Drones seize
-
సాగుకూ ఏఐ సాయం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇప్పుడు ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) వైపు చూస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ ఏఐ తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా వ్యవసాయ రంగంలోనూ అడుగుపెట్టనుంది. ఈ రంగంలోని అన్ని విభాగాల్లో కృత్రిమ మేధను అమలు చేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అడుగులేస్తోంది. ఇప్పటికే కలుపు తీసే రోబోట్లపైన ప్రయోగాలు చేస్తోంది. ఇవి పూర్తయ్యాక పూర్తి స్థాయిలో కృత్రిమ మేధను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రైతులకు ప్రయోజనకరం ఏఐ.. మనదేశంలో ఉన్న 143 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేయడానికి అవసరమైనంత మంది రైతులు అందుబాటులో ఉండటం లేదు. యువతరానికి వ్యవసాయం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండటం లేదు. చదువులు, ఉద్యోగాలకు వారు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయరంగంలో ప్రవేశపెడితే కూలీలు, మానవవనరుల కొరతకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేలో మందు కొట్టడానికి రెండు గంటలు పట్టేది. ఇప్పుడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఆరు నిమిషాల్లోనే పని పూర్తవుతోంది. ఉద్యోగాలు చేసుకుంటూనే వీకెండ్ వ్యవసాయం చేద్దామనుకునేవారు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఇటు వైపు మొగ్గు చూపుతున్నారు. బీమా కంపెనీలు, ప్రభుత్వాలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందో ఒక్క క్షణంలోనే ఏఐ పరిజ్ఞానం ద్వారా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం 167 భూసార పరీక్షా కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి శాంపిల్స్ తీయడం కష్టమవుతుండటంతో ఒక రోబోట్ రూపకల్పనపై వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేస్తోంది. ఏఐ పరిజ్ఞానంతో ఏదైనా పంటకు రాబోతున్న తెగులును కూడా ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తద్వారా దాని నివారణకు చర్యలు చేపట్టవచ్చంటున్నారు. సాగులో తగ్గనున్న ఖర్చు.. దేశంలో ఇప్పటికే నీటిపారుదలను నియంత్రించే యాప్‌లు, ట్రాక్టర్లను నడిపించే జీపీఎస్ సిస్టమ్‌లు, పశువులను పర్యవేక్షించే ఆర్ఎఫ్ఐడీ–చిప్డ్ ఇయర్ ట్యాగ్లు ఉన్నాయి. వ్యవసాయంలో సాంకేతిక స్థిరత్వం రావాలంటే కృత్రిమ మేధ అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. సంప్రదాయ పద్ధతుల కంటే సులువుగా, ఖర్చు తగ్గించేలా చేయడానికి వ్యవసాయ వర్సిటీ కృషి చేస్తోంది. దేశంలోనే అత్యాధునిక ఏరియల్ రోబో డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా పురుగు, కలుపు, తెగుళ్ల మందుల పిచికారీలే కాకుండా విత్తనాలు వేయడం, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు చల్లడం వంటివి చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ రోబో.. వ్యవసాయ రంగంలో ఎల్వోటీ, బిగ్‌డేటా ఎనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రైతుల ముంగిట్లోకి తేవడానికి వర్సిటీ పరిశోధనలను ముమ్మరం చేసింది. తద్వారా కూలీల కొరత, ఖర్చు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చని పరిశోధకులు అన్నారు. సాగు పనులకు వ్యవసాయ రోబోను వర్సిటీ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. సంప్రదాయ సాగు పద్ధతులతో పోలిస్తే వ్యవసాయ రోబో 4–5 రెట్ల సామర్థ్యంతో పనిచేస్తుందంటున్నారు. అదే డ్రోన్ల ద్వారా అయితే పదిరెట్ల పని సామర్థ్యం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో రైతులకు ఖర్చులూ తగ్గిపోతాయని అంటున్నారు. కూలీలు దొరక్కపోయినా మందులు, పోషకాలను అందించి పంటను కాపాడతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్సిటీ రోబోలను అందుబాటులో తేవడానికి వడివడిగా అడుగులేస్తోంది. వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి.. మానవ రహిత వ్యవసాయంతోపాటు, ఖచ్చిత వ్యవసాయం చేసేందుకు కృత్రిమ మేధ దోహదపడుతుంది. వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వ్యవసాయంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయతి్నస్తున్నాం. పరిశోధనలు ముమ్మరం చేశాం. – అంగిరేకుల సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి ఇచ్చింది. దేశంలోనే తొలిసారి వర్సిటీకి లైసెన్సు జారీచేస్తూ డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జితేందర్ లౌరా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రమైన సెంటర్ ఫర్ అప్సర ద్వారా సంప్రదాయ, వ్యవసాయ డ్రోన్లపై రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజుల శిక్షణ ఇచ్చేందుకు 2032 వరకు అనుమతి లభించింది. దేశంలో సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు రంగంలో 34 డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాలకు డీజీసీఏ అనుమతి ఉంది. ఈ కేంద్రాల్లో ఐదుకిలోల బరువున్న సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల పాటు కన్వెన్షనల్ రిమోట్ పైలెట్ కోర్సు (సీఆర్పీసీ) కింద శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే డ్రోన్లు 25 కిలోలకుపైగా బరువుంటాయి. వీటిపై శిక్షణ పొందాలంటే ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఉండాలి. కనీసం 12 రోజులు పడుతుంది. డీజీసీఐ మార్గదర్శకాలకనుగుణంగా గుంటూరు లాంలో సెంటర్ ఫర్ అప్సర పేరిట ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 2020లో వ్యవసాయ డ్రోన్ల పరిశోధన సంస్థకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం దేశంలోనే తొలిసారి 12 రోజుల శిక్షణకు ప్రత్యేకంగా పాఠ్యప్రణాళికను సైతం రూపొందించింది. 10 ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, చెరకు, మొక్కజొన్న జొన్న, మినుము, కంది, శనగ, వేరుశనగ సాగులో డ్రోన్ల వినియోగంపై ప్రామాణికాలను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గడిచిన ఖరీఫ్‌లో 30 వేల ఎకరాల్లో వ్యవసాయ డ్రోన్ల వినియోగం ద్వారా సత్ఫలితాలను సాధించారు. అంతేకాదు.. సెంటర్ ఫర్ అప్సర ద్వారా 75 మంది వ్యవసాయ డిప్లమో విద్యార్థులకు అంతర్గతంగా శిక్షణ ఇచ్చి వ్యవసాయ డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దారు. వ్యవసాయ అనుబంధ అవసరాలకు తగినట్టుగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా 16 డ్రోన్లను రూపొందించి వివిధ పరిశోధనల్లో వినియోగిస్తున్నారు. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం రూపొందించిన పాఠ్యప్రణాళికతో పాటు పైలెట్ శిక్షణకు అనుమతి కోరుతూ వర్సిటీ ప్రతిపాదనలు పంపింది. దీంతో ఈ నెల 3, 4 తేదీల్లో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ జితేందర్ లౌరా నేతృత్వంలోని బృందం లాంలోని సెంటర్ ఫర్ అప్సరను సందర్శించింది. అక్కడ మౌలిక సదుపాయాలతోపాటు పైలెట్ చీఫ్ ట్రైనర్ డాక్టర్ ఎ.సాంబయ్య నేతృత్వంలో శిక్షణ ఇస్తున్న అధ్యాపక బృందం నైపుణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. సెంటర్ ఫర్ అప్సరకు లైసెన్సు జారీచేస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మూడు వర్సిటీలకు మాత్రమే డ్రోన్ పైలెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి ఉంది. అయితే వ్యవసాయ డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చే తొలి అవకాశం ఎన్జీరంగా వర్సిటీకే దక్కింది. సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల శిక్షణ పొందినవారికి కొనసాగింపుగా వ్యవసాయ డ్రోన్లపై మరో ఏడురోజులు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీచేసే అవకాశం కల్పించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆర్బీకేలోను డ్రోన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక డ్రోన్ విప్లవం వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు డీజీసీఏ అనుమతినివ్వడం.. రాష్ట్రంలో డ్రోన్ విప్లవానికి నాంది పలికింది. ఇదొక చరిత్రాత్మక పురోగతిగా భావించవచ్చు. దేశంలోనే తొలి వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు.. తొలి శిక్షణ కేంద్రం కూడా మనదే కావడం గర్వంగా ఉంది. 2032 వరకు అనుమతి ఇవ్వడంతో డ్రోన్ రంగంలో వేలాదిమంది గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది. – డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ రాష్ట్రానికి దక్కిన గౌరవం వ్యవసాయ డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం ఎంపికచేసిన రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
7 డ్రోన్లు సీజ్.. అధికారుల దర్యాప్తు
నిబంధనలకు విరుద్ధంగా, పర్మిషన్ లేకుండా దిగుమతి చేసుకున్న 7డ్రోన్లను సీజ్ చేసినట్లు పుణే కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఆ డ్రోన్ల విలువ దాదాపు 1.2కోట్ల రూపాయలపైమాటే అని తెలిపారు. కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కె శుభేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. భవదాన్ లోని ప్రైవేట్ కంపెనీ ఎంఎస్ మిబ్ నాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ ను నిర్వహిస్తున్న అమిత్ తాక్తే అనే వ్యక్తి అమెరికాలో తయారైన డ్రోన్స్ విడి భాగాలను దిగుమతి చేసుకున్నాడు. కెనడా నుంచి ఆ డ్రోన్ ముడిసరుకు భారత్ కు వచ్చిందని తెలుసుకుని సీజ్ చేశామన్నారు. కస్టమ్స్ యాక్ట్-1962 ప్రకారం లైసెన్స్ లేకుండా డ్రోన్లను దేశంలోకి దిగుమతి చేసుకోరాదు. వైర్ లెస్, ప్లానింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ కు సంబంధించి టెలికాం అనుమతి లేకుండా డ్రోన్లను ఇక్కడికి తీసుకువచ్చే అవకాశం లేదు. ఎంఎస్ హైట్స్ నెక్స్ కు చెందిన వికాస్ కుమార్, అమిత్ తాక్తే సంయుక్తంగా డ్రోన్లపై వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వారు దిగుమతి చేసుకున్న డ్రోన్లను ఏ అవసరాలకు వినియోగిస్తున్నారన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ శుభేంద్ర వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు.