శనివారం రాజమణి (29), ఆమె కూతుళ్లు శ్రీయ(7), జ్యోతి(4), జ్ఞాన హస్మిత(3), జ్ఞాన సమిత(3) (వీరిద్దరు కవలలు) దీపాంక్ష (13 నెలలు), నవీన్ కలసి కారులో బయల్దేరారు. కొద్దిరోజుల కిందట చిన్న పాప దీపాంక్షపై వేడి టీ పడడంతో శరీరం కాలింది. అప్పుడే తడకల్లోని స్థానిక ఆసుపత్రిలో చూపించి చికిత్స అందించారు. శనివారం అన్నారం వెళ్తుండగా దారి మధ్యలో పిట్లంలో పాపను మరోసారి డాక్టర్‌కు చూపించాలని భావించారు. కారు కారేగామ్ వద్దకు వచ్చింది. అక్కడ పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కారు వెళ్లడానికి వీలు కాదంటూ వాగు వద్ద కాపలాదారు వారిని వారించాడు. అయినా కారు డ్రైవర్ ఇస్మాయిల్ వినకుండా ముందుకుపోనిచ్చాడు. వాగు మధ్యలోకి వెళ్లిన తర్వాత కారు ఆగిపోయింది. కారులోనుంచి ఇస్మాయిల్, నవీన్ బయటకు వచ్చారు. కారును ముందుకునెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఒక్కసారిగా వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న రాజమణి, ఆమె ఐదుగురు పిల్లలు వాగులో కొట్టుకుపోయి మరణించారు. ఘటన తెలుసుకున్న పిట్లం, కంగ్టి పోలీసులు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తున్నా తాళ్ల సాయంతో వాగులోకి దిగి కారు ఆచూకీని గుర్తించి బయటకు తీశారు. కారు నుంచి తల్లితో సహా ఐదుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఇస్మాయిల్ మద్యం సేవించి కారు నడుపుతున్నాడని స్థానికులు, రాజమణి తమ్ముడు నవీన్ తెలిపారు. సీఎం సంతాపం కారేగామ్‌లో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. పిల్లల్లేని ఇంట్లో నేనెలా ఉండాలి ‘‘పిల్లలను ఎంతో గారాబంగా పెంచుతున్నా.. వారి కోసమే కారు కొన్నా.. అదే కారు పిల్లలతోపాటు నా భార్యను మృత్యు ఒడిలోకి లాక్కెళ్లింది..’’ అంటూ జంగం రాజు రోదించారు. పిల్లల్లేని ఇంట్లోకి ఇక ఎలా వెళ్లాలంటూ విలపించారు. -
వరంగల్‌లో బతుకమ్మ సంబరాలు
-
‘బతుకమ్మ’కు అంతర్జాతీయ గుర్తింపు
• 10వేల మందితో 8న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ • మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పండుగకు గిన్నిస్ రికార్డుల్లో చోటు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 8న ఎల్బీ స్టేడియంలో 10వేల మంది మహిళలతో బతుకమ్మ పండుగ జరుపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8న ప్రభుత్వం తరఫున ఉత్సవాలు జరుగుతాయని, 9న ప్రజలు పెద్ద బతుకమ్మను నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో 8న జిల్లాల్లో కూడా వెయ్యి మంది మహిళలతో ఉత్సవాలు జరుపుతారన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద 9న పెద్ద బతుకమ్మను వినాయక నిమజ్జనం తరహాలో నిర్వహిస్తామన్నారు. పండుగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. బతుకమ్మ ఉత్సవాల కోసం పాత జిల్లాలకు రూ. 10 లక్షలు, కొత్త జిల్లాలకు రూ.5 లక్షలు విడుదల చేస్తుందన్నారు. తెలంగాణ వాసులు నివసించే ముంబై, సూరత్, భీవండి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో, అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు స్థానిక సంఘాలకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుందన్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నగరంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు అంజలి, షీలా తెలిపారు. సచివాలయంలో వారు మీడియా తో మాట్లాడుతూ.. అక్టోబర్ 7న రవీంద్రభారతిలో, 8న గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో, 9న ట్యాంక్‌బండ్, 10న రవీంద్రభారతి, 11న గచ్చిబౌలిలో 7 దేశాల కళాకారులతో ఉత్సవాలు జరుపుతామన్నారు. -
బతుకమ్మ పండుగను విమర్శించడం సరికాదు
యైటింక్లయిన్‌కాలనీ : తెలంగాణ ఆడబిడ్డలు ఆరాధ్యదైవంగా పూజిస్తున్న బతుకమ్మ పండుగపై ఏఐటీయూసీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి పర్ర రాజనరేందర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణాకర్, సంపత్‌రెడ్డి, రాఘవరెడ్డి, కొలిపాక మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర పండుగను విమర్శించే వారికి తెలంగాణలో ఉండే అర్హత లేదని తెలిపారు. సెంటినరీకాలనీలో తమ యూనియన్ ఆఫీస్‌ను కమ్యూనిటీ హాలుగా మార్చి కార్మికుల అవసరాలకు వేలాదిరూపాయల అద్దె వసూలు చేస్తున్న ఏఐటీయూసీ నాయకులకు ఈవిషయం తెలియదా అని ప్రశ్నించారు. అనవరస ఆరోపణలు చేయొద్దని సూచించారు. -
బతుకు బాటలో పూలజాతర
సుమారు ముప్పైవేల మంది రైతన్నల కుటుంబాల్లో ఇంటికొక స్త్రీ వైధవ్యం పాలయింది. ఈ శాతాన్ని తగ్గించకుండా మహిళల పండగని రాష్ట్ర పండగగా ప్రకటించవద్దని చెప్పగలగాలి. చిమ్మచీకటి ఆవరించుకున్న మహిళ బతుకులో వెలుగు చూపని పండగ మనకెందుకు అనే పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతున్నది. బతుకమ్మని ఒక పండగగా చూడ్డం ఆచారం. ఈ ఏడాది మాత్రం దానిని ఒక సంద ర్భంగా చూడ్డం వర్తమానం అవసరం. పండగలు రకర కాలు. స్త్రీలవి, పురుషులవి. ఇద్ద రివీ. అందరివీ. అవి మతాల వారీగా, కులాల వారీగా ఉం టాయి. ప్రభుత్వ పండగలు, ప్రజల పండగలు అని వేరు వేరుగా ఉంటాయి. ప్రభుత్వ పండగలు ప్రజల పండగలుగా మారలేవు. ఎందుకంటే వాటిలో ప్రజాస్వభావం ఉండదు. కానీ ప్రజల పండగల్ని ప్రభుత్వాలు, పాలక వర్గాలు హైజాక్ చేస్తాయి. చిన్న చిన్న కుల వర్గాలకు చెందిన పండగలను ఉన్నత వర్గాల వారు సొంతం చేసుకుంటారు. వాటికి ఆర్థికంగా, నైతికంగా మద్దతు ఇచ్చినట్లు చూపిస్తారు. తమకు స్వతహాగా లేని ప్రజాభావనని ఆపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితి బతుకమ్మ పండగకి కూడా ఎదురైందని అనిపిస్తుంది. బతుకమ్మ తెలంగాణకు ఒక సంకేతం. ఇంట్లోనో, ఊరు బయటో ఆడే ఆట ప్రత్యేక ఉద్యమంలో రోడ్డెక్కింది. రహదారి నిర్బంధంలో ఒక అడ్డుగోడగా రూపొందింది. బతుకమ్మలను నెత్తిమీద పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్న మహిళలు ఉద్యమానికి కొత్త దృశ్యం అయ్యారు. బంద్‌లలో, రహదార్ల అడ్డగింపుల్లో బతుకమ్మ దొంతరలు సిమెంట్ గోడలకన్నా బలంగా నిలిచాయి. క్రూరంగా, కర్కశంగా ఉద్యమకారులను పక్కకు తొలగిస్తూ, వ్యాన్లలో ఎక్కించే ఆ పోలీసులకు బతుకమ్మలతో ఉన్న ఉద్యమకారిణులు శక్తి స్వరూపిణు లుగా కనిపించారు. వారిని తాకడానికి మహిళా పోలీ సులు కూడా తటపటాయించేవారు. ఒకరివెనుక ఒకరు బతుకమ్మలతో కవాతు చేస్తున్నట్టుగా నడిచిపోతుంటే అది ఒక కొత్త శక్తితో వాతావరణం బరువెక్కేది. బతుకమ్మ తెలంగాణ సంకేతం. బతుకమ్మ పండగ నుండి ప్రజాస్వభావాన్ని పెకిలించి కలిగినమ్మల పట్టు పీతాంబరాలు, బంగారు తాంబూలాలు, చానెల్ దృశ్యాల బతుకమ్మగా చేస్తామంటే అదే బతుకమ్మ ఏదో ఓనాడు ఎదురు తిరగక తప్పదు. నిజానికి ఆ పండగ మూల స్వభావం నుండి దూరంగా జరపడం వల్ల బతుకమ్మకి అవమానం జరుగుతోంది. బతుకమ్మ ఒక సామాజిక ఆచరణ. సమస్త కుటుంబ సభ్యుల కలయిక. ఒకప్పుడు సంతానమే సంపద. ధాన్యమే ధనం. వ్యవసాయ ఉత్పత్తిలో, శిశువులకి జన్మనివ్వడంలో స్త్రీయే ప్రధానం. పునరుత్పత్తికి స్త్రీయే కేంద్రం. ఇలాంటి భావన లతో నిండిన పండగే బతుకమ్మ. ఈ భావనని భౌతిక ఆచరణగా ఆచరించడమే బతుకమ్మ పండగ ప్రధాన ఉద్దేశం. ఈ రెండేళ్లలో ఆ వాతావరణం, ఆ భావన పక్కన పడింది. కేవలం సింగారింపులకే, ఆటకే విలువ పెరి గింది. ఏనాడూ పండగలో, ఆటలో భాగం కాని ‘పెద్దమ్మ’లు ఇప్పుడు అంతటా కానవస్తున్నారు. వారి ఫొటోలు, వీడియోలతో మీడియా తరించిపోతోంది. బతుకమ్మ పాట పాడలేని చోట సెల్ఫోన్లో పాట మోగు తోంది. డెక్‌లలో అభాస బతుకమ్మ పాట అవమానిత అవుతోంది. శ్రామిక స్త్రీల ఆటలోని పరమార్థం ఖూనీ చేయబడుతోంది. వర్తులాకారంగా కిందకు వంగుతూ, పైకి లేస్తూ పూవులా వికసిస్తూ, ముడుచుకుంటూ విప్పారి నట్లుగా ఆడే ఆట నడుం వంచని, లయాత్మకంగా చప్పట్లు కూడా కొట్టలేని నాజూకు స్త్రీలకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం సద్దుల ఫలహారం కంటికి కానరావడం లేదు. బతుకమ్మ పవిత్రత పక్కన పడిపోయింది. అంటు బతుకమ్మల గోల అధికమైంది. పాటల్లో వేగం హెచ్చి దాండియా శైలి పెరిగింది. తెలంగాణలో రాబోయే కాలంలో బతుకమ్మ ఆట అస్తిత్వానికి దెబ్బతగిలే ప్రమాదం ఉందనిపిస్తోంది. ఇప్పుడు బేనర్లలోనే కాదు నిజమైన బతుకమ్మ పరాయి పూలతో కిక్కిరిసిపోతున్నది. బతు కమ్మలో గులాబి, లిల్లీ, చేమంతి, మల్లె వంటి పరాయి పూలు పనికిరాని పదార్థాలు. ఫాం పూలు కూడా నిషిద్ధం. దేశీ పూలకే అంగీకారం. కాని ఇప్పుడు కృత్రిమ పరాయి పూలు నిండిపోయి బతుకమ్మలు భారమై పోతున్నాయి. కృత్రిమ పూలే కాదు - ప్లాస్టిక్ పూల బతుకమ్మల్ని సెంట ర్లలో బంటరిగా బేలగా నిలిపారు. వాటి పక్కన బేనర్లలో రాజకీయ నాయకుల ఫొటోలు. ఇప్పుడు కొండల్ని, గుట్టల్ని, అడవుల్ని, చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డ వర్గాలు పంచ భౌతిక శక్తుల కూర్పుగా ఉన్న బతుకమ్మ పండగని అట్టహాసంగా చేయడం ఒక పరిహాసం. సుమారు ముప్పైవేల మంది రైతన్నల కుటుంబాల్లో ఇంటికొక స్త్రీ వైధవ్యం పాలయింది. ఈ శాతాన్ని తగ్గించ కుండా మహిళల పండగని రాష్ట్ర పండగగా ప్రకటిం చవద్దని చెప్పగలగాలి. మద్యపానం వల్ల ఆసరా కోల్పో యి చిమ్మచీకటి ఆవరించుకున్న మహిళ బతుకులో వెలుగు చూపని పండగ మనకెందుకు అనే పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతున్నది. కల్లీకల్లు, గుడుంబా, చీప్‌లిక్కర్ ప్రభుత్వం నడపడానికి పనికొస్తాయేమో గాని ప్రజల బతుకు బాటకవి అవరోధాలే. ఈ సారి బంగారు బతుకమ్మ ఎందుకో పండగలా అనిపించనేలేదు. ఈ సందర్భం ఏదో పోగొట్టుకున్న వెలితి నిండిన పళ్లెంలా గోచరిస్తున్నది. ఐతే బతుకమ్మ తెలంగాణ సంకేతమే. కాని దానిని పరిరక్షించుకోవల సింది ప్రజలే. వ్యాసకర్త తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు, మొబైల్: 99519 42242 - జయధీర్ తిరుమలరావు -
చిలుకూరులో బతుకమ్మ సంబురాలు
సోమవారం నుంచి 20వ తేదీ వరకు.. * జిల్లాస్థాయిలో కార్యక్రమాలన్నీ ఇక్కడే * చిలుకూరు మహిళా ప్రాంగణంలో పండుగ వాతావరణం సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న బతుకమ్మ పండుగకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాలకు మొయినాబాద్ మండలం చిలుకూరు వేదికగా నిర్ణయించింది. సోమవారం నుంచి పది రోజులపాటు జరిగే బతుకమ్మ సంబరాల్లో రోజుకోవిధంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టనున్నారు. 14వ తేదీన జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చిలుకూరులోని మహిళా ప్రాంగణం (టీటీడీసీ)లో 16న వికారాబాద్‌లో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో, 17న కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మండల కేంద్రాల్లోనూ గతేడాది మాదిరిగా సంబరాలు నిర్వహించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబరాలు ఇలా.. 12న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న బాలికా సంరక్షణ అంశంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, 14న విద్యార్థినులకు వివిధ అంశాల్లో పోటీలు, 15న మహిళా ప్రజాప్రతినిధులతో మహిళా సాధికారత ప్రదర్శన, 16న బాలికలకు రంగోలీ పోటీలు, 17న మాతాశిశు సంరక్షణ పథకాలపై ప్రదర్శనలు, 18న మహిళల ఆర్థిక స్వాలంబనపై ప్రదర్శనలు, 19న మహిళా ఉద్యోగిణులతో ఆటాపాట, 20న సాంస్కృతిక ప్రదర్శనలు, సంబరాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు కూడా అందిస్తారు. అనంతరం 21న హైదరాబాద్‌లో జరిగి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో జిల్లా తరఫున 100 మంది బృందం పాల్గొననుంది. -
'ఆ మొత్తం' ఎంపీ కవిత కార్యక్రమాలకే ఖర్చు చేశారు
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు, ఆశావర్కర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద శుక్రవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. బతుకమ్మ పండగకు తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు రైతులు, ఆశావర్కర్లు ఆత్మహత్యల నేపథ్యంలో బతుకమ్మ పండగకు రూ. 10 కోట్లు కేటాయించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఏడాది కూడా ఈ పండగకు ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయిస్తే అవి ఎంపీ కె.కవిత కార్యక్రమాల కోసమే ఖర్చు చేశారని నేరెళ్ల శారద ఆరోపించారు. బతుకమ్మ పండగ కోసం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి కాని జాగృతి సంస్థ దత్తత తీసుకోవడం ఏమిట అని కేసీఆర్ ప్రభుత్వాన్ని నేరెళ్ల శారద సూటిగా ప్రశ్నించారు. అలాగే అన్నదాతలు అనాధలని జాగృతి సంస్థ భావించడం సరికాదని నేరెళ్ల శారద అన్నారు. -
'కేంద్రంలో చేరతామనేది ఊహాగానమే'
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి వేదికగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో మమేకమై బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారు.. ఎంపీ కవిత. ఆమె సీఎం కేసీఆర్ కుమార్తెగా కంటే తెలంగాణ జాగృతి కవితగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందన్న ప్రచారంతో పాటు సీఎంపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా విపక్షాల విమర్శలు, బీజేపీతో సఖ్యత తదితర అంశాలపై ఆమె మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు... టీఆర్ఎస్ కేంద్రంలో చేరుతుందన్న ప్రచారంపై మీ స్పందన? కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుంద న్నవి రాజకీయ ఊహాగానాలే. పార్టీకి, తెలంగాణకు ఏది మంచిదో నిర్ణయించే తెలివి, కార్యదక్షత పార్టీలో కేసీఆర్‌కు త ప్పితే మరెవరికీ లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. పదవులు, హోదాల మీద మా కుటుంబంలో ఎవరికీ ఆశలేదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం. ఏ నిర్ణయమైనా పార్టీ, తెలంగాణ ప్రజల కోసమే ఉంటుంది. బీజేపీని కేసీఆర్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారన్న విమర్శల మాటేమిటి? తెలిసీ తెలియక ఏదో మాట్లాడుతుంటారు. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కేంద్రం విషయంలో టీఆర్ఎస్ వైఖరి మారినట్లుంది? కేంద్ర ప్రభుత్వ విషయంలో మా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. బీజేపీ మొదట తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తాం. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దారిలో పెట్టడానికి ప్రయత్నాలు చేశాం. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి తెలుగుదేశానికి, ఎన్టీఆర్‌కు అనుకూలంగా మాట్లాడినప్పుడు విమర్శించాం. తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు సరే అన్నాం. కేంద్రంలో ఎవరున్నా.. ఏ ప్రభుత్వమున్నా.. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాలు కాపాడేందుకు సఖ్యతతో ఉం టాం. తెలంగాణకు వ్యతిరేకమైతే కచ్చితంగా వ్యతిరేకిస్తాం. కేసీఆర్ ఆమరణ దీక్ష, ఉద్యమ సమయంలో ఎలా ఫీల్ అయ్యేవారు? రాష్ట్రం వచ్చాక ఎలా ఫీలవుతున్నారు? రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటివరకూ పడిన కష్టమంతా చేయితో తీసేసినట్లు అనిపిస్తోంది. కానీ ఉద్యమ సమయంలో అనుభవించిన బాధాకర సంఘటనలు.. ఒకవైపు నాన్న ఉద్యమం.. మరోవైపు చనిపోతున్న పిల్లలు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు.. అదంతా మామూలు కష్టం కాదు. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దని కోరుకుంటాను. సీఎం కుటుంబ సభ్యులపైనా విమర్శలు వస్తున్నాయి కదా? ఈ పదిహేనేళ్లుగా విమర్శలను ఎదుర్కోవడం అలవాటైంది. చివరకు కుటుంబ సభ్యులనూ టార్గెట్ చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కొందరు మహానుభావులు ‘పిల్లలను చంపుతాం’ అని కూడా బెదిరించారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. మేమంతా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాం. విమర్శలు వస్తాయి. కానీ, మేమేంటో ప్రజలకు తెలుసు. మా అంకిత భావం, చిత్తశుద్ధి, పట్టుదల వారికి తెలుసు. చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని.. నాన్న పుట్టినరోజును పెద్దగా చేసుకోరు. పెద్దగా స్పెషల్ ఏమీ లేదు. ఆయనకు గుర్తుండదు కూడా. నాన్న పుట్టినరోజు అని నేనే చిన్నప్పుడు చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని. ఇప్పుడు ఆయన అభిమానులుగా మాకు స్పెషల్. ఈ రోజు ఆయన యథావిధిగా తన విధుల్లో ఉన్నారు. మహారాష్ట్ర సీఎంతో చర్చల్లో పాల్గొన్నారు. కేసీఆరే స్టార్ బ్యాట్స్‌మన్.. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విపక్షాల విమర్శలు సహజం. కేసీఆర్ స్టార్ బ్యాట్స్‌మన్. వాళ్లంతా చిన్న చిన్న బౌలర్లు. వారివల్ల ఆయనకు పెద్దగా ఫరక్ (సమస్య) పడేది ఏమీలేదు. కాకుంటే కువిమర్శలు కాకుండా, సద్విమర్శలు చేస్తే ఆహ్వానిస్తాం. ఉద్యమ సమయంలో తీవ్రంగా విమర్శించిన వారినీ కలుపుకొనిపోయాం. మన విధానాల మీద విమర్శలు చేస్తే ఓకే కానీ... వ్యక్తిగతంగా ‘వాస్తును నమ్ముతావ్, జాతకాలు నమ్ముతావ్’ అంటూ విమర్శిస్తే ప్రజలు హర్షించరు. ప్రతిపక్షాలకు నేను ఒకటే చెబుతున్నా.. మీరు కేసీఆర్ వేగాన్ని అందుకోలేరు. వాస్తవాలను విస్మరించి విమర్శిస్తే నవ్వుల పాలవుతారు. ప్రజలకు పనికొచ్చే, రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే సూచనలు చేయండి.. తీసుకుంటాం. -
సంస్కృతిపై రాజకీయ క్రీనీడలు
కొద్ది రోజులుగా బతుకమ్మ పండుగ, కల్లు రెండిటి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. బతుకమ్మ పండుగను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయం. కానీ బతుకమ్మ స్త్రీలు తప్ప, పురుషులు ఆడేది కాదనే స్పృహను కోల్పోయి చంద్రబాబు సహా అన్ని పార్టీల నేతలు, మంత్రులు, బతుకమ్మలాడారు. బతుకమ్మను రాజకీయ క్రీడగా మారుస్తున్నారనడానికి వేరే ఉదాహరణ కావాలా? ఇక హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరవాలని నిర్ణయించి కేసీఆర్ మాట నిలుపుకున్నారు. కానీ కల్తీ కల్లు ఏరులై పారకుండా జాగ్రత్తల మాటేమిటి? డేట్లైన్ హైదరాబాద్ బతుకమ్మ పండుగ, కల్లు తెలంగాణ సంస్కృతిలో భాగం. దురదృష్టవశాత్తు కొద్ది రోజులుగా ఈ రెండిటి చుట్టూ రాజకీయాలు, రాజకీయాల చుట్టూ ఈ రెండూ తిరుగుతున్నాయి. సుదీర్ఘ ఉద్యమం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సమాజం మొత్తం అందుకు హర్షం వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మ మీద నిషేధం ఏమీ లేదు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ పల్లెలు రకరకాల పూలతో అలంకరించుకుని ఎంతో అందంగా తయారయ్యేవి. ఆ తొమ్మిది రోజులూ తెలంగాణ పల్లెల సొగసు వర్ణనాతీతం. కనువిందు చేసే దృశ్యాలు, వీనుల విందు చేసే జానపద గీతాలు చూసి, విని ఆనందించాల్సిందే. బతుకమ్మ పండుగపై నాడు నిషేధం లేకపోయినా నిరాదరణ ఉండేది. బతుకమ్మ అనాదిగా తెలంగాణ స్త్రీ ధిక్కార, ప్రతిఘటన స్వభావానికి ప్రతీకగా నిలిచింది. బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ ప్రతీక తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మను మరింత ప్రచారంలోకి తెచ్చిన ఘనత ‘తెలంగాణ జాగృతి’ సంస్థకు, ఆ సంస్థ నాయకురాలు కల్వకుంట్ల కవితకు దక్కుతుంది. ఈ పదమూడేళ్లు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ రూపాల్లో భాగమై నిలిచింది.బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి ఒక బలమైన సాంస్కృతిక ప్రదర్శన. దాన్ని అట్లా ఉండనిస్తే బాగుండేది. కానీ బతుకమ్మ చుట్టూ రాజకీ యాలు చేరాయి. బతుకమ్మ ఆధారంగా ఎదిగిన తెలంగాణ జాగృతి నేత్రి, టీఆర్ఎస్ అధినేత కూతురు కవిత పార్లమెంటుకు పోవడానికి నిచ్చెనలు వేసింది. ఎవరు ఏ పదవికి పోటీ చేయాలో నిర్ణయించుకునే హక్కు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ ఉంటుంది. దాని మీద చర్చలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మను అధికారిక పండుగగా ప్రకటించడంపై చర్చలేదు, అభ్యం తరం అంతకన్నా ఉండకూడదు. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రమం తటా ఘనంగా జరపడానికి పది కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కాబట్టి దాన్ని కూడా స్వాగతిద్దాం. ఈ జోరు కొత్త మురిపెం కాకుండా దీర్ఘకాలం కొనసాగాలని ఆశిద్దాం. అయితే ఇక్కడ రెండు విషయాలు తప్పకుండా మాట్లాడుకోవాలి. ప్రభుత్వం ఈ పండుగ ఘనంగా జరపడం కోసం కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చు అయ్యాయి అనేది మొదటిదయితే, మొత్తం బతుకమ్మ సంబరాలు రాజకీయ క్రీడలో భాగంగా తయారయి అపహాస్యం పాలు కావడం రెండవది. మెప్పు కోసం నేతలెత్తిన బతుకమ్మ తెలంగాణ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మంత్రులు, అధికారులు, వీళ్లు వాళ్లు అనకుండా బతుకమ్మను నెత్తికి ఎత్తుకొని, బతుకమ్మ చుట్టూ అడుగులేసి నృత్యాలు చేశారు. ముఖ్య మంత్రి మెప్పు పొందడానికే ఇదంతా. అందుకే బతుకమ్మ స్త్రీలకు మాత్రమే ప్రత్యేకం, పురుషులు ఆడేది కాదనే స్పృహ పూర్తిగా కోల్పోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ్రంతి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు బతుకమ్మను నెత్తికి ఎత్తుకున్నట్టు? బహుశా తెలంగాణలో తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన బతుకమ్మను ఇట్లా ఉపయోగించుకున్నారేమో. మరి ఇందిర చేత బతుకమ్మ ఆడించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ట్యాంక్ బండ్ మీద జరిగిన అధికారిక ముగింపు ఉత్సవంలో తానెందుకు బతుకమ్మ ఆడలేదన్న సందేహం ఎవరికీ ఎందుకు కలగలేదు? బతుకమ్మను తెలంగాణ అస్తిత్వానికి ఒక సాంస్కృతిక ప్రతిరూపంగా కాకుండా రాజకీయ క్రీడగా మార్చేస్తున్నారన డానికి ఇంత కంటే వేరే ఉదాహరణ అవసరం లేదేమో. కల్లు తెలంగాణ సంస్కృతిలో భాగం ఇక కల్లు వ్యవహారం చూద్దాం. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తిరిగి ప్రారంభిస్తామన్న ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకుని కేసీఆర్ మొన్న దసరా పండుగ నాటి నుంచి కల్లు దుకాణాలు తెరిపించారు. మొదట్లో చెప్పినట్టు కల్లు తెలంగాణ సంస్కృతిలో భాగం. తెలంగాణలో ఒకప్పుడు కల్లును మద్యం కింద లెక్కించే వారు కాదు. పైగా ఆరోగ్య పానీయంగా పరిగణించే వారు. ఇప్పటికి తెలంగాణ పల్లెల్లో కల్లు తాగడాన్ని దురలవాటుగా చూడరు. ఎవరయినా గతానికి వెళ్లి చూసి... హైదరాబాద్ నగరంలో రాష్ర్ట ప్రభుత్వమే శాసనసభ ఆవరణలో, ట్యాంక్ బండ్ మీద, మరికొన్ని చోట్లా అధికారికంగా దుకాణాలు తెరిచి ‘నీరా’ (తెల్లవారు జామున చెట్టు నుంచి తీసే కల్లు) అమ్మించిన విషయం గుర్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరవాలనే నిర్ణయం తీసుకోగానే రెండు వాదనలు ముందుకొచ్చాయి. 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లు విక్రయాన్ని నిషేధించింది. హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలో తాటి చెట్లు లేనందున కల్తీ కల్లు, కృత్రిమ కల్లు సరఫరా వల్ల ప్రాణహాని కలుగుతుందని 767 జీవోలోని ఒకక్లాజు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్‌లో కల్లు విక్రయంవల్ల విస్కీ, బ్రాందీల వంటి సీమ మద్యం వ్యాపారం నష్టపోతుందనే మద్యం వ్యాపా రులతో కుమ్మక్కయి ఎక్సైజ్ అధికారులు ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిం చారని, నగరం కల్లు అవసరాలను తీర్చగలిగినన్ని తాటి చెట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని గీత పనివారి సంఘ నాయకుల వాదన. స్మార్ట్ సిటీ, ఇంటర్నేషనల్ సిటీ అంటున్న హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరవడం ఏమిటి? అన్నది. దీన్ని పెద్దగా పట్టించు కోనక్కరలేదు. మద్యం రక్కసి కోరలు విప్పి చీప్ లిక్కర్ పేరుతో హైదరాబాద్‌ను ఎట్లా కబళించ చూస్తున్నదో అందరికీ తెలుసు. నిజానికి హైదరాబాద్‌లో కల్లు అమ్మితే నష్టపోయేది చీప్ లిక్కర్ అమ్మకందారులే. కాటేసే ‘సొసైటీల’ కల్లేనా మళ్లీ? పాత సొసైటీలకే హైదరాబాద్‌లో కల్లు విక్రయాన్ని అప్పచెబుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. ఈ సొసైటీలన్నీ ఎప్పుడో కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. లాభార్జనే ధ్యేయంగా అవి కల్తీకల్లు, కృత్రిమ కల్లు అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్న సంఘటనలు గతంలో అనేకం. హాస్యాస్పదం ఏమిటంటే కల్లు గీత పనివారే ఉండవలసిన ఈ సొసైటీలలో ఆ వృత్తితో, ఆ సామాజికవర్గంతో సంబంధం లేని ప్రభుత్వ అధికా రులు కూడా సభ్యులుగా ఉంటారు. ఇది కల్లు గీత పనివారికి ఏ రకంగాను మేలు చెయ్యదు. హైదరాబాద్‌లో కల్లు అమ్మకాలు మళ్లీ మాఫియాల చేతుల్లోకి వెళ్లకుండా, కల్తీ లేకుండా సక్రమంగా జరగాలంటే ఈ సొసైటీలను రద్దు చేసి, కల్లు గీత కార్మికులకే కల్లు విక్రయాలను అప్పగించాలి. అందుకు కావలసిన ఆర్థిక సాయాన్ని వారికి అందించాలి. కల్లు కల్తీ జరిగినా, కృత్రిమ కల్లు పారిం చినా కోలుకోలేని శిక్షలు విధించాలి. ఇదంతా చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధపడ్డ నాడే నగరంలో కల్లు విక్రయాలు మొదలు పెడితే మంచిది. హైదరాబాద్ నగర అవసరాలకు సరిపడా కల్లు లభించేందుకు కావలసినన్ని చెట్లు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయని గీత పనివారల సంఘం చేస్తున్న వాదన సరైనదే కావచ్చు. అయితే అసలు కొత్త తరం గీత పనివారి కుటుంబాల నుంచి ఎంత మంది ఈ వృత్తి మీద ఆధార పడుతున్నారు? ఎంత మంది తాడి చెట్లు ఎక్కుతున్నారు? అనేది కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ ఆలోచించకుండా ఎన్నికల వాగ్దానం కదా అని అమలు చేసేస్తే ఒక ఉపద్రవానికి తెర లేపిన బాధ్యతను రేపు ప్రభుత్వమే తలకెత్తుకోక తప్పదు. దేవులపల్లి అమర్ -
నేడు సద్దుల సంబరం
- గౌరీదేవిని కొలిచిన మహిళాలోకం - నేడు సద్దుల బతుకమ్మ సిరిసిల్ల/కరీంనగర్ కల్చరల్ : ప్రకృతి ఆరాధనతో కూడిన బతుకమ్మ పండగను జిల్లా మహిళలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ.. పాదం కలుపుతూ ఊరూవాడను ఏకం చేశారు. పల్లెపల్లెనా ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాటలు మార్మోగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగకు అధికారిగా గుర్తింపు ఇచ్చింది. నిర్వహణ కుసైతం ఏర్పాట్లు చేసింది. మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. అధికారిక ఏర్పాట్లు బతుకమ్మ పండగ నిర్వహణకు తొలిసారిగా అధికారికంగా ఏర్పాట్లు జరిగాయి. అన్ని స్థాయిల్లోనూ అధికారులు భాగస్వాములవుతూ.. బతుకమ్మ పండగను నిర్వహించారు. బతుకమ్మ పాటల పోటీలు, ఫలహారం తయారీ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒక్కోచోట వేర్వేరుగా.. జిల్లాలో సద్దుల బతుకమ్మ విడతలవారీగా నిర్వహిస్తున్నారు. వేములవాడలో ఏడు రోజుల్లోనే బతుకమ్మ నిమజ్జనం జరిగింది. రుద్రంగి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో పదకొండు రోజులుకు జరుపుకుంటారు. జిల్లావ్యాప్తంగా గురువారం మెజార్టీ ప్రాంతాల్లో బతుకమ్మ నిమజ్జనం జరుగుతుంది. బతుకమ్మ పండుగ ప్రతి ఏటా జరుగుతున్నా.. తెలంగాణరాష్ట్రంలో తొలిసారి మాత్రం అధికారికంగా జరగడం మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం పెరగడం విశేషం. తెలంగాణ మహిళలున్న ప్రతి దేశంలోనూ బతుకమ్మ ఆటలు వేడుకగా జరిగాయి. పూలతో తీర్చిదిద్ది సద్దుల బతుకమ్మ కోసం మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చేమంతి, కట్లపువ్వులు, గోరింటతోపాటు అందుబాటులో ఉన్న ఇతర పూలనూ వినియోగిస్తారు. బతుకమ్మ పైభాగంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి అగరవత్తులు, ప్రమిదలు వెలిగించి వీధి కూడళ్లలో పెట్టి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ‘పోవయ్యా దేవ ఉయ్యాలో... తేవయ్యా పూలు ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాములాయే సందమామ’ అంటూ పాటలు పాడుతారు. చివరగా సమీప చెరువులు, కుంటల్లో బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వరి, గోధుమ, నువ్వులు, పెసర, మినుము, మొక్కజొన్న వంటి నవధాన్యాలు, చక్కెర కలిపి చేసిన పిండిని వాయినాలుగా ఇచ్చుకుంటారు. దీంతో బతుకమ్మ పండగ ముగుస్తుంది. భగ్గుమంటున్న ధరలు ఈ ఏడాది తంగేడు పూలు, గునుగ పూలు అవసరం మేరకు అందుబాటులో లేవు. దీంతో వ్యాపారులు పిడికెడు తంగేడుపూలను రూ. పది విక్రయించారు. గునుగు పూలకట్టలు మూడింటికి రూ.10 చొప్పున వసూలుచేశారు. చేమంతి పూలు కిలోకు రూ.200 నుంచి రూ250 అమ్మకాలు సాగించారు. బంతిపూలు కిలో 250 రూపాయలకు అమ్మారు. -
బతుకమ్మ సెంటిమెంట్‌తో బిడ్డకే రూ.10 కోట్లు ఖర్చు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎర్రబెల్లి ఆరోపణ తొర్రూరు: సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని... తన బిడ్డ పండుగ జరుపుకునేందుకు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నారని టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చామని గొప్పలు చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ మహిళలు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు ఒక్కపైసా కుడా ఇవ్వడం లేదని విమర్శించారు. -
పదివేల బతుకమ్మలతో ముగింపు వేడుక
దేశంలోనే అతిపెద్ద పూల వేడుక అయిన బతుకమ్మ పండుగ ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పదివేల బతుకమ్మలు గురువారం ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. లాల్‌బహదూర్ స్టేడియంలో బతుకమ్మ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. స్టేడియంలో 1200 వుంది వుహిళలు పదివేల బతుకమ్మలను తీర్చిదిద్దనున్నారు. వీటిలో వంద బతుకమ్మలను ఐదడుగుల ఎత్తున నిలపనున్నారు. ముగింపు వేడుకలు తిలకించేందుకు వీలుగా 650 బస్సులను స్టేడియం వరకు ప్రత్యేకంగా నడపనున్నారు. వీటి ద్వారా దాదాపు పాతికవేల మంది మహిళలు ఇక్కడకు చేరుకోనున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లాల్‌బహదూర్ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు హుస్సేన్‌సాగర్ వరకు కనుల పండువగా సాగనుంది. హుస్సేన్‌సాగర్ వద్ద జరగనున్న కార్యక్రమాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌లతో పాటు జ్వాలా గుత్తా, పి.వి.సింధు తదితర సెలిబ్రిటీలు హాజరు కానున్నారు. -
పూలు నింగిలో!
శంషాబాద్ రూరల్: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో పూల ధరలకు రెక్కలొచ్చాయి. బుధవారం నగరంలోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో వీటి ధరలు నింగినంటాయి. వారం క్రితం కిలో రూ.20 పలికిన బంతిపూల ధర ప్రస్తుతం రూ.100కు చేరింది. బతుకమ్మలను అలంకరించడానికి ఎక్కువగా బంతి, చామంతి (తెల్ల, పసుపు), గులాబీలను విరివిగా వినియోగిస్తుంటారు. వీటితో పాటు సాధారణంగా తంగేడు, గునుగు పూలను బతుకమ్మకు వాడుతుంటారు. ఈ ఏడాది వీటి కొరత ఏర్పడింది. ఈసారి బతుకమ్మ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహస్తుండడంతో ప్రతి చోటా భారీ సంఖ్యలో బతుకమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. పోటాపోటీగా బతుకమ్మలను అలంకరిస్తుండడంతో పూలకు డిమాండ్ పెరిగింది. దసరా సీజన్లో స్థానికంగా పండించిన బంతి పూలు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. కానీ ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో స్థానికంగా పూల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో వ్యాపారులు మహారాష్ట్ర, బెంగళూరు ప్రాంతాల నుంచి బంతితో పాటు చామంతి పూలను ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా పూల దిగుబడి తగ్గడం, బతుకమ్మలకు పూల వినియోగం పెరగడంతో డిమాండ్ ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్లో హోల్‌సెల్‌గా కిలో రూ.100 పలి కిన బంతి రిటైల్‌గా రూ.200 నుంచి రూ.250 వరకు అమ్ముడయ్యాయి. ఉద యం బంతి కిలో రూ.50 పలకగా మధ్యాహ్నం తర్వాత రూ.100కు చేరింది. ఇంత ఎక్కువగా ధరలు పెట్టి బతుకమ్మలకు పూలను కొనలేక సామా న్య, మధ్య తరగతి కుటుంబాల మహిళలు నిరాశకు గురవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలను పెద్దఎత్తున నిర్వహిస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా పూలకు మంచి ధరలు పలకడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూల ధరలు.. బంతి (కిలో) రూ.50 నుంచి 100 చామంతి (పసుపు) రూ.200 నుంచి 300 చామంతి (తెలుపు) రూ.150 గులాబీ రూ.150 -
ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి : డీసీపీ
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీసీపీ సుదీర్ దాబాడే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అఖిల పద్మశాలి సమాజం కార్యాలయంలో తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సభలో డీసీపీ సుదీర్ దాబాడే మాట్లాడుతూ.. ఠాణే జిల్లాలో బతుకమ్మ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలుగు సమాజానికి చెందిన మహిళా వాలంటీర్లను ప్రధాన ఘాట్ల వద్ద నియమిస్తున్నామని, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు ప్రధాన వీధుల్లో సివిల్ డ్రస్స్‌లల్లో విధులు నిర్వహిస్తారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా విదుత్ కోత ఉండకుండా చర్యలు తీసుకోవాలని టోరంట్ పవర్ కంపెనీ అధికారులకు సూచించామని చెప్పారు. రాత్రి 12 గంటల లోపే బతుకమ్మల నిమజ్ఞం నిర్వహించాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఎన్డీ రోడేతో పాటు అఖిల పద్మశాలి సమాజ అధ్యక్షుడు కముటం శంకర్, కార్యదర్శి దాసి అంబాదాస్, న్యాయదాని కమిటి చైర్మన్ కొంక మల్లేశం, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, గాజుల రాజారాం, వంగ పురుషోత్తం, మాజీ నగరాధ్యక్షుడు ఎస్. మల్లేశం, బొల్లి రమేశ్, వడ్లకొండ రాముతో పాటు భారీ సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు. -
స్వీట్ మెమొరీ
సంతోషాన్నిచ్చింది బతుకమ్మ పండుగంటే చాలా ఇష్టం. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు ధన్యవాదాలు. - సందీప్తి, హీరోయిన్ సంప్రదాయ వేదిక బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు వేదిక. స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్‌ను కావడం... ఇలాంటి కళాత్మక పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉంది. - రమ్య, నర్తకి పెరుగుతున్న ఆదరణ రాబోయే రోజుల్లో బతుకమ్మకు మరింత ఆదరణ పెరుగుతుంది. మరింత ఉత్సాహంగా ఈ వేడుక జరుపుకొంటాం. తొలిసారి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మన సంప్రదాయానికి ఊపిరి పోస్తోంది. - అంజనాచౌదరి, మాజీ ఎమ్మెల్యే అదృష్టం గతేడాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. ఈసారి సాక్షి ‘సిటీ ప్లస్’ ఆధ్వర్యంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు తేవాలని ఆశిస్తున్నా. - మాధవీలత, హీరోయిన్ మధురానుభూతి: బతుకమ్మ వేడుకలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ అవకాశం కల్పించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు కృతజ్ఞతలు. ఇలా సంప్రదాయబద్ధంగా ముస్తాబై సహ నటులతో ఆడటం జీవితాంతం గుర్తుండిపోతుంది. - ఫర్హాఖాన్, హీరోయిన్ సంస్కృతీ సౌరభం బతుకమ్మ ఆట ఆరంభం నుంచి నిమజ్జనం వరకు.. ప్రతి క్షణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టింది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఈ వేడుకలో పాల్గొనే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ‘సాక్షి’. - రుచికాశర్మ, మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ 2014 ‘సాక్షి’కి కృతజ్ఞతలు చిన్నప్పటి నుంచే సిటీలో బతుకమ్మ ఆడటం చూస్తున్నా. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి వేడుకలో పాల్గొనేదాన్ని. అయితే యాంకర్‌గా మారాక తొలిసారిగా బతుకమ్మ ఆడే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి థ్యాంక్స్. - గీతాభగత్, యాంకర్ ఎంజాయ్ చేశా ఈ వేడుకను ఎంతో ఎంజాయ్ చేశా. శిల్పరామంలో చాలా మంది మధ్య పాటలకు చప్పట్లు కొడుతూ... ఆడుతూ బతుకమ్మల చుట్టూ తిరగడం ఓ మధురానుభూతి. - అనూష, యాంకర్ చిన్నప్పటి నుంచీ... మాది వరంగల్ జిల్లా. చిన్నప్పటి నుంచే బతుకమ్మ ఆడుతున్నా. అమ్మమ్మ, నానమ్మలు పాట పాడుతుంటే మేం కోరస్ అందుకునే రోజులు గుర్తొచ్చాయి. ‘సాక్షి’కి ధన్యవాదాలు. - మహతి, టీవీ నటి అంతా ఒక్కచోట... బతుకమ్మ ఆడటం ఇదే తొలిసారి. నాలాంటి నటీమణులందరినీ ఒక చోటకు చేర్చిన సాక్షి ‘సిటీ ప్లస్’కు థ్యాంక్స్. సంప్రదాయ వేదిక శిల్పారామంలో ఈ వేడుక జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి. - తనుశ్రీ, హీరోయిన్ కలకాలం... సిటీలో ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉంటున్నారు. అలాంటి సిటీకి ‘సాక్షి’ బతుకమ్మ కళ తెచ్చింది. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడటం జీవితంలో మరిచిపోలేనిది. - క్యాండీ, యాంకర్ అద్భుతం గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారందరినీ ఒక చోటకు చేర్చి బతుకమ్మ ఆడించడం అద్భుతంగా ఉంది. ఇలాంటి చక్కని వేడుకను నిర్వహించి, మా అందరికీ స్వీట్ మెమొరీని మిగిల్చిన ‘సాక్షి సిటీ ప్లస్’కు ధన్యవాదాలు. - అనిత, యాంకర్ -
సాక్షి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
సాక్షి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పారామంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంబరాల్లో తెలంగాణ రాజకీయ, సినీ రంగ, ఉద్యోగ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో శిల్పారామం దద్దరిల్లింది. దాండియాతో అమ్మాయిలు అదరగొట్టారు. ఆద్యంతం తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బతుకమ్మ సంబరాలు సాగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు డీకే అరుణ, శ్రీనివాస గౌడ్, మాజీ మేయర్ కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘తంగెడి పువ్వులు తెచ్చేవాడిని’
-జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్ కల్చరల్, ప్రగతినగర్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం లభించడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ చం ద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన ‘బంగా రు బతుకమ్మ’ సంబురాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన చిన్నతనంలో బతుకమ్మ పండుగ ఎంతో వైభవంగా జరిగేదన్నారు. బతుకమ్మ కోసం తంగడి పువ్వును తెంపుకు వచ్చేవాడినని గుర్తుచేశారు. ఘనంగా నిర్వహిస్తున్నాం : కలెక్టర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబించే పండుగైన బతుకమ్మను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారన్నారు. ఈ పం డుగను వైభ వంగా నిర్వహించేందుకు అధికారి కంగా తమవంతు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
బతుకమ్మ తెలంగాణకే గర్వకారణం
నల్లగొండ కల్చరల్ :తెలంగాణ పండగగా బతుకమ్మను ప్రభుత్వం గుర్తించడం మనందరికీ గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండగలో సోమవారం మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏమైతది అనే కుహనా విమర్శకులకు బతుకమ్మ పండగే సమాధానమన్నారు. మన రాష్ట్రంలో, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పండగ నిర్వహించుకునే అవకాశం కలిగిందన్నారు. బతుకమ్మ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10 కోట్లు కేటాయించారన్నారు. మన సంస్కృతిని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా సెలవులు ఇచ్చి ఉత్సహపరుస్తుం దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు రూ. 6.4 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ జీఓ విడుదలైయ్యిందని మంత్రి ప్రకటించారు. జిల్లాకు చెందిన శ్రీకాంతచారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరికిషోర్ మాట్లాడారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అధ్యాపకురాలు సుధారాణి బృందం అందించిన వివరాల ప్రకారం జిల్లా విద్యాశాఖ బతుకమ్మకు మొదటి బహుమతిగా రూ. 1000, రెండవ బహుమతిగా ఆర్వీఎం మహిళలకు మంత్రి చేతులమీదుగా రూ. 500 అందచేశారు. ఈ సందర్భంగా లలిత సుమాంజలి చేసిన కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావు, ఆర్ఐఓ ఎన్.ప్రకాశ్‌బాబు, డీఈఓ ఎస్.విశ్వనాథరావు, మాడా పీడీ సర్వేశ్వరరెడ్డి, ఆర్డీఓ జహీర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ గోనారెడ్డి, అశోక్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్య క్షుడు కందాల పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, భిక్షం, ఉదయ్‌కుమార్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సౌభాగ్యాలను ఇచ్చే తల్లి బతుకమ్మ సౌభాగ్యాలను అందించే తల్లిగా తెలంగాణలో బతుకమ్మ పూజలందుకుంటుంది. ప్రభుత్వమే ఈ పండగను నిర్వహించడం వల్ల, మహిళా ఉద్యోగులకు సంతోషంగా ఉంది. ఇంత గొప్ప పండగ కావటం గర్వంగా ఉంది. వి.జ్యోతి, డీఈఓ కార్యాలయం అద్భుతమైన పండగ ఎన్నో ఔషధ గుణాలున్న పూలతో నిర్వహించుకునే అద్భుతమైన పండగ బతుకమ్మ. జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దమని బతుకమ్మను వేడుకోవటం జరుగుతుంది. ప్రపంచంలో మహిళలు కోసం ప్రత్యేకంగా ఉన్న గొప్ప పండగ బతుకమ్మ. - కె.కవిత, ఆర్వీఎం -
మలేషియాలో బతుకమ్మ వేడుకలు
-
'మహబూబ్‌నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు'
హైదరాబాద్: మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అలాంటి జిల్లాలో బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవితను పిలవడమేంటని అరుణ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాయలంలో అరుణ మాట్లాడుతూ... పండగ సెంటిమెంట్‌తో అధికార టీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని విమర్శించారు. ఈ సాకుగా చూపి ప్రజలను విభజించాలనుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడామని డికే అరుణ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దసరా పండగకు సెలవులు పెంచి... సంక్రాంతికి తగ్గించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. -
బతుకు..పూలపాట
కనిపించని బాధలతో కన్నీరు పెట్టే పల్లెకు.. బతుకమ్మ పండుగ ఓదార్పునిస్తుంది. పట్నంలో క నుమరుగైన సంస్కృతిని బతుకమ్మ పండుగ ఏడాదికోసారి గుర్తుచేస్తుంది. జనపదాలలో ఎదిగిన జానపదుల బతుకమ్మ పాటలు తరాలు మారినా.. వనితల నాల్కలపై నాట్యం చేస్తూనే ఉన్నాయి. ఉయ్యాలలో జోగుతున్న చరిత్రను ఉయ్యాల పాటలతో నిద్రలేపి తర్వాతి తరాలకు అందించిన ఘనత బతుకమ్మ పాటలది. వెన్నెల మకుటంతో సాగే పాటల వన్నె నేటికీ తగ్గలేదు. బతుకమ్మ పాటలు.. వాల్మీకికీఅందని రామాయణ ఘట్టాలు వినిపిస్తాయి.. వ్యాసుడు చెప్పని పురాణగాథలను వర్ణిస్తాయి. ఇక బతుకమ్మ ఆటలో లయబద్ధంగా సాగిన నాటి ఆడపడుచుల అడుగుల్లో.. నేటి ముదితలూ మురిపెంగా నడుస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆటపాటల్లో ఉన్న మహిళలను ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా ప్రజాకవి గోరటి వెంకన్న పలకరించారు. గోరటి వెంకన్న: మనం బతుకుతూ అన్నింటినీ బతికించే సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ బతుకమ్మ. ప్రకృతిలోని సమస్త జీవులనూ ప్రేమించి, ఆరాధించి వాటి మనుగడను కోరుకునే పండుగ ఇది. అమ్మవారిని పూలలో చూసుకునే పండుగ ఇది. స్త్రీలు.. పూలు ఒక్కటే. అగో.. అక్కడ అందంగా పేర్చిన బతుకమ్మలు ఎలాగున్నాయో.. ఇక్కడ అమ్మలు కూడా అలాగే ఉన్నారు. తెలంగాణ వచ్చాక, రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించాక ఎలా జరుపుకుంటున్నారు తల్లీ..? సావిత్రమ్మ: చాలా సంతోషంగా ఉంది. పిల్లలంతా చాలా ఘనంగా చేసుకుంటున్నారు. సులోచన: పదిహేనురోజులు సెలవులు ఇచ్చిండ్రు సార్. కానీ తొమ్మిదిరోజుల పండుగలా కూడా ప్రకటించాలి సార్. గోరటి వెంకన్న: అమ్మా.. కౌసల్యమ్మా! ఈ బతుకమ్మ ఎప్పటి పండుగమ్మా..? కౌసల్య: తరతరాల నుంచి చేసుకుంటున్నరు. మన పరిస్థితి మంచిగున్నా, లేకున్నా.. బతుకమ్మ పండుగొచ్చిందంటే రంగురంగుల పూలతో పండుగచేసుకునేటోళ్లం. గోరటి వెంకన్న: బతుకమ్మ పూల కోసం అప్పట్లో కొండలుగుట్టలు తిరిగి కట్ల పూలు, గునుగు పూలు, బంతులు, చేమంతులు అన్నింటినీ కోసుకుని తెచ్చుకునేటోళ్లు.. మరి ఇప్పడు ఏం చేస్తున్నారు? రేఖ: కొనుక్కుంటున్నం సార్ పద్మ: మా చిన్నప్పడు ఊళ్ల ఆడపిల్లలమంతా చెట్లంట, పుట్లెంట తిరిగి రకరకాల పూలు తెచ్చుకునేటోళ్లం. పూల కోసం చాలా తిరిగేటోళ్లం. సరిత: ఇప్పుడు ఏ పువ్వు కొనాలన్నా.. కిలో వంద రూపాయలకు తక్కువ లేదు. ఏం చేస్తం.. ప్రతి రోజూ బతుకమ్మ పేర్చాలంటే మార్కెట్వోయి పూలు కొనాల్సిందే. గోరటి వెంకన్న: ముఖ్యంగా ఏమేం పూలు వాడుతున్నరు తల్లీ..? కౌసల్య: తంగేడు పువ్వు, కట్ల పువ్వు, పార్వతీపరమేశ్వరుని పువ్వు, పుట్నం పువ్వు, గునుగు పువ్వు, గన్నేరు పువ్వు, ఉప్పు పువ్వు, అడవి చేమంతి, గుమ్మడి పువ్వు, బంతి పువ్వు.. ఇట్ల చానా పువ్వులను పెట్టేటోళ్లం. గిప్పుడు ఏవి దొరికితే గవ్వే.. గోరటి వెంకన్న: పూర్వం యోగులు, రుషులు చెట్లతో మాట్లాడేవారని మన పెద్దలు చెప్పేవాళ్లు. స్వయంగా మొక్కల దగ్గరికి వెళ్లి మీ చేతులతో పూలను కోసుకుంటే పొందే అనుభూతి మార్కెట్లోని పూలమ్మేవారితో బేరం చేస్తే రాదు కదా ! రేఖ: రాదు సార్. కానీ ఏం చేస్తం. మాకు అందుబాటులో ఉన్న పూలతోనే బతుకమ్మను అందంగా తయారుచేసుకుంటున్నాం. సరిత: పండుగ రాష్ట్ర పండుగయ్యింది కాబట్టి ఈ పూల పెంపకంపై కూడా దృష్టి పెట్టాలి. గోరటి వెంకన్న: అమ్మా.. సావిత్రమ్మా! మీరు.. మూడు రోజుల పాటు ఆపకుండా బతుకమ్మ పాట రూపంలో రామాయణం చెబుతారని విన్నాను. సావిత్రమ్మ: మేం ఆనాటి మనుషులం సార్. ఎంతసేపైనా ఆపకుండా పాట పాడతనే ఉంటం. గిప్పటి పిల్లలకు ఒక పాట పాడంగనే ఆయాసమొస్తది. గోరటి వెంకన్న: బతుకమ్మ పాటకు, ఆటకు ఒక లయ ఉంటుంది కదమ్మా.. ? కౌసల్య: అవును.. హైరానా పడకుండా పాడాలి. అందరి అడుగు ఒక్కలెక్కనే పడేలా ఆడాలి. మా చిన్నప్పుడు ఆపకుండా ఐదారు గంటలు ఆడేటోళ్లం. గోరటి వెంకన్న: బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డల పండుగంటరు? పద్మ: అవును సార్. అన్నకు అక్కచెల్లెళ్లు గుర్తుకొచ్చేరోజు. బతుకమ్మ పండుగెప్పుడొస్తదా అని.. అత్తారింట్లున్న ఆడపిల్ల వెయ్యికళ్లతో ఎదురుచూసే పండుగ. ఇంటి ఆడపిల్లతో బతుకమ్మ పేర్చుకోవాలి. బతుకమ్మ పండుగప్పుడు అన్నాచెల్లెళ్ల అనుబంధం తెలుపుతూ పాడే పాటలు కూడా చానా ఉంటయి. గోరటి వెంకన్న: ఎంత మంచి మాట చెప్పినవ్ తల్లీ.. బతుకమ్మ అంటే మన ఇంటి ఆడపిల్ల. ఆమె చల్లగ ఉండి, తన పుట్టింటి వారి క్షేమం కోరుకుంటూ బతుకమ్మకు మొక్కుకుంటే మనకు ఏ కష్టాలు రావు. అమ్మా.. బతుకమ్మ అలంకరణలో ముఖ్యమైనది తంగేడు పువ్వు. దాని గురించి చెప్పండి. సరిత: చాలా ముఖ్యమైనది సార్. కానీ ఆ పువ్వును కూడా కొంటున్నం. గోరటి వెంకన్న: హిమాలయాల్లో బ్రహ్మకమలం పువ్వుని పూజించినట్టు మన దగ్గర తంగేడు పువ్వుని పూజించే రోజు వస్తదంటరా? పద్మ: వస్తుంది సార్. తప్పకుండా వస్తుంది. సులోచన: సార్.. ఇంకో ముఖ్యమైన విషయం. మా చిన్నప్పుడు బతుకమ్మలను చెరువులో వదిలి ఆ చెరువులో నీరు తాగి ఇంటికొచ్చేటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. మంచినీళ్ల సంగతి పక్కన పెట్టండి. అసలు చెరువులే కానొస్తలేవు. గోరటి వెంకన్న: అవునమ్మా.. బతుకమ్మను మనం తయారుచేసుకోగలం. కానీ ఆ గంగమ్మని చేసుకోలేం. . అయినా ఊరికో చెరువులాగా మన పట్నంల కూడా నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. సురేఖ: మన సిటీల ఏ చెరువులకు పోయిన మురుగునీరే సార్. నీళ్లల్ల దిగేటట్టే లేదు. గోరటి వెంకన్న: ఇప్పుడైనా అంతే తల్లీ.. రాష్ట్ర పండుగైన బతుకమ్మ మన దేశ పండుగలా చేసుకోవాలి. ప్రాంతాలు, జాతులకు అతీతంగా పూలను ఆరాధించే పండుగగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనదే. గోరటి వెంకన్న: బొడ్డెమ్మ పాటలు ఎవరికన్నా వచ్చామ్మా. రేఖ: అందరికీ వస్తయి సార్. గోరటి వెంకన్న: ఏదీ.. ఒక పాట పాడు తల్లీ. రేఖ: బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో నీ బిడ్డ నీళ్ల గౌరి ఉయ్యాలో.. నీ బిడ్డ నీళ్లు పోసే ఉయ్యాలో నిత్యం నీళ్లు పోసి ఉయ్యాలో.. నిత్యమల్లె చెట్టేసే ఉయ్యాలో నిత్యమల్లె చెట్టూకు ఉయ్యాలో.. ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గలకు ఉయ్యాలో.. ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో.. సాలోనికిస్తే ఉయ్యాలో సాలోడు నేసేనే ఉయ్యాలో.. నెలకొక్కపోగు ఉయ్యాలో దిగెనే ఆ చీర ఉయ్యాలో.. దివిటీల ఆ చీర ఉయ్యాలో... ఇట్ల చానా పెద్దగ ఉంటది సార్. గోరటి వెంకన్న: ఎంత అందమైన, అద్భుతమైన సాహిత్యమో చూడండి. బిడ్డ దగ్గర మొదలుపెడితే ఎక్కడికో వెళ్లింది. బతుకమ్మ పాటలంటే.. మన బతుకు పాటలు. కౌసల్య: మొత్తం నాలుగు రకాలుగా బతుకమ్మ పాటలుంటయి. ఉయ్యాలో, రామ, వెన్నెల, చందమామ.. ఇట్ల ముగింపు పదాలతో చరిత్రను చెబుతాయి. పురాణాలు చెబుతాయి. ఏ విషయానైన్నా చెప్పొచ్చు. సావిత్రమ్మ: పదాలకంటే పాట బలమైంది. అందులోనూ బతుకమ్మ పాటకుండే ప్రత్యేకత చాలా గొప్పది. ఈ పాట రూపంలో చెప్పిన ఏ విషయమైనా వినడానికి ఇంపుగా ఉంటుంది. గోరటి వెంకన్న: బతుకమ్మ పండుగప్పుడు చేసే ఫలహారాల గురించి చెప్పండి తల్లీ. సులోచన: కుడుములు, గుడాలు, మలిదలు, సద్దులు, పెరుగన్నం.. రకరకాలు కౌసల్య: ఒక్కొక్క తాన ఒక్కోతీరు ఉంటయి సార్. నైవేద్యాలు ఎవరిష్టమున్నట్టు వారు పెట్టుకుంటరు. మా చిన్నప్పుడైతే పచ్చొడ్లు, జొన్నలు, తైదలు దంచుకుని నైవేద్యం తయారు చేసేటోళ్లు. అప్పట్ల బతుకే బతుకమ్మ అన్నట్లు ఉండేది సార్. బతుకమ్మ కారు విలక్షణమైన కార్ల రూపకర్త, గిన్నిస్ రికార్డు గ్రహీత సుధాకర్ తాజాగా బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ ఆకారంలో కారును జీహెచ్ఎంసీ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పది అడుగుల వ్యాసం, పదమూడు అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ మూడు చక్రాల కారు 150 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బతుకమ్మ కారులో రెడ్‌లైట్, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. సుధాకర్ ఇంతకుముందు వినాయకుడి ఆకారంలో కూడా ఒక కారు రూపొందించారు. -బహదూర్‌పురా -
ఏమేమి పువ్వొప్పునే.. గౌరమ్మ
-
అంబరాన్నంటిన పూల సంబురం
బతుకమ్మ పండుగను మహిళలు రెండోరోజూ ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బతుకమ్మ ఆటల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు. ఒక్కేసి పువ్వేసి.. చందమామ.. రాశి పడబోసి చందమామ రాశి కలుపుదాం రావె చందమామ రత్నాలగౌరు చందమామ నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ తీగతీగెల బిందె రాగితీగెల బిందె నీనోము నీకిత్తునే గౌరమ్మ నానోమునాకీయవే గౌరమ్మ అదిచూసిమాయన్న గౌరమ్మ ఏడుమేడలెక్కిరి గౌరమ్మ ఏడు మేడలమీద పల్లెకోటల మీద పల్లెకోటల మీద పత్రీలు కోయంగ దొంగలెవరో దోచిరీ గౌరమ్మ బంగారు గుండ్లపేరు గౌరమ్మ దొంగతో దొరలందరూ గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ రెండేసి పూలేసి రాశి పడబోసి గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ బతుకమ్మ ఆటపాటలతో పాలమూరు జిల్లా హోరెత్తుతోంది. వేడుకలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నారు. గురువారం రెండోరోజు అటుకుల బతుకమ్మను చేసి సంబురాలు జరిపారు. మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నూ ఉద్యోగినులు బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పూలు సుఖ సంతోషాలకు ప్రతీకలు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పూలు సుఖ సంతోషాలకు ప్రతీకల, రకరకాల పూలతో నిర్వహించే బతుకమ్మ పండుగ ఎంతో శక్తితో కూడుకున్నదని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం తీసుకొచ్చిన నిజామాబాద్ ఎంపీ కవిత ముఖ్య అతిథి గా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జేసీ శర్మన్ మా ట్లాడుతూ పెద్దలు అందించిన పూర్వ పండుగలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏజేసీ రాజారాం పున్న, డీఈఓ చంద్రమోహ న్, ఆర్వీఎం పీఓ కుసుమకుమారి, ఏఎంఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆడపడుచుల గుండెచప్పుడు బతుకమ్మ
నల్లగొండ కల్చరల్ : బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచుల గుండెచప్పుడని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. గురువారం స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలను ప్రారంభించి మాట్లాడారు. పెద్ద ఎత్తున మహిళలు ఈ ఉత్సవాలలో పాల్గొనటం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ పండగ మహిళా సంఘటిత శక్తికి నిదర్శనమన్నారు. జిల్లా నుంచి ఇద్దరు మహిళలను ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలకు పంపించనున్నట్లు తెలిపారు. కళాశాల మైదానంలో ప్రతి రోజూ, అక్టోబర్ 2న బైపాస్‌లో గల వల్లభరావు చెర్వు వద్ద బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశామన్నారు. మొదటి బహుమతి రూ. 1000లను పానగల్లు మహిళా సంఘ బంధం సభ్యులకు , 2వ బహుమతి రూ. 500లను ప్రభుత్వ శాఖల మహిళలకు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సోలేషన్ బహుమతి కింద రూ.250 చొప్పున అందజేశారు. అంతకుముందు 15 బృందాలుగా ఏర్పడిన మహిళలు బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతిమీనా, ఏజేసీ వెంకట్రావ్, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ జహీర్, డీఆర్డీఏ పీడీ సుధాకర్, మెప్మా పీడీ సర్వోత్తమరెడ్డి, డీఎంహెచ్ఓ ఆమోస్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డీపీఆర్ఓ నాగార్జున, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, మౌలానా, శాస్త్రి, చాంద్‌పాషా, డీపీఓ కృష్ణమూర్తి, కె.చినవెంకట్‌రెడ్డి, సుధారాణి, ఏచూరి శైలజ తదితరులు పాల్గొన్నారు. ‘బతుకమ్మ’ పోస్టర్ ఆవిష్కరణ రాంనగర్ : నల్లగొండ జిల్లా బతుకమ్మ ఉత్సవాలు అనే కార్యక్రమంపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ టి.చిరంజీవులు గురువారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జిల్లాస్థాయిలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలపై వాల్ పోస్టర్‌ను తయారు చేసియించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతి మీనా, ఏఎస్పీ రమా రాజేశ్వరి, ఏజేసీ వెంకట్రావ్, డీపీఆర్ఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి బతకమ్మ వేడుకలు
-
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
-
నేటి నుంచి బతకమ్మ వేడుకలు
‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు గౌరమ్మ ఉయ్యాలో...’‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దూల గుమ్మ.. అందాల బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన..’ ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..ఏమేమి కాయొప్పునే.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే..’ ‘ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జామాయె చందమామ...రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయె చందమామ..’’ ఎంగిలి పూల బతుకమ్మ.. బతుకమ్మ... బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బంగారు బతుకమ్మను తొమ్మిది రోజులపాటు కొలిచే పండుగ రానే వచ్చింది. ‘పూల’ పల్లకిలో మహిళలకు సంబరాలు మోసుకువచ్చింది. తెలంగాణకే తలమాణికమైన బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు పల్లెల నుంచి పట్టణాల వరకు మహిళలు ఇష్టంగా జరుపుకుంటారు. మనిషికి ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే భారతీయ సంస్కృతిలో ప్రకృతితో మమేకమై చేసే పండుగలే అధికం. ఇటువంటి పండుగల్లో బతుకమ్మ ఒకటి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వచ్చిందం టే ఆడపడుచుల్లో కలిగే సంబరం అంతా ఇంతా కాదు. అశ్వయుజమాసం ఆరంభం అమావాస్యరోజైన శుక్రవారం నుంచి నవరాత్రులు ముగిసే వరకు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. బతుకమ్మ పండగ మూడు పండగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక. అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చి సాయంత్రం చావడి వద్దకు తీసుకవచ్చి ఆడుతారు. ఎంగిలి పూలు వేస్తారు. అమావాస్యకు ముందు ఐదు రోజులు బొడ్డెమ్మగా ఆడిన అనంతరం అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఆట సాగుతుంది. ఈ పండుగ వచ్చిం దంటే ఎక్కడెక్కడి వారో తమ సొంతూళ్లకు చేరుకుంటుంటారు. పండుగ పుట్టిందిలా... పూర్వం ధర్మాంగధుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య సత్యవతి. ఆ కాలంలో ఈ రాజ దంపతులకు పలుమార్లు సంతానం కలిగినా పుట్టిన వారు పుట్టినట్లే చనిపోతూ ఉండేవారు. ఇలా చాలామంది చని పోతుండడంతో దంపతులిద్దరూ లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు. వారికి చివరగా ఓ పాప పుడుతుంది. ఆమె బతికుండాలని రాజు లోకమాత అయిన దుర్గాదేవికి శరన్నవరాత్రుల పేరిట తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. అప్పటి వరకు పాపకు ఏపేరు పెట్టకుండా ఉంటాడు. ఈ బిడ్డ బతకాలని అందరూ ఆమెను ‘బతుకమ్మా.. బతుకమ్మా..’ అంటూ దీవించారు. క్రమంగా ఆ పాప పేరు బతుకమ్మగా మారింది. తదుపరి లక్ష్మీదేవిగా నామకరణం చేసినా.. అందరూ బతుకమ్మగానే పిలుస్తుండేవారు. రాజు కూతురు ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఎవరి ఇంట్లో అడుగిడినా లక్ష్మీదేవి తాండవిస్తుండేది. వరంగల్ జిల్లాలో ఈ పండుగ పుట్టిందనేది ఎక్కువగా వాడుకలో ఉంది. సౌభాగ్యం పంచే బతుకమ్మ పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలి రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి వరుడు రావడంతోపాటు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం. ఇదే తీరులో సౌభాగ్యం కలిగిన మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను పూలతో పూజించి ఆడితే సౌభాగ్యం నిలుస్తుందని విశ్వాసం. పూనాస పంటలుగా వచ్చే వాటితో ఐదు రకాల పిండి వంటలు చేసి, ఐదు రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మగా కొలిస్తే ఆ ఇంట సిరుల పంట కురుస్తుంది. తంగేడు పూలు, గోవు పూలు, గుమ్మడి పూలు, పున్నాగ పూలు, కట్లపూలతో బతుకమ్మను పేరుస్తారు. పప్పు పులుగడం, పెరుగుతో చేసే దద్దోజనం, పాయసం, పులిహోర, కేసరి అనే ఐదింటిని నైవేద్యాలుగా పెడుతారు. ఈ వంటకాలు శరీరారానికి మేలు చేస్తాయి. ప్రదక్షిణలే పాటలయ్యాయి భక్తిశ్రద్ధలతో ఐదేసి రకాల పూలు, వంటకాలతో బతుకమ్మ చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో పాత కాలంలో వేద మంత్రాలతో కూడిన శ్లోకాలు పాడేవారు. అన్ని వర్గాల వారికి శ్లోకాలు రాకవపోవడంతో గౌరమ్మపై స్థానిక భాష, వైవిధ్యాలకు అనుగుణంగా పాటలు పాడేవారు. ఆనాటి ఆ పాటలు నేటి బతుకమ్మ పాటలుగా చెలమణి అవుతున్నాయి. కష్ట జీవులు కూడా బతుకమ్మ ఆడుతున్న సమయంలో తమ శ్రమను, తమ కష్టాల్ని బతుకమ్మ పాటలుగా మలిచేవారు. అలా నేడు బతుకమ్మ పాటలు వేలల్లో కనిపిస్తాయి. ఎక్కువగా దేవుళ్లు పడ్డ కష్టాలు, రామాయణంలో సీతమ్మవారి కష్టాలు, లక్ష్మీదేవి వైభవాన్ని చాటుతాయి. తెలంగాణ ప్రజల కష్టసుఖాలు కూడా బతుకమ్మ పాటలుగా నేడు ఆదరణ పొందుతున్నాయి. సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం. తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఆడపడుచూ తప్పనిసరిగా బతుకమ్మ చుట్టూ రెండు అడుగులు వేయాలి. రెండు పాటలు పాడాలి అనుకునే సందర్భం సద్దుల బతుకమ్మ. మహిళలు పట్టు చీరెలు, యువతులు పరికిణీలు ధరించి, నగలతో సింగారించుకుంటుంటారు. వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ రాత్రిలో బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరుతోనూ, గౌరమ్మగానూ కొలిచి నీటిలో నిమజ్జనం చేసి పోయి రా.. బతుకమ్మా అంటూ.. హారతులు ఇచ్చి సాగనంపుతారు. వెంట తెచ్చుకున్న పెరుగన్నం, సత్తు పిండి (మొక్కజొన్న, వేరుశెనగ పిండి వేయించి చక్కెర కలిపి) ఇచ్చి పుచ్చుకుంటారు. బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్నలను చక్కెర, బెల్లంతో కలిపి దంచిపెడుతారు. యువతులు, మహిళలు ఒకచోట చేరి శిబ్బుల్లో (బతుకమ్మను పేర్చేది) ఇచ్చిపుచ్చుకుంటుంటారు.