డ్రోన్లా..? విమానాలా..? యూఎఫ్‌వోలా? | Drone Sightings In New Jersey and New York | Sakshi
Sakshi News home page

డ్రోన్లా..? విమానాలా..? యూఎఫ్‌వోలా?

Published Sat, Dec 14 2024 7:46 AM | Last Updated on Sun, Dec 15 2024 6:34 AM

Drone Sightings In New Jersey and New York

ఆకాశంలో మిస్టరీ వస్తువులపై అమెరికన్లలో కొత్త టెన్షన్‌ 

వాటిలో చాలావరకు విమానాలేనన్న అధికారులు 

ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టికరణ

వాషింగ్టన్‌: అమెరికా తూర్పు తీర రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా రాత్రి వేళల్లో ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులు కనిపిస్తుండటం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. అవి శత్రు దేశాల నిఘా డ్రోన్లా, ఫ్లయింగ్‌ సాసర్లా, లేక మామూలు విమానాలా అన్నది ఓ పట్టాన తేలడం లేదు. దీనిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దాంతో రాత్రయితే చాలు జనం ఆకాశం వంక ఆసక్తిగా పరికించి చూస్తున్నారు. 

తాజాగా న్యూజెర్సీ మీదుగా ఆకాశంలో కనిపిస్తున్న గుర్తు తెలియని వస్తువులపై స్థానిక సోషల్‌ మీడియాలో చిలువలు పలవలుగా కథనాలు వెలువడుతున్నాయి. వీటి వెనుక వాస్తవాలను ప్రభుత్వం తక్షణం ప్రజల ముందుంచాలని ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేసేదాకా వెళ్లింది! న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ అయితే అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ మేరకు లేఖ కూడా రాశారు. గురువారం రాత్రి న్యూజెర్సీ శివారులో కనిపించిన డ్రోన్‌ను వెంటాడినట్లు సెనేటర్‌ ఆండీ కిమ్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. మోరిస్‌ కౌంటీలోని ఓ ఇంటి ఆవరణలో గురువారం రాత్రి బుల్లి డ్రోన్‌ కూలడం మరింత కలకలం రేపింది. అది ది బొమ్మ డ్రోనేనని అధికారులు తేల్చారు. 
 

ఇవీ వదంతులు.. 
గుర్తు తెలియని వస్తువులపై రకరకాల కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు న్యూజెర్సీ రాష్ట్రంలోని బెడ్‌మిన్‌స్టర్‌లో ఉన్న ఆస్తులను కాపాడేందుకే ఈ డ్రోన్లను ప్రయోగించి ఉంటారని కొందరు, నిఘా కోసం ఇరాన్, లేదా చైనా పంపి ఉంటాయని మరికొందరు అంటున్నారు. దీనిపై చర్చకు సోషల్‌ మీడియాలో గ్రూపులే ఏర్పాటయ్యాయి! ఫేస్‌బుక్‌లో న్యూజెర్సీ మిస్టరీ డ్రోన్స్‌ పేరుతో పేజీ పుట్టుకొచ్చింది. అందులో సభ్యుల సంఖ్య శనివారానికి 44 వేలకు చేరింది! డ్రోన్లు, ఇతర వస్తువుల ఫొటోలను అందులో పోస్ట్‌ చేస్తున్నారు. కామెంట్ల వరద కొనసాగుతోంది. డ్రోన్లు కనిపిస్తే పిట్టల్ని కాలి్చనట్లు కాల్చి పారేయాలని కొందరు సలహాలిస్తున్నారు. జనం క్రిస్మస్‌ షాపింగ్‌ తదితరాలను కూడా మానేసి మరీ ఇంటిల్లిపాదీ వాటినే చూస్తూ కాలక్షేపం చేస్తున్నారట! 

చిన్న విమానాలే: వైట్‌హౌస్‌ 
ఆకాశంలో ఎగురుతూ కనిపించే డ్రోన్లతో జాతీయ భద్రతకు, ప్రజలకు ముప్పేమీ లేదని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. అవేమిటో, ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలుస్తున్నాం. వాటిలో చాలావరకు చిన్న విమానాలే. ఇతర దేశాల నుంచి వచి్చనవి కావు. నిషేధిత ప్రాంతాల మీదుగా ఎగరడం లేదు’’ అని తెలిపింది. కానీ జనం మాత్రం దీన్ని నమ్మడం లేదు.

 

కూల్చేయండి: ట్రంప్‌
మిస్టరీ డ్రోన్లను కనిపించిన వెంటనే కూల్చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇవన్నీ యథేచ్ఛగా 
సంచరిస్తున్నాయా అంటూ సొంత సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’లో ప్రశ్నించారు. ‘అవేంటో ప్రజలకు చెప్పండి. లేదా కూల్చేయండి’ అని అధికారులను కోరారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement