సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (కులగణన) పేరుతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులతోపాటు ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన ప్రణాళికలను రూపొందించేందుకు ఉద్దేశించిన ఈ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సభ ముందుంచారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్ సభ్యులు కేటీఆర్, గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, కాలేరు వెంకటేశ్, కాంగ్రెస్ సభ్యులు వాకాటి శ్రీహరి, శంకరయ్య, ఆది శ్రీనివాస్, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు.
చట్టం అవసరం లేదు: పొన్నం ప్రభాకర్
జనాభా దామాషా పద్ధతిలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానా లు రూపొందిస్తామని చెప్పారు. కులగణన తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఆయన బదులిచ్చారు. కులగణనకు ఎలాంటి చట్టం అవసరం లేదని, 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చట్టం లేకుండానే చేపట్టిందని తెలిపారు.
అయితే తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టడంతో పదేళ్లుగా వెనక్కు పోయిందని అన్నారు. 2014లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పటికీ బయట పెట్టలేదని విమర్శించారు. తాజాగా చేపట్టనున్న సర్వే అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2014 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం బీసీల కోసం రూ.23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఎంబీసీలకు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
న్యాయపరమైన సలహాల మేరకే ముందుకు: భట్టి
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణనకు అంకురార్పణ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ‘ఎవరెంత ఉంటారో వారికి అంత చెందాలి’అని రాహుల్‌గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగానే ఈ నెల 4న కేబినెట్‌లో చర్చించి కులగణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బీసీలకు సబ్‌ప్లాన్ కూడా తీసుకొస్తామని, సర్వే అనంతరం బీసీల శాతాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పారు.
చట్టబద్ధత కల్పిస్తేనే మంచిది: కేటీఆర్
రాష్ట్రంలో కులగణనను బీఆర్‌ఎస్ సంపూర్ణంగా స్వాగతిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చట్టబద్ధత కల్పిస్తేనే ఫలవంతమవుతుందని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్ మొదటి నుంచి పనిచేస్తోందన్నారు. 2004లోనే కేసీఆర్.. ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్ రావుతో కలసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలసి ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. 2014 తర్వాత శాసనసభలో రెండుసార్లు ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.
ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి: అక్బరుద్దీన్
రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు వీలుగా కులగణన చేపట్టేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలతోపాటు మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనలను తొలగించాలన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. కులగణనకు సంబంధించిన విధివిధానాలు ఏమిటో తెలపాలని విజ్ఞప్తి చేశారు. బిల్లు రూపంలో తీసుకొస్తే చట్టబద్ధత ఉంటుందని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment