నటి కొడుకు అనుమానాస్పద మృతి
కనెక్టికట్ : అమెరికా నటి మియా ఫారోస్ పెంపుడు కొడుకు థాడియస్ విల్క్(27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలియోతో బాధపడుతున్న అతడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. రోక్స్ బరీలోని ఫారోస్ నివాసంలో ఉంటున్న అతడు బుధవారం సాయంత్రం ప్రమాదానికి గురైనట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని వెల్లడించారు. తాను నివసిస్తున్న ప్రాంతానికి 39 కిలోమీటర్ల దూరంలో అతడు ప్రమాదానికి గురికావడం అనుమానాలకు తావిస్తోంది.
అయితే థాడియస్ మరణం వెనుక కుట్ర కోణం కనిపించడం లేదని పేర్కొన్నారు. మిగతా వివరాలు వెల్లడించేలేదు. అతడి మరణానికి కారణాలు పోస్టుమార్టంలో తెలిసే అవకాశముందన్నారు. థాడియస్ మృతిపై మియా ఫారోస్ తరపు ప్రతినిధులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కోల్కతాలోని అనాథాశ్రమం నుంచి థాడియస్ ను ఫారోస్ దత్తత తీసుకుంది. పోలియో కారణంగా నడుము కిందిభాగం చచ్చుబడిపోవడంతో అతడు చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.