బతుకమ్మ కవిత.. బాక్సింగ్ నేత!!
తెలంగాణ జాగృతి.. బతుకమ్మ పండుగలు.. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పోరాటం.. ఇన్ని రకాల పాత్రలలో ఒదిగిపోయిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరో సరికొత్త పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్కు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా సంఘాలలో జరిగిన మార్పులలో ఇదే మొదటిది.
తెలంగాణ ఉద్యమానికి స్థానిక సంస్కృతిని జోడించడంలో కవిత ఒకరకంగా విజయం సాధించారనే చెప్పుకోవచ్చు. అంతకుముందు కూడా బతుకమ్మ పండుగను ఎవరికి వారుగా తెలంగాణ ప్రాంతంలో చేసుకునే అలవాటు ఉన్నా, ఉద్యమంలో భాగంగా ఆ పండుగకు కూడా ఒక సామూహిక ఉనికిని తీసుకొచ్చి, బహిరంగ ప్రదేశాలలో బతుకమ్మలు ఆడటం, పూర్ణకుంభ స్వాగతాలకు బదులు బతుకమ్మలతో స్వాగతం పలకడం లాంటి వాటిని ప్రవేశపెట్టి, 'తెలంగాణ సంస్కృతి'ని కవిత బాగా ప్రమోట్ చేశారు. ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి మంచి ఊపునిచ్చింది.
అలాంటి కవిత.. ఇప్పుడు తెలంగాణ బాక్సింగ్ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ ఎంపీగా లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, శుక్రవారం జరిగిన బాక్సింగ్ సంఘ ఎన్నికలలో విజయం సాధించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం ధనుంజయ్ గౌడ్ వ్యవహరిస్తారు. దీంతో బతుకమ్మ పండుగ నుంచి బాక్సింగ్ రింగ్ వరకు కవిత ప్రస్థానం సాగినట్లయింది.