వాషింగ్టన్: సాధారణంగా బావి ఎక్కడ ఉంటుంది. ఇంటి వెనకాలో, ఇంటి ఆవరణలోని ఈశాన్యం మూలలోనో ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఏకంగా ఇంట్లోనే బావి ఉంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. క్రిస్టోఫర్ టౌన్ అనే వ్యక్తి ఆదివారం కనెక్టికట్‌లోని తన మిత్రుడు ఇంటికి వెళ్లాడు. అతను కొత్తగా అద్దెకు దిగినందున ఆ ఇంట్లో సామాను సర్దేందుకు సహాయపడుతున్నాడు. ఈ క్రమంలో ఓ గదిలో వస్తువులు అమర్చుతున్న క్రమంలో కింద ఉన్న ఫ్లోర్ ఒక్కసారిగా విరిగిపోయింది. క్షణ కాలంలో అతను బావిలో పడిపోయాడు. అతని కేకలతో ఇంట్లోవాళ్లు పరుగెత్తుకొచ్చి బావిలోకి తొంగి చూడగా క్రిస్టోఫర్ 30 అడుగుల లోతైన బావిలో బిక్కుబిక్కుమంటూ కనిపించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వారు ఇంటికి చేరుకున్నారు. (బోరు నుంచి గ్యాస్.. వేమవరంలో కలకలం)
అయితే బావి ఇంట్లో ఉందనడంతో వారు కూడా షాక్‌కు లోనయ్యారు. అనంతరం ఇంట్లోకి చేరుకుని అతడిని తాడు సహాయంతో బయటకు తీశారు. కొంత సమయం వరకు బావిలోనే నరకయాతన అనుభవించిన అతను కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయట పడ్డాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక ఆ బావి ఇప్పటికీ నీళ్లతో నిండి ఉండటం గమనార్హం. కాగా 1843లో ఆ ఇంటిని నిర్మించారు. అప్పుడు బావి ఇంటి వెలుపలే ఉంది. అయితే 1981లో అదనపు నిర్మాణం చేపట్టిన క్రమంలో బావిపై కూడా గదిని నిర్మించారు. అప్పుడు ఆ బావిని కేవలం చెక్కతోనే కప్పివేశారు. దీంతో అది శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. (మాయా పుస్తకం: కాలిస్తేనే చదవగలం)
Comments
Please login to add a commentAdd a comment