గత రెండు మూడేళ్లుగా అమెరికాలో జరుగుతున్న యాక్సిడెంట్లలో తెలుగు విద్యార్థులే ఎక్కువ బాధితులవుతున్నారు. ఎన్నో ఆశలతో, ఉన్నత చదువులు చదువుకోవడానికి అమెరికా వచ్చి అనూహ్యంగా అందరికీ దూరమవుతున్నారు. ఇదీ వారి ప్రాణాలకు సంబంధించినదొక్కటే కాదు, ఇక్కడ ఎన్నో కష్టాలు పడి తమ పిల్లలను అమెరికా పంపించిన తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు జీవిత కాలం సరిపడా ఆవేదన మిగిలిపోతోంది.
అగ్రరాజ్యానికి వెళ్లేవారిలో అగ్రవాటా మనదే
ప్రతీ ఏటా అమెరికా వెళ్లే వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువ. అమెరికాలో ఉన్నత చదువులు, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల కోసం మనవాళ్లు ఎక్కువగా వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి MS కోసం వివిధ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వీసాను F1 అంటారు. ప్రతీ ఏటా దాదాపు 75వేలకు పైగా జారీ చేస్తారు. 2022లో 82వేల F1 వీసాలిచ్చారు. F1 వీసా అయిదేళ్లు అమెరికాలో ఉండే అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడాది F1 వీసా దక్కించుకున్న తెలుగు విద్యార్థులు ఏకంగా 58 వేలు.
లెఫ్ట్ వర్సెస్ రైట్
అమెరికా జాగ్రఫీ కొంత విభిన్నంగా ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా.. చాలా చోట్లకు వెళ్లడం కష్టం. పైగా ఒక టౌన్లోనే ఒక చోటి నుంచి మరో చోటికి చాలా చాలా దూరం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల వల్ల బైక్లు వాడడం చాలా కష్టం. ముఖ్యంగా చలికాలంలో బయటకు రాలేం. అందుకే కారు తప్పనిసరి. అయితే భారత్తో పోలిస్తే రెండు ప్రధానమైన తేడాలు కనిపిస్తాయి. ఒకటి ఇండియా రైట్ సైడ్ డ్రైవింగ్. కానీ అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. అంటే స్టీరింగ్ గానీ, రోడ్ టర్నింగ్ గానీ లెఫ్ట్ వైపు ఉంటుంది.
ఎక్కడ తేడా కొడుతోంది?
అమెరికా వచ్చే తెలుగు విద్యార్థుల్లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తప్పు చేస్తారు. ఇండియా నుంచి వచ్చేప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటారు. ఇది కారు నడిపే అవకాశం ఇస్తుంది కానీ, చట్టపరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కు ఎలాంటి విలువ లేదు. అమెరికాలోనే అక్కడి పరిస్థితుల మధ్య శిక్షణ తీసుకుని అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటేనే దానికి విలువ, చట్టపరంగా గుర్తింపు. ఇండియన్ లైసెన్స్తో యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ సున్న.
కొంప ముంచుతున్న వేగం
అమెరికా రోడ్లు మనతో పోలిస్తే చాలా పెద్దవి. పైగా మన ఔటర్ రింగ్రోడ్డుకు రెట్టింపు పెద్దగా... దేని లేన్లో అవి వెళ్తుంటాయి. భారీ ట్రక్కులు, కంటెయినర్లు కూడా కార్లతో సమానంగా దూసుకెళ్తుంటాయి. రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి కాబట్టి వేగంలో ఏ ఒక్కరు రాజీ పడరు. ఇక్కడే తేడా వస్తోంది. రోడ్డుపై ఎక్కడ తేడా వచ్చినా.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆటోమెటిక్ కార్లు, వంద మైళ్లకు తగ్గకుండా స్పీడ్తో మన వాళ్లు దూసుకుపోతున్నారు సరే, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే.
అనుభవం అవశ్యకం
అమెరికా గురించి ఎంత తెలిసినా.. రోడ్డుపై డ్రైవింగ్ చేసిన అనుభవం తప్పకుండా కావాలి. ముందు టౌన్లలో కొన్నాళ్లు, ట్రాఫిక్ తక్కువగా ఉండే రోడ్లలో కొన్నాళ్లు నడిపిన తర్వాతే మెయిన్లోకి రావాలి. మనవాళ్లు తరచుగా వచ్చిన కొద్దిరోజులకే మెయిన్ రోడ్డు ఎక్కేస్తున్నారు. అనుభవలేమి వల్ల ఇబ్బంది పడుతున్నారు. గూగుల్ లేదా యాపిల్ మ్యాప్ల మీద ఆధారపడడం వల్ల డ్రైవింగ్పై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కడైనా ట్రక్కులు నిలిచిపోయినా.. లేక అదుపు తప్పినా.. తిరిగి గాడిన పెట్టలేని దుస్థితి.
విద్యార్థులు తొందర పడొద్దు- రత్నాకర్
అమెరికాలోని కనెక్టికట్లో జరిగిన యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.సాక్రెడ్ హర్ట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అనూహ్యంగా యాక్సిడెంట్కు గురయి చనిపోవడం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగినపుడు చాలా బాధ కలుగుతుంది. ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ వేరు, అమెరికాలో వేరు. కార్లు చాలా వేగంగా నడుపుతారు. కొత్తగా వచ్చే విద్యార్థులు డ్రైవింగ్ అనుభవం లేకుండా కారు నడపొద్దు.
రత్నాకర్, నార్త్ అమెరికా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment