భారీ వర్షం ధాటికి న్యూయార్క్‌లోని జాతీయరహదారిపై నిలిచిన వర్షపు నీరు
న్యూయార్క్: అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని గవర్నర్ క్యాథీ హోచల్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. న్యూ ఇంగ్లండ్ (కనెక్టికట్, మెయిన్, మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్ రాష్ట్రాలున్న ప్రాంతం)లోనూ తుపాను ప్రభావం పెరుగుతోంది. మరిన్ని భీకర సుడిగాలులు దూసుకొచ్చే ప్రమాదముందని వార్తలొచ్చాయి. ఒక్క న్యూయార్క్‌లోనే రెండేళ్ల బాలుడు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. సబ్‌వే స్టేషన్లలోకి వర్షపు నీరు చేరడంతో అన్ని సర్వీస్‌లను రద్దుచేశారు. సబ్‌వేలో సీట్లపై నిలబడే నగరవాసులు ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. ఇళ్లలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉంటున్నారు.
సెంట్రల్ పార్క్‌లో రికార్డుస్థాయి వర్షపాతం
‘న్యూయార్క్ సిటీలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించాం’ అని న్యూయార్క్‌లోని అమెరికా జాతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్‌లో బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డుస్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూజెర్సీలోనూ తుపాను కారణంగా భారీస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాలుల ధాటికి దక్షిణ న్యూజెర్సీ కౌంటీలో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మొత్తం 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. పెన్సిల్వేనియాలో వరదల పట్టణంగా పేరున్న జాన్స్‌టౌన్ దగ్గరున్న ఆనకట్ట పొంగి పొర్లే ప్రమాదం పొంచి ఉంది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాది ఇళ్లలో అంధకారం అలముకుంది.
సబ్‌వే స్టేషన్‌లోకి దూసుకొస్తున్న వరద నీరు; అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి వృద్ధుడిని రక్షిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment