వాషింగ్టన్/లండన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4,591 మంది 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్క రోజు 2,569 మంది మరణిస్తే, గురువారం రాత్రి 9 గంటలయ్యే సరికి దాదాపుగా అంతకు రెట్టింపు సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. మొత్తంగా మృతుల సంఖ్య 33 వేలు దాటేసింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది.
అమెరికాలో నమోదైన కేసుల్లో 30శాతం మంది ఆఫ్రికన్ అమెరికన్లకే సోకింది. కరోనా కట్టడి కాకపోతే అమెరికాలో లక్ష నుంచి 2 లక్షల 40 వేల మంది వరకు చనిపోతారని అంచనాలున్నాయి. అయితే గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా 850 కౌంటీలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. యాంటీవైరల్ థెరపీలు, ఇమ్యూన్ థెరపీ, బ్లడ్ ప్లాస్మా థెరపీ వంటివి సత్ఫలితాల్నే ఇస్తున్నాయి.
ఆఫ్రికాలో 3 లక్షల మంది మరణిస్తారు: యూఎన్ అంచనా
కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసినప్పటికీ ఈ ఏడాది దేశంలో 3 లక్షల మరణాలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ ఆఫ్రికా విభాగం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మృతుల సంఖ్య 33 లక్షల వరకు కూడా ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్ సోకుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా కేసులు 20 వేలకు చేరుకున్నాయి.
బ్రిటన్‌లో లాక్‌డౌన్ 3 వారాలు పొడిగింపు
బ్రిటన్‌లో కోవిడ్ మృతులు 14 వేలకు చేరువలో ఉండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మరో 3 వారాలు పొడిగించింది. అయితే, కరోనా కట్టడిలో వ్యవస్థాగతమైన లోపాల కారణంగా యూకేలో 40 వేల వరకు మరణాలుండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలని లండన్ మేయర్ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు కోవిడ్ భయాందోళనలతో అన్ని దేశాలు సరిహద్దుల్ని మూసివేయడంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ రంగంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 96 శాతం పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
రోగులకు రాకుమారి సేవలు
స్టాక్ హోమ్: స్వీడన్ రాకుమారి సోఫియా శుక్రవారం నుంచి ఆస్ప్రతిలో పనిచేయడం ప్రారంభించారు. డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియాహెమ్మెట్ యూనివర్సిటీ కాలేజీ వారానికి దాదాపు 80 మంది హెల్త్ కేర్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ కాలేజీకి సోఫియా గౌరవ చైర్ మెంబర్. మూడు రోజుల పాటు మెలకువలు నేర్చుకున్న రాకుమారి సోఫియా సేవలు అందించడం ప్రారంభించారు. రోగులకు సాయం అందిస్తున్న ఇతర వర్కర్లతో కలసి సోఫియా భౌతిక దూరం పాటిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. మోడల్ రంగానికి చెందిన సోఫియా స్వీడన్ రాకుమారుడు కార్ల్ ఫిలిప్ ను పెళ్లాడడంతో రాజ కుటుంబంలోకి అడుగుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment