
బతుకు బాటలో పూలజాతర
సుమారు ముప్పైవేల మంది రైతన్నల కుటుంబాల్లో ఇంటికొక స్త్రీ వైధవ్యం పాలయింది. ఈ శాతాన్ని తగ్గించకుండా మహిళల పండగని రాష్ట్ర పండగగా ప్రకటించవద్దని చెప్పగలగాలి. చిమ్మచీకటి ఆవరించుకున్న మహిళ బతుకులో వెలుగు చూపని పండగ మనకెందుకు అనే పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతున్నది.
బతుకమ్మని ఒక పండగగా చూడ్డం ఆచారం. ఈ ఏడాది మాత్రం దానిని ఒక సంద ర్భంగా చూడ్డం వర్తమానం అవసరం. పండగలు రకర కాలు. స్త్రీలవి, పురుషులవి. ఇద్ద రివీ. అందరివీ. అవి మతాల వారీగా, కులాల వారీగా ఉం టాయి. ప్రభుత్వ పండగలు, ప్రజల పండగలు అని వేరు వేరుగా ఉంటాయి. ప్రభుత్వ పండగలు ప్రజల పండగలుగా మారలేవు. ఎందుకంటే వాటిలో ప్రజాస్వభావం ఉండదు. కానీ ప్రజల పండగల్ని ప్రభుత్వాలు, పాలక వర్గాలు హైజాక్ చేస్తాయి. చిన్న చిన్న కుల వర్గాలకు చెందిన పండగలను ఉన్నత వర్గాల వారు సొంతం చేసుకుంటారు. వాటికి ఆర్థికంగా, నైతికంగా మద్దతు ఇచ్చినట్లు చూపిస్తారు. తమకు స్వతహాగా లేని ప్రజాభావనని ఆపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితి బతుకమ్మ పండగకి కూడా ఎదురైందని అనిపిస్తుంది.
బతుకమ్మ తెలంగాణకు ఒక సంకేతం. ఇంట్లోనో, ఊరు బయటో ఆడే ఆట ప్రత్యేక ఉద్యమంలో రోడ్డెక్కింది. రహదారి నిర్బంధంలో ఒక అడ్డుగోడగా రూపొందింది. బతుకమ్మలను నెత్తిమీద పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్న మహిళలు ఉద్యమానికి కొత్త దృశ్యం అయ్యారు. బంద్‌లలో, రహదార్ల అడ్డగింపుల్లో బతుకమ్మ దొంతరలు సిమెంట్ గోడలకన్నా బలంగా నిలిచాయి. క్రూరంగా, కర్కశంగా ఉద్యమకారులను పక్కకు తొలగిస్తూ, వ్యాన్లలో ఎక్కించే ఆ పోలీసులకు బతుకమ్మలతో ఉన్న ఉద్యమకారిణులు శక్తి స్వరూపిణు లుగా కనిపించారు. వారిని తాకడానికి మహిళా పోలీ సులు కూడా తటపటాయించేవారు. ఒకరివెనుక ఒకరు బతుకమ్మలతో కవాతు చేస్తున్నట్టుగా నడిచిపోతుంటే అది ఒక కొత్త శక్తితో వాతావరణం బరువెక్కేది.
బతుకమ్మ తెలంగాణ సంకేతం. బతుకమ్మ పండగ నుండి ప్రజాస్వభావాన్ని పెకిలించి కలిగినమ్మల పట్టు పీతాంబరాలు, బంగారు తాంబూలాలు, చానెల్ దృశ్యాల బతుకమ్మగా చేస్తామంటే అదే బతుకమ్మ ఏదో ఓనాడు ఎదురు తిరగక తప్పదు. నిజానికి ఆ పండగ మూల స్వభావం నుండి దూరంగా జరపడం వల్ల బతుకమ్మకి అవమానం జరుగుతోంది. బతుకమ్మ ఒక సామాజిక ఆచరణ. సమస్త కుటుంబ సభ్యుల కలయిక.
ఒకప్పుడు సంతానమే సంపద. ధాన్యమే ధనం. వ్యవసాయ ఉత్పత్తిలో, శిశువులకి జన్మనివ్వడంలో స్త్రీయే ప్రధానం. పునరుత్పత్తికి స్త్రీయే కేంద్రం. ఇలాంటి భావన లతో నిండిన పండగే బతుకమ్మ. ఈ భావనని భౌతిక ఆచరణగా ఆచరించడమే బతుకమ్మ పండగ ప్రధాన ఉద్దేశం. ఈ రెండేళ్లలో ఆ వాతావరణం, ఆ భావన పక్కన పడింది. కేవలం సింగారింపులకే, ఆటకే విలువ పెరి గింది. ఏనాడూ పండగలో, ఆటలో భాగం కాని ‘పెద్దమ్మ’లు ఇప్పుడు అంతటా కానవస్తున్నారు. వారి ఫొటోలు, వీడియోలతో మీడియా తరించిపోతోంది. బతుకమ్మ పాట పాడలేని చోట సెల్‌ఫోన్‌లో పాట మోగు తోంది. డెక్‌లలో అభాస బతుకమ్మ పాట అవమానిత అవుతోంది. శ్రామిక స్త్రీల ఆటలోని పరమార్థం ఖూనీ చేయబడుతోంది. వర్తులాకారంగా కిందకు వంగుతూ, పైకి లేస్తూ పూవులా వికసిస్తూ, ముడుచుకుంటూ విప్పారి నట్లుగా ఆడే ఆట నడుం వంచని, లయాత్మకంగా చప్పట్లు కూడా కొట్టలేని నాజూకు స్త్రీలకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం సద్దుల ఫలహారం కంటికి కానరావడం లేదు. బతుకమ్మ పవిత్రత పక్కన పడిపోయింది. అంటు బతుకమ్మల గోల అధికమైంది. పాటల్లో వేగం హెచ్చి దాండియా శైలి పెరిగింది. తెలంగాణలో రాబోయే కాలంలో బతుకమ్మ ఆట అస్తిత్వానికి దెబ్బతగిలే ప్రమాదం ఉందనిపిస్తోంది.
ఇప్పుడు బేనర్లలోనే కాదు నిజమైన బతుకమ్మ పరాయి పూలతో కిక్కిరిసిపోతున్నది. బతు కమ్మలో గులాబి, లిల్లీ, చేమంతి, మల్లె వంటి పరాయి పూలు పనికిరాని పదార్థాలు. ఫాం పూలు కూడా నిషిద్ధం. దేశీ పూలకే అంగీకారం. కాని ఇప్పుడు కృత్రిమ పరాయి పూలు నిండిపోయి బతుకమ్మలు భారమై పోతున్నాయి. కృత్రిమ పూలే కాదు - ప్లాస్టిక్ పూల బతుకమ్మల్ని సెంట ర్లలో బంటరిగా బేలగా నిలిపారు. వాటి పక్కన బేనర్లలో రాజకీయ నాయకుల ఫొటోలు. ఇప్పుడు కొండల్ని, గుట్టల్ని, అడవుల్ని, చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డ వర్గాలు పంచ భౌతిక శక్తుల కూర్పుగా ఉన్న బతుకమ్మ పండగని అట్టహాసంగా చేయడం ఒక పరిహాసం.
సుమారు ముప్పైవేల మంది రైతన్నల కుటుంబాల్లో ఇంటికొక స్త్రీ వైధవ్యం పాలయింది. ఈ శాతాన్ని తగ్గించ కుండా మహిళల పండగని రాష్ట్ర పండగగా ప్రకటిం చవద్దని చెప్పగలగాలి. మద్యపానం వల్ల ఆసరా కోల్పో యి చిమ్మచీకటి ఆవరించుకున్న మహిళ బతుకులో వెలుగు చూపని పండగ మనకెందుకు అనే పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతున్నది. కల్లీకల్లు, గుడుంబా, చీప్‌లిక్కర్ ప్రభుత్వం నడపడానికి పనికొస్తాయేమో గాని ప్రజల బతుకు బాటకవి అవరోధాలే. ఈ సారి బంగారు బతుకమ్మ ఎందుకో పండగలా అనిపించనేలేదు. ఈ సందర్భం ఏదో పోగొట్టుకున్న వెలితి నిండిన పళ్లెంలా గోచరిస్తున్నది. ఐతే బతుకమ్మ తెలంగాణ సంకేతమే. కాని దానిని పరిరక్షించుకోవల సింది ప్రజలే.
వ్యాసకర్త తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు,
మొబైల్: 99519 42242
- జయధీర్ తిరుమలరావు