తెలంగాణ హృదయం– బతుకమ్మ | Asnala Srinivas Article On Bathukamma Festival | Sakshi
Sakshi News home page

తెలంగాణ హృదయం– బతుకమ్మ

Published Fri, Oct 23 2020 1:04 AM | Last Updated on Fri, Oct 23 2020 1:05 AM

Asnala Srinivas Article On Bathukamma Festival - Sakshi

‘బతుకమ్మ బతుకు / గుమ్మడి పూలు పూయగా బతుకు / తంగెడి పసిడి చిందగా బతుకు/  గునుగు తురాయి కులుకగ బతుకు/ కట్ల నీలిమల చిమ్మగా బ్రతుకు’ అని ప్రజాకవి కాళోజీ తెలంగాణ వారసత్వ సంపద బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియచేశారు. బతుకుతో ఇంత ప్రత్యక్ష సంబంధమున్న పండుగ మరొకటి లేదు. ప్రకృతిలో నిబిడీకృతమైన నిసర్గ సౌందర్యాన్ని తెలంగాణ గుమ్మం ముందు నిలిపిన పండుగ బత్కమ్మ.

పుష్పం పునరుత్పత్తికి ప్రతీక, మానవ సమాజం ధరిత్రిపై అవిచ్ఛి న్నంగా కొనసాగడానికి స్త్రీకి ప్రకృతి కల్పించిన ప్రత్యేక ధర్మం సంతానోత్పత్తి. తల్లి కడుపులో శిశువు పెరుగుదలతో పాటు దాని జీవన సారాలన్నీ బొడ్డు తాడు ద్వారానే తీరుతాయి. ఈ బొడ్డు తాడుకు, మహత్మ్యాన్ని, దైవత్వాన్ని అపాదించి రూపం కలిపిస్తే బొడ్డెమ్మ అవుతుంది. ఈ మహోన్నత పవిత్ర కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవడం కోసం పూలను బత్కమ్మగా, బొడ్డెమ్మగా కొలిచే అద్వితీయ సాంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం.

తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్ట, పువ్వు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్య పాలకులు తెలంగాణ అంతటా చెరువులను తవ్వించడం ఒక ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు. చెరువులను అభివృద్ధికి ప్రతీకలుగా భావించారు. అప్పటినుండి ఈ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ వస్తున్నారు. చిరు మార్పులతో ఆనాటి పండుగను నేటికీ జరుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండేది చెరువుల వల్లే కాబట్టి అందరూ కలిసి ఏడాదికొకసారి చెరువులకు పూలతో కృతజ్ఞతలు చెప్పేవారు. అందుకే బతుకమ్మ చెరువుల పండుగ.

పండుగ జరిపే నాటికి వర్షరుతువు ముగిం పులో ఉంటుంది. చెరువులు, కుంటలు నీలి బంగారంతో నిండి ఉంటాయి. ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉంటుంది. రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది. బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. పండుగ కొనసాగుతున్న 18 రోజులు పంచే ఫలహారాలలో పుష్కలమైన ఖనిజ, విటమిన్‌ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. లయబద్ధమైన పాదపు కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలు గల పాటలతో రసరమ్య మోహనరాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను చిక్కపరిచే బతుకమ్మ చిరకాలం వర్ధిల్లుతూనే ఉంటుంది.


అస్నాల శ్రీనివాస్,

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం, వరంగల్‌
మొబైల్‌ : 96522 75560 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement