connecticut
-
US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అమెరికా దేశంలోని న్యూయార్క్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా మృతి చెందారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేష్(22), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్(21)గా వారిని గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ దగ్గరి స్నేహితులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హార్ట్ఫోర్డ్ చేరాడు. ఇటీవల నికేష్ అక్కడికి చేరుకున్నాడు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరు అమెరికాలో రూమ్మేట్స్ అయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే రూమ్‌లో చనిపోయారు. అయితే వీరు ఉంటున్న గదిలో హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వెలువడిందని, దీని కారణంగానే చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కచ్చితమైన ఆధారాలను బట్టి త్వరలోనే ఒక ప్రకటన చేస్తామన్నారు అధికారులు. వనపర్తిలో విషాద చాయలు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు దినేష్. దినేష్ గత ఏడాది చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా పొందాడు. డిసెంబర్ 2023 చివర్లో MS చేయడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో సేక్ర్డ్ హార్ట్ యూనివర్సిటీలో ఆడ్మిషన్ తీసుకుని స్థానికంగా నివాసముంటున్నాడు. దినేష్‌తో పాటు శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ ఉంటున్నాడు. వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్టు తల్లితండ్రులకు సమాచారం అందింది. రూం హీటర్ నుంచి విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చిందని, దానిని పీల్చడం వల్ల దినేష్, నికేశ్ మరణించినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే దినేష్ తండ్రి వెంకన్న అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్న సందర్భంలో కొడుకుతో అయ్యప్ప స్వామి పూజ చేయించి పంపించారు వెంకన్న. ఇంతలోనే మరణవార్త తెలియడంతో వెంకన్న దంపతులు తల్లడిల్లిపోయారు. (ఎడమ నుంచి మూడో వ్యక్తి, ఎరుపు రంగు దుస్తుల్లో దినేష్) దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నికేశ్ కుటుంబ సభ్యులతో తమకు పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికాలో స్నేహితులయ్యారని పేర్కొన్నారు. దినేష్ కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేశ్ కుటుంబం గురించి తెలుసుకుంటున్నట్టు శ్రీకాకుళం పోలీసు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి సాయానికి రెడీ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి పట్ల ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు శ్రీకాకుళంకు చెందిన నికేశ్ (21), వనపర్తికి చెందిన దినేష్ (22)గా గుర్తించారని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ భౌతిక కాయాన్ని పార్థివదేహాన్ని భారత్ కు రప్పించేలా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తోందని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రత్నాకర్ తెలిపారు. My deepest condolences to the family of Nikesh from srikakulam AP , who lost his life along with another student dinesh from telnagana at an unfortunate incident. ANDHRA PRADESH CMO is concerned and extended their help. — Kadapa Rathnakar (@KadapaRathnakar) January 15, 2024 ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం: అక్కడి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి!
గత రెండు మూడేళ్లుగా అమెరికాలో జరుగుతున్న యాక్సిడెంట్లలో తెలుగు విద్యార్థులే ఎక్కువ బాధితులవుతున్నారు. ఎన్నో ఆశలతో, ఉన్నత చదువులు చదువుకోవడానికి అమెరికా వచ్చి అనూహ్యంగా అందరికీ దూరమవుతున్నారు. ఇదీ వారి ప్రాణాలకు సంబంధించినదొక్కటే కాదు, ఇక్కడ ఎన్నో కష్టాలు పడి తమ పిల్లలను అమెరికా పంపించిన తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు జీవిత కాలం సరిపడా ఆవేదన మిగిలిపోతోంది. అగ్రరాజ్యానికి వెళ్లేవారిలో అగ్రవాటా మనదే ప్రతీ ఏటా అమెరికా వెళ్లే వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువ. అమెరికాలో ఉన్నత చదువులు, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల కోసం మనవాళ్లు ఎక్కువగా వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి MS కోసం వివిధ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వీసాను F1 అంటారు. ప్రతీ ఏటా దాదాపు 75వేలకు పైగా జారీ చేస్తారు. 2022లో 82వేల F1 వీసాలిచ్చారు. F1 వీసా అయిదేళ్లు అమెరికాలో ఉండే అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడాది F1 వీసా దక్కించుకున్న తెలుగు విద్యార్థులు ఏకంగా 58 వేలు. లెఫ్ట్ వర్సెస్ రైట్ అమెరికా జాగ్రఫీ కొంత విభిన్నంగా ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా.. చాలా చోట్లకు వెళ్లడం కష్టం. పైగా ఒక టౌన్లోనే ఒక చోటి నుంచి మరో చోటికి చాలా చాలా దూరం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల వల్ల బైక్‌లు వాడడం చాలా కష్టం. ముఖ్యంగా చలికాలంలో బయటకు రాలేం. అందుకే కారు తప్పనిసరి. అయితే భారత్‌తో పోలిస్తే రెండు ప్రధానమైన తేడాలు కనిపిస్తాయి. ఒకటి ఇండియా రైట్ సైడ్ డ్రైవింగ్. కానీ అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. అంటే స్టీరింగ్ గానీ, రోడ్ టర్నింగ్ గానీ లెఫ్ట్ వైపు ఉంటుంది. ఎక్కడ తేడా కొడుతోంది? అమెరికా వచ్చే తెలుగు విద్యార్థుల్లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తప్పు చేస్తారు. ఇండియా నుంచి వచ్చేప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటారు. ఇది కారు నడిపే అవకాశం ఇస్తుంది కానీ, చట్టపరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎలాంటి విలువ లేదు. అమెరికాలోనే అక్కడి పరిస్థితుల మధ్య శిక్షణ తీసుకుని అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటేనే దానికి విలువ, చట్టపరంగా గుర్తింపు. ఇండియన్ లైసెన్స్‌తో యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ సున్న. కొంప ముంచుతున్న వేగం అమెరికా రోడ్లు మనతో పోలిస్తే చాలా పెద్దవి. పైగా మన ఔటర్ రింగ్‌రోడ్డుకు రెట్టింపు పెద్దగా... దేని లేన్‌లో అవి వెళ్తుంటాయి. భారీ ట్రక్కులు, కంటెయినర్లు కూడా కార్లతో సమానంగా దూసుకెళ్తుంటాయి. రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి కాబట్టి వేగంలో ఏ ఒక్కరు రాజీ పడరు. ఇక్కడే తేడా వస్తోంది. రోడ్డుపై ఎక్కడ తేడా వచ్చినా.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆటోమెటిక్ కార్లు, వంద మైళ్లకు తగ్గకుండా స్పీడ్‌తో మన వాళ్లు దూసుకుపోతున్నారు సరే, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. అనుభవం అవశ్యకం అమెరికా గురించి ఎంత తెలిసినా.. రోడ్డుపై డ్రైవింగ్ చేసిన అనుభవం తప్పకుండా కావాలి. ముందు టౌన్లలో కొన్నాళ్లు, ట్రాఫిక్ తక్కువగా ఉండే రోడ్లలో కొన్నాళ్లు నడిపిన తర్వాతే మెయిన్‌లోకి రావాలి. మనవాళ్లు తరచుగా వచ్చిన కొద్దిరోజులకే మెయిన్ రోడ్డు ఎక్కేస్తున్నారు. అనుభవలేమి వల్ల ఇబ్బంది పడుతున్నారు. గూగుల్ లేదా యాపిల్ మ్యాప్‌ల మీద ఆధారపడడం వల్ల డ్రైవింగ్‌పై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కడైనా ట్రక్కులు నిలిచిపోయినా.. లేక అదుపు తప్పినా.. తిరిగి గాడిన పెట్టలేని దుస్థితి. విద్యార్థులు తొందర పడొద్దు- రత్నాకర్ అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగిన యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.సాక్రెడ్ హర్ట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అనూహ్యంగా యాక్సిడెంట్‌కు గురయి చనిపోవడం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగినపుడు చాలా బాధ కలుగుతుంది. ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ వేరు, అమెరికాలో వేరు. కార్లు చాలా వేగంగా నడుపుతారు. కొత్తగా వచ్చే విద్యార్థులు డ్రైవింగ్ అనుభవం లేకుండా కారు నడపొద్దు. రత్నాకర్, నార్త్ అమెరికా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి -
ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా?
వాషింగ్టన్: కరోనా వైరస్ చూసి ప్రపంచమంతా భయపడుతున్న వేళ..ఇతర రకాల వైరస్ల సామర్థ్యంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వైరస్లు ఇతర జీవుల చర్మ వాసనలను సైతం మార్చేసి దోమలు కుట్టేందుకు ప్రేరేపించేలా చేయగల శక్తి ఉందని తాజాగా తేలింది. కనెక్టికట్ యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంగ్వా వాంగ్ ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. దోమల ద్వారా సంక్రమించే మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, జికా, గున్యా జ్వరాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. ఈ బాధితులను కుట్టిన దోమ ఆ వైరస్‌ని, అది కుట్టిన మరో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇలా అతిథేయిపై వాలి కుట్టేందుకు దోమలను ప్రేరేపించే అంశాలను పెంగ్వా వాంగ్ గుర్తించారు. వైరస్ బాధిత జీవి చర్మంపై తయారయ్యే అసిటోఫెనోన్ అనే ఒక సువాసన తయారవుతుందని, దీనివల్లనే ఆరోగ్యవంతుల కంటే 10 రెట్లు ఎక్కువగా దోమలు బాధితులనే కుడుతున్నట్లు గుర్తించారు. పేగులు, చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియానే అసిటోఫెనోన్ తయారీలో కీలకం. డెంగ్యూ, జికా వైరస్లు చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియా రెల్మా అనే కణ తయారీని అడ్డుకుని అసిటోఫెనోన్ను పెంచుతోంది. ప్రయోగంలో చివరిగా వైరస్ బాధిత ఎలుకలకు ఎల్మాను ప్రేరేపించే విటమిన్ ఏను అందజేసి, వాటి శరీరంపై బాసిల్లస్ బ్యాక్టీరియాను తగ్గించినప్పుడు తిరిగి ఆరోగ్యవంతంగా మారాయి. మనుషులపైనా ఇవే ప్రయోగాలను చేపట్టి, ఫలితాల ఆధారంగా అంతిమంగా వాటిని బాధితులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తామని పెంగ్వా వాంగ్ చెప్పారు. తమ ప్రయోగాలు పలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంతో మేలుచేస్తాయన్నారు. -
సెనెసెంట్ కణాలు తొలగిస్తే ‘షుగర్’కు చెక్
వయసు పెరిగే కొద్దీ శరీరంలో పేరుకుపోయే సెనెసెంట్ కణాల (విభజనకు గురయ్యే లక్షణాన్ని కోల్పోయినవి)ను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు వేయవచ్చునని కనెక్టికట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుకలపై ప్రయోగాల్లో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు వారు తెలిపారు. ఊబకాయంతో ఉన్న ఎలుకలకు సెనెసెంట్ కణాలను తొలగించే ప్రయోగాత్మక మందులు డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లు ఇచ్చినప్పుడు వాటి మధుమేహ లక్షణాలు మాయమైపోయాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మింగ్ షూ తెలిపారు. ఊబకాయం, వ్యాయామలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది మధుమేహుల్లో ఇనుల్సిన్ నిరోధకత ఉంటుంది. వాటితోపాటు కొవ్వులో ఉండే సెనెసెంట్ కణాలూ మధుమేహంపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని మింగ్ షూ చెప్పారు. ఈ కణాలను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు పడ్డాయని వివరించారు. డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లను తాము మానవ కొవ్వు కణజాలంపై ప్రయోగించినప్పుడు అందులోని సెనెసెంట్ కణాలు నశించాయని వివరించారు. ఊబకాయుల నుంచి సేకరించిన ఈ కణజాలాన్ని ఎలుకలకు అమర్చినప్పుడు మధుమేహ లక్షణాలు తగ్గాయని చెప్పారు. మానవుల్లోనూ ఈ మందుల ప్రభావం ఇదేలా ఉంటుందా? అన్నది పరిశీలించేందుకు త్వరలో విస్తృత ప్రయోగాలు చేస్తామన్నారు. -
ఇడా తుపాను దెబ్బకు 46 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మేరీలాండ్ నుంచి కనెక్టికట్ ప్రాంతం వరకు ఇడా సృష్టించిన విలయంలో దాదాపు 46 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. పలువురు ప్రజల ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇడా దెబ్బకు పలు ప్రాంతాల్లో నదులు పొంగి ఉత్పాతాలు సృష్టించాయి. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. పరిస్థితులను అధ్యక్షుడు జోబైడెన్ సమీక్షిస్తున్నారు. జోరున కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బాధితులతో పాటు అత్యవసర చికిత్సలు అవసరమైనవారి కోసం చాలా చోట్ల జనరేటర్లతో ఆసుపత్రులను నిర్వహించాల్సి వచి్చంది. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన 911 సేవలకూ ఆటంకాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ష్కైల్‌కిల్ నదికి 100ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచి్చంది. వాన, గాలి కారణంగా అధికారిక సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. -
అద్దాలు తుడవటానికి వెళ్లి... రూ.12 లక్షలు
వాషింగ్టన్: మనిషి కష్టాన్ని చూసి సానుభూతి చూపించే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చి సాయం చేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అమెరికాలోని కనెక్టికట్‌లో మైక్ అనే వ్యక్తి తల దాచుకోవడానికి కూడా నిలువ నీడ లేని దుస్థితిలో ఉన్నాడు. 46 ఏళ్ల వయసున్న ఇతగాడు ఓ రోజు ఫిలిప్ వ్యూ అనే వ్లోగర్ కారు అద్దాలు తుడవడానికి వెళ్లాడు. అయితే అతడు అందుకు ససేమీరా అనడంతో చేసేదేం లేక బయట ఒంటరిగా దీనంగా కూర్చుండిపోయాడు. ఇది చూసిన ఫిలిప్ అతడి మీద జాలిపడి కారులోకి పిలిచి తినడానికి సాండ్విచ్ ఇచ్చాడు. నెమ్మదిగా మాటలు కలుపుతూ అతడి పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అతడు ఎంతో కష్టకాలంలో ఉన్నాడని అర్థమైన ఫిలిప్ వారు మాట్లాడుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అతడి మాటల్లోనే తెలుసుకున్న నెటిజన్లు ఆయనకు ఎలాగైనా సాయం చేయాలనుకున్నారు. అలా ఎంతోమంది మైక్కోసం వేలాది డాలర్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో వీరి కోసం ఫిలిప్ 'గో ఫండ్ మీ' పేజ్ ఏర్పాటు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 10 వేల డాలర్లు పోగయ్యాయి. తాజాగా ఈ అమౌంట్ 17 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.12 లక్షలు)కు చేరింది. దీన్నంతటినీ ఫిలిప్ తక్కువ కాలంలోనే తనకు మంచి ఫ్రెండ్ అయిన మైక్‌కు అందజేసి ఆశ్చర్యపరిచాడు. ఆ డబ్బంతా ఇక నీ సొంతమని చెప్పడంతో క్షణకాలం పాటు నమ్మలేకపోయిన మైక్ ఆ వెంటనే కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన మైక్ కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడట. ఏమైందో ఏమోకానీ తర్వాత తన కుటుంబానికి కూడా దూరమై ఒంటరిగా జీవిస్తున్నాడు. ఉండటానికి ఇల్లు కూడా లేని అతడి రియల్ లైఫ్ స్టోరీ విన్న నెటిజన్లు పెద్ద మనసుతో 12 లక్షల రూపాయలు ఇవ్వడంతో మైక్ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లోనూ వైరల్‌గా మారింది. చదవండి: వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్ -
ఇంటి కింద 30 అడుగుల గోతిలో పడ్డాడు..
వాషింగ్టన్: సాధారణంగా బావి ఎక్కడ ఉంటుంది. ఇంటి వెనకాలో, ఇంటి ఆవరణలోని ఈశాన్యం మూలలోనో ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఏకంగా ఇంట్లోనే బావి ఉంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. క్రిస్టోఫర్ టౌన్ అనే వ్యక్తి ఆదివారం కనెక్టికట్‌లోని తన మిత్రుడు ఇంటికి వెళ్లాడు. అతను కొత్తగా అద్దెకు దిగినందున ఆ ఇంట్లో సామాను సర్దేందుకు సహాయపడుతున్నాడు. ఈ క్రమంలో ఓ గదిలో వస్తువులు అమర్చుతున్న క్రమంలో కింద ఉన్న ఫ్లోర్ ఒక్కసారిగా విరిగిపోయింది. క్షణ కాలంలో అతను బావిలో పడిపోయాడు. అతని కేకలతో ఇంట్లోవాళ్లు పరుగెత్తుకొచ్చి బావిలోకి తొంగి చూడగా క్రిస్టోఫర్ 30 అడుగుల లోతైన బావిలో బిక్కుబిక్కుమంటూ కనిపించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వారు ఇంటికి చేరుకున్నారు. (బోరు నుంచి గ్యాస్.. వేమవరంలో కలకలం) అయితే బావి ఇంట్లో ఉందనడంతో వారు కూడా షాక్‌కు లోనయ్యారు. అనంతరం ఇంట్లోకి చేరుకుని అతడిని తాడు సహాయంతో బయటకు తీశారు. కొంత సమయం వరకు బావిలోనే నరకయాతన అనుభవించిన అతను కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయట పడ్డాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక ఆ బావి ఇప్పటికీ నీళ్లతో నిండి ఉండటం గమనార్హం. కాగా 1843లో ఆ ఇంటిని నిర్మించారు. అప్పుడు బావి ఇంటి వెలుపలే ఉంది. అయితే 1981లో అదనపు నిర్మాణం చేపట్టిన క్రమంలో బావిపై కూడా గదిని నిర్మించారు. అప్పుడు ఆ బావిని కేవలం చెక్కతోనే కప్పివేశారు. దీంతో అది శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. (మాయా పుస్తకం: కాలిస్తేనే చదవగలం) -
ఒకేరోజు 4,591 మంది మృతి
వాషింగ్టన్/లండన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4,591 మంది 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్క రోజు 2,569 మంది మరణిస్తే, గురువారం రాత్రి 9 గంటలయ్యే సరికి దాదాపుగా అంతకు రెట్టింపు సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. మొత్తంగా మృతుల సంఖ్య 33 వేలు దాటేసింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. అమెరికాలో నమోదైన కేసుల్లో 30శాతం మంది ఆఫ్రికన్ అమెరికన్లకే సోకింది. కరోనా కట్టడి కాకపోతే అమెరికాలో లక్ష నుంచి 2 లక్షల 40 వేల మంది వరకు చనిపోతారని అంచనాలున్నాయి. అయితే గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా 850 కౌంటీలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. యాంటీవైరల్ థెరపీలు, ఇమ్యూన్ థెరపీ, బ్లడ్ ప్లాస్మా థెరపీ వంటివి సత్ఫలితాల్నే ఇస్తున్నాయి. ఆఫ్రికాలో 3 లక్షల మంది మరణిస్తారు: యూఎన్ అంచనా కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసినప్పటికీ ఈ ఏడాది దేశంలో 3 లక్షల మరణాలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ ఆఫ్రికా విభాగం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మృతుల సంఖ్య 33 లక్షల వరకు కూడా ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్ సోకుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా కేసులు 20 వేలకు చేరుకున్నాయి. బ్రిటన్‌లో లాక్డౌన్ 3 వారాలు పొడిగింపు బ్రిటన్‌లో కోవిడ్ మృతులు 14 వేలకు చేరువలో ఉండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మరో 3 వారాలు పొడిగించింది. అయితే, కరోనా కట్టడిలో వ్యవస్థాగతమైన లోపాల కారణంగా యూకేలో 40 వేల వరకు మరణాలుండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలని లండన్ మేయర్ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు కోవిడ్ భయాందోళనలతో అన్ని దేశాలు సరిహద్దుల్ని మూసివేయడంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ రంగంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 96 శాతం పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రోగులకు రాకుమారి సేవలు స్టాక్ హోమ్: స్వీడన్ రాకుమారి సోఫియా శుక్రవారం నుంచి ఆస్ప్రతిలో పనిచేయడం ప్రారంభించారు. డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియాహెమ్మెట్ యూనివర్సిటీ కాలేజీ వారానికి దాదాపు 80 మంది హెల్త్ కేర్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ కాలేజీకి సోఫియా గౌరవ చైర్ మెంబర్. మూడు రోజుల పాటు మెలకువలు నేర్చుకున్న రాకుమారి సోఫియా సేవలు అందించడం ప్రారంభించారు. రోగులకు సాయం అందిస్తున్న ఇతర వర్కర్లతో కలసి సోఫియా భౌతిక దూరం పాటిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. మోడల్ రంగానికి చెందిన సోఫియా స్వీడన్ రాకుమారుడు కార్ల్ ఫిలిప్ ను పెళ్లాడడంతో రాజ కుటుంబంలోకి అడుగుపెట్టారు. -
ప్రజాసంకల్పయాత్రకు వైఎస్సార్సీపీ ఆమెరికా విభాగం సంఘీభావం
-
ప్రజాసంకల్పయాత్రకు ఎన్ఆర్ఐల సంఘీభావం
కనెక్టికట్ : ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ ఆమెరికా విభాగం నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ అమెరికా విభాగం కన్వీనర్ రత్నాకర్, స్టేట్ ఇంచార్జి శ్రీనివాస రెడ్డి, రామ్ నరేష్, ప్రదీప్ రెడ్డి, వంశీ, స్టూడెంట్స్ వింగ్ సభ్యులు ఆధ్వర్యంలో ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా కేక్ కట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ జగన్ గెలిపించాలని కోరారు. కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోందన్నారు. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటి దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. -
అమెరికాలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
కనెక్టికట్(అమెరికా) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అమెరికా కమిటీ సభ్యులు గురువారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కనెక్టికట్ స్టేట్ హిందూ దేవాలయంలో వైఎస్ జగన్ పేరు మీద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించామని కమిటీ కన్వీనర్ రత్నాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కూడా హాజరైనట్లు వెల్లడించారు. -
వర్సిటీ విద్యార్థిని ప్రాణం తీసిన సరదా
కనెక్టికట్: సరదాగా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలను హరిస్తాయి. కొండంత సంతోషాన్ని విషాదంగా మారుస్తాయి. కనెక్టికట్‌లోని విశ్వవిద్యాలయంలో ఇదే చోటు చేసుకుంది. విద్యార్థునులు పెట్టుకున్న సరదా పోటీ ఓ వర్సిటీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయేలా చేసింది. పాన్ కేక్ తినే పోటీలో పాల్గొన్న కైట్లిన్ నెల్సన్ అనే యువతి వేగంగా తినే క్రమంలో మధ్యలో ఓసారి పొరబోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపట్ల మొత్తం వర్సిటీ విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపింది. కనెక్టికట్‌లో సేక్రడ్ హార్ట్ యూనివర్సిటీ ఉంది. ఇందులో కైట్లిన్ నర్సింగ్ జూనియర్ విద్యార్థినిగా ఉంది. ఇందులో ఆమె సోషల్ వర్క్ విభాగాన్ని ఎంచుకుంది. ఇటీవల అక్కడ కాల్పులు జరిగిన పాఠశాలలో గొప్ప సేవలు అందించింది కూడా. అంతేకాదు.. ఆమె తండ్రి జేమ్స్ నెల్సన్ న్యూయార్క్‌లో పోర్ట్ అథారిటీ విభాగంలో పోలీసు అధికారిగా ఉంటూ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబర్ 11న బాంబు దాడి జరిగిన సమయంలో ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలుకోల్పోయాడు. అలా తండ్రి బాటలోనే నడుస్తూ సోషల్ సర్వీస్ అందించాలనే ఆత్రంతో కెరీర్ ప్రారంభించిన కైట్లిన్ చిన్న సరదాకు పోయి దురదృష్టవశాత్తు ప్రాణాలుకోల్పోయింది. -
నటి కొడుకు అనుమానాస్పద మృతి
కనెక్టికట్ : అమెరికా నటి మియా ఫారోస్ పెంపుడు కొడుకు థాడియస్ విల్క్(27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలియోతో బాధపడుతున్న అతడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. రోక్స్ బరీలోని ఫారోస్ నివాసంలో ఉంటున్న అతడు బుధవారం సాయంత్రం ప్రమాదానికి గురైనట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని వెల్లడించారు. తాను నివసిస్తున్న ప్రాంతానికి 39 కిలోమీటర్ల దూరంలో అతడు ప్రమాదానికి గురికావడం అనుమానాలకు తావిస్తోంది. అయితే థాడియస్ మరణం వెనుక కుట్ర కోణం కనిపించడం లేదని పేర్కొన్నారు. మిగతా వివరాలు వెల్లడించేలేదు. అతడి మరణానికి కారణాలు పోస్టుమార్టంలో తెలిసే అవకాశముందన్నారు. థాడియస్ మృతిపై మియా ఫారోస్ తరపు ప్రతినిధులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కోల్‌కతాలోని అనాథాశ్రమం నుంచి థాడియస్ ను ఫారోస్ దత్తత తీసుకుంది. పోలియో కారణంగా నడుము కిందిభాగం చచ్చుబడిపోవడంతో అతడు చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. -
తేన ఆధ్వర్యంలో కనెక్టికట్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ (TeNA) కనెక్టికట్ చాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ రెండో వార్షికోత్సవాన్ని హార్ట్ ఫోర్డ్ సమీపంలోని వెర్నాన్ నగరంలో గల వెర్నాన్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 350 మంది హాజరై విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్, కవి, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు చిన్నారులు, పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరించారు. తేన మహిళా కమిటీ సభ్యులు తెలంగాణలోని 10 జిల్లాల గురించి వివరిస్తూ ప్రదర్శించిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తేన అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ మారోజు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమర్ కర్మిల్ల, కనెక్టికట్ చాప్టర్ అధ్యక్షుడు విక్రం రౌతు వేదికను అలంకరించి సభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎంపీ వినోద్ వివరించారు. తెలంగాణా ఎన్ఆర్ఐ అసోసియేషన్ అమెరికాలోను, తెలంగాణలోను చేసే పలు కార్యక్రమాల గురించి వెంకట్, అమర్, విక్రం వివరించి అతిథులను సత్కరించారు. తర్వాత టాలీవుడ్ గాయకుడు రేవంత్, స్థానిక గాయని మానస నిర్వహించిన మ్యూజికల్ షో ప్రేక్షకులను రంజింపజేసింది. సావి క్యాతం, స్వప్న జూపల్లిల యాంకరింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని తేన సభ్యులు సునీల్ తరాల, ధర్మారావు ఎరబెల్లి, సతీష్ అన్నమనేని, కరుణాకర్ సజ్జన, సతీష్ గండ్ర, రాకేశ్ వంగల, ప్రసాద్ కడారి, కమలాకర్ స్వామి, కృష్ణ కుంభం, సావి క్యాతం, స్వప్న జూపల్లి, విక్రం రౌతు, హరి రావు నిర్వహించారు.