విశ్లేషణ
కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలామందికి గొంతు దిగని పచ్చివెలక్కాయలా మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నాపత్రంపై కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం. అసెంబ్లీ, పార్లమెంటులు కాదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి, ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గురించిన అభ్యంతరాలు అర్థం లేనివి.
కుటుంబ సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులకు భంగమైనట్లు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసి ఆదాయపన్ను చెల్లించడం పౌరుల బాధ్యత కాదా? వివిధ సముదాయాల ఆర్థిక స్థితి గతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కా ఇంట్లో ఉంటున్నారా? పూరిగుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులే మున్నాయి? అసలున్నాయా? ఇల్లు ఉందా లేదా? ఎక్కడ తలదాచు కుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ అవసరమైనవే. ఈ ప్రశ్నలకు జవాబుల్లోనే ఏ సముదాయం ప్రజలకు ఆదాయవనరులు అందుబాటులో లేవు, ఎవరికి విద్యావసతి అందుబాటులో లేదు వంటి వివరాలు తెలుస్తాయి. రాజ్యంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం?
ఉండవలసిన ప్రశ్నలు
ఇది ప్రాచీన దేశం. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సముదాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధసంచార జాతులు, సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్ అనేకం ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే, ప్రభుత్వం ప్రణాళికా రచన ఎలా చేయగలదు? అందువల్లనే రాహుల్ గాంధీ తన న్యాయ్ యాత్రలో ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పారు. డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించి రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేదవర్గాలు కాకపోవచ్చు. వారందరికీ రిజర్వేషన్లు అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి.
క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కాని, సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యలు చేప ట్టడం కాని ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోని అధి కరణ 17 ప్రకారం అంటరానితనం నేరం. సమాజంలో ఏదో ఒక రూపంలో అంటరానితనం ఉంది కాబట్టి ఈ సర్వేలో దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉండవలసింది.
విద్యాహక్కు అందరికీ ఉంది. కానీ ఎంతమందికి విద్య అందు బాటులో లేదు? అధికరణ 23 హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నిషేధిస్తుంది. వెట్టిచాకిరిని నిషేధిస్తుంది. సర్వే జరగకపోతే ఎంత మంది వెట్టిచాకిరిలో ఉన్నారు? అనే వివరాలు ఎలా తెలుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న కూడా ప్రస్తుత సర్వేలో లేదు. మహానగరాల రెడ్ లైట్ ఏరియాల్లో, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు? వెట్టిచాకిరి, హ్యూమన్ ట్రాఫికింగ్, బాలకార్మికులు వంటి సమస్యలు పరిష్కరించాలంటే డాటా కావాలి.
సంపద కొందరి చేతుల్లోనే పోగుపడరాదు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలంటే, సంపదకు సంబంధించిన డాటా ఉండాలి. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు? ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? ఏ కులం పరిస్థితి ఎలా ఉంది? ఎవరి బ్యాంకు ఎక్కౌంట్లు ఎలా ఉన్నాయి?
వంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే ఎవరు సంపన్నులు, ఎవరు బాగా బతుకుతున్నారు? ఎవరు ఇతరుల వాటాను కబళిస్తున్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే దోపిడీ శక్తులు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న వారంతా అగ్రవర్ణాలకు చెందినవారే అన్నది గమనించాలి. దురదృష్టవశాత్తు కొందరు అభివృద్ధి చెందిన వెనుకబడిన కులాలవారు, అభివృద్ధి సాధించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కూడాను.
ఎందుకు అవసరం?
ఇందిరా సాహ్ని కేసుతో సహా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. 1966లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కోర్టులు ఈ ప్రతిపాదనను డాటా లేనందువల్ల కొట్టేశాయి. సర్వేలు ఏవీ జరగ లేదు. మురళీధర్ కమిషన్ విషయంలోనూ ఇదే జరిగింది. మురళీధర్ కమిషన్ ఈ సర్వే నిర్వహించలేదు. డాటా లేదన్న కారణంతో కోర్టులు కమిషన్ సిఫారసులను కొట్టేశాయి.
భారతదేశంలో ఇప్పుడు లభి స్తున్న రిజర్వేషన్లకు కారణం బ్రిటిషు వారి కాలంలో, 1931లో చేసిన కులగణన. దీని ఆధారంగానే మండల్ కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్టులో బీసీ జనాభా 52 శాతంగా నిర్ధారించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కులగణన చేయించలేదు. కులగణన అనేది రాజ్యాంగబద్ధమైన అవసరం.
అధికరణ 38 ప్రకారం ప్రభుత్వం సోషల్ ఆర్డర్‌ను కాపాడటం ద్వారా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. ఇందులో రాజకీయ న్యాయాన్ని కూడా మరిచిపోరాదు. పురుషులు, మహిళలకు సమానంగా తగిన జీవనోపాధి హక్కు, భౌతిక వనరుల యాజమాన్యం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారి తీయకుండా చూడటం, సమాన పనికి సమాన వేతనం గురించి ప్రభుత్వాలకు నిర్దేశాలున్నాయి.
గణాంకాలతోనే సామాజిక న్యాయం
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అదే అధికరణ 243 డి 6. ఈ అధికరణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది. 1992లో ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు పంచాయితీల్లో, చైర్‌పర్సన్ల ఎన్నికల్లో తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు ఉంది. అయితే వెనుకబడిన వర్గాలు రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన రిజ ర్వేషన్లు పొందగలరు. అందువల్లనే అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పంచా యత్ రాజ్ చట్టం 1994 తీసుకువచ్చారు.
ఆ విధంగా స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు 1994 నుంచి గత ఎన్నికలకు ముందు వరకు లభిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు క్యాప్ 50 శాతం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాల లభ్యతను బట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కుల సముదాయాల డాటా అందుబాటులో లేకపోవడం వల్లనే. అందు వల్లనే కులగణన అవసరం.
సమగ్ర కుటుంబసర్వేలో కానీ, కులగణనలో కానీ ఉన్న ప్రశ్నలు పాతవే. 2011లో జరిగిన సర్వేలో ఉన్న ప్రశ్నలే ఇప్పుడూ అడుగు తున్నారు. అప్పుడు ఎవ్వరు అభ్యంతరాలు చెప్పలేదు. నిజానికి, గణాంకాల చట్టం ఉంది. అధికరణ 342 ఏ (3) ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ దేశంలో కులగణన జరిగితే తిరుగుబాట్లు జరుగుతాయని మాట్లాడారు. కులగణన జరగకపోతేనే అణగారిన వర్గాలు తిరగబడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది.
కులరహిత వ్యవస్థ ఏర్పడాలంటే కులగణన తప్పనిసరి అవసరం. బడుగు బలహీనవర్గాలు సామాజికంగా కాస్త పైస్థాయికి చేరుకున్న ప్పుడే కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా కులనిర్మూ లన జరుగుతుంది. అందువల్ల అందరూ కులగణనకు సహకరించా లని కోరుతున్నాను. కులగణన సమగ్ర ప్రగతి వికాసాలకు తోడ్పడే మొదటి అడుగు.
జస్టిస్ వి.ఈశ్వరయ్య
వ్యాసకర్త జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment