బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!! | Deepti Mamidi conducting Bathukamma Celebrations in New Jersey | Sakshi
Sakshi News home page

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! అమెరికా బతుకమ్మ ఉయ్యాలో!!

Published Sat, Aug 19 2023 12:28 AM | Last Updated on Sat, Aug 19 2023 9:40 AM

Deepti Mamidi conducting Bathukamma Celebrations in New Jersey - Sakshi

దీప్తి మామిడి, న్యూజెర్సీలో బతుకమ్మ వేడుక (ఫైల్‌ ఫోటో)

‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ!
తంగేడు పువ్వులో... తంగేడు కాయలో... ఆట చిలుకలు రెండు... పాట చిలుకలు రెండు...’’

‘‘చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన...’’
‘‘ఇలా ఒకటా... రెండా... లెక్కలేనన్ని బతుకమ్మ పాటలు మా నాలుకల మీద నాట్యమాడుతుంటాయి. గ్రామాల్లో గడిచిన బాల్యం జీవితాన్ని నేర్పుతుంది. తెలంగాణ గ్రామాల్లో బాల్యం బతుకమ్మ పాటల రూపంలో సమాజంలో జీవించడాన్ని నేర్పుతుంది. నిరక్షరాస్యులు కూడా ఈ పాటలను లయబద్ధంగా పాడతారు. బతుకమ్మ పాటల సాహిత్యం వాళ్ల నాలుకల మీద ఒదిగిపోయింది. తమకు తెలిసిన చిన్న చిన్న పదాలతో జీవితాన్ని అల్లేశారు గ్రామీణ మహిళలు. మా నాన్న ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌.

మా అమ్మమ్మ గారి ఊరు జగిత్యాల జిల్లా, వెలుగుమాట్ల. నా చదువు పుట్టపర్తిలో, సెలవులు అమ్మమ్మ ఊరిలో. దసరా సెలవులు వస్తున్నాయంటే సంతోషం అంతా ఇంతా కాదు. దేశమంతా దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటే మేము బతుకమ్మ వేడుకలు చేసుకుంటాం. గౌరమ్మ అందరి మనసుల్లో కొలువుంటుంది, మాట, పాట, ఆట అన్నీ గౌరమ్మ కోసమే అన్నట్లు ఉంటుందీ వేడుక. ఇంత గొప్ప వేడుకకు దూరమయ్యానని అమెరికా వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు. అందుకే అమెరికాలో బతుకమ్మను పేర్చాను’’ అన్నారు దీప్తి మామిడి... కాదు, కాదు, బతుకమ్మ దీప్తి.

‘‘నేను 2007లో యూఎస్‌కి వెళ్లాను. న్యూజెర్సీలో ఉండేవాళ్లం. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లిని. భర్త, పాప, ప్రొఫెషన్‌తో రోజులు బిజీగా గడిచిపోయేవి. డబ్బు కూడా బాగా కనిపించేది. కొద్ది నెలల్లోనే... ఏదో మిస్సవుతున్నామనే బెంగ మొదలైంది. వ్యాక్యూమ్‌ ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు, కానీ బాల్యం, సెలవుల్లో బతుకమ్మ వేడుక మరీ మరీ గుర్తుకు వస్తుండేది. బతుకమ్మ కోసం ఇండియాకి రావడం కుదరకపోతే నేనున్న చోటే బతుకమ్మ వేడుక చేసుకోవచ్చు కదా! అనిపించింది. అలా అక్కడున్న తెలుగువాళ్లను ఆహ్వానించి బతుకమ్మ వేడుక చేశాను.

మొదటి ఏడాది పదిహేను మందికి లోపే... పదేళ్లు దాటేసరికి ఆ నంబరు ఐదారు వందలకు చేరింది. అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. ఏటా ఒక పెళ్లి చేసినట్లు ఉండేది. ఇండియా నుంచి తెలంగాణ పిండివంటలను తెప్పించుకోవడం, ఆ రోజు వండుకోవాల్సినవన్నీ మా ఇంట్లోనే వండడం, ఆ వంటల కోసం దినుసులను సేకరించడం, స్నేహితులందరినీ ఆహ్వానించడం, పూలు తెచ్చుకుని ఒక్కొక్కటీ పేర్చడం... ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంజాయ్‌ చేసేదాన్ని. ‘ఏటా అంతంత ఖర్చు ఎందుకు’ అని స్నేహితులు అనేవాళ్లే కానీ మా వారు ఒక్కసారి కూడా అడగలేదు. నా సంతోషం కోసం చేసుకుంటున్న ఖర్చు అని అర్థం చేసుకునేవారు.

ఎప్పుడూ అన్నం ఉంటుంది!
యూఎస్‌లో మా ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ మీద ఎప్పుడూ అన్నం, కూరలుండేవి. మా కన్సల్టెన్సీకి వచ్చిన వాళ్లు, ముఖ్యంగా బ్యాచిలర్స్‌ కోసం ఈ ఏర్పాటు. మేము యూఎస్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే రెసిషన్‌ వచ్చింది. అప్పుడు పడిన ఇబ్బందులు నాకిప్పటికీ గుర్తే. అందుకే యూఎస్‌కి వచ్చిన కుర్రాళ్లు మన తెలుగింటి రుచులతో భోజనం చేస్తారు కదా! అనుకునేదాన్ని.

షడ్రసోపేతమైన భోజనం అని కాదు కానీ కనీసం పప్పుచారయినా ఉండేది. ఈ అలవాటుకు బీజం పడింది కూడా అమ్మమ్మ దగ్గరే. అమ్మమ్మ పెద్ద పాత్రలో అంబలి చేయించి ఇంటి ముందు పెట్టేది. చాలామంది పొలం పనులకు వెళ్తూ దారిలో మా ఇంటి ముందాగి అంబలి తాగి, ఆవకాయ ముక్క చప్పరించుకుంటూ వెళ్లేవాళ్లు. ఆకలి తీర్చడంలో, అవసరమైన వాళ్లకు సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరి దేనిలోనూ ఉండదు. మా డ్రైవర్‌ ఇతర పనివాళ్ల పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు మరొకరి జీవితానికి మనవంతు సహాయం చేస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది.

అవకాశం లేనప్పుడు ఎలాగూ చేయలేం, వెసులుబాటు ఉన్నప్పుడయినా చేసి తీరాలి. మన ఎదుగుదల కోసం సమాజం నుంచి మనం తీసుకుంటాం, మనం ఎదిగిన తరవాత మరొకరి ఎదుగుదల కోసం ఆపన్న హస్తాన్ని అందించి తీరాలనేది పుట్టపర్తి స్కూల్‌ నేర్పించిన వాల్యూ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌. మా అమ్మ ఫ్రెండ్‌ లీలా ఆంటీ కూడా బతుకమ్మ పండుగను బాగా చేసేవారు. ఆమె ఎన్విరాన్‌మెంట్‌ యాక్టివిస్ట్‌. గునుగుపూలు వాటర్‌బాడీస్‌ని శుద్ధి చేస్తాయని చెప్తూ ఈ పండుగ వెనుక ఉన్న పర్యావరణ పరిరక్షణను వివరించేవారు. ఇవన్నీ మైండ్‌లో ఒక్కటొక్కటిగా అల్లుకుంటూ ఇలా దండ కూర్చుకున్నాయి.
 
బతుకమ్మ దీప్తినయ్యాను!
యూఎస్‌ జీవితం నాకు చాలా నేర్పించిందనే చెప్పాలి. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదనే వెలితి. రొటీన్‌ లైఫ్‌ని జాయ్‌ఫుల్‌గా మలుచుకోవడానికి నాకు బతుకమ్మ ఒక దారి చూపించింది. అప్పట్లో యూఎస్‌ ఇంతగా ఇండియనైజ్‌ కాలేదు. ఇప్పుడైతే న్యూజెర్సీ, డాలస్‌తోపాటు కొన్ని నగరాలు పూర్తిగా భారతీయలవే అన్నట్లు, తెలుగువాళ్ల ఊళ్లే అన్నట్లయిపోయాయి. మన పండుగలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. నేను మొదలుపెట్టడంతో నేను బతుకమ్మ దీప్తినయ్యాను. ‘దీప్తి మామిడి’గా అమెరికాలో అడుగుపెట్టాను. మూడేళ్ల కిందట తిరిగి వచ్చేటప్పటికి నా పేరు ‘బతుకమ్మ దీప్తి’గా మారింది. బతుకమ్మ పాటకు మ్యూజిక్‌ మొదలైతే చాలు... ఒళ్లు పులకించిపోతుంది. పూనకం వచ్చినట్లే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నా సరే... బతుకమ్మ ఫీల్‌ వచ్చేస్తుంది. చూడండి గూజ్‌బంప్స్‌ వచ్చేశాయి’’ అని చేతులను చూపించారు బతుకమ్మ దీప్తి.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement