హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు, ఆశావర్కర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద శుక్రవారం హైదరాబాద్లో మండిపడ్డారు. బతుకమ్మ పండగకు తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓ వైపు రైతులు, ఆశావర్కర్లు ఆత్మహత్యల నేపథ్యంలో బతుకమ్మ పండగకు రూ. 10 కోట్లు కేటాయించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఏడాది కూడా ఈ పండగకు ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయిస్తే అవి ఎంపీ కె.కవిత కార్యక్రమాల కోసమే ఖర్చు చేశారని నేరెళ్ల శారద ఆరోపించారు.
బతుకమ్మ పండగ కోసం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి కాని జాగృతి సంస్థ దత్తత తీసుకోవడం ఏమిట అని కేసీఆర్ ప్రభుత్వాన్ని నేరెళ్ల శారద సూటిగా ప్రశ్నించారు. అలాగే అన్నదాతలు అనాధలని జాగృతి సంస్థ భావించడం సరికాదని నేరెళ్ల శారద అన్నారు.