సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ఇంటింటి సర్వే చేస్తూనే బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఆ వర్గానికి సంబంధించిన కుల గణన చేయటానికి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో తమ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలితులను పాలకులను చేయడానికే తమ తపన అని వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన చర్యల తరహాలోనే రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే గొప్ప నిర్ణయమైనందున దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తిన సందేహాలపై సీఎం వివరణ ఇచ్చారు.
అండగా ఉండాలంటే లెక్కలు తెలియాలని సుప్రీం చెప్పింది
‘ఈ తీర్మానంపై సలహాలు సూచనలు ఇవ్వటం కంటే అనుమానాలు లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించటంతో పాటు ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారు. యూపీఏ–1 హయాంలో మైనారిటీల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వేశారు. దాని సిఫారసుల ఫలితంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇప్పుడు బీసీల సమగ్ర అభ్యున్నతి కోసం, వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్న రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు మా ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు వెల్లడించలేదు. పదేళ్లయినా అది ఓ రహస్య నివేదికగానే ఉండిపోయింది. ఒకే ఒక కుటుంబం ఆ వివరాలను అవసరమైనప్పుడు చూసుకుని, ఎన్నికల సమయంలో దాన్ని వాడుకుంది. మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఈ తీర్మానం అత్యంత కీలకమైంది. బలహీనవర్గాలకు అండగా నిలబడాలంటే ఆ వర్గం లెక్కలేంటో తెలియాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనే అనుమానాలు ఏవైనా ప్రతిపక్షానికి ఉంటే వాటిని వెల్లడిస్తూ మంచి సూచనలు చేయాలి..’అని సీఎం కోరారు.
అర శాతం ఉన్నోళ్లకు బాధగానే ఉంటుంది..
‘అర శాతం ఉన్నోళ్లకు కచి్చతంగా బాధ ఉంటుంది. రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకున్నోళ్లకు.. ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వచ్చి 50 శాతం ఉన్నోళ్లకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న బాధ ఉండొచ్చు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి అభిప్రాయం చెప్పాలి. లేదా వారు బాధ్యత అప్పగించిన వారైనా చెప్పాలి. నకలుæ చిట్టీలు అందించినట్టు కడియం శ్రీహరి పక్కన చేరి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు సందేహం లేదు. కానీ, పక్కన కూర్చున్నవారి సావాస దోషం ఆయనను తప్పుదోవ పట్టిస్తోంది. మేనిఫెస్టో, ఎన్నికల హామీలపై చర్చ కావాలంటే ప్రత్యేకంగా పెట్టుకుందాం. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీ ఏం హామీ ఇచ్చింది, వాటిని ఎంతమేర అమలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన హామీలు, ఈ 70 రోజుల్లో అమలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దాం..’అని రేవంత్ అన్నారు.
కేవలం బీసీల కులగణనతో వారికే నష్టం: గంగుల కమలాకర్
బీఆర్‌ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, అయితే దీనిపై కొన్ని సందేహాలున్నాయని అన్నారు. తీర్మానం కాకుండా బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం బీసీ కుల గణన చేస్తే చివరికి బీసీలే నష్టపోతారని పేర్కొన్నారు. సర్వే ఎప్పట్లోగా చేసి వివరాలు వెల్లడిస్తారో కూడా చెప్పాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారని, వచ్చే జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని అమలు చేయాలని కోరారు. బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్‌ప్లాన్ తెస్తామని చెప్పినా బడ్జెట్‌లో వాటి ఊసు లేదన్నారు.
తీర్మానంలో స్పష్టత లేదు: కడియం శ్రీహరి
తీర్మానంలో స్పష్టత లోపించిందని, సమగ్ర కుటుంబ సర్వే అని, బీసీ కుల గణన అని ఉందని, ఇందులో ఏది చేస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్ సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని తీర్మానంలో పూర్తి స్పష్టత ఉందని, అన్ని వర్గాలు, అన్ని కులాల ఆర్థిక, సామాజిక ఇతర అంశాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నట్టు చెప్పారు. బీసీ కులగణన కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. విపక్షం ఒకవేళ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టైతే ఆ విషయం బహిరంగంగా చెప్పాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment